Jyothi Muvvala

Romance Classics Inspirational

4.5  

Jyothi Muvvala

Romance Classics Inspirational

బహుమతి

బహుమతి

3 mins
373


అందరూ భోజనాలు చేసి ఎవరి గదులలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. శారదా మాత్రం మిగిలినవన్నీ ఎత్తి పెట్టుకొని తెల్లవారు టిఫిన్కి కావాల్సినవన్నీ ఏర్పాటు చేసి గిన్నెలన్నిటినీ సర్దిపెట్టి తలుపులన్నిటిని ఒకసారి సరిగ్గా వేసారో లేదో చెక్ చేసుకొని లైట్ ఆఫ్ చేసి పడుకోవడానికి తన గదికి వచ్చింది.


ఎప్పుడు శారదా వచ్చేంతవరకు పుస్తకం చదువుకొని శారద వచ్చాక కాసేపు కష్టసుఖాలు మాట్లాడుకుని పడుకునే పద్మభూషణ్ ఆరోజు పెందలాడనే పడుకుని పోయాడు.


మొదట తను వచ్చేసరికి పడుకుని ఉన్న పద్మభూషణాన్ని చూసి శారద కొద్దిగా నొచ్చుకున్న... మధ్యాహ్నం ఎక్కడికో వెళ్లారు కదా బాగా అలసిపోయి ఉంటారు. ఈమధ్య ఈయనకి పనులు ఎక్కువైపోయాయి ఎక్కడికి వెళ్తున్నారో చెప్పరు అని తనలో తాను అనుకుంటూ తన పక్క సద్దుకొని పడుకోడానికి సిద్ధపడి తలగడని లాగింది.


అంతలోనే తన తలగడ మీద ఉన్న ఒక కవర్ కింద పడింది.

ఏంటిది ?అని ఆశ్చర్యంగా తీసి చూసింది శారద.


అవి ఫ్లైట్ టికెట్స్.


ఆశ్చర్యంగా కవర్ మొత్తాన్ని ఇప్పి చదవడం మొదలు పెట్టింది.


పద్మభూషణం, శారదా పేర్లు మీద ఢిల్లీకి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసి ఉన్నాయి.


మొదట నమ్మలేకపోయింది. కళ్ళల్లో నీరు తిరిగాయి. మసకబారిన కళ్లను తుడుచుకొని మళ్ళీ చూసి సంతోషంతో పొంగిపోయింది.


తనని తాను తమాయించుకొని పద్మభూషణం వైపు చూసింది.


అప్పటివరకు నిద్రపోతున్నట్టు నటిస్తున్న పద్మభూషణం ఒక కంట శారదను గమనిస్తూ ఉన్నాడు.


పద్మభూషణం పడుకోలేదని గమనించిన శారద...


"చాలేండి సంబరం! ఇక లేవండి మీరు చేసిన నాటకాలు చాలుగాని అంది."


నవ్వుతూ లేచి కూర్చొని "అడ్వాన్స్ హ్యాపీ వెడ్డింగ్ అనివర్సరీ" అని చెప్పాడు.

"ఇంకా దానికి టైం ఉంది లేండి" అంది శారదా.


"ఎలా ఉంది నా సర్ప్రైజ్ "అన్నాడు పద్మభూషణం.


"ఏ తిరుపతో కాశీకో బుక్ చేసి ఉంటే చాలా సంతోషించేదాన్ని"

అంది శారదా.

"నిజం చెప్పు నీకు కులిమనాలి చూడాలని లేదా?"

విదేశాలకు ఎలాగూ నేను తీసుకెళ్లలేను. కనీసం మనదేశంలో ఉన్న ఆ ఐసు పర్వతాలపై ఒకసారి విహరించి వస్తే ఎంత బాగుంటుంది కదా ? అన్నాడు పద్మభూషణం.


"బాగుంది ముసలోడికి దసరా పండుగ "అంది శారద.


"పిల్లలకి పెళ్లి చేస్తే ముసలోలమైపోయామా?

వయసులో వాళ్ళ చదువుల కోసం త్యాగం చేశాము. తర్వాత వాళ్ళ పెళ్లిళ్లు చదువులు బాధ్యతలు అంటూ మన సరదాలన్నిటిని మానుకున్నాం. ఇప్పుడు రిటైర్ అయిపోయాం.మన డబ్బులు మన ఇష్టం ఏది చూడాలనిపిస్తే అక్కడికి వెళ్తాం. ముసలైపోయిన తర్వాత కాశీయే వెళ్లాలి , దేవస్థానాలు తిరగాలని ఏ గ్రంథంలో రాసి ఉంది చెప్పు అన్నాడు" పద్మభూషణం.


"అది కాదండీ...! పిల్లల ముందు మనం ఇలా చెస్తే బాగుంటుందా?" అంది శారదా


"ఎందుకు బాగోదు వాళ్లు కూడా చూసి నేర్చుకుంటారు. ఇదేమీ తప్పు పని కాదు అన్నాడు" పద్మభూషణం.


"పిల్లలు చిన్నప్పటినుంచి తల్లిదండ్రులని చూస్తూ పెరుగుతారు వాళ్ళు ఏం చూస్తారో అదే నేర్చుకుంటారు."


"భార్యాభర్తల బంధం అంటే సంపాదించడం, పిల్లల్ని కనటం పెద్ద చేయటం, బాధ్యతలు తీర్చుకోవడం. ఇదేనా?


ఇది కాదు జీవితం అంటే....

"జీవితం సంతోషంగా సుఖంగా సాగాలి అంటే చిన్న చిన్న సరదాలు సంతోషాలు కూడా ఉండాలి అని మనల్ని చూసి నేర్చుకుంటారు."


ఎంతో బాగా చదువుకున్న నువ్వు... పిల్లల కోసం మంచి ఉద్యోగాన్ని కూడా వదిలేసావు. నీలా నీ కోడలు కాకూడదని ఆమెని ఉద్యోగం చేయమని ఇంటి పని మొత్తం నువ్వే చూసుకుంటున్నావు.


రోజు అందరూ తిని పడుకున్న, నువ్వు మాత్రం మరుసటి రోజుకి ఏం కావాలో అన్ని ఏర్పాటు చేసి, అందరికన్నా లేటుగా పడుకుంటావు. కోడి కూయక ముందే లేచిపోతావ్. ఇల్లుని, మమ్మల్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ సర్దిపెట్టుకుంటూ మా కోసం ఎన్నో త్యాగాలను చేసావు.


అప్పట్లో మా అమ్మ అంతే మాకోసం కష్టపడి అన్ని చేసింది కానీ చివరి దశలో ఏమీ అనుభవించకుండానే చనిపోయింది.

అప్పుడు నాకు తెలీదు. మా నాన్నగారికి తెలీదు.

మేము ఎవరు కూడా ఎప్పుడు మాకోసం మేము ఆలోచించుకున్నామే గాని మా అమ్మ కోసం ఆలోచించలేదు.


మా నాన్న! వాళ్ళ నాన్నను చూసి పెరిగాడు అదే జీవితమని అనుకున్నాడు.

ఇప్పట్లాగా ఇంటర్నెట్లు స్మార్ట్ ఫోన్లు ఏమీ లేవు కదా!


ఎవరో ఒకరిని చూసి నేర్చుకోవడం తప్ప తెలుసుకునే మార్గాలు లేక అప్పట్లో వాళ్ళు అలా బతికేశారు.


కానీ ఒకరకంగా మేము అదృష్టవంతులమనే చెప్పాలి.


ఈ స్మార్ట్ ఫోన్ పుణ్యమా అని లోకం చాలా చిన్నది అయిపోయింది.


ఈ టిక్ టాక్లు, చిన్న చిన్న షార్ట్ మూవీస్ ఇలాంటివన్నీ చూడడం వల్ల మనకి తెలియని విషయాలు మనం ఆలోచించలేని విషయాలను కూడా తెలుసుకోగలుగుతున్నాం.



నీకు ఫ్లైట్ ఎక్కాలని ఎప్పటినుంచో కోరిక ఉందని నాకు తెలుసు. ఆ మధ్య నీ ఫ్రెండ్ కులు మనాలి వెళ్ళామని చెప్పినప్పుడు నీ కళ్ళల్లో ఆనందం నేను చూశాను. బాధ్యతల కారణంగా నీ మనసులో... కోరిక ఉన్న నువ్వు అడగలేదని అర్థం చేసుకున్నాను.


అందుకే నీకు చెప్తే నువ్వు ఇలానే వద్దు అంటావని నీకు తెలియకుండా నేను బుక్ చేశాను. నీ చిన్న చిన్న కోరికలు సరదాలు తీర్చడం భర్తగా నా బాధ్యత .నేను ఉన్నప్పుడు కాకపోతే నిన్ను ఇంకెవరు తీసుకెళ్తారు చెప్పు. ఎప్పుడు ఎవరో ఒకరు ఏదో అనుకుంటారు, నవ్వుతారు అని లోకం కోసం ఆలోచిస్తే మనకోసం మనం ఆలోచించుకోవడమే మానేస్తాం. మన సంతోషాలన్నిటిని ఇలాగే వదిలేసుకుంటే తర్వాత మనలో ఎవరో ఒకరు పోతే... జీవితం వెనక్కి తిరిగి చూసుకుంటే మనకు మిగిలేదే ఈ గడిపిన ఆనంద క్షణాలే తప్ప ఇంకేమీ ఉండవు. నీతో గడిపే సమయం నాకు అమూల్యం. వయసు దేహానికే గాని మనసుకు లేదు. నీ మీద నాకున్న ప్రేమ పెళ్లినాటి నుండి ఈరోజు వరకు అలానే ఉంది. అప్పట్లో ఉద్యోగంలో సెలవులు లేక పిల్లల పరీక్షలు ఉండటం ఇలా ఎన్నో అడ్డంకులు. ఇప్పుడు మనకు ఇంకేం అడ్డంకులు ఉన్నాయి చెప్పు అన్నాడు పద్మభూషణం.


పద్మభూషణం మాటలు విని గిర్రుణ కళ్ళల్లో నీరు తిరిగాయి శారదకు. వెంటనే తన చేతితో భర్త నోరు మూసేసింది.

అలాంటి అపసకునపు మాటలు మాట్లాడకండి.

ఎవరికి ఏమీ కాదు మనం సంతోషంగానే ఉంటాం అంటూ భర్తకు తన మీద ఉన్న ప్రేమకు పొంగిపోయి భర్తను హత్తుకుంది.



అలా ప్రయాణానికి కావలసినవన్నీ సర్దిపెట్టుకొని ఢిల్లీకి ప్రయాణమయ్యారు శారదా పద్మభూషణం.



జ్యోతి మువ్వల


Rate this content
Log in

Similar telugu story from Romance