నిషిక
నిషిక


అది ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో శ్రీకాకుళం కి 150 కిలోమీటర్ల దూరంలో అటవీ ప్రాంతంలో ఉన్న బినవాడ అనే చిన్న కుగ్రామం.. చుట్టూ అటవీ ప్రాంతం అవ్వడం వల్ల అక్కడి ప్రజలు దాదాపుగా అన్ని వస్తువులు వారపు సంత లోనే కొంటారు.
సంత అంతా తిరిగి కావలసినవన్నీ కొనుక్కున్నాడు గోపి..
తిరిగి వస్తూ కొంచెం దూరంగా ఉన్న గంజాయి పుంత వైపుకి వెళ్ళాడు.. అది ఒక ఇసుకప్రదేశం.
పూర్వం అక్కడ రహస్యంగా గంజాయి పండించేవారు..కానీ ఇప్పుడు లేదు..కానీ సాధారణంగా అక్కడ ఎవరైనా దొంగలు దొంగతనం చేసి తెచ్చిన వస్తువుల్ని రహస్యంగా అమ్ముతూ ఉంటారు.. అవి చౌకగా లభిస్తుంటాయి కాబట్టి ఎవరో మంచివాళ్లు తప్ప చాలా మంది అవి కొంటూ ఉంటారు ...
ప్రస్తుతం అక్కడ ఎవరూ లేరు
కాసేపు చూసాడు గోపి. ఇక వెళ్లిపోదాం అనుకుంటూ ఉండగా. ఒక నడివయసు వ్యక్తి ఒక మంచాన్ని భుజం మీద పెట్టుకుని వస్తున్నాడు.
అతను గోపిని చూసి ఆగాడు.
" అయ్యా ఇది చాలా పాతది..టేకు మంచం. మీరు ఎక్కడ కొన్నా 10 వేల కన్నా ఎక్కువే ఉంటుంది... ఇది గంజాం దగ్గర ఒక గ్రామం నుంచి దొంగిలించి తీసుకువచ్చాను..
ఎంత ఇస్తారో ఇవ్వండి"
అన్నాడు
మంచం చూడగానే సంతోషం వేసింది గోపికి తాను ఎప్పటినుంచో మంచి మంచాన్ని కొనాలి అనుకుంటున్నాడు కాబట్టి అతనికి కొంత డబ్బు ముట్టచెప్పి తీసుకున్నాడు.
వెళ్లిపోయేటప్పుడు అడిగాడు
"నీ పేరు ఏమిటి?"
"నా పేరు ఎందైతే ఏంది లెండి అందరూ తాతాజీ అని పిలుస్తారు
మీరూ అలాగే పిలవచ్చు" అన్నాడు..
"అలాగే వెళ్ళొస్తా తాతాజీ" అని నవ్వుతూ
సెలవు తీసుకున్నాడు గోపి.
*********
ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రతి గ్రామంలోనూ ఉన్నట్టే ఆ బినవాడ గ్రామానికి కూడా ఒక మంత్రగాడు అతని పేరు మారయ్య.
ఆ ఊరి వాళ్ళు అందరూ ఏ సమస్య వచ్చినా ముందు అతని దగ్గరికి వస్తారు తర్వాతే డాక్టర్ దగ్గరికి .
తలుపు కొట్టాడు గోపి..
" ఏం కావాలి సామి పొద్దున్నే వచ్చావు"
తలుపు తీసి అడిగాడు మారయ్య.
" చెప్తాను విను మా ఇంట్లో ఒక మంచం ఉంది.. అది మాట్లాడుతోంది"
కళ్ళు పెద్దవి చేసి గట్టిగా చెప్పాడు గోపి..
గంభీరంగా చూసాడు మారయ్య.
" ఏంటి మంచం మాట్లాడుతోందా" నవ్వుతూ అన్నాడు..
" అవును స్వామి నువ్వు విన్నది నిజమే..మాట్లాడుతోంది మూలుగుతోంది ఏడుస్తోంది కూడా"
ఇంకా బిగ్గరగా అన్నాడు గోపి..
" అలాగా ఆ మంచం కొని ఎంతకాలమైంది ఎక్కడ కొన్నావు" సాలోచనగా అడిగాడు మారయ్య.
అంతా చెప్పాడు గోపి..
" నేను కొన్న తర్వాత కొన్ని రోజులు బాగానే ఉంది.. రెండు రోజుల నుంచి రాత్రి పడుకున్నప్పుడు అర్ధరాత్రి మూలుగుతూ ఏడుస్తోంది.
ప్లీజ్ దయచేసి నన్ను వదిలి పెట్టు నేను రాలేకపోతున్నాను దయచేసి నన్ను వదిలి పెట్టు అని మరీ మరీ అంటోంది "దాదాపు ఏడుస్తున్నట్టు అన్నాడు గోపి.
"ఇదేదో పెద్ద విషయమే నేను గతంలో ఇలాంటివి విన్నాను.
నువ్వు భయపడకు నేను ఈ రోజు రాత్రి మీ ఇంటికి వచ్చి ఆ మంచం మీద పడుకుంటాను..
ఏం చెబుతుందో వింటాను తర్వాత ఏం చేయాలో అది చేద్దాం" అని చెప్పి గోపీకి హామీ ఇచ్చాడు మారయ్య.
హమ్మయ్య అనుకుని ప్రశాంతంగా ఇంటికి వెళ్ళాడు గోపి ..
మాట ఇచ్చినట్టే ఆ రాత్రి గోపి ఇంటికి వెళ్ళాడు మారయ్య..
అప్పటికే మంచాన్ని ఇంటివెనుక పాకలో వేసి ఉంచారు ..
దోమ తెర కట్టుకొని అక్కడే పడుకున్నాడు మారయ్య చుట్టూ ప్రహరీ ఉండడంవల్ల అడవి జంతువుల నుంచి భయం లేదు అనుకున్నాడు..
హాయిగా నిద్రపోదాం అనుకున్నాడు కానీ ఏదో తెలియని భయం.నిద్ర పట్టట్లేదు.. అయినా అలాగే పడుకున్నాడు అర్ధరాత్రి అయ్యింది..ముందు రోజు కురిసిన వర్షం వల్ల చుట్టూ కప్పల
బెకబెకలు..నిముషాలు గడుస్తున్నాయి..హఠాత్తుగా తన చెవులను తాకుతున్న చిన్న మూలుగు..చిన్నగా ఎవరో ఏడుస్తున్నట్టు తెలుస్తోంది.అది క్రమక్రమంగా పెద్దగా అవుతోంది..
ఆ మూలుగు తన తలగడ నుంచా దుప్పటి నుంచా అని సందేహం వచ్చి అన్నీ తీసేసాడు..
అయినా వస్తోంది సన్నని ఏడుపు.. తన శరీరం వణకడం ప్రారంభించింది.. చుట్టూ నిశ్శబ్దం .. క్రమక్రమంగా చిన్నగా మాటలు వినిపిస్తున్నాయి
"దయచేసి నన్ను వదిలి పెట్టు నేను మోయలేక పోతున్నాను"
అంటూ అరుపులు..
" ఎవరు నువ్వు..
నువ్వు ఎవరు ..
నాకు చెప్పు.."
ధైర్యం చేసి అడిగాడు మారయ్య..
" నేనెవర్ని ..
నేనెవర్ని..'
అదే మాట మళ్లీ మళ్లీ వినిపిస్తోంది..
మరింత భయం పెరిగింది మారయ్యకి.
" నిన్ను విడిచి పెడతా నాకు ఏమిస్తావు"
మళ్లీ అడిగాడు.
ఈసారి కాసేపు ఆ ఏడుపుకి విరామం.. చిన్నగా నవ్వు..
ఆ నవ్వు కూడా భయపెట్టేట్టే ఉంది..
నవ్వుతూ చెప్పింది
" నీకు ఇస్తాను ఇప్పటివరకు నీకు లేని గొప్ప గొప్ప శక్తులు నీకు ఇస్తాను.."
కాస్త ధైర్యం సంతోషం మారయ్యలో
" సరే నేను ఏం చేయాలో చెప్పు"
ఉద్రేకాన్ని ఆపుకుంటూ అడిగాడు..
"బలి ఇవ్వాలి"
మారయ్య ముఖం లో భయం నాట్యం చేస్తోంది.
"అవును
బలి ఇవ్వాలి
ఇస్తే నీకు నా శక్తులు ఇస్తాను" కొంచెం గంభీరంగా ఉంది ఆ గొంతు..
కాస్త కీడు శంకించింది మారయ్య మనసులో..
అది గమనించిన ఆ మంచం
' నువ్వేమి చేయక్కర్లేదు నేను చెప్పింది చెయ్యి ..రెండు రోజుల్లో అమావాస్య వస్తుంది ..
కాబట్టి నా బలం రెట్టింపవుతుంది..
ఆ రాత్రి అయితే అది పది రెట్లు అవుతుంది..
ఆ సమయంలో ఈ మంచాన్ని తీసుకెళ్లి అడవిలో ఉత్తరాన ఉన్న మర్రిచెట్టు మొదట్లో ఉన్న పెద్ద శిల దగ్గర వదిలిపెట్టమని చెప్పు.
ఆ శిలే నా రూపం నా నివాసం..
మంచాన్ని అక్కడ వదిలిపెట్టి వచ్చేయమను చాలు.."
అంది ఆ మంచం..
" మరి బలి "
ఆశ్చర్యంగా అడిగాడు మారయ్య..
మూర్ఖుడా అది చెబుతాను ఈ మంచం శిల దగ్గరకు వెళ్ళగానే నాలోని శక్తి బైటకి వస్తుంది.. ఆ వ్యక్తి ని బలి తీసుకుంటుంది..
ఆ సమయంలో నువ్వు అక్కడ ఉండి అతని బూడిద నుదుటికి పెట్టుకో నీకు కావలసిన శక్తి లభిస్తుంది"
వికటంగా చెప్పింది ఆ మంచం..
" బాగుంది కానీ నాకో సందేహం.. అతని శరీరాన్ని ఎవరైనా చూస్తే?"
"నాకు తెలుసు నీభయం.. నేనొక
భయంకరమైన దుష్ట శక్తి ని నన్ను నిషిక అంటారు..
మనిషి రక్తమే నాకు దాహం..
అతని మాంసమే నాకు ఆహారం..
అతని ఆస్తికలే నాకు అస్తిత్వం.. అతని శరీరమే నాకు ప్రాణం.. కాబట్టి అతనిలో ఏ భాగము అక్కడ మిగలదు.."
రోదన తో కూడిన నవ్వుతో వికటంగా చెప్పింది..
వినడానికే భయంగా అనిపించింది మారయ్యకి.తన జీవితం లో ఎన్నడూ లేని భయంకర అనుభవం ఇది..
" కానీ .."
ఇంకా ఏదో అనబోయాడు.
" నాకు తెలుసు నీ గుండె శబ్దం నేను వినగలను..
నీ మనసులో ఆలోచనలు కూడా వినగలను ..
నువ్వు కూడా అక్కడే ఉంటావు నీకు మాత్రం ఎందుకు హాని జరగదు అనే కదా నీ సందేహం..
నువ్వు ఒక పని చెయ్యి ఈ మంచం పట్టెడ చివర ఉన్న చిన్న ముక్క కత్తిరించి దగ్గర ఉంచుకో..నీకు అదే రక్ష.."
ఈసారి కాస్త ధైర్యం వచ్చింది
" సరే "
అన్నాడు..
*********
" చెప్పాగా గోపి అదొక దుష్టశక్తి..అది నిషిక..నువ్వు ఎల్లుండి రాబోయే అమావాస్య రాత్రి 12 గంటలకి ఆ మంచాన్ని తీసుకుని అడవిలో ఉత్తరాన ఉన్న పెద్ద మర్రిచెట్టు కింద ఉన్న శిల దగ్గర దింపేస్తే చాలు..సమస్య పరిష్కారం అయినట్టే.. పోతే నువ్వు మాత్రం ఇక ఆ మంచం మీద ఇక పడుకోకు..దానితో అసలు మాట్లాడకు"
అని చెప్పి వెళ్ళిపోయాడు మారయ్య.
అయితే ఎల్లుండి ఈ మంచాన్ని వదిలించుకోవడం అన్నమాట అనుకున్నాడు గోపి.
సరే అనవసరంగా కొన్నాను అని ముందుగా బాధపడినా అది తననేమీ చేయనందుకు సంతోషంగానే ఉంది..
సరే రాత్రి మళ్ళీ ఈ మంచం మీద పడుకోకూడదు అనుకున్నాడు . మారయ్య చెప్పినట్టు తాను అసలు మాట్లాడకూడదు అని కూడా అనుకున్నాడు
గోపి.
******
రాత్రయింది ప్రశాంతంగా పడుకోడానికి ఎంత ప్రయత్నించినా నిద్ర రాలేదు .
దృష్టి మంచం మీదే ఉంది..ఇప్పటివరకు అది తనని ఏమీ చేయలేదు అంటే ఇక పై కూడా చేయకపోవచ్చు..ఒక్కసారి ప్రయత్నిస్తే పోలా..అనుకున్నాడు.
నిశ్శబ్దంగా వెళ్లి మంచం మీద పడుకున్నాడు..
కొంతసేపు నిశ్శబ్దంగానే గడిచింది.
అర్ధరాత్రి హటాత్తుగా మరలా మూలుగు చిన్నగా
మరలా ఏడుపు..
కాసేపు విన్నాడు..ఇక ఉండబట్టలేక మాట్లాడేసాడు..
" ఎవరు నువ్వు ?'
అంతే ఒక్కసారిగా ఏడుపు ఆగిపోయింది..
" చూడు నువ్వు ఈ మంచం కొని తప్పు చేశానని బాధపడుతున్నావని నాకు తెలుసు..
నీ బాధ పోయే మార్గం చెబుతాను.."
ఎనలేని ఆశ్చర్యం గోపిలో..
" సరే చెప్పు ' ఆతృతగా అడిగాడు.
" నువ్వు నన్ను వదిలి పెడితే నీకు అపారమైన నిధి ఉన్న స్థలాన్ని చూపిస్తాను.."
కొంచెం సంతోషం గోపి మనసులో.
" మరి నేనేం చేయాలి?"
అడిగాడు గోపి.
" బలి ఇవ్వాలి "
ప్రశాంతంగా చెప్పింది మంచం.
ఉలిక్కిపడ్డాడు గోపి. నోట మాట లేదు ..
"కంగారు పడకు నువ్వేమి చేయనవసరం లేదు.
నువ్వు రేపు ఈ మంచాన్ని తీసుకువచ్చే పనిని ఎవరికైనా అప్పగించు..
మంచాన్ని శిల దగ్గర వదిలి దాన్నే చూడమను. నేను అతని కళ్ళ ద్వారా అతనిలోకి ప్రవేశించి వాడిని బలి తీసుకుంటాను..
ఆ తర్వాత నీకు నేను చూపించే స్థలంలో తవ్వితే అపారమైన నిధి నీకు దొరుకుతుంది.. "
" కానీ..."
నాకు తెలుసు నువ్వు ఏమంటున్నావో నువ్వు ఈ మంచం పట్టెడ వంచన చిన్న ముక్క కత్తిరించి నీ దగ్గర ఉంచుకో అది నిన్ను కాపాడుతుంది లేకపోతే నువ్వు కూడా చనిపోతావు..
" సరే తప్పకుండా అలా చేస్తాను"
అనుకుని ఇక పడుకోకుండా నిద్ర పట్టక బయటికి వచ్చేశాడు గోపి..
అంటే మారయ్య తనని బలి ఇచ్చి నిధిని పొందుదాం అనుకున్నాడు అన్నమాట ..మనసంతా ఆందోళన ..
ఏమైనా ఈ రాత్రి మంచం మీద పడుకోబట్టి తనకు నిజం తెలిసింది లేకపోతే అంతే సంగతులు తలుచుకుంటేనే వణుకు వచ్చింది గోపి కి..
**********
"గోపి గారి ఇల్లు ఎక్కడండి"
అడిగాడు రాజు ..
అవతలి వ్యక్తి ఒక సందు చూపించాడు
ఈ సందు లోనే ఆఖరి పెంకుటిల్లు"
అని వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి..
రాజు ఆ ఇంటి వైపు వెళ్ళాడు..
చూస్తూనే స్నేహితుని పట్టుకుని కుశల ప్రశ్నలు అడిగాడు గోపి..
"ముందు నేను వచ్చిన పని నీకు తెలుసు కదా ఆ సంగతి చెప్పు" అన్నాడు గోపి..
" సరే సరే చెప్తాను రా" అన్నాడు రాజు
"త్వరగా చెప్పు గోపి నిజంగానే మంచం మాట్లాడుతుందా?"
ఆతృతగా అడిగాడు రాజా..
" కంగారెందుకు నువ్వే చూద్దువు గాని "అంటూ పాకలో వేసిన మంచాన్ని చూపించాడు గోపి..
'ఇదే..
నేను నెల రోజుల క్రితం కొన్నాను కొన్ని రోజులు బాగానే ఉంది కానీ హఠాత్తుగా ఏమైందో తెలియదు మాట్లాడడం మొదలుపెట్టింది చివరకు మారయ్య ను అడిగాను అతను రేపు అమావాస్య అర్ధరాత్రి ఈ మంచాన్ని ఒక్కళ్ళే వెళ్లి అడవుల్లో ఉన్న మర్రిచెట్టు కింద ఒక శిల దగ్గర పెట్టి వెనక్కి వచ్చేయమని చెప్పాడు..
అందుకే రేపు ఈ మంచం వెళ్ళిపోతుంది నువ్వు ఎప్పటి నుంచో దెయ్యాలను ఆత్మలను తెలుసుకోవాలని అని అనుకుంటూ ఉంటావు కదా అందుకే నిన్ను పిలిచాను..రేపు రాత్రి ఈ మంచాన్ని తీసుకెళ్లేది కూడా నువ్వే" అన్నాడు గోపి ..
"అవునా అయితే ఈ రాత్రి కచ్చితంగా నేను దీని మీద పడుకుంటాను..రేపు దీన్ని దాని ప్లేస్ కి పంపుతాను.." అన్నాడు రాజా ఉద్విగ్నంగా..
"కానీ ఇందాకే మారయ్య ఎవరినీ పడుకోవద్దని చెప్పాడు..కాబట్టి వద్దు "అన్నాడు గోపి
"లేదు లేదు నేను పడుకుని తీరవలసిందే" మొండిగా అన్నాడు రాజా
"కానీ రాజా ఒక్కటి మాత్రం మర్చిపోకు నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ నోరు మెదపకు..విను అంతే..సరేనా"
మరీ మరీ చెప్పాడు గోపి.
**********
అర్ధరాత్రి అవుతోంది.. నిద్ర పట్టట్లేదు రాజాకి..
ఎలాగైనా మంచం మాటలు వినాలి అది కథ చెబితే ఊకొట్టాలి..
నేనూ ఏదో ఒకటి చెప్పాలి నవ్వు కొన్నాడు రాజా..
దూరంగా గుడ్లగూబల అరుపులు..అప్పుడప్పుడు నక్కల ఊళలు తప్ప ఇక శబ్దాలు ఏమీ లేవు..
హటాత్తుగా మూలుగు అతనిని ఆశ్చర్యపరచింది..కాస్త చెవులు రిక్కించాడు..
ఆ తర్వాత చిన్నగా రోదన.. కానీ అది తను అనుకున్నంత ఆహ్లాదకరంగా లేదు..
అతని మెదడుని గుండెని ఎవరో పిండేస్తున్నట్టుగా ఉంది..
తన స్నేహితుడు ఎట్టి పరిస్థితుల్లోనూ మాట్లాడవద్దని వార్నింగ్ కూడా ఇచ్చాడు..
కానీ..
పదే పదే ఏడుస్తూ అది మాట్లాడుతున్న మాటలు వింటూ ఉండలేకపోయాడు..
అందుకే అడిగేసాడు భయంభయం గా
"ఎందుకు ఏడుస్తున్నావు?'
ఒక్కసారిగా ఏడుపు ఆగిపోయింది..
ఒక ముసలిగొంతు మాట్లాడడం మొదలు పెట్టింది..
"నువ్వు చాలా మంచివాడివి బాబు..
ఇప్పటివరకు నన్ను ఎవరు ఇలా అడగలేదు ..
కానీ .
కానీ నువ్వు నా బాధని తీర్చగలవా?"
ఆప్యాయత ఆ గొంతులో..
" చెప్పు తీరుస్తాను.."
సరే రేపు నన్ను అడవుల్లో ఉన్న మర్రి చెట్టు కింద శిల దగ్గర వదిలిపెట్టి వచ్చేస్తారు వాళ్ళు కానీ అది నాకు ఇష్టం లేదు..
ఎందుకంటే దానివల్ల వాళ్లకి లాభం కలుగుతుంది కానీ అదే పని నువ్వు చెయ్యి అలా చేస్తే నీకు నేను శక్తులు ఇస్తాను..
ఆ దుర్మార్గులకి ఆ శక్తులు ఇవ్వడం నాకు ఇష్టం లేదు.."
నిరాశగా అంది మంచం..
" సరే ఏం చేయాలో చెప్పు.."
" నిజానికి నన్ను అక్కడ వదిలి పెట్టిన వాళ్ళు అక్కడే చనిపోతారు అది వాళ్లకి తెలుసు అందుకే ఆ పని నీకు అప్పగించాడు గోపి .."
వింటూనే మనసు ఉడికిపోయింది రాజాకి ..
నమ్మక ద్రోహం చేసిన స్నేహితుడి మీద విపరీతమైన కోపం..
"నీ బాధ నేను అర్థం చేసుకోగలను నీ స్నేహితుడు నిన్ను వంచించాడు.. కానీ నేను నీకు ఒక సాయం చేస్తాను.. "
"సరే చెప్పు "
అతనిలో కోపం కంఠంలో కనిపిస్తోంది..
"సరే విను నువ్వు రేపు మంచం తీసుకుని మర్రి చెట్టు దగ్గర శిల వద్దకు రా నిన్ను చూడడానికి నీ చావు చూడడానికి వాళ్ళిద్దరూ నీ వెనకాల నక్కి నక్కి వస్తారు .. వారికి తెలియని విషయం ఏమిటంటే అక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఛస్తారు.. కానీ ఒక పని చెయ్ ఈ మంచం పట్టెడ అంచును కత్తిరించి నీ దగ్గర ఉంచుకో..
అప్పుడు నా శక్తి నిన్ను ఏమీ చేయదు ..
వాళ్ళిద్దర్నీ చంపి నువ్వు క్షేమంగా రావచ్చు పైగా నీకు కొంత శక్తి కూడా వస్తుంది"
అంది .
"ఆ శక్తి ఏమిటి ?"
అడిగాడు రాజా.
నీకు బాగా ఇష్టమైనది.
ఆత్మలతో మాట్లాడగలిగే శక్తిని నీకు ఇస్తాను..
సరే అన్నాడు రాజా సంతోషంగా..
తెల్లవారింది .
"ఈరోజు మంచాన్ని తీసుకెళ్లడానికి నీకు అభ్యంతరం లేదు కదా అడిగాడు గోపి..
" తప్పకుండా తీసుకెళ్తాను" కోపాన్ని దాచుకుంటూ అన్నాడు రాజా..
******
అర్ధరాత్రి 12 గంటలు అయింది..
అమావాస్య కారు చీకట్లు చుట్టూ దారిని కనబడ నివ్వడం లేదు..
అంత చీకటిలోనూ చిన్న టార్చ్ లైట్ వేసుకుని మంచం నెత్తి మీద పెట్టుకుని నడుచుకుంటూ వెళుతున్నాడు రాజా..
ఊరు దాటాక స్మశానం దగ్గర ఉన్న మారయ్య
వెళ్తున్న రాజా ని చూసాడు
"ఎందుకు గోపి వెళ్లట్లేదు?"
అర్థం కాలేదు ..
ఈలోగా రాజా వెనుక వెలుతున్న గోపి కూడా కనిపించాడు..
వాళ్ళిద్దరూ వెళ్లిన కాసేపటికి వాళ్ళిద్దరి వెనుకా వెళ్ళాడు మారయ్య..
చుట్టూ చీకటి కీచురాళ్ళ అరుపులు అప్పుడప్పుడు గాలికి చెట్ల ఆకులు శబ్దాలు చేస్తున్నాయి అప్పుడప్పుడు పొదల్లో ఆడుకుంటున్న నిశాచరాల చప్పుళ్ళు..
వాటి మధ్య తీవ్రమైన ఉత్కంఠ తో చెమట్లు పడుతున్నా లెక్క చేయకుండా ఆయాసపడుతూ వెళ్తున్నాడు రాజా..
అతని వెనుక నిశ్శబ్దంగా గోపి..అతని వెనుక మారయ్య.. ముగ్గురు దూరం దూరంగా వెళ్తున్నారు ..
దట్టమైన మేఘాలు ఎప్పుడైనా వర్షించడానికి సిద్ధంగా ఉన్నాయి..
గాలి వేగం పెరిగింది ఎండిపోయిన చెట్ల కొమ్మలు అప్పుడప్పుడు విరిగి కింద పడుతున్నాయి ఆ శబ్దానికి చిన్న చిన్న జీవులు పరుగులు పెడుతున్నాయి రాను రాను శబ్దాలు పెరిగాయి కీచురాళ్ళ రోదలతో పాటు గుడ్లగూబల అరుపులు పాముల బుసలు. నక్కల ఊళలు తోడేళ్ళ అరుపులతో ఆ ప్రదేశం భయానకంగా మారింది..
కానీ ఆయాసపడుతూనే ముందుకు వెళుతున్నాడు రాజా..
అతను అనుకున్న మర్రిచెట్టు రానే వచ్చింది దాని కింద ఐదు అడుగుల పెద్ద శిల ..
గోపి నిన్న చెప్పాడు పూర్వం ఆ శిల దగ్గర చాలా కాలం పాటు బలులు ఇచ్చేవారట .. క్రమక్రమంగా ఆ దుష్టశక్తి బాధ తట్టుకోలేక ఊరు అక్కడినుంచి వెళ్లిపోయిందట అప్పుడు అదంతా అడవిగా మారిపోయిందట..
మంచాన్ని శిల దగ్గర దింపాడు
రాజా..
ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి అనుకుంటూ రెండు అడుగులు వెనక్కి వేశాడు..
అతనికి మరో మూడు అడుగుల వెనక గోపి ..
అతనికి మరో మూడు అడుగుల వెనక మారయ్య..
అందరి దృష్టి ఆ మంచం మీదే ఉంది ..
హఠాత్తుగా ఒక వెలుగు ..మిణుకు మిణుకు మంటూ.. ఆ వెలుగు క్రమంగా పెద్దదై దాని చుట్టూ ఉన్న మొక్కలను చెట్లను ఆక్రమించింది..
ఆ వెలుగు మరింత ఎక్కువైంది.
అవి వెలుగు రేఖలు కాదు కాలరాత్రి యముని పాశాల్లా ఉన్నాయి..
ఆ వెలుగు
వారి కళ్ళను మూసేసింది..
వారిలోని నవ నాడులూ కుచించుకు పోతున్నాయి..ఎమ్ జరుగుతోందో తెలుసుకునే పరిస్థితిలేదు వారికి..
వారిలో ఉన్న రక్తాన్ని పీల్చేసింది శరీరాన్ని కాల్చేసింది.
ఎముకలను బూడిదగా మార్చేసింది ..
చూస్తుండగానే ఆ కబంధ హస్తాలు ఆ ముగ్గురిని తనలోనికి లాగేసుకున్నాయి..
అతి భయంకరమైన ఆ దుష్టశక్తి ధాటికి అక్కడ బూడిద కూడా మిగలలేదు..
అంతా కొన్ని నిమిషాల్లోనే జరిగిపోయింది..
ఆహారం దొరికిన సంతృప్తి తో అది శాంతించింది..
చూడడానికి వచ్చిన గుడ్లగూబలు తామ పని అయిపోయినట్టు అక్కడ్నుంచి ఎగురుతూ వెళ్ళిపోయాయి..
కాసేపటికి అంతా ప్రశాంతం అయిపోయింది .
చుట్టూ నిశ్శబ్దం ..
ఈలోగా
దూరం నుంచి మెల్లగా అడుగుల చప్పుడు...
నెమ్మదిగా నడుస్తూ అక్కడికి వచ్చాడు ఓ నడివయసు వ్యక్తి..
" తాతాజీ..
తాతాజీ.."
వికటంగా నవ్వింది ఆ శిల..
దణ్ణం పెట్టాడు తాతాజీ..
ఆ మంచాన్ని నెత్తిమీద పెట్టుకున్నాడు ..అక్కడినుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు.
"రేపు ఉదయం అశ్వాపురం సంతలో అమ్మాలి"
అనుకున్నాడు మనసులో.
క్రమక్రమంగా అతను దూరమయ్యాడు ..
అసలు ఏమీ తెలియని దానిలా అలాగే నిశ్చలంగా ఉంది ఆ శిల ..