Varun Ravalakollu

Horror

4.3  

Varun Ravalakollu

Horror

రా... కథ చెప్తా !!

రా... కథ చెప్తా !!

12 mins
21.7K


అప్పటికే మూడు గంటలైంది విరించి పెన్ను, పేపర్ పట్టుకుని ఒక్క ముక్క కూడా రాయలేకపోయాడు. ఏం రాయాలి? ఏం రాసినా నచ్చట్లేదు తనకి, రాయడం పేపర్ చించేయడం, ఇప్పటికే రెండు నెలలు దాటి పోయింది ఇంకో ఇరవై రోజుల్లో ప్రొడ్యూసర్ కి కథ ఇవ్వాలి ఈ సినిమా కూడా లేకపోతే రోడ్డు మీద పడాల్సిందే. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో వరుస హిట్లతో దూసుకుపోయిన తన జీవితం ఒక్కసారిగా తల క్రిందులైంది, నాలుగు వరుస ఫ్లాపులు. లోన్ తీసుకుని కొనుకున్న ఫ్లాటుకి ఈ నెల ఇన్స్టాల్మెంట్ కట్టలేదు. కారు వాడటం మానేసి చాలా రోజులైంది. రెండు సంవత్సరాల ఖాళీ తర్వాత వచ్చిన అవకాశం. లో బుడ్జెట్లో హారర్, థ్రిల్లర్ సినిమాకి కథ కావాలి అన్నాడు ఒక ప్రొడ్యూసర్, ఇప్పుడదే ట్రెండు నడుస్తుంది. ఇంతకు ముందు అలాంటి కథలు రాసిన అనుభవం లేదు. అయినా డబ్బులు లేక ఒప్పుకున్నాడు విరించి. రూమ్ తలుపు పెట్టుకుని రాత్రి, పగలు ఆలోచిస్తున్నాడు అయినా ఏమీ తట్టట్లేదు. అప్పటికీ కొన్ని ఇంగ్లీష్ సినిమాలు, కొరియన్ సినిమాలు చూసాడు ఊహూ అవీ నచ్చలేదు. ఇక ఇంట్లో ఉంటే కుదరదు ఎక్కడికైనా దూరంగా వెళ్ళాలి కథ వెతుక్కుంటూ అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ట్రైన్లో ఢిల్లీకి బయలు దేరాడు, తన ఫ్రెండ్ మహేష్ అక్కడే జాబ్ చేస్తున్నాడు, ఎప్పుడూ రమ్మని అంటూ ఉంటాడు, సర్ప్రైజ్ ఇద్దామని తనకు చెప్పకుండా బయలుదేరాడు.

ట్రైన్లో రకరకాల వ్యక్తులు, కొందరు ఫ్యామిలీతో వస్తే, కొందరు ఒంటరిగా. తన భోగీలో చాలా మంది హిందీ మాట్లాడే వారే ఉన్నారు. విరించి హిందీ అర్ధం చేసుకోగలడు కానీ మాట్లాడలేడు. విరించికి ఊరట ఆనందరావుతో కలిగింది. ఆనందరావు ఫిజిక్స్ ప్రొఫెసర్, ఢిల్లీలో ఉన్న తన కూతురు ఇంటికి వెళ్తున్నాడు. విరించి తనను తాను పరిచయం చేసుకున్నాడు. వారు చాలా విషయాలు మాట్లాడుకున్నారు, ఆ మాటల్లోనే తను ఒక హారర్ కం థ్రిల్లర్ స్టొరీ రాయాలనుకుంటున్నానని చెప్పాడు.

“మీరు ఫిజిక్స్ ప్రొఫెసర్ కాబట్టి అడుగుతున్నా... దెయ్యాలు ఉంటాయా, ఉండవా?” కుతూహలంగా అడిగాడు విరించి.

“మన కంటికి కనిపించేవన్నీ త్రీ డైమెన్షన్లో ఉంటాయి, ఈ విశ్వంలో లెవెన్ డైమెన్షన్స్ ఉన్నాయని అంటారు. ఈ లెక్కన దెయ్యాలు ఫోర్త్ డైమెన్షన్లో ఉండొచ్చని నా అభిప్రాయం” అన్నాడు ఆనందరావు కళ్ళ జోడు సరిచేసుకుంటూ.

“అంటే దెయ్యాలు ఉన్నాయని మీరు నమ్ముతారా?” ఆశ్చర్యంతో అడిగాడు విరించి.

“నమ్ముతాను. దెయ్యాల గురించి నేను చాలా విన్నాను, కానీ ఎప్పుడూ వాటిని చూడలేదు”

“నేను కూడా చాలా విన్నాను అవన్నీ కట్టు కథలు, ఒక ఫిజిక్స్ ప్రొఫెసర్ అయి ఉండి దెయ్యాలను నమ్ముతారా? మూడ నమ్మకాలను ఖండించాల్సిన మీరు కూడా ఇలాంటివి నమ్మితే ఎలాగండీ?” విరించి కొంచెం అసహనంగా అన్నాడు.

“నేను ఊరికే నమ్మట్లేదు నా చిన్నప్పుడు మా అన్నయ్యకి దెయ్యం పట్టి చనిపోయాడు, తర్వాత చాలా మంది దెయ్యాల వల్ల చనిపోయిన వారు నాకు తెలుసు”

“నాన్సెన్స్ సైన్సు ఇంత అభివృద్ధి చెందిన తర్వాత కూడా ఏదో కారణంతో చనిపోతే అది దెయ్యం వల్లనే అనుకునే మీకు ఫిజిక్స్ చెప్పడానికి కొంచెం కూడా అర్హత లేదు, ఆ జాబుకి రిసైన్ చేసి గుడి ముందు పూల కొట్టు పెట్టుకోండి” ఆవేశంతో అన్నాడు విరించి.

ఆనంద రావు ప్రశాంతంగా “సైన్స్ కనుక్కోలేనివి చాలా ఉన్నాయి. వాటిలో ఇది కూడా ఒకటి” అన్నాడు.

“ఓకే మీ అన్నయ్య దెయ్యం పట్టి చనిపోయాడు అన్నాడు కదా ఏ కారణంతో దెయ్యం పట్టింది?”

“వాటికి కారణాలు ఉండవు, అవి ఉన్న దారిలో మనకు తెలియకుండా వెళ్ళినా సరే అవి మనకు ఎదురు పడవచ్చు, అప్పుడవి ఏం చెయ్యాలనుకుంటే అవి చేస్తాయి. అదంతా కర్మ ప్రకారం జరుగుతుంది. కొంతమంది ఎనభై, తొంభై ఏళ్ల వారకూ బ్రతుకుతారు, కొందరు పాతికేల్లకే ఆక్సిడెంటులో పోతారు, కొందరు రక రకాల రోగాలతో ఆయుష్షు తీరకముందే పోతారు, కొందరు పుట్టిన కొన్ని గంటల్లోనే చనిపోతారు ఎందుకు? అదే కర్మ దాని ప్రకారం చావు ఏ రూపంలోనైన రావొచ్చు, అది దెయ్యం కూడా కావొచ్చు” ఆనందరావు తాపీగా చెప్పుకుంటూ పోయాడు.

“అంటే మన ఆయుష్షు తీరితే దెయ్యం కూడా ఒక మీడియంగా మారి ఏ కారణం లేకుండా చంపుతుంది అన్న మాట, జస్ట్ లైక్ ఆక్సిడెంట్?”

“ఎక్జాక్ట్లీ” అన్నాడు ఆనంద రావు.

“యూ ఆర్ ఆన్ ఎడ్యుకేటెడ్ స్టుపిడ్” అన్నాడు విరించి కోపంగా.

“చూడు దెయ్యాలను చూసామని, వాటితో మాట్లాడామని రక రకాల కథలు వింటూ ఉంటాం. అవి నిజమో కాదో మన దాకా వచ్చేవరకు మనకు తెలీదు. ఫారెన్ కంట్రీస్ లో సియాన్స్ అనే ఒక పక్రియ ద్వారా ఒక మీడియం ద్వారా ఆత్మలతో మాట్లాడుతారు. దీని గురించి నీకేం తెలుసు? చనిపోయిన తర్వాత జీవితం ఎలా ఉంటుందో వాటిని అడిగి తెలుసుకుంటూ ఉంటారు. ఇంకా అక్కడ పారానార్మల్ రీసెర్చ్ సెంటర్లు ఎన్నో ఉన్నాయి. వీటి గురించి ఇంటర్నెట్లో వెతికినా దొరుకుతుంది” అన్నాడు ఆనంద రావు.

“ఇంటర్నెట్లోనా?” ఎగతాళిగా నవ్వాడు విరించి.

“కరక్టే ఇంటర్నెట్లో దొరికే ఫోటోలు, వీడియోలు 99% ఫేక్ ఉంటాయని నేను కూడా ఒప్పుకుంటా, కానీ నిజానికి ఒక్క పర్సెంట్ ఉన్నా చాలు కదా, మన నమ్మకాలను మార్చుకోవడానికి” సంజాయిషీ ఇస్తున్నట్టుగా అన్నాడు ఆనందరావు.

“ఆ ఒక్క పర్సెంట్ కూడా ఫేక్ అని ఏదో ఒక రోజు తెలిసిపోతుందిలే మాస్టారు” వెటకారంగా అన్నాడు విరించి.

“సరే నేను చెప్పింది అంతా ట్రాష్ అనుకో కానీ నువ్వు రాసే సినిమా కథకి ఇది పనికొస్తుంది అనుకుంటున్నా, ఎందుకంటే సినిమాకి లాజిక్ అవసరం లేదు కదా?” అన్నాడు ఆనందరావు తాపీగా.

“ఓకే, మీరు చెప్పిన వాటిని యూస్ చేసుకుని ఒక మంచి హారర్ స్టోరీ రాయొచ్చు, బట్ సియాన్స్ తో సహా మీరు చెప్పినవేమీ నేను నమ్మను కేవలం సినిమాలో మాత్రమే ఉపయోగిస్తాను” అన్నాడు విరించి వెనక్కి వాలుతూ.

“ఓకే నీ ఇష్టం, అనుభవమే నమ్మకాలను సృష్టిస్తుంది, అప్పటి వరకు అభిప్రాయాలు మాత్రమే ఉంటాయి. ఎనీ వే నాకు నిద్ర వస్తుంది” అంటూ బెర్త్ సరిచేసుకుని పడుకున్నాడు ఆనంద రావు. విరించి కూడా పై బెర్త్ ఎక్కి పడుకున్నాడు. పడుకున్నాడే కానీ విరించి మెదడులో రక రకాల ఆలోచనలు ఏం రాయాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. రెండు గంటలు గడిచింది ఎంతసేపటికీ నిద్ర రాకపోవడంతో కిందికి దిగాడు, ఆనందరావుతో సహా అందరూ పడుకుని ఉన్నారు. జేబులో తడిమి చూసుకున్నాడు సిగరెట్లు అయిపోయాయి. తిండి లేకుండా రోజంతా ఉండగలడు కానీ సిగరెట్ లేకుండా గంట కూడా ఉండలేడు. ఇందాక స్టేషన్లో తీసుకోనందుకు తనను తానే తిట్టుకున్నాడు. నిద్రరాక డోర్ దగ్గరికి వెళ్లి నిల్చున్నాడు. చల్లని గాలి రివ్వున తాకుతుంది. అలాగే బయట చీకట్లోకి చూస్తూ నిల్చున్నాడు.

“ఏం గురూ నిద్ర పట్టట్లేదా?” అని వినిపించడంతో వెనక్కి తిరిగాడు. ఒక ఐదున్నర అడుగుల వ్యక్తి మాసిన బట్టలతో, చెదిరిన జుట్టుతో కూలీ పని చేసుకునే వాడిలా ఉన్నాడు.

“నాకు కూడా నిద్ర పట్టడం లేదు గురూ అందుకే అటూ, ఇటూ తిరుగుతున్నా” అంటూ జేబులోంచి సిగరెట్ తీసి వెలిగించుకున్నాడు. అతని చేతిలో సిగరెట్ చూడగానే విరించికి ప్రాణం లేచి వచ్చినట్టనిపించింది. తను తాగే బ్రాండే. ఎలా అడగాలా అని సంకోచిస్తున్న విరించిని చూస్తూ “ఏంటి గురూ సిగరెట్ కావాలా?” అని జేబులోంచి మరో సిగరెట్ తీసి విరించికి ఇచ్చి, తనే అగ్గిపుల్లతో వెలిగించాడు. విరించికి ప్రాణం లేచి వచ్చినట్టైంది, గుండెల నిండా పొగ పీల్చి తలుపు నుండి బయటికి వదిలాడు.

“ఎక్కడికి గురూ?”

“ఢిల్లీకి”

“ఏం పని మీద వెళ్తున్నారో?”

“ఏం పని లేదు, ఊరికే ఫ్రెండుని కలవడానికి”

“మంచిది మంచిది ఏం పని చేస్తుంటావ్ గురూ”

“నేను రైటర్ని”

“అంటే?”

“సినిమాలకు కథలు రాస్తూ ఉంటా”

“అవునా గురూ, నాకు సినిమాలంటే పిచ్చి, ఇంతకీ ఏ సినిమాలకి కథ రాసారు గురు?”

“వాసుకి, తొలకరి, సునంద,.......”

“తెలుగు సినిమాలా గురూ... నేను తెలుగు సినిమాలు పెద్దగా చూడను. తమిళ్, మలయాళం, భోజ్పురి ఇలాంటివే నచ్చుతాయి”

“ఓహో!” అంటూ కాలిపోయిన సిగరెట్ ను డోర్ లోంచి బయటికి విసిరాడు విరించి.

“ఇంకో సిగరెట్ కావాలా గురూ? నెక్స్ట్ స్టాప్ రావడానికి ఇంకో రెండు గంటలు పడుతుంది.” అంటూ మరో సిగరెట్ తీసి విరించి చేతిలో పెట్టాడు. విరించి కాదనలేక తీసుకున్నాడు.

“మర్చి పోయాను నా పేరు భోంస్లే, మీ పేరేంటి గురూ?”

“విరించి”

“గురూ...సినిమా కథలంటే మాంచి రొమాన్సు ఉంటుందా?” మరో సిగరెట్ వెలిగిస్తూ అన్నాడు భోంస్లే.

“అన్నీ ఉంటాయి”

“తర్వాత సినిమా ఏం రాస్తున్నారు గురూ?”

విరించికి చెప్పాలి అనిపించకపోయినా “హారర్, థ్రిల్లర్ లాంటిది” అన్నాడు.

“అవి ఎవరు చూస్తారు గురు! మంచి మసాలా సినిమా రాయకూడదు, మాలాంటి వాళ్ళు ఎగబడి చూస్తారు” పళ్లన్నీ కనిపించేలా నవ్వాడు భోంస్లే. అతని పళ్లన్నీ గారపట్టి ఉన్నాయి. విరించికి అతన్ని చూస్తేనే అసహ్యంగా అనిపించింది. విరించి ఏం మాట్లాడలేదు.

“గురు, మీరేం అనుకోకపోతే నేను కూడా ఒక మంచి కథ చెప్తా గురూ, ఎప్పుడైనా అవసరమైతే వాడుకోండి”

విరించి అదేం పట్టించుకోకుండా చేతిలో ఉన్న సిగరెట్ వెలిగించి డోర్ నుండి బయటికి చూడసాగాడు.

“మా ఫ్రెండ్ చంద్రకాంత్ గాడి పక్కింటి ఆంటీతో లవ్ స్టోరీ చెప్పమంటావా గురూ, మంచి థ్రిల్లర్ కథలా ఉంటుంది” నవ్వుతూ అన్నాడు భోంస్లే. విరించి అసహనంగా చూసాడు.

“పోనీ నా ఏడో తరగతిలో సోనాతో జరిగిన ఫెయిల్యూర్ లవ్ స్టోరీ చెప్పమంటావా గురూ, మంచి ఫీల్ ఉంటది. ఆ బాధ తట్టుకోలేకే నేను చదువు మానేసిన, చెప్పమంటావా గురూ...”

విరించి సిగరెట్ బయట పారేసి చిరాకుగా భోంస్లే వైపు చూసాడు. ఏదో సిగరెట్ ఇచ్చిన కృతజ్ఞతా భావంతో అప్పటి దాకా భరిస్తూ వచ్చాడు. ఇక ఓపిక నశించి “నాకు నిద్ర వస్తుంది వెళ్లి పడుకుంటా” అన్నాడు.

“అవునా గురూ ఇంకొద్దిసేపు ఉంటే మంచి స్టోరీలు చెప్పేవాన్ని, ఓకే గురూ గుడ్ నైటు”

విరించి అక్కడి నుండి వెళ్ళబోయాడు. టైం చూసుకుంటే ఒంటిగంట అయ్యింది.

“కానీ గురూ మీరు ఇంకో రెండు గంటలే నిద్రపోతారు”

“ఏం?” అన్నాడు విరించి.

“ఎందుకంటే ఇంకో రెండు గంటల్లో ఈ ట్రైన్ పట్టాలు తప్పుతుంది”

“నీకెలా తెలుసు?”

“నాకు అన్నీ తెలిసిపోతాయి గురూ... ఎలా అని అడగకండి. భిష్నోయ్ అనే ఊరి దగ్గర ట్రైన్ పట్టాలు తప్పుతుంది. అప్పుడు మనకు చాలా టైం దొరుకుతుంది, అప్పుడు మీకు మంచి కథ చెప్తాలే! మీ సినిమాకి పనికొచ్చే కథ”

“అంటే మీరు దొంగలా, నువ్వు దొంగల ముఠాలో పార్ట్నర్వా?” అనుమానంగా ముఖం పెట్టి అన్నాడు విరించి.

“అయ్యో గురూ... ఎంత మాటన్నారు. నాలాంటి వాన్ని అనుమానిస్తారా. నేను చాలా మంచివాన్ని గురూ, నా దోస్తు చంద్రకాంత్ గాడే శాడిస్టు, నేను అలాంటివాన్ని కాదు గురూ”

“అయితే ట్రైన్ పట్టాలు తప్పుతుందని నీకెలా తెలుసు?”

“అది మాత్రం అడగొద్దు గురూ, మాకన్నీ తెల్సిపోతాయి” అంటూ వెకిలిగా పళ్ళు బయటపెట్టి గట్టిగా నవ్వుతూ బిత్తర చూపులు చూసాడు.

నాన్సెన్స్ ఇంతసేపు ఒక పిచ్చి వాడితో మాట్లాడానన్న మాట అని మనసులో అనుకుని అక్కడి నుంచి తన బెర్త్ వైపు వెళ్ళాడు. “జాగ్రత్త గురూ, తలకు మెత్తనిది ఏదైనా చుట్టుకుని పడుకోండి లేదంటే దెబ్బ తగులుతుంది” వెనకనుండి అన్నాడు భోంస్లే మళ్ళీ గట్టిగా నవ్వుతూ. విరించి అదేం పట్టించుకోకుండా పైకి ఎక్కాడు, పడుకోగానే నిద్రపట్టేసింది.

కొద్దిసేపటికి తలకు ఏదో బలంగా తగిలేసరికి కళ్ళు తెరిచాడు విరించి. అందరూ హాహాకారాలు చేస్తూ పరిగెత్తుతున్నారు. కొందరు దెబ్బలు తగిలి పైకి లేవలేక మూలుగుతున్నారు. ఇంకొందరు వేరేవాళ్ళు బయటికి వెళ్ళడానికి సహాయం చేస్తున్నారు. విరించి నెమ్మదిగా కిందికి దిగాడు. తగిలిన దెబ్బకు తల దిమ్ముగా ఉంది, మెడ పట్టేసింది. కిందికి దిగగానే కళ్ళు భైర్లు కమ్మినట్టు అనిపించింది. కొద్దిసేపటికి తేరుకుని నెమ్మదిగా ట్రైన్ బయటికి వచ్చాడు. చుట్టూ చీకటి. వర్షం పడి వెలిసినట్టుంది నేలంతా బురద బురదగా ఉంది. తమ భోగీకి ముందు ఉన్న భోగీలు ఒక వైపుకి ఒరిగి దారుణమైన స్థితిలో ఉన్నాయి. అదృష్టం! వీరి భోగి కొద్దిగా వంగింది అంతే. పోలీసులకి ఫోన్ చేద్దాం అని ఫోన్ తీసాడు సిగ్నల్ లేదు. ఫోన్లో టార్చ్ లైట్ ఆన్ చేసి చూసాడు. చుట్టూ పంట పొలాలు ఉన్నట్టున్నాయి. కొద్ది దూరంలో ఒక బోర్డు పై “భిష్నోయ్” అనే అక్షరాలూ కనబడ్డాయి. విరించి ఆశ్చర్యంగా అటే చూస్తున్నాడు.

ఏడుపులు, హాహాకారాలు తప్ప ఏమీ వినిపించడం లేదు. అంతా గందరగోళంగా ఉంది. ఏమైనా సహాయం చేద్దామనుకుంటే తన మెడ పట్టేసి ఎటూ తల తిప్పలేని పరిస్థితి. విరించి మెడను పట్టుకుని అటూ ఇటూ తిప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు, ఇంతలో ఒక చేయి తన భుజం మీద పడడంతో ఒక్కసారిగా భయపడి వెనక్కి తిరిగి చూసాడు.

“ఏం గురూ ఎలాగున్నావ్? నేను చెప్పానా ట్రైన్ పట్టాలు తప్పుతుందని, మెడ పట్టేసినట్టుంది?!” నవ్వుతూ చూసాడు భోంస్లే.

విరించి భోంస్లేని అలాగే చూస్తూ “నువ్వు చెప్పింది నిజమే కానీ నీకెలా తెలుసు, ఇలా జరుగుతుందని?” ఆశ్చర్యం, భయం రెండూ కలిసిన గొంతుతో అన్నాడు.

“చెప్పానుగా గురూ మాకు తెలిసిపోతాయి అని, అయినా ఇక్కడెందుకు గురూ దగ్గరలో మా ఇల్లు ఉంది అక్కడికి వెళ్లి రెస్ట్ తీసుకుందాం, పైగా నీకు కథ చెప్తా అని మాట కూడా ఇచ్చాను. పద గురూ”

“కానీ......” విరించి తటపటాయిస్తూ చూసాడు.

“ఇంకేం మాట్లాడకండి గురూ నా వెంట రండి” అంటూ ఆ పొలాల మధ్య ఉన్న ఒక చిన్న దారి గుండా నడవడం మొదలు పెట్టాడు. విరించికి తల నెప్పిగా ఉంది, అక్కడ ఉండే ఓపిక లేదు. ఏం చేసేది లేక భోంస్లే వెనక నడవడం మొదలు పెట్టాడు. దారంతా బురదతో నిండిపోయి ఉంది.

“జాగ్రత్త గురూ వాన పడింది కదా పురుగూ, పుట్రా బయటికి వస్తాయి చూసి నడవండి, నాకంటే అలవాటే, ఇటు రండి” అన్నాడు భోంస్లే విరించికి దారి చూపిస్తూ.

“మీ ఇల్లెక్కడ?” అన్నాడు విరించి.

“ఇంకో రెండు కిలో మీటర్లు నడిస్తే వస్తుంది. కొద్దిగా ఓపిక తెచ్చుకోండి. ఈ లోపు నా జీవితంలో నిజంగా జరిగిన కథ చెప్తా”

విరించి ఏం మాట్లాడలేదు. అతనికి ఆశ్చర్యంతో పాటు కొద్దిగా భయం కూడా కలిగాయి. ఒక పక్క మెడ నెప్పి భరించలేకుండా ఉంది. కొంచెం రెస్ట్ కావాలనుకుని భోంస్లే వెంట మౌనంగా నడుస్తున్నాడు.

“గురూ మూడు సంవత్సరాల క్రింద ఏమైందంటే నేను, నా దోస్తు చంద్రకాంతుగాడు ఒక బిల్డింగ్ కడుతుంటే కూలీలుగా చేరాం. రోజూ పొద్దంతా పని చేయడం రాత్రైతే సారా తాగి పడుకోవడం ఇదే మా జీవితం. సాయంత్రం కాగానే పనోల్లందరూ ఎవరింటికి వారు వెళ్ళిపోయేవారు. మేమిద్దరం ఒంటికాయ సొంటిగాల్లం మాకెవరున్నారు, రోజూ ఆ ఇంటి టెర్రస్ పైకి ఎక్కి రాంత్రంతా తాగుతూ అక్కడే పడుకుని తెల్లారే లేచి పని చూసుకునే వాళ్ళం.

మా చంద్రకాంత్ గాడికి ఒక శాడిస్టు బుద్దుంది రాత్రి పూట ఫుల్లుగా తాగి ముసుగు వేసుకుని రోడ్డు మీద పొయ్యేవారందరినీ భయపెడుతూ ఉండేవాడు. వాడికి అదొక సరదా. నేను కూడా రక రకాల శబ్దాలు చేస్తూ వాడికి వంతపాడేవాన్ని. ఒక రోజు అలాగే పనోల్లందరూ వెళ్ళిపోయాక సారా తీసుకుని పైకి ఎక్కి మందుకొడుతున్నాం. ఇంతలో ఎవరో వస్తున్న చప్పుడు కావడంతో భయంతో ట్యాంక్ వెనక్కి వెళ్లి దాక్కున్నాం. ఆ ఇంటి ఓనర్, అతడి భార్య పైకి వచ్చారు.

కొంచెం సేపు బాగానే మాట్లాడుకున్నారు. తర్వాత ఆమె గొడవ పెట్టుకోవడం మొదలు పెట్టింది. వాళ్ళ మాటల్లో తెలిసిందేంటంటే మా ఓనరుకి వేరే అమ్మాయితో సంబంధం ఉంది. ఆమెను వదిలేయమని ఓనర్ భార్య ఏడుస్తుంది. అతడు ఇద్దరినీ చూసుకుంటానని బుజ్జగిస్తున్నాడు. ఆమె వినడం లేదు. వారిద్దరి మధ్య మాటా, మాటా పెరిగింది. మా చంద్రకాంత్ గాడు ఆ గొడవంతా సెల్ ఫోనులో రికార్డ్ చేసాడు. ఆ గొడవలో మా ఓనర్ ఆమెను బిల్డింగ్ పై నుండి కిందికి తోసేసాడు. తర్వాత కిందికి వెళ్ళిపోయాడు. కొంత సేపటికి ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చాడు. వాళ్ళిద్దరూ ఏమో మాట్లాడుకున్నారు. మరుసటి రోజు పేపర్లో ‘ప్రమాదవశాత్తు బిల్డింగ్ పై నుండి పడి మహిళ మృతి’ అని వచ్చింది. ఆ పోలీస్ ఆఫీసర్ లంచానికి లొంగిపోయాడని అర్ధం అయ్యింది.

మేమిద్దరం ఓనర్ దగ్గరికి వెళ్ళాం. జరిగింది చూసామని, రికార్డు చేసామని వీడియో చూపించాం. అడిగినంత డబ్బు ఇవ్వాలని బెదిరించాం. మా పంట పండింది ఓనర్ మాకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇచ్చేవాడు. మాకు ఉండడానికి ఇల్లు లేకపోవడంతో అదే ఇంట్లో కింద చిన్న గదిలో ఉండేవాళ్ళం.

కొన్ని రోజులకు మా ఓనర్ ఆమె లవర్ని పెళ్లి చేసుకుని అదే ఇంటికి తీసుకువచ్చాడు. ఇద్దరూ ‘ఏక్ తుజే కేలియే’ అన్నట్టు ఉండేవారు” అంటూ ఆపి ఎదురుగా చూపిస్తూ “అదే నేను చెప్తున్న ఇల్లు అక్కడే మేము ఉండేది” అన్నాడు భోంస్లే. విరించి ఇల్లుని చూస్తూ “తర్వాత ఏమైంది?” అన్నాడు.

“ఒక రోజు నేను సారా తాగి ఇంట్లోకి వెళ్తుంటే ఇంటి పైన ఏదో ఆకారం తిరుగుతున్నట్టు కనిపించింది. చూస్తుంటే దెయ్యంలాగే ఉంది, అది మా చంద్రకాంత్ గాడి పనే అనుకున్నాను, మందు ఎక్కువై వీడు నన్ను కూడా భయపెట్టడానికి చూస్తున్నాడు వెదవ అనుకుని నేను రూములోకి వెళ్లాను, అక్కడ చంద్రకాంత్ గాడు నిద్రపోతూ ఉన్నాడు, నాకు వెన్నులో వణుకు పుట్టింది వీడు ఇక్కడ ఉంటే బిల్డింగ్ పైన ఉన్నది ఎవరూ అనుకుని బయటికి వచ్చి చూసా అక్కడ ఏమీ లేదు, అదంతా నా భ్రమ అనుకున్నా.

మరుసటి రోజు రాత్రి చంద్రకాంతుగాడు ఫుల్లుగా తాగి పదరా ఎవరినైనా భయపెడదాం అంటూ రోడ్డు మీదికి తీసుకెళ్ళాడు. దెయ్యంలా ముసుగు వేసుకుని ఒక చెట్టు పక్కకు నిల్చున్నాడు. రోడ్డు మీద ఒక అమ్మాయి వస్తూ కనిపించింది. నేను సైగ చేసాను. వాడు ముసుగుతో ఆమె ముందుకు దూకాడు, నేను రక రకాల శబ్దాలు చేసాను. ఆ అమ్మాయి అస్సలు భయపడలేదు.

“నా చావుని మీ జల్సాలకి వాడుకుంటార్రా? మీరెవ్వరినీ వదిలిపెట్టను” అంటూ గాలిలో అమాంతం లేచింది. మాకు తాగిందంతా దిగిపోయింది, పై ప్రాణాలు పైనే పోయాయి వెనక్కి తిరగకుండా ఇంటికి పరిగెత్తాం. రాత్రంతా వణుకుతూ కూర్చున్నాం.” అంటూ భోంస్లే కళ్ళు పెద్దవి చేసి చూసాడు.

“అంటే చనిపోయిన అమ్మాయి దెయ్యం అయ్యిందన్న మాట, ఇలాంటి సొల్లు చెప్తే నేను నమ్ముతాను అనుకున్నావా” సిగరెట్ వెలిగిస్తూ అన్నాడు విరించి.

“సొల్లు కాదు గురూ నిజం ఒట్టు. ఆ తర్వాత చాలా సార్లు ఆ దెయ్యం మాకు కనిపించింది. అదే విషయం మా ఓనరుకి చెప్పాం. అతను నమ్మలేదు. కొన్ని రోజులకు మా ఓనరుకు సాయం చేసిన పోలీసు బిల్డింగ్ మీది నుండి దూకి ఆత్మ హత్య చేసుకున్నాడు. జీవితంలో ఏ బాధ లేనివాడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో మా ఓనరుకు అర్ధం కాలేదు. కానీ మాకు తెలుసు అది దెయ్యం పనే అని అదే విషయం అతనికి చెప్పాం అయినా కూడా నమ్మలేదు, పోయేకాలం వస్తే అంతేగా గురూ” అన్నాడు కాలిపోయిన సిగరెట్ పక్కకు పడేస్తూ భోంస్లే.

“ఓహో రివెంజ్ స్టొరీ అన్న మాట, తెలుగు సినిమాకి పనికి వస్తుందిలే చెప్పు చెప్పు.. కానీ నిజంగా జరిగింది అని మాత్రం కలర్ ఇవ్వకు” పొగ చీకట్లోకి వదుల్తూ అన్నాడు విరించి.

“నువ్వు నమ్మినా నమ్మకపోయినా నిజం గురూ... ఒట్టు” అంటూ తల మీద చెయ్యి వేసుకున్నాడు భోంస్లే.

“సర్లే నీ ఒట్టు కోసమైనా నమ్ముతానులే, తర్వాత ఏమైందో చెప్పు” ఎగతాలిగా అన్నాడు విరించి.

“తర్వాత కొత్తగా వచ్చిన అమ్మగారికి కూడా ఆ దెయ్యం కనిపించి భయపెట్టేది. దీంతో ఆమె ఇంట్లో నుండి వెళ్ళిపోతానని ఓనర్ని బతిమిలాడింది. ఆయన అవన్నీ పిచ్చి పిచ్చి నమ్మకాలని కొట్టిపడేసాడు. ఓనర్కి తెలియకుండా అమ్మగారితో కలిసి రక రకాల పూజలు చేయించాం, బెంగాళ్ నుండి మంత్రగాళ్ళను తెచ్చి హోమాలు చేయించాం”

“ఆ దెయ్యం వెళ్లిపోయిందా? వెళ్లిపోయుండదే అలా వెళ్తే స్టొరీ ఆగిపోతుందిగా” అన్నాడు విరించి వెటకారంగా.

“అవును గురూ వెళ్ళిపోలేదు సరి కదా అప్పటి నుండి తన ప్రతాపం చూపించేది. రాత్రి పూట ఇల్లంతా ఒక్కసారిగా మంచు కురిసినంత చల్లగా అయిపోయేది, అంతలోనే నిప్పులు కురిసినంత వేడిగా అయిపోయేది. మా ఓనర్కి ఏం జరుగుతుందో అర్ధం కాకపోయేది, ఇంట్లో దయ్యం ఉందని ఎంత చెప్పినా వినేవాడు కాదు. దీంతో మాకు చిరాకు వేసి ఇంట్లో నుండి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాం. నేను, చంద్రకాంత్ గాడు మూటా, ముల్లె సర్దుకుని రైల్వే స్టేషన్ వైపు వెళ్తున్నాం. ఇంతలో అదే ఆకారం గాలిలో తేలుతూ మా ముందుకు వచ్చింది. మేము భయపడిపోయి పరుగెత్తాం. తను రక రకాల శబ్దాలు చేస్తూ వెంబడిస్తూనే ఉంది. ఆ శబ్దాలు అచ్చం నేను చేసినట్టే ఉన్నాయి.

రైలు పట్టాల మీద పరిగెత్తుతున్న మా కాళ్ళు పట్టాల్లో ఇరుక్కున్నాయి. ఎంత బయటికి లాగినా రాలేదు. ఇంతలో ట్రైన్ వచ్చి ఇద్దరినీ నుజ్జు నుజ్జు చేసి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఏమైందో నాకు తెలీదు”

విరించి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. కానీ ఇంతలోనే తేరుకుని “భలే జోకులేస్తున్నావ్, అంటే నువ్వు చచ్చిపోయావా?” అన్నాడు.

“అవును గురూ నేను చచ్చిపోయి చాలా రోజులైంది”

“అంటే నేను దెయ్యంతో మాట్లాడుతున్నానన్న మాట”

“అవును గురూ, మామూలుగా మేము ఎవ్వరికీ కనిపించం కొన్ని రాక్షస గడియల్లో పుట్టిన వారికి తప్ప. అందుకే జనాలు ఎక్కువగా తిరిగే ప్లేసుల్లో మేము తిరుగుతూ ఎవరికైనా కనిపిస్తామేమో అని అందరినీ పలకరిస్తూ ఉంటాము, అదృష్టం బాగుండి ఈ రోజు మీరు కనిపించారు”

“అయితే నేను రాక్షస గడియల్లో పుట్టాను అంటావు”

“చావు మూడినప్పుడే మీలాంటి వారు మాకు, కనిపిస్తారు. మాకు కనిపించిన తర్వాత బ్రతకడం అసాధ్యం”

“అవునా... నేను జనాల్ని భయపెట్టే కథ చెప్పమంటే నువ్వు నన్ను భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నావా? కథ చెప్పింది చాల్లే గాని మీ ఇంటికి పద”

“నిజం చెప్తే ఎవ్వరూ నమ్మరు గురూ, అవును గురూ మేము చనిపోయిన తర్వాత మా ఓనర్, అతడి లవర్ ఏమై ఉంటారు గురూ”

“హ్మ్మ్... రైటర్ని ఆ మాత్రం ఊహించి చెప్పలేనా? కానీ ఈ స్టోరీకి ఇది మాత్రం సరిపోదు ఇంకా చాలా కలపాలి.”

“స్టొరీ కాదు నిజం అని చెప్తే నమ్మరేంటి గురూ, నేను నిజంగా నిజమే చెప్తున్నా, ఒట్టు?” మళ్ళీ తల మీద చెయ్యి వేసుకున్నాడు భోంస్లే.

“సర్లే నమ్ముతాలే, ఇంతకీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు?” నవ్వుతూ అన్నాడు విరించి.

“నువ్వింకా నమ్మినట్టు లేదు గురూ. ఆ ఇంట్లో ఇంకెవరు ఉంటారు గురూ నేను చంద్రకాంతుగాడు. వాడు దెయ్యంలా మారిన తర్వాత ఇంకా శాడిస్టులా తయారయ్యాడు గురూ. మేము ఎలా చనిపొయామో అలాగే భయపెట్టి మనుషుల్ని చంపుతున్నాడు”

“అవునా” అని నవ్వుతున్న విరించి ఒక్కసారిగా ముందు చూసి బిగుసుకుపోయాడు. అతని నోట్లో నుండి మాట రావట్లేదు. ఎదురుగా గాలిలో తేలుతూ ఒక ఆకారం తన ముందుకు వస్తుంది. భయంతో పక్కకు చూసాడు. భోంస్లే మెల్లిగా పొగ రూపంలో ఉన్న మనిషిలా మారి పోయారు. వారి ఆకారాలు అంతకంతకు పెరుగుతూ పోయాయి. అంటే ఇంత వరకు చెప్పిన కథంతా నిజమేనన్న మాట అనుకున్నాడు విరించి, భోంస్లే పొగ రూపంలో నవ్వుతూ కళ్ళు పెద్దవిగా చేసాడు. విరించి వళ్ళు జలదరించింది. వంట్లో శక్తినంతా కూడదీసుకుని వెనక్కి తిరిగి పరిగెత్తాడు. విరించి శరీరం చెమటతో తడిసిపోయింది, కాళ్ళు సహకరించట్లేదు. అయినా రాళ్ళల్లో, ముల్లల్లో పడి పరిగెత్తుతూనే ఉన్నాడు. వెనక ఆ ఆకారాలు వికృతంగా మారి తరుముతూనే ఉన్నాయి. గుండెను చేతితో అదిమి పట్టుకుని ఆయాసంతో రొప్పుతూ పరిగెత్తుతున్నాడు.

అలా పరిగెత్తుతూ తనకు తెలియకుండానే రైలు పట్టాల పైకి ఎక్కాడు. ఇంతలో అతని కాలు పట్టాల్లో ఇరుక్కుంది. పెద్ద శబ్ధం చేసుకుంటూ రైలు వస్తూంది. పక్కన ఆ ఆకారాలు గాలిలో పల్టీలు కొడుతున్నాయి. రైలు దగ్గరికి వస్తున్నకొద్దీ శరీరంలో నరాలు చిట్లిపోతున్నాయేమో అన్నంతగా భయపడుతున్నాడు విరించి. ఎంత లాగిన కాలు బయటికి రావడం లేదు ఇంతలో పెద్దగా హారన్ కొడుతూ ట్రైన్ తన మీదికి దూసుకువచ్చేసింది.

గట్టిగా అరుస్తూ లేచి కూర్చున్నాడు విరించి. చుట్టూ చూసాడు. పైన ఫ్యాన్ తిరుగుతుంది. ఆనందరావు అంకుల్ ఫోన్లో గేమ్ ఆడుతున్నాడు. మిగతా వారంతా పడుకుని ఉన్నారు. ట్రైన్ హారన్ కొడుతూ ఆగిపోయింది. ఇదంతా కలా అనుకుని ఊపిరి పీల్చుకున్నాడు విరించి. నుదిటికి పట్టిన చెమటను తుడుచుకుంటూ కిందికి దిగాడు.

“ఏంటోయ్ విరించి, ఏదో పీడ కల కన్నట్టున్నావ్?” అన్నాడు ఆనంద రావు ఫోన్ పక్కన పెడుతూ.

“అవును అంకుల్ ఏదో పీడ కల”

“ఏమిటోనయ్యా నాకు నిద్రపట్టడం లేదు, అందుకే ఫోన్లో గేమ్ ఆడుకుంటున్నా, బాగా భయపడిపోయినట్టున్నావ్, వెళ్లి మొఖం కడుక్కునిరా పో, ప్లాస్కులో కాఫీ ఉంది తాగుదువుగానీ” అన్నాడు ఆనందరావు.

విరించి అలాగే అంటూ తల ఊపుతూ ఫ్రెష్ అప్ అవడానికి వెళ్ళాడు, తలుపు దగ్గర నవ్వుతూ నిల్చుని ఉన్నాడు భోంస్లే. భోంస్లేని చూడగానే కొంచెం భయం వేసినా అదంతా కల అని గుర్తుకురాగానే తనలో తాను నవ్వుకున్నాడు విరించి.

“ఏం గురూ నిద్ర బాగా పట్టిందా?” అన్నాడు.

“ఏం నిద్రనో ఏమో.. నువ్వు ట్రైన్ పట్టాలు తప్పుతుంది అని సరదాకి అన్న మాట కలలా వచ్చి రాత్రంతా నన్ను భయపెట్టింది, చూడు వళ్ళంతా చెమటతో ఎలా తడిసిపోయిందో” అన్నాడు విరించి షర్టు దులుపుకుంటూ.

“ఏదో సరదాకి చెప్పాను గురూ, నిన్ను ఆటపట్టిద్దామని. ఇంతకీ మా ఓనర్, వాడి ప్రియురాలు ఏమయ్యారో ఎప్పుడు చెప్తావు గురూ” అన్నాడు భోంస్లే నవ్వుతూ.

భోంస్లే అన్న మాటకి విరించి ఆశ్చర్యపోయి అలాగే చూస్తూ ఉండి పోయాడు. శరీరంలో ఏ కదలికా లేదు.

“ఎవరితోనయ్యా మాట్లాడుతున్నావ్” అంటూ ఆనంద రావు విరించి భుజం మీద చెయ్యి వేసాడు.

ఎదురుగా ఎవరో ఉన్నట్టు తల ఊపాడు విరించి.

“అక్కడ ఎవరూ లేరు కదయ్యా, నీలో నువ్వు మాట్లాడుకుంటూ ఉంటే ఏంటో చూద్దామని వచ్చా” అన్నాడు ఆనందరావు.

విరించి భోంస్లేనే చూస్తూ ఉన్నాడు. భోంస్లే మెల్లిగా గాలిలో కలిసిపోయాడు.

“ఇంకో పది నిమిషాల్లో భిష్నోయ్ దాటుతాం” ఎవరో ఫోన్లో మాట్లాడుతున్నారు.

ఇది నిజామా ఇంకా కలలోనే ఉన్నానా అన్న భ్రమలో నోట మాట రాక అలాగే నిల్చుండి పోయాడు విరించి.

ట్రైన్లో ప్రతి ఒక్కరూ పడుకుని ఉన్నారు. చీకట్లో ట్రైన్ హారన్ కొడుతూ ముందుకు దూసుకుపోతుంది.

***Rate this content
Log in

Similar telugu story from Horror