తరలిరాదా తనే వసంతం
తరలిరాదా తనే వసంతం


'ఈ రోజైనా నా సఖుడు తప్పకుండా వస్తాడు. నా నిరీక్షణ వృధా పోదని, నా అభిలాష అసాధ్యం కాదని నిరూపించడానికైనా వచ్చి తీరతాడు. నేనేమీ లేనిది క్రొత్తగా కోరుకోవడం లేదే ? పోగొట్టుకున్నదాన్ని వెతుక్కుంటున్నాను అంతేగా ..!! కళ్ళు, ముక్కు, నోరు, మనసు అన్నీ తెరిచి ఉంచే తపస్సు చేస్తున్నా తన పునరాగమనం కోసం ఒళ్ళంతా కళ్ళు చేసుకుని, తదేకంగా, అచంచలమైన ప్రీతితో, అవ్యాజమైన ఆర్తితో. కాలమనే కొలిమిలో కాలి బూడిదవ్వడానికి మన ప్రేమ ఏమైనా బొగ్గా? కాదు కాదు ...సెగ ఎగసేకొద్దీ మెత్తనై బాధ్యతల సమ్మెటతో పదునెక్కే కత్తి. ఆప్యాయతకి వయోభారముంటుందా? ఆయుష్షు హరించుకుపోతుందా? అలా ఉంటే నా మీదెందుకు పడలేదు దాని ఉక్కుపాదం? ఒత్తిళ్ల పొత్తిళ్లలో ఆదమరిచి సుప్తావస్థలో సోలిపోతున్నదేమో? తనపై నాకున్న ప్రేమకేగా నిద్రాణమైన ఆ ప్రేమని చైతన్యపరిచి ఉత్తేజితం చేసే మంత్రశక్తి ఉన్నది?' అంతరంగస్థలంమీద ఏకపాత్రాభినయం చేస్తుండగా కాలింగ్ బెల్ మ్రోగింది అనుకోని అతిధి పాత్ర ప్రవేశానికి సూచనగా.
"డోర్ తీయడానికి ఇంతసేపా? టిక్ టాక్ లో స్లో మోషన్ వీడియోలు చేసి చేసి అదే పంథాలో తెరిచావా" కసిరాడు మొహం ఉప్పుకళ్ళు వేయకుండానే చిటపటలాడే వేడివేడి పెనంలా పెట్టుకుని, విసురుగా లోపలికి వస్తూనే.
"మీరనుకోలేదండి లేకపోతే ఇలా ఉరుముతారని తెలిసి ఒక్క ఉరుకులో తెరుస్తాను. ఇంత ముందుగా వస్తే ఎవరో అనుకుని, చున్నీ వెతుక్కోవడానికి టైం పట్టింది" గొణిగాను.
చటుక్కున బుర్రలో బుడ్డి (లైట్) వెలిగింది చిటికెలో దాని మీట (స్విచ్) దాక్కున్నట్లుగా.
ఆయన లోపలికి వచ్చేసిన తర్వాత కూడా తలుపు వేయక
ుండా, ఇంకెవరికోసమో ఎదురుచూస్తున్నట్లుగా తల అటు ఇటు తిప్పుతూ పరికించసాగాను ఎంత దూరంలో ఉన్నాడో తెలియకపోయినా, ఎవరినో అమాంతం తనకు దగ్గరగా లాగేసుకునే శక్తి ఉన్న ఆయస్కాంతంలా కళ్ళను చేసుకుని.
అనుకున్నట్లుగానే వారంటీ ముగిసిన శాల్తీలా సోఫాలో కూలబడి, "ఎక్కడున్నారో తెలుసుకుని తీసుకురావచ్చుగా అక్కడే ఆగి ఎదురుచూసే బదులు?" అడిగాడు వసంత్.
"అలుపు లేకుండా ప్రయత్నిస్తూనే ఉన్నానండి కానీ ఎక్కడ తప్పిపోయారో తెలియడంలేదు వెదుకుదామంటే. చిత్రమేంటంటే, తీసుకురావడం నా కంటే మీకే చాలా సుళువైన పని, ఆహా కాదు, కేవలం మీకు మాత్రమే సాధ్యమయ్యే పని అని చెప్పాలి" కొనసాగించాను తనను సమీపిస్తూ, రంగులు మారే తన మొహాన్ని గమనిస్తూ, దోసిల్లలో తన చెంపలను పొదివికొని కళ్ళలోకి చూస్తూ "రెండేళ్లుగా ఎదురుచూస్తున్నా ఎప్పుడొస్తాడా అని ఆశని ఆవిరవ్వనివ్వకుండా. తీసుకొస్తారా ? తిరిగి అందిస్తారా? తన ప్రేమలో తరించిపోనీయరా? తను లేకుండా ఉండడం నావల్ల కావట్లేదు. మీరు ఇంకొద్దు నాకు. తనని తీసుకురాలేనంటే చెప్పండి.. నాకు నేను కూడా వద్దు" అంటూ తన గుండెల మీద గుద్దేశాను.
నా ఆంతర్యం అర్థమైనవాడిలా "సారీ బంగారం, ఐ యాం రియల్లీ సారీ..గడువు తేదీ మెడలో వేసుకుని పుట్టే మెటీరియలిస్టిక్ ప్రలోభాలలో చిక్కుకుని స్వచ్ఛమైన, శాశ్వతమైన తేనెలాంటి నీ ప్రేమని నిర్లక్ష్యం చేసాను. తప్పిపోయిన నన్ను వెదికి మరీ దక్కించుకున్నావే.. జగమొండీ..!!" అంటూ నా నుదుటిపై సంతకం పెట్టి రాచముద్ర వేసాడు మళ్లీ తప్పిపోననే శాసనం శాశ్వతంగా చెల్లుబాటయ్యేలా అల్లుకుపోతూ.
-మీ ప్రశాంత్