బంధం
బంధం


తండ్రి ఆరోగ్యపరిస్థితి విషమించిన్నట్టు వృద్ధాశ్రమం నుంచి వచ్చిన పిలుపుతో పెట్ డాగ్ స్నూపీతో సహా కార్లో చేరుకుంది రవి కుటుంబం. క్షణాలలో మాత్రమే ఉన్న తన ఆయుష్షు తీరిపోయేలోపు తనవాళ్ళని కళ్లారా కడసారి చూస్కోవాలనే నిరీక్షణ ఫలించి పరవశంతో వెలిగిపోతున్న తండ్రి కళ్ళలోకి చూస్తూ ఏమైనా కావాలా నాన్నా అని అడిగాడు రవి. వణుకుతున్న చేతులతో తన ముద్దుల కొడుకు తల నిమురుతూ నువ్వు తీర్చే కోరిక కాదులేరా, ఆ దేవుడే తీర్చగలడు అందుకే ఆయన్నే అడుగుతున్నాను అన్నాడు తండ్రి. చెప్పునాన్నా ఏం కోరుకున్నావ్ అని అడిగితే వచ్చే జన్మలో అయినా మన స్నూపీలా పుట్టిస్తే మీతో నా తుదిశ్వాస వరకు ఆనందంగా గడిపేస్తాను అన్న తండ్రిమాటలకి కళ్ళలో సుడిగుండం తిరిగింది. వెల్లువలా జాలువారిన కన్నీళ్ళని తుడవబోతున్న తండ్రి చేతులతో తన చెంపలపై గట్టిగా కొట్టుకుని చేసిన తప్పుకి క్షమాపణ అడిగాడు కొడుకు. తన గారాలకొడుకుని తదేకంగా చూస్తూ కళ్ళలో పూర్తిగా నింపుకుని మౌనంగా అచేతనమయ్యాడు తండ్రి.