We welcome you to write a short hostel story and win prizes of up to Rs 41,000. Click here!
We welcome you to write a short hostel story and win prizes of up to Rs 41,000. Click here!

PRASHANT COOL

Comedy Romance


3.2  

PRASHANT COOL

Comedy Romance


ఊహలకు రెక్కలు-గోడలకు చెవులు

ఊహలకు రెక్కలు-గోడలకు చెవులు

2 mins 415 2 mins 415

"ఏమండీ…….ఎప్పుడూ అలాగే ఒకేలా చేస్తారా? కొంచెం వేరే వేరేగా చేయొచ్చుకదా…..బోర్ కొడుతుందంటే అర్ధంచేస్కోరూ…...కొత్తగా….వెరైటీగా…..మళ్లీ మళ్లీ అడిగేలా….గుర్తుండిపోయేలా…. ఏదైనా ట్రై చేస్తే అరిగిపోతారా? తరిగిపోతారా? ….ఎప్పుడుచూసినా అదే…ఇంటరెస్ట్ ఉండట్లేదండీ….కొంచెం నా బాధ అర్థంచేస్కోండీ…." గోముగా, ముద్దుగా గారాలుపోతూ అడిగింది రాధ. 

"ఉండవే బాబూ, ఇది చేయాలంటేనే ఒళ్ళు హూనమైపోతుంది….నాకిలాగే వచ్చునే...ఇలాగే చేస్తా...ఇప్పుడేంటి….కొత్తగా కొత్తగా అంటూ కొట్టుమిట్టాడిలోతున్నావ్...పోనీ నువ్వు ట్రై చేయరాదా...చూస్తా ఎలా చేస్తావో….ఎంత బాగా చేస్తావో నేనూ చూస్తా…." అంటూ కొంచెం గుర్రుగానే సమాధానమిచ్చాడు భర్త రాజు. 

"పెళ్ళికిముందు ఫోన్లో తెగ గొప్పలు చెప్పేసారు...నేనది చేస్తా...ఇది చేస్తా...అలా చేస్తా...ఇలా చేస్తా….నీకు ఊపిరితీసుకొనివ్వను….వెరైటీలతో ఉక్కిరిబిక్కిరిచేసి ఉక్కపోతారప్పిస్తా, కొంచెం కూడా గాప్ ఇవ్వకుండా అన్నిరుచులు చూపిస్తా అని, అదంతా వట్టి మాటలేనా….చేతల్లో చేతులెత్తేస్తారా?మీరు చెప్పే మాటలువిని నేను తెగ ఊహించుకున్నా....ఇప్పుడు అర్థమైంది మీ ప్రతాపమెంతో….ఇప్పుడు చూడండి నేను చేస్తా...ఎంత బాగా చేస్తానో...నేర్చుకోండి కొంచెమైనా….." అంటూ సిద్ధమైంది రాధ. 


"అయ్యబాబోయ్...నువ్ చేస్తావా….వద్దులేవే..ఆవేశంలో ఏంచేస్తావో ఎలా చేస్తావో నీకే తెలియదు…..వంకలుపెడుతున్నావని కోపంలో ఏదో అంటే నాపై ఇలా ముందస్తు హెచ్చరికాలేకుండా ఏం చేద్దామని….బతకనీయవా నన్ను….ఆ చెత్త వీడియోలు చూసి ఈ అభాగ్యుడిమీద ఎందుకొచ్చిన ప్రయోగాలే ఇవి...పెళ్ళైన కొత్తలో చేశావుకదా...అప్పుడేదో కొత్త కాబట్టి మైకంలో ఉండి ఏమి అనలేకపోయాను. నాకొచ్చినట్టేదో చేస్తాలే కానీ నువ్ నోర్మూసుకుని చే…." అని రాజు బయటకు వెళ్తూ అనబోయేలోపు పక్కింటి పంకజంగారు పక్క పోర్షన్ లోంచి మొత్తం విని కుతూహులం ఉగ్గబట్టలేక ఏమీ ఎరగనట్టు ఇంట్లోకి వస్తూ….."రాకూడని టైం లో వచ్చినట్టున్నా…మీరిద్దరూ ఏదో సన్నిహితంగా మాట్లాడుకుంటుంటే మధ్యలో పానకంలో పుడకలా వచ్చాను...క్షమించు రాధ…" అంటూ వెనక్కి తిరిగి వెళ్లిపోబోతుండగా….


"మీరు అనుకునేదేదీ లేదు ఆంటీ… నీకు వంట రానప్పుడు నేనేం వండిపెడితే అదే నోర్మూసుకుని తిను అని కసురుకుంటున్నారు అంతే…." అని ఆవిడ ఊహల రెక్కలను అమాంతం సెన్సార్ కట్ అంటూ నిశ్శబ్దంగా కత్తిరించేసింది రాధ. అందుకు ఆవిడ…" ఓస్… అంతేనా...నేనింకా ఏదో అనుకున్నాలే రాధ…." అంటూ నోటిమీద వేలేసుకుని కాసేపు ఆలోచించి అయినా నోర్మూసుకుని ఎలా తింటారో నాకు తెలియదులేమ్మా అంటూ సణుక్కుంటూ వెళ్ళిపోయింది అంటీ. బయటికి వెళ్లిన రాజుకి ఎప్పుడొస్తాడా అని గోడమీద పిల్లిలా అతృతతో ఎదురుచూస్తున్న వెంకటేశం కనిపించి …

"లోపల చాలా వేడి వేడిగా చర్చాగోష్ఠి జరుగుతుంది...నీ వంట తిని తిని మీ ఆవిడ విసుగెత్తిపోతున్నట్లుంది. ఏమయ్యా..కొంచెం మాలాంటి నిపుణులదగ్గర నేర్చుకుని వెరైటీలు చేసిపెట్టొచ్చుకదా రాజు..రోజు అదే వండితే మాత్రం ఏం తినగలదు చెప్పు...కాస్త అర్థంచేసుకోవయ్యా… పెళ్ళయ్యి ఇన్నేళ్లయినా భార్యని ఎలా ప్రసన్నం చేసుకోవాలో నీకింకా వంటబట్టినట్టులేదు సుమా….ఎప్పుడు బాగువుడతావో ఏంటో…." అంటూ నిట్టూర్చాడు. 


అందుకు రాజు.."అయ్యో అంకుల్ మీరు అనుకునేదొకటి...లోపల విషయం మరొకటీను…రకరకాల వంటలను ఎంతో రుచిగా చేసే నా పెళ్ళాం ఉండగా నేనెందుకు వంట చేస్తానండీ. మీకు మరీ చాదస్తం ఎక్కువైపోయింది..లోపల మా సంభాషణ ఇంకేదోలే… మీకిప్పుడు నేనెలా చెప్పగలను చెప్పండి" అంటూ ఆయన చెవిలో ఏదో గొణిగి, 'కొంచెం మెల్లగా మాట్లాడవే అంటే వినదు, బోదురుకప్పలా ఊరంతా వినిపించేలా అరుస్తుంది, వీళ్ళేమో బావురుపిల్లిలా ఒళ్ళంతా చెవులు చేసుకుని వింటూ ఉంటారు….ఛి ఛీ..ప్రైవసీ లేకుండా పోయింది' అని మనసులోనే తిట్టుకుంటూ చేతిలో ఉన్న సంచిని అంకుల్ కి కనిపించకుండా రోడ్ మీద ఉన్న చెత్తకుండీలో వేసి చల్లగా ఇంట్లోకి జారుకున్నాడు రాజు. 


(ఇంతకీ రాధ అంటీకి చెప్పింది నిజమో, రాజు అంకుల్ కి చెప్పింది నిజమో, ఆ మొగుడు పెళ్లాల మధ్య జరిగిన సంభాషణ ఏమిటో చదివిన మీకే తెలియాలి, నన్ను ఇన్వోల్వ్ చేయకండి, నాకేం తెలియదు)


Rate this content
Log in

More telugu story from PRASHANT COOL

Similar telugu story from Comedy