STORYMIRROR

kavi voleti. Prahaasin

Comedy

4.9  

kavi voleti. Prahaasin

Comedy

ఇదే కదా మన కథ

ఇదే కదా మన కథ

3 mins
834


ఉదయాన్నే శ్రీమతి  టీ పట్టుకు వచ్చే విధానం రెండు రకాలు ఒకటి బడిపంతులు సినిమా లో అంజలీదేవిలా వెనక నుంచి వచ్చి ఏవండీ అంటూ నా భుజం మీద ఎడమ చెయ్యి వేసి నేను పేపర్ చదవడం పూర్తి చేసే వరకు నిలబడి కుడి చేత్తో నాకు టీ ఇచ్చి నవ్వుతూ లోపలికి వెళ్లడం.. రెండోది గీతాంజలి లో అంజలి మోడల్.. హఠాత్తుగా టీపాయ్ మీద టీ కనిపిస్తుంది పట్టీల చప్పుడు నా గుండె చప్పుడు మాత్రమే వినిపిస్తుంది. వారానికి ఆరు రోజులు మొదటి విధానమే అమలవుతుందని చెప్పడానికి నేనేం సంకోచించను.

కానీ ఈ సారి మాత్రం సీక్వెన్సు లో కాస్త తేడా వచ్చింది. వారంలోనే రెండోసారి ఈ పరిస్థితి. ఒకసారి క్యాలెండర్ వైపు చూసాను. తరువాత ఫోన్ లో ఉన్న క్యాలెండర్ లో ముఖ్యమైన రోజులన్నీ చూసాను. పుట్టిన రోజులు, పెళ్లిచూపులు,నిశ్చితార్ధం ,పెళ్లి రోజు,ఫస్ట్ నైట్,.. అన్నీ.. ఐడియా రాలేదు ..

నేనిలా బుర్ర పీక్కుంటుండగానే.. బాగ్ పట్టుకుని కాలేజీకి బయలుదేరింది మయూఖ, నా గారాల పట్టి, కనీసం నా ముఖం చూడకుండా.. వాళ్ళ అమ్మకి బై చెప్పి వెళ్ళిపోయింది. ఇది కూడా రెండో రకమే.. ఖచ్చితంగా ఆలోచించాల్సిందే.. కానీ ఈ పాడు బుర్రకి కరోనా వైరస్ లేకపోతే ఏవో ఆఫీస్ పనులు తప్ప ఇంకేం గుర్తు రావట్లేదు..బుర్ర తగినంత వేడెక్కాక ఇక లాభం లేదు అనుకుని వెంటనే స్నానం చేసాను. నిన్న ముఖ పుస్తకం లో ఎవరో రాసింది గుర్తొచ్చింది. ఏదో మంత్రం.. అది చదివితే సాక్షాత్తూ పరమ శివుడే పార్వతి ని వదిలేసి పరుగెత్తుకుంటూ వచ్చి అడిగినన్ని వరాలూ ఇచ్చేస్తాడని దాని సారాంశం. సరే ఎలాగూ స్నానం చేసాను కదా అని దేవుడి గది లో కి వెళ్లాను. కాసేపు గుర్తున్న మటుకు చదివి భక్త కన్నప్ప లా లింగం మీద రెండు నీటి బొట్లు ఒంపేసరికి నిజం గానే ప్రత్యక్షమైపోయాడు ఆ అల్ప సంతోషి. ఒకవేళ నా పిచ్చి స్తోత్రాలకి విసుగొచ్చి నన్ను లేపేయడానికి వచ్చాడేమో అనే సందేహం కూడా వచ్చింది.

 "ఏం కావాలో కోరుకో" అభయమిచ్చాడు అఘోరుడు

 ఎగిరి గంతేసాను.

" ఏం చెప్పమంటారు స్వామి ఈ జనాలతో నా బాధ.. ఏమిటో తెలియదు ఎంత చేసినా సంతృప్తి ఉండదు. ఎంత కష్టపడినా ఫలితం ఉండదు. వాళ్లు నన్ను మెచ్చు కోవాలంటే ఏం చేయాలో చెప్పండి. వాళ్ళ మెప్పు పొందాలంటే ఏం చేయాలో చెప్పండి.."

ఆయన చూపులో బోల్డంత కన్ఫ్యూషన్ కనిపించింది. ఆ చూపులోనే నాకు ఏదో అర్ధమైంది.

"స్వామి ఎదుటి వాళ్ళగురించి ఆలోచించకుండా నీ పని నువ్వు చేసుకుపో అంటున్నారు కదా?"


మళ్ళీ నిర్మలం గా చూసాడు నిర్గుణుడు.


నాకు ఏమీ అర్ధం కాలేదు


"స్వామి మీకు రోజు ధూప దీప నైవేద్యాలు టైమ్ టూ టైం అందుతున్నాయి కాబట్టి మీకేం తెలీటం లేదు

.

మొన్నే పక్కింట్లో శ్యామల కొత్త మంగళసూత్రం కొనుక్కుందని నేను కొనిచ్చేవారకూ మాటల్లేవ్.అంతేనా మా అమ్మాయి ఉంది చూడు అదే మయూఖ నీ ముందు ఆగరత్తులు వెలిగిస్తుందే రోజూ..ఆ పిల్లే.కొత్త ఫోన్ కొనలేదని అసలు వారం పాటు కాలేజ

్ కె వెళ్ళలేదు. ఇక పక్కింటి పద్మనాభం గాడు మూడు రోజులు వరుసగా మా ఇంట్లోనే టీ తాగేసి నాలుగో రోజు పాలు లేవంటే ఏంట్రా మీ ఇంట్లో ఎప్పుడూ పాలకి కరువేనా అనేసి చక్కాబోయాడు.. ఇక ఆఫీస్ లో మేనేజర్ గాడైతే మరీనూ నేను సెలవు పెడితే నీ పని ఎవడు చేస్తాడు అంటాడు ఉత్తప్పుడు అసలు నీకు పనేముంది అంటాడు....."

చెప్పుకు పోతున్న నావైపు జాలిగా చూసాడు శంకరుడు.

నేను ఆపానని అర్ధమయ్యాక తను చిన్నగా నవ్వుతూ మొదలుపెట్టాడు

" ఎదుటివారిని మెప్పించడం అన్నది అంత చిన్న విషయం కాదు అలాగని పెద్ద విషయం కూడా కాదు నిజానికి అసలది విషయమే కాదు.. ఒక్కోసారి అదే అసలు విషయం."

ఈ సారి నా ముఖం లో అయోమయం..


"స్వామీ,దయ ఉంచి ఈ మానవ మాత్రునికి అర్ధమయ్యేలా చెప్పగలరా"


 "చీమలు ఎంత ఆహారాన్ని తెచ్చినా చీమల రాణి ఇంకా కావాలంటుంది,తేనెటీగలు ఎంత సేకరించినా వాటికి తృప్తి ఉండదు అందుచేతనే అవి ఎక్కువ ఎక్కువ సేకరించి హాయిగా జీవిస్తాయి అదే సంతృప్తి చెంది ఉంటే వాటి జాతి అంతరించి పోవచ్చు కూడా.."

ఇంకా చెప్పబోతూ నా ముఖంలో రంగులు మారడం చూసి ఆగాడు అక్షరుడు..

" స్వామి సర్వ జీవులూ నీకు ఒక్కటే అనుకో కానీ చీమలు దోమలతో మాకు పోలికా" విషాదంగా అన్నాను.


ఆశ్చర్యంగా చూసాడు అనీశుడు..

 కాసేపాగి అడిగాడు

"నువ్వు ఎప్పుడైనా రామాయణం చదివావా?"

 నేను తలూపాను

 "మరి భారతం?"

 మళ్ళీ తల ఊపాను.

 "ఇంకేం భాగవతం ?"

"నేను అన్నీ చదివాను స్వామి"


 "ఇంకా అర్థం కాలేదా ?"

అడిగాడు హరుడు.

నిరాశ తో తల అడ్డంగా ఊపాను.


" దశరథుడు కైకేయిని మెప్పించి ఉండగలిగితే అసలు రామాయణమే లేదు..

 అదేవిధంగా ధృతరాష్ట్రుడు తన కొడుకుని సంతృప్తి పరచగలిగి ఉంటే ఇక భారతమే లేదు.. అంతేనా అసలు జయ విజయులు సనక సనందాదుల్ని ఒప్పించగలిగి ఉంటే అసలు ఆ హరికి ఇన్ని అవతారాలు ఎత్తవలసిన అవసరమే వచ్చేది కాదు కదా.

ఆ మన్మధుడే నన్ను మెప్పించలేక పోయాడు.ఇంకో వింత చెప్పనా నేనే పార్వతిని పెళ్లి చేసుకోవడానికి నా మామ ని ఒప్పించలేక పోయాను " నిర్లిప్తంగా చూసాడు నిరాకారుడు.

ఇంకా నా మొహం లో సంతృప్తి కనిపించక ఇంకో మాట అన్నాడు.

"అసలు నీకు ఇంకో రహస్యం చెప్తాను విను.. కనీసం రోజుకోసారైనా అడుగుతుందయ్యా మీ అమ్మవారు."ఈ మంచంతా కరిగిపోతోంది..ఇల్లు మారేదుందా..!"అని....


నా మొహం లో హఠాత్తుగా మందహాసం అది క్రమక్రమంగా సంతోషం గా మారి కాసేపటికి పెద్ద నవ్వుగా మారిపోవడం చూసి ఆ అర్ధనారీశ్వరునికి అర్ధమైనట్టుంది..

కుడి చెయ్యి పైకెత్తి అదృశ్యమైపోయాడు..

నేను అలా సంతోషం గా ఉండిపోయాను...

జపం చేసింది చాలు కానీ త్వరగా రండి టిఫిన్ చల్లరిపోతోంది అంటూ ప్రేమ గా నన్ను తాకిన నా శ్రీమతి పిలుపు నాలో కొత్త ఆలోచనల్ని తీసుకొచ్చింది..


Rate this content
Log in

Similar telugu story from Comedy