8.మారిన మనసు
8.మారిన మనసు


8. మారిన మనసు
-శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి
ఎంత భయానక స్వప్నమో...? దిగ్గున లేచాడు ఆకాష్.
ఏంటి...ఎందుకొచ్చిందీ కల...? ఒళ్ళంతా చమటలు పట్టేసాయి. ఒకవేళ నేను తనను చంపాలనుకున్న నా మనసులోని మాట...భూమికకు తెలిసిపోయిందా...? అనుకుంటూ పక్కకు తిరిగి చూసాడు. కలలోకొచ్చి ఏమీ తెలియనట్టు ఎంత అమాయకంగా నిద్రపోతుందో...? సమయానికి మెలకువ వచ్చింది కాబట్టి సరిపోయింది గానీ...లేదంటే...గుండాగి చచ్చేవాడిని అనుకుంటూ లేచెళ్లి మంచినీళ్లు తాగిపడుకున్నాడు.
అలా పడుకున్నాడే గానీ...తనకొచ్చిన కల గురించే ఆలోచిస్తున్నాడు...ఏమిటీ కల...? నన్ను చంపేంత ధైర్యం భూమికకు ఎలా వచ్చింది..? నిద్దట్లో ఉన్న నాముక్కు దగ్గర ఏదో పెట్టి మత్తులోనికి పోనిచ్చినా సరే...తాను చేసేదంతా నాకు తెలుస్తూనే ఉంది. నా నోటిని గట్టిగా గుడ్డతో కట్టేసింది. కాళ్ళను, చేతుల్నీ..మంచానికేసి తాళ్లతో బంధించింది. తలగడ తీసుకుని...ముఖంపై పడేసింది. తన రెండు చేతుల్తోనూ...గట్టిగా అదుముతూ ఊపిరాడకుండా నొక్కేస్తుంది. కొన ఊపిరితో...గిలగిల కొట్టుకుంటూ...గొంతు చించుకొని అరుస్తున్నా...నోటి నుంచి మాట బయటకు రావడం లేదు. నాలో నేను పడ్డ ఆ టెన్షన్ కి ఎలా వచ్చిందో..ఒక్కసారిగా మెళకువ రావడంతో బ్రతికిపోయాను.
అచ్చం అలాగే కదూ...నాభార్యను అడ్డం తొలగించుకోడానికి నేను నిజం చేయాలనుకున్నదంతా భూమిక కలలో నన్నే చంపేస్తూ భయపెట్టింది. అమ్మో...అనుకుంటూ వచ్చిన కలను తలచుకుని...మెల్లిగా నిద్రలోకి ఒదిగిపోయాడు ఆకాష్.
* * * *
ఆకాష్ కళ్ళు తెరిచిచూసేసరికి....ఆసుపత్రిలో వున్నాడు.
అతని ముఖంలోకి ముఖం పెట్టి ఆదుర్దాగా చూస్తూ... భార్య భూమిక కనిపించింది.
తన ఒంటినిండా ట్యూబుల్లాంటివి అమర్చేసి ఉన్నాయని గ్రహించాడు. తనకేమయ్యిందో అర్థంగాక చూస్తుంటే...భార్య భూమిక లేచి భర్త చేయిని చేతిలోకి తీసుకుంటూ చెప్పింది.
"మరేం లేదండీ...ఉదయం నాకు మెలకువ వచ్చి మిమ్మల్ని చూసేసరికి...ఒళ్ళంతా చమటలు పట్టేసి...ఏదో చెప్పలేని బాధతో విలవిల్లాడుతుంటే...కంగారు పడ్డాను. వెంటనే 108 అంబులెన్స్ కి ఫోన్ చేసి...ఆసుపత్రికి తీసుకొస్తే...గుండెపోటు వచ్చింది...వెంటనే ఆపరేషన్ చేయాలని చెప్పారు. మీ ఆరోగ్యం కుదుటపడితే చాలని ఇంకేమీ ఆలోచించకుండా వెంటనే వైద్యం చేసేయమని చెప్పాను. సమయానికి తీసుకురావడం వల్ల ఆపరేషన్ సక్సెస్ అయ్యిందని డాక్టర్లు చెప్పారు" అంటూ...మంగళ సూత్రాల్ని కళ్లకద్దుకుంది...భర్త తేరుకోవడంతో భూమిక.
భార్య చెప్పింది విన్నాకా...ప్రాశ్చాత్తాపంతో ఆమె ముఖం చూడలేపోయాడు.
నా ఉంపుడుగత్తెను శాశ్వతంగా ఇంటికి తీసుకొచ్చేయడం కోసమే...భార్యను చంపేసి...తమకు అడ్డం తొలగించుకోవాలన్న వ్యూహం పన్నినందుకే...భార్య నన్నే చంపేస్తున్నట్టు భయానిక కలతో...ఇంతవరకూ తెచ్చుకున్నాననుకున్నాడు.
నా ప్రాణాల్ని కాపాడిన భార్యనా....? అంత దారుణంగా చంపేయాలనుకున్నాను. ఇప్పటికైనా...పిచ్చి వ్యూహాలు పన్నడం మానేసి...బుద్దిగా భార్యతోనే కాపురం చేసుకోవాలి . మనసు మార్చుకుంటూ అనుకున్నాడు ఆకాష్...!!*
*** *** ***
.