STORYMIRROR

Jyothi Muvvala

Drama Classics Fantasy

4  

Jyothi Muvvala

Drama Classics Fantasy

కొత్త మలుపు

కొత్త మలుపు

6 mins
36

 


కోర్టు ఆవరణలో అందరూ ఉత్కంఠగా జడ్జ్ గారి తీర్పుకోసం వేచి చూస్తూ ఉన్నారు. అశ్విని ,అరుణ్ తల్లి వంక నిస్సహాయ స్థితిలో చూస్తూ ఉన్నారు. కోర్టు బోనులో నుంచున్నా సత్యవతి న్యాయం కావాలని జడ్జి గారి వైపు ఆశగా చూస్తుంది. అవతల బోన్లో ఉన్న భాస్కర్ రావు తలదించుకుని మొఖం చూపించు కోలేక సిగ్గుతో నిలబడిపోయాడు.


ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి....?? ఒకసారి గతంలోకి వెళ్లి చూద్దాం....


సత్యవతికి, భాస్కరరావుకి పెళ్లయి 25 సంవత్సరాలు అవుతుంది. పెద్దలు కుదిర్చిన సంబంధం. పదహారేళ్లకే ఊహ కూడా తెలియని వయసులో తన తల్లిదండ్రులు మాటమీద భాస్కర్రావుని పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్లి పోయింది సత్యవతి.


భాస్కర్రావుకి సత్యవతికి 12 ఏళ్లు తేడా ఉండటం వల్ల 

పెళ్లంటే అయింది గానీ, ఆ చిన్న వయసులో అత్తమామలు, భర్త ఏం చెప్తే అది వినటం తప్ప.సంసారం, జీవితం, అంటే ఏమిటో తెలియదు సత్యవతికి. 


అప్పట్లో వయసు చూసుకోకుండా బంధుత్వాలను నిలబెట్టుకోవడం కోసం పెద్దలు అలానే పెళ్ళిళ్ళు చేసేవారు. అలా సత్యవతి తల్లిదండ్రులు కూడా మేనత్త కొడుకుకి ఇచ్చి పెళ్లి చేశారు. తల్లిదండ్రులు చేసిన తప్పిదానికి సత్యవతి బలైపోయింది.


మంచి వయసులో ఉన్న భాస్కర్ రావు ప్రేమగా సత్యవతిని దగ్గర తీసుకున్నప్పుడల్లా సత్యవతి భయంతో వణికి పోయేది... ఏం జరుగుతుందో తెలియక దూరంగా పారిపోయేది.అది ఆమె తప్పిదము కాదు ఆమె వయసు చిన్నది కావడం వల్ల తనకి అవగాహన లోపంతో ఆ చిన్న వయసులో మనసులోని అనేక భయాలు చోటుచేసుకోవడంతో తను అల చేస్తూ ఉండేది.

అందుకే భాస్కర్రావు బయట తిరుగులకు అలవాటు పడ్డాడు.


అలా కాలం గడిచిపోతూ వచ్చింది. సత్యవతి మంచి వయసుకి వచ్చింది. వయసులో ఉన్న ఆడ పిల్లను చూసి ఇష్టపడటం సర్వసాధారణమైన విషయం. ఆ విధంగానే భాస్కర్రావుకి సత్యవతి మీద మనసు మళ్ళింది. అలా సత్యవతి ఇద్దరు పిల్లలకు తల్లి అయింది.ఇంటి బాధ్యతలతో పిల్లల ఆలనాపాలనా చూసుకోవడంలో సత్యవతి మునిగిపోయింది. బయట తిరుగుళ్లుకి అలవాటు పడ్డ భాస్కర్రావు మళ్లీ పెడదారి పట్టాడు. అలా సత్యవతి మీద ఉన్న ఇంట్రెస్ట్ తగ్గిపోయింది.


కానీ సత్యవతి మాత్రం తన భర్త తన మీద ఎటువంటి ప్రేమ చూపించడం లేదని, తనను పట్టించుకోవడం లేదని, ఇంటిలో ఒక వస్తువులా చూస్తున్నాడని మదనపడుతూ ఉండేది. తన మనసులో మాట ఎవరికీ చెప్పుకోలేక తనలోనే తాను దహించుకు పోతూ ఉండేది.


తన భర్త తనని దూరం పెడుతున్నాడని గమనించిన సత్యవతి తన భర్తకి నచ్చే విధంగా అందంగా ముస్తాబై ... భర్తకు నచ్చివి అన్ని వండి పెడుతూ... మాట మాట కలిపే ప్రయత్నం చేసేది. కానీ భాస్కర్రావు మాత్రం బయట తిరుగుళ్ళు తిరిగి వచ్చి ఇంటిలో మాత్రం ఏమీ ఎరుగని వాడిలా తిని పడుకునేవాడు. సత్యవతి ఎంత ప్రయత్నిస్తున్నా ఆమె వైపు మొగ్గు చూపే వాడు కాదు.


తన భార్య చేస్తున్న ప్రయత్నాలు వెనక అంతరార్ధం తెలిసినా కూడా భాస్కర్ రావు ఏమీ తెలియని వాడిలా ఉండిపోయేవాడు. తన తప్పు కప్పిపుచ్చుకోవడం కోసం ఊరికినే ఏ తప్పు లేకపోయినా సత్యవతిని చీటికిమాటికి తప్పులు ఏంచి చీవాట్లు పెడుతూ ఉండేవాడు.


తన తప్పిదం ఏమిటో తెలియక భర్త మనసు ఎందుకలా మారిపోయిందో అర్థం కాక ... తనలో తానే ఏడుస్తూ జీవితం మీద ఆశ కోల్పోయి ఎన్నోసార్లు ఆత్మహత్య చేసుకుందామని అనుకుంది. కానీ సత్యవతి ఇద్దరు బిడ్డలకు తల్లి కావడంతో వారి ముఖం చూసి వారిని అనాధలు చేయడం ఇష్టం లేక భాస్కర్రావు మీద నమ్మకం లేక జీవితాన్ని నెట్టుకొస్తుంది.


అలా 25 సంవత్సరాలు చూస్తుండగానే గడిచిపోయాయి. రానురాను భాస్కరరావు తిరుగుళ్ళు ఎక్కువైపోయాయి. డబ్బంతా బయట ఆడవాళ్లకు ఖర్చు పెట్టేస్తూ ఉండేవాడు. ఉద్యోగరీత్యా సొంత ఊరికి దూరంగా ఉండటం వలన తల్లిదండ్రుల భయం కూడా లేకుండా పోయింది. ఇంట్లో వాళ్ళకి చెప్తే సత్యవతిని శారీరకంగా హింసించేవాడు.


భాస్కరరావు తల్లిదండ్రులు తన తమ్ముడి దగ్గరే ఉండేవారు. భాస్కర్రావు అసమర్థత వలన ఏమి పట్టించుకోకపోవటం వలన తన తమ్ముడు మొత్తం ఆస్తి అమ్మేసుకుని అప్పులు ఉన్నాయి అని చెప్పి దొంగ లెక్కలు చూపించాడు.

తల్లిదండ్రులు కూడా తన తమ్ముడికే సపోర్ట్ చేయడం వలన మారు మాట్లాడలేకపోయాడు భాస్కరరావు.


ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న సత్యవతికి మనసులో ఎన్నో ప్రశ్నలు వేధిస్తూ ఉండేవి... తన పిల్లలను ఎలా పెంచుకోవాలి ? వాళ్లని ఎలా చదివించు కోవాలి?

ఆడ పిల్లకి ఎలా పెళ్లి చేయాలి ? అని సత్యవతి మనసుని వెంటాడుతూ వచ్చాయి.


పెళ్లి అయినప్పటి నుంచి భర్తతో ఏనాడు ఏ సుఖానికి నోచుకోలేదు. ప్రేమగా ఒక మూర పూలు తెచ్చి ఇవ్వలేదు. సరదాగా ఒక సినిమాకి తీసుకుని వెళ్ళలేదు. కనీసం ఒక పూట కాఫీ కూడా పెట్టి ఇచ్చి ఎరగడు... ఆడదంటే వంటింటి కుందేలుగా తనకి ఏమీ తెలియదు అనే విధంగా మాట్లాడేవాడు.


నోరెత్తి ఒక్కమాట ఎదురు చెప్పితే చాలా దారుణంగా శారీరకంగా బాధించేవాడు. అలా సత్యవతి భాస్కరరావుతో విసిగి...వేసారి పోయింది. 


ఇదిలా ఉండగా ఒకరోజు భాస్కర్రావు తన స్నేహితుడి కూతుర్నే తన కొడుకు అరుణ్కి ఇచ్చి పెళ్లి చేస్తానని మాట ఇచ్చాడు. ఎందుకంటే తన స్నేహితుడి దగ్గర చాలా అప్పుబడి ఉన్నాడు భాస్కర్రావు. ఆ అప్పుకి బదులుగా తన కూతుర్ని ఇంటి కోడలిగా చేసుకుంటానని చెప్పాడు భాస్కర్ రావు.

ఆ సంగతి తెలిసిన సత్యవతి తన కొడుకుని పెద్ద చదువులు చదివించాలని అనుకుంటున్నానని అప్పుడే పెళ్లి చేయనని కరాఖండిగా చెప్పేసింది. "నా కొడుకు నా ఇష్టం నువ్వు ఎవరు చెప్పడానికి అని సత్యవతి మీద చెయ్యి ఎత్తాడు భాస్కర్రావు."


"నా జీవితాన్ని ఎలాగు నాశనం చేసావ్! నిన్ను కట్టుకున్న పాపానికి ఏ రోజు నేను సుఖపడలేదు. నా బిడ్డల నైనా బాగా చదివించుకుని వాళ్ళ కాళ్ళమీద వాళ్ళు నిలబడినాక మాత్రమే పెళ్లి చేస్తాను అని చెప్పింది సత్యవతి."


ఆ విషయంలో భార్యాభర్తలిద్దరికీ హోరాహోరీ వాదన జరిగింది. వయసు తేడా ఉండటం వల్ల భర్త అంటే భయం సత్యవతికి. అందుకే ఏరోజు సమాధానం చెప్పి ఎరగదు. అలాంటిది ఈ రోజు పిల్లల కోసం ఎదిరించి మాట్లాడుతుంది.


ఎంత చెప్పినా భాస్కర్రావు వినకపోవడంతో భాస్కరరావుతో విడిపోవడానికి నిశ్చయించుకుంది సత్యవతి.

కానీ ఇంట్లో వాళ్ళందరూ సత్యవతికి నచ్చచెప్పాలని చూశారు. వయసొచ్చిన పిల్లలను ఇంట్లో పెట్టుకుని ఈ వయసులో విడాకులు తీసుకుంటే ఆడపిల్లకి పెళ్లి కావడం కష్టమని, కనీసం కూతురికి పెళ్లి అయినంతవరకైనా సర్దుకోమని పరిపరివిధాలుగా అందరూ చెప్పి చూశారు. 


అప్పటికే మనసు విరిగిపోయి మానసికంగా చనిపోయిన సత్యవతి ఇక అలాంటి భర్తతో తను ఒక్క రోజు కూడా జీవించలేను అని తెగేసి చెప్పింది.


ఏ రోజైతే విడాకుల కాగితాల మీద సంతకం పెట్టిందో ఆ రోజే పిల్లలిద్దర్ని తీసుకుని తాను వేరే ఇంటికి వెళ్ళిపోయింది.

ఒక చిన్న హోటల్లో వంట మనిషిగా చేరింది. ఆమె చేతి వంట అమృతంలా ఉండటంతో ఆమె వంటకు గిరాకీ పెరిగింది. అందరూ ఆమె చేసిన వంటలనే కావాలని అడిగేవారు. ఇక హోటల్ యాజమాన్యం కూడా ఎంతైనా ఇచ్చి సత్యవతిని పనిలో పెట్టుకోవడానికి ముందుకు వచ్చేవారు.అలా ఆమె సంపాదించడం మొదలుపెట్టింది.తన కాళ్ళ మీద తను నిలబడటం నేర్చుకుంది. ఇప్పుడు బిడ్డలను తనే చూసుకుంటుంది.

తన జీవితంలాగా తన బిడ్డల జీవితం కాకూడదు అని

తెగించి దైర్యంగా ఒక నిర్ణయం తీసుకుంది. 


ఈ రోజు కోర్టులో తీర్పు... సత్యవతి! భాస్కర్రావుని వదిలేసి వెళ్లి ఈ రోజుకి సరిగ్గా ఆరు నెలలు అవుతుంది.సత్యవతి వదిలి వెళ్లిపోయిన తర్వాత అనారోగ్యం కూడా వచ్చింది భాస్కరరావుకి. ఉద్యోగం పోయింది.ఈ ఆరు నెలల్లో కనీసం తిన్నావా? ఉన్నావా? అని అడిగే వాళ్ళు లేక అనారోగ్యంతో కుక్క బతుకు బతికాడు భాస్కరరావు.


రోజుకో ఒక అమ్మాయితో తిరిగి భార్యని నిర్లక్ష్యం చేసినందుకు భగవంతుడు తగిన శాస్తి చేశాడు భాస్కరరావుకి. చేతిలో డబ్బులు లేక పోవడం వల్ల ఎవరు ఇప్పుడు భాస్కరరావునీ దగ్గరికి కూడా రానివ్వడం లేదు. దానికి తోడు అనారోగ్యం తోడయింది.


ఎప్పుడైనా...ఉన్నప్పుడు దేని విలువ తెలియదు. చేజారిపోయిన తర్వాతే తెలుస్తుంది. మనిషి విలువైన, వస్తువు విలువైన. అలాగే భాస్కరరావుకి కూడా సత్యవతి విలువ తెలిసొచ్చింది.భాస్కర రావుకి విడాకులు ఇవ్వడం ఇష్టం లేదు. తన తప్పు తెలుసుకున్నాడు కనుక ఒప్పుకుంటే భార్యాబిడ్డలతో సంతోషంగా జీవితాన్ని పంచుకోవాలని ఆశగా ఎదురు చూస్తున్నాడు.


తాళి కట్టిన పాపానికి అతడు ఎలాంటివాడైనా భరిస్తూ ఇన్నాళ్లు ఓపిక పట్టింది సత్యవతి .కోర్టు ఆరు నెలలు గడువు ఇచ్చింది. ఈ ఆరునెలల లోపునా మనసు మార్చుకుంటే తిరిగి యధావిధిగా భార్య భర్తలగా సంసారం చేసుకోవచ్చునని అవకాశం ఇచ్చింది.


ఆరు నెలల తర్వాత ఈ రోజు ఫైనల్ జడ్జిమెంట్ కోసం కోర్టు బోనులో నిలబడి ఉన్నారు భాస్కరరావు సత్యవతి.

ఫైనల్ జడ్జిమెంట్ కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. 


"జడ్జిగారు నీ భర్తతో కలిసి ఉండడం నీకు ఇష్టమేనా అని సత్యవతిని అడిగారు."

"అందుకు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది సత్యవతి."


"నీ భార్యతో నీకు కలిసి ఉండడం ఇష్టమేనా అని అడిగారు భాస్కరరావుని జడ్జిగారు"


అప్పటికే సగం చచ్చిపోయి మొఖం చూపించుకో లేక సిగ్గుతో నలిగిపోతున్న భాస్కరరావు! ఆ అవకాశం నా భార్య నాకు ఇస్తే నా జీవితాన్ని నిలపెట్టుకుంటాను. తాను నాకు ఎంతో చేసింది. కానీ నేను ఏ రోజు గమనించ లేదు. ఆడదంటే వంటింటి కుందేలుగా చూశాను. నా భార్యకి ఏ రోజు నా ప్రేమను అందించలేదు. నాలాంటి ఎదవతో ఇన్నాళ్లు కాపురం చేయడమే గొప్ప విషయం.ఆమె దూరం అయ్యాక మాత్రమే నాకు తన విలువ తెలిసింది. నా తప్పు నేను తెలుసుకున్నాను నాకు ఒక్క అవకాశం ఇస్తే ఆమెనీ కళ్ళలో పెట్టుకొని చూసుకుంటాను. నా బిడ్డలకి మంచి భవిష్యత్తును కల్పిస్తాను అని కన్నీరు పెట్టుకున్నాడు భాస్కరరావు.


భర్త అలా కన్నీరు పెట్టుకోగానే కరిగిపోయింది సత్యవతి. ఎప్పుడు గర్జిస్తూ గంభీరంగా ఉన్నా మనిషి ఇప్పుడు మెదక పడిపోయి చేతకాని వాడిలా నిస్సహాయస్థితిలో ఉన్నా భర్తని అతనిలో మార్పుని చూసి సంతోష పడింది. కానీ ఉద్యోగం పోయి చేతిలో డబ్బులు లేక దీనావస్థలో ఉండటంవల్ల ఆధారం కోసం అలా నటిస్తున్నాడు ఏమో అని అనుమాన పడింది.


అందుకే మనసుని రాయి చేసుకొని ధైర్యంగా నిలబడి చూస్తుంది సత్యవతి.


"మరి ఏమంటావ్ అమ్మ! నీ భర్త నీతో విడిపోవడం ఇష్టం లేదంటున్నాడు నువ్వు నీ పిల్లలు కావాలంటున్నాడు. మరి అతనితో కలిసి ఉండటం నీకు ఇష్టమేనా అని అడిగాడు జడ్జి గారు. "


"సర్ .. భార్యగా నేను ఏనాడో చచ్చిపోయాను. నా బిడ్డకు తల్లిగా వాళ్ళకి న్యాయం జరగాలని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నా బిడ్డలకి న్యాయం జరగాలి సార్! నా బిడ్డల సంరక్షణకు కావలసిన సదుపాయాన్ని కల్పించే తండ్రిగా నిలబడతాను అంటే నాకు సమ్మతమే, కానీ అతనితో కలిసి నేను ఉండలేను అని చెప్పింది సత్యవతి."

ఆమె నిర్ణయం విన్న జడ్జిగారు , తన పిల్లలకు సంరక్షకుడుగా మాత్రమే ఉండేందుకు పిల్లల బాధ్యతలను అప్పజెప్పింది. పిల్లల సంపూర్ణ రక్షణ వారి బాధ్యతల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకునే హక్కు సత్యవతికి ఇచ్చింది. సత్యవతి ఇష్ట ప్రకారం తనకు విడాకులు ఇప్పించారు.


భాస్కరరావు తన తప్పుకు క్షమించమని అందరి ముందరా భార్యకు క్షమాపణ చెప్పాడు. విడాకులు తీసుకోవద్దని ప్రాధేపడ్డాడు. కానీ సత్యవతి మనసు మార్చుకోలేదు. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏమీ లాభం. అన్ని కోల్పోయిన తర్వాత మారిపోయాను అంటే ఎవరు మాత్రం నమ్ముతారు. సత్యవతి కూడా అందుకే నమ్మలేదు. తాను చేసిన తప్పులకు తగిన శిక్ష పడిందని ఏడ్చుకుంటూ వెళ్లిపోయాడు భాస్కరరావు.

పిల్లలిద్దరిని తీసుకొని సత్యవతి సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయింది.


******************


✍️ జ్యోతి మువ్వల.




Rate this content
Log in

Similar telugu story from Drama