ఓ స్నేహం .. ఓ మధుర జ్ఞాపకం
ఓ స్నేహం .. ఓ మధుర జ్ఞాపకం


కథలు అప్పుడప్పుడే రాస్తున్నాను. ఏదో తోచినట్టు రాసి అదే గొప్ప కథని మురిసిపోయి, నాకు నేనే జబ్బచరుచుకుని ఫీల్ అయిపోతున్న రోజుల్లో ఒక ప్రొపర్ గైడెన్స్ కోసం ఎదురుచూస్తూ ఉండగా స్నేహితుడు సతీష్ పరిచయం నేనెక్కడున్నానో నాకు తెలియజెప్పింది. సతీష్ స్వతహాగా కవి! నా కథలు చదివిన వాళ్ళందరూ కథ ఎలా ఉన్నా బాగుందని చెప్తే, సతీష్ ఒక్కడు దానిలో లోటుపాట్లు చెప్పేవాడు. నేను పది పేజీల కథ రాస్తే అతను పది లైన్ల కవితలో ఆ కథను కుదించిరాసేవాడు. నేను రాయగలనని నాకంటే ఎక్కువ నమ్మి నన్ను ప్రోత్సహించిన స్నేహితుడు సతీష్. ఇలా రాస్తే బాగుంటుందేమో! ఈ భావన మరోలా చెప్పచ్చేమో అనిపించింది అని సున్నితంగా చెప్పేవాడు. అప్పటికి కథలు రాయడం, సతీష్ ఫీడ్ బ్యాక్ తీసుకోవడం. డిగ్రీ అంతా ఇలానే చేసాను. ఒక్క కథ కూడా ఏ పత్రికకు పంపలేదు. కానీ నాకొకటి అలవాటు చేసాడు, అదే బుక్ రీడింగ్. నువ్వా బుక్ చదివావా అనడిగేవాడు. లేదంటే చదువు అని చెప్పేవాడు. యండమూరి రచనలను పరిచయం చేసింది సతీషే!
మా రాజమహేంద్రవరం గౌతమి లైబ్రరీ కార్డు తీసుకోమని చెప్పి నెలకో బుక్ చదవమన్నాడు. నెమ్మదిగా చదవడం మొదలైంది. తరువాత పి.జి వైజాగ్ లో చేరాను. సతీష్ ఏ.యు లో బోటనీ చేరాడు. అక్కడ కూడా వీలున్నప్పుడల్లా కలిసి కథల గురించి, సినిమాల గురించి కబుర్లు చెప్పుకునేవాళ్ళం. ఏ.యు లైబ్రరీ లో తీసుకున్న బుక్స్ నాకిచ్చి చదవమనేవాడు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ రెండేళ్లు చాలా పుస్తకాలు చదివాను. అప్పుడప్పుడు రాసేవాడిని కానీ, నేను రాసేదాంట్లో అక్కడక్కడ అనవసరమైన విషయాలు ఉన్నాయని నాకు నేను తెలుసుకున్నాను. కాదు, అలా తెలుసుకునేలా చేయాలనే సతీష్ నాచేత చాలా బుక్స్ చదివించాడు. వాడు చేసిన ఈ అలవాటు నా అంతట నాకు ఎలా రాస్తే పాఠకులకు నచ్చచ్చో కొద్దిగా అవగాహన ఏర్పడింది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి అయింది. హైదరాబాద్ వచ్చాను. పుస్తకాలు చదవడం కొనసాగుతూనే ఉంది.
నాకు ఒక నవల రాయాలనిపించింది. ఎలాంటి నవల రాయాలి? ఆలోచిస్తే వైజాగ్ వాతావరణం నాకు చాలా నచ్చేసింది. ముఖ్యంగా సతీష్ ని కలవడానికి వెళ్ళినప్పుడు ఏ.యు మరింత నచ్చింది. ఆ యూనివర్సిటీ బ్యాక్ డ్రాప్ లో ఒక ప్రేమ నవల రాయాలనిపించి రాముడి మీద భారం వేడి మొదలు పెట్టాను. నవలను ఒక డైరీలో రాసుకున్నాను. తరువాత విప్రో లో జాబ్ వచ్చి చెన్నై వెళ్ళిపోయాను. ఈ డైరీ కూడా తీసుకెళ్ళాను . ఈ నవలను సతీష్ చదివి బాగుంది ఏమన్నా పత్రికకు పంపించమని చెప్పాడు. చెన్నై లో జాబ్ చేస్తుండగా తెలుగు టైపింగ్ నేర్చుకుని ఈ నవలనంతా టైపు చేసి స్వాతి మ్యాగజిన్ కి పంపించాను. కొంత కాలం ఎదురు చూసి దాని గురించి మర్చిపోయాను.
ఆరు నెలల తరువాత నాకు స్వాతి మ్యాగజిన్ నుండి లెటర్ వచ్చింది. మీ నవల వీక్లీ సీరియల్ గా ఎంపికైంది అని! అప్పుడు నాకున్న జీతానికి డబుల్ ఎమౌంట్ చెక్ కూడా పిన్ కొట్టి ఉంది. రచయితగా మారాలి అని కోరుకున్న ప్రతివాడు ఎదురు చూసే రోజు! నా రూమ్ లో నేనొక్కడినే! నా ఎదురుకుండా నా రాముడు. కళ్ళలో నీళ్లు! ఈ రోజు కోసం చాలా తపించాను. మొట్టమొదటి కాల్ అమ్మకు చేసి చెప్పాను. తరువాత నా మదిలో మెదిలింది సతీష్ మాత్రమే! అతను అందించిన ప్రోత్సాహం మరవలేనిది. ఇంత చేసినా నేనేం చేయలేదు అని నవ్వేస్తాడు.
అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు "One Best Book is equal to Hundred Good Friends, One Good Friend is equal to a Library."
ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాను అంటే మీలో నిజంగా ఒక రచయితా ఉన్నాడని మీరు నమ్మితే మీ కథను ధైర్యంగా పత్రికకు పంపండి. మీ కథను ఏ పత్రికవాళ్ళు కాపీ చేయరు. నచ్చకపోతే తిరిగి పంపిస్తారు. లేదా సెలెక్ట్ కాలేదని మీకు కాల్ చేసి చెప్తారు. ఒక్కసారి మీ పేరు పత్రికలో చూసుకోవాలి అని తపించే ప్రతి రచయిత మొదలు ఎక్కువగా చదవండి. చిన్నచిన్నగా రాయడం మొదలెట్టండి. తప్పులు ఉంటే సరిదిద్దుకోండి. కొంచెం క్రియేటివిటీ ఉంటే చాలు., మీరు తప్పకుండా రచయిత(త్రి)లు అవుతారు.