PVV Satyanarayana

Horror

4.4  

PVV Satyanarayana

Horror

జరుగుతూన్న కథ

జరుగుతూన్న కథ

7 mins
3.8K



***

     ప్రొద్దుట మొదలైన వర్షం సాయంత్రమైనా కురుస్తూనేవుంది. రోజూ తనకోసం వచ్చే ఆటోరిక్షా ఎంతకూ రాకపోయేసరికి, నడక ఆరంభించింది అఖిల. పధ్నాలుగేళ్ళుంటాయి ఆమెకు. పదవ తరగతి చదువుతోంది. తెల్లగా, పొడవుగా, అందంగా ఉంటుంది. ఆ వేళప్పుడు స్కూల్ బ్యాగ్ తో సిటీబస్ ఎక్కడం కష్టం. మధ్యలో ఖాళీ ఆటో ఏదైనా వస్తే ఎక్కవచ్చుననుకుంది. కొంతదూరం వెళ్ళేసరికి ట్రక్ ఒకటి వచ్చి ఆమె పక్కను ఆగింది.

“ఏయ్, అఖీ! రా…” అన్న పిలుపు వినిపించి ట్రక్ లోకి చూసింది. ఎదరసీటులో క్లాస్ మేట్ జయ కనిపించింది. అఖిల వయసే ఉంటుందామెకు. ఆ రోజు ఎందుకో బడికి రాలేదు. ఆ ట్రక్ ఆమె తండ్రిదే. అతనే డ్రైవ్ చేస్తున్నాడు. “వద్దే, జయా! నేను నడచి వెళ్ళిపోతాను” అంది అఖిల మొహమాటంగా.

“వర్షంలో తడిసిముద్దయిపోతూ…ఎక్కనంటావేంటీ? ఎక్కు” అన్నాడతను.

“ఔనే, మీ ఇంటిదగ్గర దింపి వెళతాం. రా!” పట్టుపట్టింది జయ.

రాజయ్య సైగచేయడంతో, జయ పక్కను కూర్చున్న హెల్పర్ దిగి, వెనక్కి వెళ్లిపోయాడు.

సంశయిస్తూనే ఎక్కింది అఖిల. జయ పక్కను, కిటికీ దగ్గర కూర్చుంది. తలుపు సరిగా పడలేదంటూ రాజయ్య వంగి మూస్తూంటే, బలిష్ఠమైన అతని చేయి అఖిల వక్షాన్ని తాకింది. అది యాదృచ్ఛికమో, లేక అతను కావాలనే తాకాడో బోధపడక బిత్తరపోయి అతని ముఖంలోకి చూసిందామె.

#

“ఏయ్, అఖీ! నేను స్పోర్ట్ స్ కోచింగ్ సెంటర్ లో కబడ్డీలో చేరుతున్నాను. నువ్వూ చేరతావా?” అనడిగింది జయ. “నీకు ఖోఖో అంటే ఇష్టం కదే. బాగా ఆడతావు కూడాను. స్పెషల్ కోచింగ్ తీసుకున్నావంటే నేషనల్స్ వరకు వెళ్ళొచ్చును”.

స్పోర్ట్ స్ కోచింగ్ సెంటర్ అనేసరికి, ఆ మధ్య ఆలకించిన సంగతులన్నీ అఖిల మెదడులో మెదిలాయి. ట్రెయినింగ్ పేరుతో కోచ్ లు కొందరు ఆడపిల్లలతో ఆడుకోవడము, అసభ్యకరంగా ప్రవర్తించడము, అత్యాచారానికి సైతం పూనుకోవడమూ వంటి వాటిని గురించి బాధితురాళ్ళు కొందరు అశ్రునయనాలతో వివరిస్తూంటే, టీవీలో చూసింది తాను.

అదే మాట అంటే, జయ నవ్వేసింది. “నువ్వు బేలవని తెలుసుకానీ, మరీ ఇంత పిరికిదానివనుకోలేదే, అఖీ! కోచింగ్ తీసుకునేది మనం ఒక్కరమే కాదుగా? మనలాంటి అమ్మాయిలు ఇంకా ఉంటారుగా? కోచ్ లందరూ చెడ్డవాళ్ళే అనుకుంటే ఎలా? అయినా ఎవడైనా మన జోలికి వస్తే తిరగబడి నాలుగు పీకలేకపోతే…మనం స్పోర్ట్ స్ గాళ్స్ ఎలా అవుతామే?” అంది.

“ఏమో బాబూ, నాకంతటి ధైర్యసాహసాలు లేవు. మన పి.టి. సార్ ని చూస్తేనే భయం నాకు!” భయంతో గుండెలపైన చేతులు వేసుకుంది అఖిల. స్నేహితురాళ్ళంతా నవ్వేసారు.

#

ఆ ఆదివారం - జయ పుట్టినరోజు... రాత్రికి ఇంటి దగ్గర పార్టీ ఇస్తున్నట్లూ, తమ స్నేహితులందరూ వస్తున్నట్లూ చెప్పింది జయ. తప్పక రావలసిందిగా అఖిలతో మరీ మరీ చెప్పింది.

అఖిల తండ్రి ఓ ప్రభుత్వోద్యోగి. తల్లి కస్తూరి ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తోంది. అఖిల వారి ఏకైక సంతానం…ప్రస్తుతం అఖిల తండ్రి ఊళ్ళో లేడు. ఎక్కడో పట్టిన తుఫాను కారణంగా రెండు రోజులుగా వర్షం కురుస్తూనే ఉంది. సాయంత్రానికి తుఫాను ఎక్కడో తీరం దాటబోతోందనీ, దాని ప్రభావంతో రాత్రికి వాతావరణం మరింత భీభత్సంగా మారే సూచనలు ఉన్నాయనీ వాతావరణ కేంద్రం ప్రొద్దుట్నుంచీ ఎలుగెత్తి అరుస్తోంది.

జయ ఇల్లు ఊరిశివార్లలో ఉంది. ఆ ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందలేదు. మార్గం కూడా సుగమంగా ఉండదు. కాంట్రాక్టర్ వేసిన మట్టిబాట ఉన్నా, గట్టిగా వర్షం కురిస్తే కరిగిపోతుంది. చవగ్గా, వాయిదాల పద్ధతిలో వస్తోందని రెండేళ్ళ క్రితం అక్కడ రెండు పడకగదుల ఇండిపెండెంట్ హౌస్ ఒకటి తీసుకున్నాడు రాజయ్య. అయిదేళ్ళ క్రితం జయ తల్లి మరణించడంతో మళ్ళీ పెళ్ళిచేసుకున్నాడు. పొరుగు రాష్ట్రాలకు లోడ్ వేసుకుని వెళ్ళొస్తుంటాడు.

రాత్రివేళ ఆ వాతావరణంలో జయ ఇంటికి వెళ్ళడమంటే సాహసంతో కూడుకున్న విషయమే. స్నేహితురాలి పుట్టినరోజు పార్టీకి వెళ్ళితీరాలని అఖిల పట్టుపట్టడంతో కస్తూరి ఒప్పుకోక తప్పలేదు… ఆటోవాళ్ళెవరూ రాననడంతో కస్తూరి తన స్కూటర్ని బైటకు తీయకతప్పలేదు. ఎలాగో అవస్థపడి జయ ఇంటికి చేరుకునేసరికి తడిసిపోయారు ఇద్దరూ.

“అయ్యో, ఆంటీ! బాగా తడిసిపోయారు. లోపలికి వచ్చి బట్టలు మార్చుకోండి” అంది జయ నొచ్చుకుంటూ. “పరవాలేదమ్మా,” అని నవ్వేసి, “పార్టీ ముగియగానే ఫోన్ చెయ్, వస్తాను” అని కూతురితో చెప్పి, వెళ్ళిపోయింది కస్తూరి.

స్నేహితురాలిని తన గదిలోకి తీసుకువెళ్ళింది జయ. తువాలు ఇచ్చి, తల తుడుచుకుని బట్టలు మార్చుకోమంది. కూడా తెచ్చుకున్న పార్టీవేర్ ని తొడుక్కుంటూ, “మన వాళ్ళెవరూ రాలేదా?” అనడిగింది అఖిల, తాను తప్ప ఇంకెవరూ కనిపించకపోయేసరికి.

“వర్షం కదా…” అని జయ నసుగుతూంటే, అప్పుడే అక్కడకు వచ్చిన ఆమె పిన్ని, “ఈ వాతావరణంలో ఎవరు వస్తారులే అని…ఎవరినీ పిలవవద్దన్నారమ్మాయ్, జయ నాన్న. మీరిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ కదా! అందుకే నిన్ను ఒక్కదాన్నే పిలిపించారు” అంది. ‘ఈ సంగతి ఎరిగుంటే, అనవసరంగా అమ్మను అవస్థపెట్టేదాన్ని కాదుగదా!’ అని మదిలోనే నొచ్చుకుంది అఖిల.

జయ కేక్ కట్ చేసింది. కేక్ పీసెస్ ని ఒకరికొకరు తినిపించుకున్నారు. అఖిల ఇచ్చిన గిఫ్ట్ ను చూసుకుని సంబరపడిపోతూ ‘థాంక్స్’ చెప్పింది జయ.

వాతావరణశాఖ జోష్యాన్ని ఫలింపజేస్తూ వర్షం కుండపోతలలోకి దిగింది. ఉరుములు, మెరుపులే కాక ఉండి ఉండి పిడుగులు పడిన శబ్దాలు కూడా వినవస్తున్నాయి.

స్నేహితురాళ్ళు భోజనానికి కూర్చున్నారు. “మీరూ కూర్చోండి, ఆంటీ!” అని అఖిల అనడంతో, “మీరు తింటూండండమ్మా. అంకులూ, నేనూ తరువాత కూర్చుంటాం” అంది జయపిన్ని. స్నేహితురాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ నెమ్మదిగా తినసాగారు.

కాసేపటికి రాజయ్య కూడా రావడంతో, ఆవిడ తమ ఇద్దరికీ వడ్డించి, మరో ప్లేటులో భోజనం పెట్టి తీసుకువెళ్ళి హెల్పర్ జగ్గూకి ఇచ్చి వచ్చింది. రాజయ్య త్రాగి ఉన్నాడు. అంతవరకూ గరేజ్ లో జగ్గూతో కలసి డ్రింక్ చేసాడు. సారా వాసన అఖిల కడుపులో త్రిప్పసాగింది. ఆ వాసన భరించలేక, త్వరగా అక్కడనుండి లేవాలని వేగంగా భోంచేయసాగింది.

 అది చూసి, “దీనమ్మా వర్షం! తగ్గడానికి శానా టైమే పడుతుందిగాని, నువ్వు నెమ్మదిగా తినమ్మాయ్!” అన్నాడు రాజయ్య. కాసేపాగి, “ఏమాటకామాటే సెప్పుకోవాలి. నువ్వు శానా అందంగా ఉన్నావమ్మాయ్!” అన్నాడు మళ్ళీ.

ఎలా స్పందించాలో తెలియలేదు అఖిలకు. రాజయ్య చూపులు తనమీదే నర్తిస్తూండడం ఆమె గమనిస్తూనేవుంది. “మా క్లాసులోని అమ్మాయిలందరిలోకీ అఖిలే అందంగా ఉంటుందిః” అంది జయ నవ్వుతూ.

డిన్నర్ ముగిసేసరికి వాతావరణం మరింత భీభత్సంగా తయారయింది. “అమ్మ ఎలా వస్తుందో?” అంటూ బెంబేలుపడింది అఖిల.

“నేను తీసుకెళ్ళి దింపుతాలే, భయపడకు” అన్నాడు రాజయ్య. నలభయ్ ఐదేళ్ళుంటాయి అతనికి. మనిషి ఎత్తరి. నల్లగా, దృఢంగా ఉంటాడు. అతన్ని చూస్తేనే భయం అఖిలకు. అటువంటిది, అతను ఇప్పుడు త్రాగి వున్నాడు. ఆ వేళప్పుడు అతనితో ట్రక్ లో వెళ్ళడం ఇష్టంలేదు ఆమెకు. “పరవాలేదు, అంకుల్! మమ్మీ వచ్చాకే వెళతాను” అంది.

“ఈ వాతావరణంలో మీ అమ్మగారు ఎలా వస్తారమ్మా? మీ అంకుల్ తీసుకువెళ్తార్లే” అంది జయపిన్ని.

“వర్షం తగ్గకపోతే, ఈ రాత్రికి ఇక్కడే ఉండిపోతాను, ఆంటీ!” అంది అఖిల.

“ఔను, పిన్నీ! ఈ రాత్రికి నా గదిలో పడుకుంటుంది” అంది జయ హుషారుగా.

“నోర్మూసుకుని నీ గదిలోకి వెళ్ళు!” అంటూ గట్టిగా కసిరాడు రాజయ్య. జయకు తండ్రంటే భయం. త్రాగివుంటే ఇక చెప్పనవసరమేలేదు. గదిలోకి పరుగెత్తింది. రాజయ్య బైట గెడపెట్టేసాడు.

అఖిల నిశ్చేష్టురాలయింది. తల్లికి ఫోన్ చేద్దామంటే – సెల్ ఫోన్ ఇస్తే చదువు పాడవుతుందని కొనలేదు తల్లిదండ్రులు. దాని అవసరం ఇప్పుడు ఎంతైనా కనిపించింది ఆ పిల్లకు. “మమ్మీకి ఓసారి ఫోన్ చేయండి, అంకుల్! తాను బైలుదేరిందేమో…” అంది బెరుకుగానే.

“అవసరంలేదు” అనేసి, హెల్పర్ ని పేరుపెట్టి పిలిచాడు రాజయ్య. బదులురాకపోయేసరికి, సెల్ ఫోన్ తీసి వాడికి ఫోన్ చేసాడు. వాడు జవాబివ్వగానే, “తిని తొంగున్నావేంట్రా ఎదవనాకొడకా! బండి బైటికి తియ్” అంటూ అరచాడు.

అఖిల మదిని ఏవో భయాలు ముసురుకోవడంతో చిరుకంపనకు గురయింది. “ప్లీజ్, అంకుల్! ఉరుములు, మెరుపులు అంటే భయం నాకు. నేనిప్పుడు బైటకు రాను” అంది ప్రాధేయపూర్వకంగా. ఆమె సిక్స్ త్ సెన్స్ ఏదో ప్రమాదాన్ని శంకిస్తోంది.

బైటనుండి ట్రక్ స్టార్ట్ చేసిన శబ్దం వినిపించింది. “రా, వెళదాం” అంటూ అఖిల చేయి పట్టుకున్నాడు రాజయ్య తూలుతూనే. హఠాత్తుగా భయం స్థానే తెగువ చోటుచేసుకుంది ఆమెలో. చటుక్కున చేయి విడిపించుకుని మెరుపులా అతని చేతిలోని సెల్ ఫోన్ ని లాక్కుంది. హాల్లో ఉన్న వాష్ రూమ్ కి పరుగెత్తి లోపల దూరి గెడ పెట్టేసుకుంది.

ఊహించని ఆమె చర్యకు రాజయ్య కుపితుడయ్యాడు. వాష్ రూమ్ తలుపును దబదబా బాదుతూ, “ఏయ్, పిల్లా! బైటకు రా” అంటూ అరచాడు.

జవాబివ్వలేదామె. సెల్ ఫోన్లో తల్లికి ఫోన్ చేసింది. లైన్ కలవలేదు. వర్షం మూలంగా లైన్లన్నీ పాడయిపోయాయేమోనని భయం వేసింది. ఐనా విడవకుండా ప్రయత్నిస్తూనేవుంది. ఎట్టకేలకు ఫోన్ రింగ్ అయింది. తల్లి ఎంతకూ తీయకపోవడంతో, ‘అమ్మా! ప్లీజ్! త్వరగా తియ్…’ అంటూ మనసులోనే అర్థించింది.

అటువైపు తల్లి గొంతుక వినపడగానే భోరున ఏడ్చేసింది. కస్తూరి కంగారుపడి, “అఖీ! ఏమయిందిరా? ఎందుకు ఏడుస్తున్నావ్?” అనడిగింది. వెక్కుతూనే తానున్న పరిస్థితిని వివరించింది అఖిల.

కస్తూరి విభ్రాంతికి గురయింది. “నువ్వేమీ కంగారుపడకు చిట్టితల్లీ! నేనిప్పుడే బయలుదేరుతున్నాను. నేను వచ్చేంతవరకు నువ్వు వాష్ రూమ్ నుంచి బైటకు రావద్దు” అని ఫోన్ పెట్టేసింది.

తల్లితో మాట్లాడాక మనసుకు కొంత ఊరట చేకూరింది అఖిలకు. నిస్సత్తువగా గోడకు జారగిలబడిపోయింది…బైటనుండి రాజయ్య కోపంగా అరుస్తూ తలుపు బాదుతూనేవున్నాడు. మర్యాదగా బైటకు రాకపోతే తలుపు పగులగొట్టి తానే లోపలికి వస్తానంటూ బెదిరిస్తున్నాడు.

బైటి వాతావరణాన్ని లెక్కచేయకుండా రెయిన్ కోట్ తొడుక్కుని స్కూటర్ మీద బైలుదేరింది కస్తూరి. బయలుదేరుతూ ఎక్కడికో హడావిడిగా ఫోన్ చేసింది. మధ్యలో రెండు మూడు చోట్ల బండి స్కిడ్ అయి పడిపోవడంతో కాళ్ళకు, చేతులకు దెబ్బలు తగిలాయి. హెల్మెట్ తలను కాపాడింది. డ్రెస్ మట్టికొట్టుకుపోయింది. ఐనా పట్టుదలతో ముందుకు సాగిందామె. కూతురు ఏదో ఆపదలో ఉందన్న ఆలోచనే ఆమెను ఆ సాహసానికి పురిగొల్పింది.

జయఇంటికి చేరుకునేసరికి ముద్దయిపోయిందామె. ఇంటి ముందు ట్రక్ ఆగివుంది. దాని ఇంజన్ రన్ అవుతోంది. వీల్ ముందు కూర్చున్న జగ్గూ ఆమెను గమనించలేదు. తెరచియున్న గేట్ గుండా లోపల ప్రవేశించిన కస్తూరి, మూసియున్న వీధి తలుపును గట్టిగా కొట్టింది. జవాబులేదు. ఇంటిచుట్టూ తిరిగిచూసింది. ఓపక్క కిటికీ తెరచియుంది. లోపల లైట్ వెలుగుతున్నా ఎవరూ కనిపించలేదు…వీధిగుమ్మం వద్దకు తిరిగివచ్చింది. సెల్ తీసి కూతురికి ఫోన్ చేసింది. అఖిల వాష్ రూమ్ లో సురక్షితంగా ఉన్నట్టు తెలుసుకుని తేలికగా ఊపిరి పీల్చుకుంది.

గదిబైట నుండి రాజయ్య అరుపులు వినిపిస్తూనేవున్నాయి. వాటికి తోడు ఉరుములు, మెరుపులూ మరింత భయపెడుతున్నాయి. తల్లి వచ్చిందనేసరికి అఖిలకు వేయేనుగుల బలం వచ్చింది. ఏదో తెగింపు వచ్చేసింది. హఠాత్తుగా వాష్ రూమ్ తలుపు తెరచుకుని బైటకు వచ్చింది. రాజయ్య ఒక్కడే ఉన్నాడు. మెరుపులా గుమ్మంవైపు పరుగిడుతూన్న అఖిలను చూసి, “ఏయ్, ఆగు!” అంటూ పట్టుకోబోయాడు. అతన్ని రెండు చేతులతోనూ త్రోసేసింది ఆమె. వెల్లకిలా పడిపోయాడు. బాణంలా వీధిగుమ్మం వైపు దూసుకుపోయి, తలుపుగొళ్ళెం తీసింది. గుమ్మంలో తల్లి కనపడగానే, కావలించుకుని భోరుమంది.

పైకి లేచిన రాజయ్య కేకలుపెడుతూ వారి వెనుకే పరుగెత్తాడు. జగ్గూని పిలిచాడు. సీటులో గురకపెడుతున్నాడు వాడు.

తల్లీకూతుళ్ళు స్కూటర్ వైపు పరుగెత్తారు. తడిచి ముద్దవడంతో ఓ పట్టాన స్టార్ట్ అవలేదు అది. అంతలో రాజయ్య వచ్చి స్కూటర్ కి అడ్డుగా నిలుచున్నాడు. భయంతో తల్లికి అంటుకుపోయింది అఖిల. అంతలోనే సైరన్ మ్రోగించుకుంటూ పోలీస్ జీప్ అక్కడకు వచ్చింది. వారిని చూసి పారిపోబోయిన రాజయ్యను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

గది తలుపులకు పెట్టిన గెడలను పోలీసులు తీయడంతో బైటకు వచ్చిన జయ, ఆమె పిన్నీ జరిగింది ఆలకించి నిశ్చేష్ఠులయ్యారు.

“మీరు వెంటనే మాకు ఫోన్ చేయడం మంచిదయింది, మేడమ్! వీణ్ణి నిర్భయచట్టం క్రింద బుక్ చేసి జీవితంలో మళ్ళీ బైట తిరక్కుండా చేస్తాను” అన్నాడు ఎస్సయ్, కస్తూరితో.

ఎస్సయ్ పలుకులతో జయ, ఆమె పిన్ని కలవరపడ్డారు. “ఈరోజు అతిగా త్రాగడంవల్ల అలా ఒళ్ళు తెలియకుండా ప్రవర్తించాడు కాని, నా భర్త అలాంటివాడు కాదు, మేడమ్! అతను జైలుకు వెళ్తే మా కుటుంబం వీధిన పడుతుంది…” అంటూ ఏడుస్తూ కస్తూరి చేతులు పట్టుకుంది జయ పిన్ని.

“ప్లీజ్, ఆంటీ! నాన్న ప్రవర్తనకు నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను. దయచేసి వదిలేయండి..” అంది జయ కన్నులు వర్షిస్తూంటే. కస్తూరి మాట్లాడలేదు.

జయ స్నేహితురాలిని పట్టుకుని, “అఖీ! మా నాన్నను క్షమించవే. కేసు పెట్టొద్దని మీ మమ్మీకి చెప్పవే” అంటూ భోరుమంది. అఖిల అయోమయంగా తల్లివంక చూసింది.

పోలీసుల వడ్డింపుతో మత్తు దిగిన రాజయ్య కస్తూరి కాళ్ళపైన పడి, “నన్ను క్షమించు, మేడమ్! ఇంకెప్పుడూ ఇలా ప్రవర్తించను…” అంటూ ప్రాధేయపడ్డాడు.

జయను, ఆమె పిన్నినీ చూస్తూంటే కస్తూరికి ఎలాగో అయిపోయింది. ఆమె మదిలో ఆలోచనలు రేగాయి…’రాజయ్య దుశ్చర్యఫలితం అతని కుటుంబం మీద పడుతుంది. జయ మంచిపిల్ల…పైగా ఆ సంఘటన బైటకు పొక్కితే తామే అల్లరిపడతారు…’

“ఇన్స్పెక్టర్ గారూ! సమయానికి వచ్చి మమ్మల్ని ఆదుకున్నందుకు కృతజ్ఞతలు. త్రాగుడు మనిషిని దేనికైనా ప్రేరేపిస్తుంది. ఈసారికి ఇతన్ని హెచ్చరించి వదిలేయండి” అంది కస్తూరి.

“నో, మేడమ్! ఇలాంటివాళ్ళపైన జాలిచూపకూడదు. రేపు మరోసారి మరొకరిని వేధించకమానడు వీడు…” అన్నాడు ఎస్సయ్.

“లేదండీ. కేసులు, కోర్టులూ అంటూ చిన్నపిల్లను ఎక్స్ పోజ్ చేయడం కూడా నాకు ఇష్టంలేదు. అర్థంచేసుకోగలరనుకుంటాను” అంటూ కస్తూరి పట్టుపట్టడంతో, అయిష్టంగానే ఒప్పుకున్నాడు ఎస్సయ్.

జయ, ఆమె పిన్ని కృతజ్ఞతతో కస్తూరికి చేతులెత్తి నమస్కరించారు.

“రెండు రోజులు వీడిని లాకప్ లో ఉంచి దంచి పంపిస్తాం” అన్నాడు ఎస్సయ్…

ఆ రాత్రి తల్లీకూతుళ్ళకు కంటిపైన కునుకు లేదు. ఎంతటి ప్రమాదం తప్పిందో తలచుకుంటేనే కస్తూరి గుండె గుభేలుమంటోంది. ఆ విషయం భర్తకు తెలియనివ్వరాదని నిశ్చయించుకుంది. ఏడుస్తూన్న కూతుర్ని సముదాయిస్తూ ఉండిపోయింది…

ఆ తరువాత జయతో మాట్లాడడం మానేసింది అఖిల. టెన్త్ పరీక్షలు కాగానే కూతుర్ని తన అక్కగారి ఊరికి పంపించేసింది కస్తూరి. ఫలితాలు వచ్చాక పెద్దమ్మగారి ఊళ్ళోనే జూనియర్ కాలేజ్ లో చేరిపోయింది అఖిల.

#

ఏడాది తరువాత – ఓ రోజున టీవీలో కనిపించిన ఆ వార్త అఖిలను ఆకట్టుకుంది…

‘ఓ స్నేహితురాలి ఇంట్లో పార్టీకి వెళ్ళి రాత్రి పది గంటలకు స్కూటీ పైన ఒంటరిగా వస్తూన్న ఓ పదహారేళ్ళ అమ్మాయిని ఓ ట్రక్ డ్రైవరు, అతని హెల్పరూ కిడ్నాప్ చేసి అత్యాచారం జరిపారు. తమను గుర్తుపడుతుందన్న భయంతో ఆమెను చంపేసారు…’

పోలీసులు సి.సి. కెమేరాల సాయంతో నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది. మీడియా ముందు ప్రవేశపెట్టబడ్డ జయతండ్రి రాజయ్య, హెల్పర్ జగ్గూలను చూసి ఉలికిపడింది అఖిల.

తరచు అటువంటి దుండగాలను గూర్చి ఆలకిస్తూనేయున్నా, తమ ఊళ్ళో జరిగిన ఆ సంఘటన ఆమె మదిని విపరీతంగా కలచివేసింది. జయ పుట్టినరోజునాటి ఉదంతం మదిలో మెదలడంతో గుండె ఝళ్ళుమంది. జయ జ్ఞప్తికిరావడంతో, ‘పాపం ఈ పరిణామాన్ని అది ఎలా తట్టుకుంటుందో!’ అనుకుంటే జాలివేసింది. వెంటనే వెళ్ళి స్నేహితురాలిని ఓదార్చాలనిపించింది. పెద్దమ్మకు ఏదో సాకు చెప్పి ఇంటికి బైలుదేరింది…

జయపిన్ని అఖిలను చూడగానే కళ్ళనీళ్ళు పెట్టుకుంది. ఆమె చెప్పిన సమాచారం ఆ పిల్లను విభ్రాంతికి గురిచేసింది - ‘తండ్రి కిరాతకాన్ని, కలిగిన అవమానాన్నీ తట్టుకోలేక జయ ఆత్మహత్య చేసుకుంది!’

అఖిల వెక్కివెక్కి ఏడ్చింది. ఆమె మెదడులో ఆలోచనలు సుళ్ళుతిరిగాయి – ‘ఈ సమాజానికి ఏమయింది? ఎక్కడికి పోతోంది? పసిపాపలను, వృద్ధవనితలను సైతం వదలని కామాంధులు విచ్చలవిడిగా తిరుగాడే నేటి సమాజంలో – ఆడపిల్లగా పుట్టడమే శాపమా? స్త్రీని శక్తిస్వరూపిణిగా కొలిచే గడ్డపైన – ఆడపిల్లకు మనుగడే ఓ గొప్ప సాహసంగా మారిందా!?...’ ఆ పసిమనసు తీవ్రక్షోభకు గురయింది.


Rate this content
Log in

Similar telugu story from Horror