Jyothi Muvvala

Drama Classics Children

4.5  

Jyothi Muvvala

Drama Classics Children

అనుబంధాలు

అనుబంధాలు

7 mins
12


ఫోన్ కంటిన్యూస్గా రింగ్ అవుతుంది. మంచి గాఢ నిద్రలో ఉన్న సుజాత. ఎవరో తట్టి లేపితే లేచినట్టు ఫోన్ రింగ్కి లేచింది. టైం చూస్తే తెల్లవారు నాలుగు. ఈ టైంలో ఫోన్ ఏంటి? అని కంగారు పడి ఫోన్ చూసింది.ఆ ఫోను వాళ్ళ అక్క నుంచి. ఫోన్ ఎత్తటానికి 101 కొట్టింది.

 భయపడుతూనే ఫోన్ ఎత్తి "హలో అంది" సుజాత.

అటునుంచి వాళ్ళ అక్క పావని ఏడుపు వినిపిస్తుంది. "ఏమైంది అక్క? ఎందుకు ఏడుస్తున్నావ్? అందరూ బాగానే ఉన్నారా ? అని కంగారు పడుతూ పావని చెప్పింది వినకుండా ప్రశ్నల వర్షం కురిపించింది."


"సుజాత! నాన్నగారికి సీరియస్గా ఉంది. రాత్రి పడుకునే ముందు బాగానే ఉన్నారు. సడన్గా నిద్దట్లో చాతిలో నొప్పి మొదలైంది అని అమ్మని లేపారు. గ్యాస్ట్రిక్ పెయిన్ ఏమో అనుకొని అమ్మ ఇంటి వైద్యం చేసింది. కానీ ఏమి చేసినా ఫలితం లేకపోయే సరికి కంగారుపడి ఫోన్ చేసింది వెంటనే బావగారు హాస్పిటల్ కి తీసుకెళ్లారు.

 డాక్టర్లు హార్ట్ ఎటాక్ అంటున్నారు. పరిస్థితి చాలా విషమంగా ఉంది. మేమంతా హాస్పిటల్లోనే ఉన్నాము అని చెప్పింది.

ఆమాటలు విన్న సుజాత కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఇప్పుడు ఎలా ఉంది అక్క నాన్నగారికి అని అడిగింది. తెల్లారితే గానీ ఏమీ చెప్పలేం అంటున్నారు డాక్టర్ గారు అని చెప్పింది పావని. ఆ మాట విన్నప్పటినుంచి సుజాతకు కాళ్లు చేతులు ఆడలేదు.  

భర్తకు విషయాన్ని చెప్పి  కంగారుగా మొదటి బస్సు పట్టుకొని ఊరు బయలుదేరింది. తనతోపాటు సురేష్ కూడా వస్తాను అన్నాడు. పెళ్లయినప్పటి నుంచి ఇప్పటివరకు ఎప్పుడూ ఆ ఇంటి అల్లుడుగా మీరు ఆ ఇంట్లో అడుగు పెట్టలేదు. ఇప్పటి పరిస్థితిలో వెళ్తే అక్కడ నాకే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో తెలీదు మిమ్మల్ని తీసుకెళ్ళి బాధ పెట్టలేను. అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితులు చూసుకొని మీకు కాల్ చేస్తాను అప్పుడు రండి అని చెప్పి వెళ్ళిపోయింది.


బస్సు ఎక్కినప్పట్నుంచి జ్ఞాపకాలు సుజాత కళ్ళ ముందు మెదులుతున్నాయి.

మధుసూదన్కి ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు. స్కూల్ లో టీచర్గా పనిచేస్తూ ముగ్గురిని బానే చదివించాడు. పెద్ద కూతురిని తన భార్య సావిత్రి తమ్ముడికి ఇచ్చి పెళ్ళి చేశాడు. రెండో కూతురు సుజాత ! తాను ప్రేమించిన సురేష్ని పెళ్లి చేసుకుంటానని ఇంట్లో చెప్పింది. అందుకు మధుసూదన్ ససేమిరా అన్నాడు. ప్రేమించిన సురేష్ని వదులుకోలేక ఇల్లు వదిలి పెట్టి వెళ్లిపోయి పెళ్లి చేసుకుంది. ఇంటి పరువు తీసిందని సుజాత మీద తండ్రికి కోపం.

 అందుకే కూతురితో మాట్లాడడం మానేసాడు మధుసూదన్. అప్పుడప్పుడు వాళ్ళ అమ్మ సావిత్రి, మధుసూదన్కి తెలియకుండా కూతురుతో మాట్లాడుతూ ఉంటుంది. కొడుకు లండన్లో ఎమ్మెస్ చేస్తున్నాడు. అందరూ బాగానే లైఫ్లో సెటిల్ అయ్యారు. రిటైర్ అయి భార్యతో శేష జీవితం గడుపుతున్నాడు మధుసూదన్. 

ఇక ఏ బాధ్యతలు లేవు. అంతా సవ్యంగా ఉంది అనుకునే సమయంలో ఇలా హఠాత్తుగా హార్ట్ ఎటాక్ వచ్చింది.


సుజాత హాస్పిటల్కి చేరుకుంది. అందరూ హాస్పిటల్లోనే ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందో అని భయం భయంగా ఉన్నారు. కానీ అదృష్టవశాత్తు మధుసూదన్ కళ్ళు తెరిచాడు. అందరూ చాలా సంతోషించారు. చాలా కాలంగా తండ్రి ప్రేమకు దూరమైన సుజాత అమాంతం వెళ్లి తండ్రిని పట్టుకొని బోరున ఏడ్చింది. క్షణం మనది కాదు రాత్రి ఉన్న ప్రాణం తెల్లారేసరికి ఉంటుందో లేదో తెలియదు. ఉన్న ఈ నాలుగు రోజులు ఈ కక్షలు కార్పణ్యాలు ఎందుకులే అని అనుభవంలో తెలిసి వచ్చిందో ఏమో అప్పటివరకు కూతురు మీద ఉన్న కోపం మబ్బు విడిపోయినట్టు మధుసూదన్ మనసు కూడా కరిగిపోయింది.

 కూతురుని చూసి మధుసూదన్ కూడా ఏడ్చేశాడు. డాక్టర్ వచ్చి మరేం పర్వాలేదు ఒక నాలుగు రోజులు అబ్జర్వేషన్లో ఉంచితే సరిపోతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ వారం రోజులు సుజాత తండ్రిని కంటికి రెప్పలా చూసుకుంది. క్షేమంగా మధుసూదన్ ఇంటికి చేరుకున్నాడు. 


సుజాత, సురేష్కి ఫోన్ చేసి తన తండ్రితో మాట్లాడించింది. మధుసూదన్ అల్లుడుని ఇంటికి ఆహ్వానించాడు. అలా కుటుంబం అంతా ఒకటై సంతోషంగా ఉంటున్న సమయంలో సుజాత కడుపుతో ఉన్న సంగతి తెలిసింది.

 ఇంటిలో ఆనందం మరింత రెట్టింపయింది. తన చేతుల మీదగా కూతురు పెళ్లి చేయలేక పోయానని ఇప్పుడు డెలివరీ అయ్యి మనవడో మనవరాలో పుట్టేంతవరకు కూతుర్ని ఇంట్లోనే పెట్టుకోని బాగా చూసుకోవాలని నిశ్చయించుకున్నాడు మధుసూదన్. ఆ మాటే అల్లుడు సురేష్కి చెప్పాడు. ఇన్నేళ్లుగా తల్లిదండ్రుల ప్రేమకు దూరమైన సుజాతను కొన్నాళ్లు తన తల్లిదండ్రుల దగ్గర ఉంచడమే భావ్యమని అనుకున్న సురేష్ అందుకు సరేనన్నాడు.


సుజాతను కాలు కింద పెట్టకుండా మధుసూదన్, సావిత్రి చూసుకుంటున్నారు. కానీ ఇదంతా చూసిన పావనికి తన చెల్లెలు సుజాత మీద జలస్ మొదలైంది. మొన్నటి వరకూ ఇంటి గుమ్మం కూడా ఎక్కనివ్వని తండ్రి, ఈరోజు చెల్లెల్ని నెత్తిమీద పెట్టుకోవడం చూసి తట్టుకోలేక పోయింది. మనసులో అంత కుళ్ళు పెట్టుకున్నా పైకి మాత్రం చెక్కు చెదరని చిరునవ్వుతో ఉండేది.


ఇక తన చెల్లెల్ని తన తండ్రి ఇంటికి రానివ్వడని, తమ్ముడు ఎక్కడో విదేశాలలోనే స్థిర పడతాడని అమ్మానాన్న సంపాదన, ప్రేమ తనకే దక్కుతుందని ఎన్నో ఆశలు పెట్టుకుంది పావని. కానీ ఇప్పుడు ఆశలు అడియాశలు అయ్యాయి. కథ రివర్స్ అయ్యింది. పావని రోజురోజుకూ తట్టుకోలేక పోతుంది. ఇదేమి తెలియని సుజాత తన అక్క తన శ్రేయస్సురాలిగా తలచి ప్రతీ విషయాన్ని తన అక్కతో పంచుకునేది.

 

అలా 9 నెలలు నిండాయి. అంతలోనే సుజాత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. మొదటి కూతురు పావని ఇద్దరూ ఆడపిల్లలే కావడంతో తనకి వారసుడు పుట్టాడని మధుసూదన్ సంబరపడిపోయాడు. ఊరు వాడ స్వీట్లు పంచి పండగ చేశాడు మధుసూదన్. 

మనవడు పుట్టడంతో సురేష్ అమ్మానాన్నలు కూడా వాలిని క్షమించి దగ్గరికి తీసుకున్నారు. అందరూ ఘనంగా సుజాత కొడుకు పేరు ఫంక్షన్ చేశారు. ఫంక్షన్కి వచ్చిన బంధువులందరూ సుజాత భర్తను, కొడుకును, కుటుంబాన్ని పొగుడుతూ అందలం ఎక్కించారు.

 అది చూసి పావని అస్సలు తట్టుకోలేకపోయింది.

తల్లిదండ్రులు చెప్పిన మాట విని మేనమామను చేసుకున్నందుకు తనకి ఏమి దక్కింది. అందర్నీ ఎదిరించి తన చెల్లెలు పరాయి కులం వాడిని చేసుకున్నా ఇప్పుడు అందరూ ఆమెనే పోగడటంతో పావని మనసులో బాధ పడిపోయింది. మనసులో ఎంత బాధ ఉన్నా పైకి మాత్రం నవ్వుతూనే తిరిగేది. అలా అలా రెండేళ్ళు గడిచాక తన కొడుకు భరత్ పెళ్లి నిశ్చయించాడు మధుసూదన్. పెళ్లి పనులు చూసుకోడానికి కూతురులిద్దరిని ఒక నెల ముందే ఇంటికి పిలిచాడు. పావని పుట్టినప్పటి నుంచి సొంతూరిలోనే పుట్టి పెరిగి అక్కడే మేనమామను చేసుకుని స్థిరపడడంతో పెద్దగా ఇతర విషయాల మీద అవగాహన లేక పోయింది. అందుకే హైదరాబాదులో ఉంటున్నా సుజాతకు అన్ని తెలిసనే భావంతో భరత్ షాపింగ్ విషయాలు అన్నిటికీ సుజాతనే వెంటబెట్టుకుని వెళ్ళేవాడు. ఇక పావని ఈర్ష పరాకాష్టకు చేరి నట్టు చెల్లెలి మీద పీకల వరకు కక్ష పెంచుకుంది. 

కావాలనే ప్రతి విషయంలోనూ సుజాతను తక్కువ చేసి మాట్లాడటం మొదలు పెట్టింది. కానీ తన అక్క ఏదో తెలియక అలా మాట్లాడుతుంది గాని కావాలనే అలా మాట్లాడుతుందని గమనించుకో లేకపోయింది సుజాత. అంతటితో ఆగక పెళ్లి కూతురు బంధువుల దగ్గర సుజాత పెళ్లి ప్రస్తావన తీసుకు వచ్చి నలుగురిలో పరువుతీసింది. పెళ్లికూతురు బంధువులు అందరూ సుజాతను చూసి గుసగుసలాడుకోవటం తట్టుకోలేకపోయింది. ఎవరికైనా బయట శత్రువులు ఉంటారు. కానీ సొంత తోడబుట్టిన అక్కే తనకి శత్రువుగా మారి తన పరువు బజార్న పెట్టినందుకు కుమిలిపోయింది సుజాత. 

జరిగిన విషయాన్ని తల్లితో చెప్పుకొని బాధపడింది. సావిత్రికి కోపం వచ్చి పావనిని చీవాట్లు పెట్టింది. తల్లి, తండ్రి కూడా సుజాత మాటే నమ్మడంతో పావనికి సుజాత మీద కోపం ఇంకా పెరిగిపోయింది. అప్పట్లో తండ్రి మీద కోపంలో ఉన్నప్పుడు అక్క అని మనసులో మాటలు షేర్ చేసుకున్న మాటలు ఇప్పుడు పావని బయట పెట్టడం మొదలు పెట్టింది. దాంతో పెద్ద గొడవ జరిగింది. ఆ మాటలు అనలేదు అని చెప్పలేక ఏ సందర్భంలో అన్నదో వివరించ లేక సుజాత మొఖం చెల్లక వెళ్ళిపోయింది. 

అలా సుజాతను కుటుంబం మొత్తానికి చెడ్డ చేసింది పావని.

సొంత వాళ్ల అనుకొని మనసులో మాటలన్నీ చెప్పుకుంటే ఇలా సమయం చూసి ఇరికిస్తారని తెలుసుకోలేక పోయింది సుజాత. మళ్లీ తన తల్లిదండ్రుల ప్రేమకు దూరమై పోయింది. తన తప్పు తాను తెలుసుకొని ఇంకెప్పుడూ ఎవరినీ నమ్మ కూడదు అని తెలుసుకుంది.

పావని మాత్రం చాలా సంతోషంగా ఉంది. తనకున్న అడ్డు తొలగి పోయినందుకు మేఘాలలో తేలుతుంది. కానీ ఇదంతా గమనిస్తున్న పావని భర్త ఆనంద్ పావని చీవాట్లు పెట్టాడు. "నువ్వు చేసిన పని నాకు నచ్చలేదు పావని" పాపం సుజాత చిన్నప్పట్నుంచి కష్టాలే . నువ్వు ఇలా తయారయ్యావ్ ఏంటి అని చిదరించుకున్నాడు."

భర్త మాట లక్ష్యపెట్టకుండా "మీకు ఏమీ తెలీదు మీరు మాట్లాడకండి అని భర్త నోరు ముయించేసింది పావని"

పావని మాటలు మధుసూదన్ నమ్మినా చిన్నప్పటినుంచి సుజాత మనస్తత్వం తెలిసిన సావిత్రి నమ్మలేదు. ఎందుకో సుజాత అన్న మాటలను తిప్పి చెప్పింది పావని అని సావిత్రి మనసులో బలంగా నమ్మింది. సుజాత ప్రేమించిన అబ్బాయి విషయంలో తండ్రిని ఎదిరించిందన్నమాటే గాని ప్రతి విషయంలోనూ ఎంతో అనుకువుగా ఉండేది. సావిత్రి ఎలా అయినా భర్తకు నచ్చచెప్పి మళ్లీ సుజాతను ఇంటికి తీసుకు రావాలని నిశ్చయించుకుంది. తన మనసులో మాట భర్తతో చెప్పింది. భరత్ కూడా తల్లిని సమర్థిస్తూ సుజాత అలా అని ఉండదని, ఏదో మిస్ అండర్స్టాండింగ్ వల్ల ఇలా జరిగి ఉంటుందని చెప్పి తండ్రిని ఒప్పించాడు. భార్య , కొడుకు చెప్పినమాట విన్న మధుసూదన్ మనసు మార్చుకున్నాడు. కుటుంబంలో చెలరేగిన సమస్యలకు పరిష్కారం చెప్పాలని మళ్లీ కుటుంబం అంతటినీ కలపాలని సుజాతకు ఫోన్ చేసి పండక్కి రమ్మని పిలిచాడు. తండ్రి నుంచి ఫోన్ రాగానే సుజాత సంతోషపడింది. తనను అర్థం చేసుకున్నందుకు పొంగి పోయింది. ఆనందంగా కుటుంబంతో ఇంటికి బయలుదేరింది.


పండక్కి సుజాత వచ్చిందన్న సంగతి విని పావని పండక్కి రాలేదు. మీకు నేను కావాలో అది కావాలో తేల్చుకోండి అని చెప్పింది. ఆ మాటలు విన్న సావిత్రి "ఏంటి పావని నువ్వు ఇలా తయారయ్యావు?. చిన్నప్పుడు నీకు సుజాత అంటే ఎంత ఇష్టం. స్కూల్ లో ఎవరైనా దాంతో పేచి పడితే నువ్వు వెళ్లి గొడవ పెట్టుకునే దానివి. నాన్నగారు ఏం తీసుకొచ్చిన తమ్ముడికి, చెల్లికి ఇచ్చాకే నువ్వు తీసుకునే దానివి. దాని ప్రేమ విషయంలో కూడా నువ్వు నాన్నగారితో ఎంత పోట్లాడావు. ఇప్పుడు అది నీకు కానిది అయిందా? వయసుతోపాటు జ్ఞానం పెరగాలి. నేను నిన్ను ఇలాగేనా పెంచాను? తోటి కోడళ్ళుతో పోట్లాడే వాళ్ళని చూసాను. కానీ సొంత చెల్లిని ఇంత ద్వేషించే దానిని ఎక్కడా చూడలేదు." అని చివాట్లు పెట్టింది.

అందుకు పావని "అవును నేను మంచిదాన్ని కాదు. నువ్వు చెప్పినట్టు విని మీ తమ్ముని చేసుకున్నాను కదా! మావయ్యని చేసుకుంటే జీవితం బాగుంటుంది ఊర్లోనే ఉంటావు. కళ్ళముందే ఉంటావు అని నీ స్వార్థం కోసం నా బ్రతుకుని నాశనం చేసావు. అది ఇల్లు వదిలి పెట్టి వెళ్లి పోయిన అప్పటినుంచి ఇప్పటిదాకా నీ కష్టాలు నష్టాలు అన్నీ నేనే చూసుకున్నాను. అది చక్కగా దానికి నచ్చిన వాడిని బాగా సంపాదించే వాడిని చూసి పెళ్లి చేసుకుంది. నీ కొడుకుని కూడా లండన్ పంపించి పెద్ద చదువులు చదివించారు. నాకే చిన్న వయసులో చదువు ఆపేసి మావయ్యకి ఇచ్చి పెళ్లి చేశారు. ఇప్పుడు నాకు ఏం మిగిలింది. ఆస్తి కూడా ముగ్గురికి సమానం అంటున్నారు.

మీ దగ్గరే ఉండి మీ కష్టాలు సుఖాలు అన్నీ చూసుకున్నందుకు నాకు ఏమి కలిసొచ్చింది. పైగా నాకు ఇద్దరు ఆడపిల్లలు, నా పిల్లలు పుట్టినప్పుడు ఎప్పుడైనా నాన్న అంత సంతోషంగా ఫంక్షన్ చేశాడా ? దానికి కొడుకు పుడితే ఊరంతా పిలిచి పండగ చేశాడు. మీ మాట విని మీరు చెప్పినట్టు విన్నందుకు, సర్దుకుపోయి నందుకు నన్నే చిన్నగా చూస్తున్నారు. అందుకే నాకు అది అంటే కోపం అని గట్టిగా అరిచింది.


కూతురు మాటలు విని మధుసూదన్ తట్టుకోలేకపోయాడు. తన కూతురు ఇంత అభద్రతాభావంతో బతుకుతున్నాదని తెలుసుకొని కుమిలి పోయాడు.

"అమ్మ పావని! నాకు ముగ్గురు సమానమే, నువ్వంటే మీ తమ్ముడికి, చెల్లికి ఎంత ఇష్టమో తెలుసా? సుజాత కొడుకు నేమింగ్ ఫంక్షన్లో మీ అమ్మ సుజాతకి కట్నం పెట్టలేదు, అల్లుడికి కట్నకానుకలు, మర్యాదలు చేయలేదు. ఎంతోకొంత మీ రిటైర్మెంట్ డబ్బులు తీసి ఇవ్వండి అంటే నేను ఒక పది లక్షలు సుజాతకు ఇవ్వబోయాను. కానీ సుజాత ఏమందో తెలుసా? నాన్నగారు మీ ప్రేమ , ఆప్యాయత ఉంటే చాలు. ఈ కట్న కానుకలు బహుమతులు నాకు వద్దు. మీరేమైనా ఇవ్వాలనుకుంటే పావని అక్కకి సాయం చేయండి. బావ గారిది చిన్న ఉద్యోగం. ఇద్దరు ఆడ పిల్లల్ని చదివించుకుని పెళ్లిళ్లు చేయాలి. మీరు చేసే సాయం దానికి చాలా ఉపయోగపడుతుంది నాకు ఏమీ వద్దు అని సున్నితంగా తిరస్కరించింది. అలాంటి దాని మీద నువ్వు ఈర్ష పెంచుకున్నావు. తమ్ముడు కూడా ఊర్లో ఇల్లు అక్కకే రాసేయండి నాన్నగారు అని చెప్పాడు. మీ తదనంతరం ఎప్పుడైనా ఊరు రావాలి అంటే ఇక ఈ ఊర్లో మాకు ఎవరున్నారు? అక్క బావ తప్ప! మేము మీ ఊర్లో ఉండం కదా! అక్క కైతే ఉపయోగపడుతుంది అని చెప్పాడు.

వాళ్ళిద్దరు నీకోసం ఆలోచిస్తుంటే నువ్వు మాత్రం వాళ్ళిద్దర్నీ ద్వేషిస్తున్నవా" అని జరిగినదంతా చెప్పాడు.


తండ్రి మాటలు విన్న పావని! తన బుద్ధి ఇంత పెడదారి పట్టిందా అని సిగ్గుతో చచ్చిపోయింది. తన సొంత చెల్లిని శత్రువులా చూసినందుకు కుమిలిపోయింది. తన తప్పు తాను తెలుసుకొని చెల్లిని క్షమించమని వేడుకుంది.

తన అక్క అభద్రతా భావంతోనే అలా మాట్లాడిందని అర్థం చేసుకున్న సుజాత మనలో మనకి క్షమాపణలు ఏంటక్కా అని పావనిని దగ్గరికి తీసుకుంది. భరత్ తన ఇద్దరు అక్కలను దగ్గర తీసుకొని హగ్ చేసుకున్నాడు. తన కుటుంబం అపార్ధాలు తొలగి మళ్లీ కలిసి సంతోషంగా ఉన్నందుకు సావిత్రి, మధుసూదన్ సంతోషపడ్డారు.

--జ్యోతి మువ్వల 


Rate this content
Log in

Similar telugu story from Drama