Jyothi Muvvala

Drama Action Fantasy

4.8  

Jyothi Muvvala

Drama Action Fantasy

వర్క్ ఫ్రొం హోమ్

వర్క్ ఫ్రొం హోమ్

3 mins
710



రాధా చాలా మంచి పిల్ల బాగా చదువుకునేది. పుట్టింట్లో తల్లిదండ్రులు ఉన్నత చదువులు చదివించే స్తోమత లేక చదువుని మధ్యలోనే ఆంపించేసి పెళ్లి చేసి పంపించేసారు. కానీ రాధ స్నేహితులలో చాలా మంది పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఇంజనీర్లు అయ్యారు. ఆడపిల్లని గుదిబండగా భావించే ఈ రోజుల్లో ఎంత త్వరగా పెళ్లి చేస్తే అంత త్వరగా బాధ్యత తీరిపోతాయని అనుకుంటారు కొందరు తల్లిదండ్రులు. చవకగా అల్లుడు వచ్చాడని చూసుకుంటారేగాని ఆ అల్లుడు సమర్ధుడో కాదో... పిల్లని కష్టపెట్టకుండా చూసుకుంటాడో లేదో పిల్ల మెట్టినింట ఎలా ఉంటుందో అని ఆలోచించరు. రాధ తల్లిదండ్రులు కూడా అలానే తమ భారాన్ని దింపేసుకున్నారు. 

అలా శేఖర్తో పెళ్లయి నాలుగేళ్లు గడిచాయి. ఇద్దరూ పిల్లలకు జన్మనిచ్చింది రాధా. ఈ నాలుగేళ్లు తన భర్త సంపాదనలో ఏ లోటూ లేకుండా హాయిగా గడిచిపోయాయి. కానీ పిల్లలు పుట్టాక బాధ్యతలు పెరుగాయి. సంపాదన సరిపోక బిడ్డల ఆలనాపాలనా చూసుకో లేక అవస్థలు మొదలయ్యాయి. రాధ కేమో తన బిడ్డలను మంచి చదువులు చదివించి తన కన్నా గొప్పగా పెంచాలని ఆశ. సర్దుకుపోవడం రాని రాధతో వేగలేక పాపం రాధ భర్త శేఖరు! రాత్రి పగలు కష్టపడి కుటుంబ బాధ్యతని మోస్తున్నాడు

ఇదిలా ఉండగా ఒకరోజు అనుకోకుండా మార్కెట్లో తన స్నేహితురాలిని కలిసింది రాధా. చాలా కాలం తర్వాత కలిసారేమో మాటల్లో మునిగిపోయారు. తానిప్పుడు హైదరాబాదులో ఉంటున్నానని ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేస్తున్నానని చెప్పింది. అలా తన స్నేహితులందరి కోసం తెలుసుకున్న రాదా తానే చదువు మధ్యలో ఆపేసి ఇంటికే పరిమితం అయ్యానని, చాలీచాలని జీతంతో బీద బతుకు బ్రతుకుతున్నాం అని బాధపడింది. తన బిడ్డల భవిష్యత్తు బాగుండాలన్న తనకంటూ ఒక గుర్తింపు ఉండాలన్నా ఉద్యోగం చాలా అవసరం అని గుర్తించింది. అందుకే తాను కూడా ఉద్యోగం చేయాలని నిశ్చయించుకుంది. కానీ తాను చదివిన అరకొర చదువుకి

 ఏ ఉద్యోగం వస్తుంది పాపం.? ఏ టెలీకాలరో ,రిసెప్షనిస్టు ఉద్యోగమో రాకపోతుందా అనే ఆశతో కాళ్లరిగేలా ప్రయత్నించింది రాధ! మొత్తానికి అనుకున్నది సాధించి ఒక చిన్న కంపెనీలో రిసెప్షనిస్ట్ ఉద్యోగం సాధించింది. అలా మూడేళ్లు ఇట్టే గడిచిపోయాయి. కానీ అనుకోకుండా కరోనా వచ్చి పడింది. కంపెనీలన్నీ మూతపడ్డాయి.చేసేది సాఫ్ట్ వేర్ ఉద్యోగం కాదు కదా వర్క్ ఫ్రొం హోమ్ చేయటానికి..సాఫ్ట్వేర్ వాళ్లకే బెటరు. ఇంట్లో ఉన్న లక్షల లక్షల జీతాలు వస్తాయి.మాలాంటి చిన్నాచితక ఉద్యోగస్తులకు ఇలాంటి సదుపాయం ఉంటే ఎంత బాగుంటుందో అని నిట్టూర్చింది. తన భర్త ఉద్యోగం కూడా రేపోమాపో అన్నట్టు ఉంది. ఇక చేసేదేమీలేక ఇంటిపట్టునే ఉంటూ భర్తనీ బిడ్డలని చూసుకుంటుంది. కంపెనీలు మూసేసి ఉద్యోగాలైయితే పొయాయి గాని ఆన్లైన్ క్లాసులు అంటూ పిల్లల ఫీజులు మాత్రం స్కూలు యజమాన్యం లాగేస్తున్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ కుటుంబ పోషణ భారమై పిల్లల స్కూల్ ఫీజులు కట్టలేక అప్పులు చేసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. అలాంటి పరిస్థితుల్లో ఒకరోజు అనుకోకుండా పేపర్లో ఉద్యోగ ప్రకటన ఒకటి చూసింది. "నీడ్ టెలీకాలర్ అర్జెంట్లీ... వర్క్ ఫ్రొం హోమ్ ఆప్షన్ అవైలబుల్ "అని

వెంటనే రాధ ముఖం చంద్రబింబంలా వేయికాంతులతో వెలిగిపోయింది. రాధకు ఎప్పటినుంచో తన స్నేహితులా వర్క్ ఫ్రం హోం చేయాలని ఆశ ఉండేది. ఎందుకంటే ఎంచక్కా వాళ్ళ ఇంట్లో ఉంటూనే లక్షలు సంపాదించుకుంటున్నారు అది ఎదో అదృష్టంగా భావించేది రాధ. ఒక్క నిమిషం కూడా లేట్ చేయకుండా వెంటనే అప్లై చేసింది.వారు రాధా క్వాలిఫికేషన్స్ అన్నీ తీసుకొని ఇంటర్వ్యూ షెడ్యూల్ చేశారు. ఈ ఉద్యోగం ఎలాగోలా వస్తే తన కష్టాలన్నీ తీరిపోతాయని ప్రతి దేవుని మొక్కుకుంటూ పోయింది. ఆన్లైన్లో ఇంటర్వ్యూలు అలవాటు లేక నానా అవస్థలు పడి మొత్తానికి అటెండ్ అయింది. మొబైల్లో ఇంటర్వ్యూ అటెండ్ కావడం ఇదే మొదటిసారి. అందుకే టెన్షన్లో వచ్చిన ప్రశ్నలు కూడా సమాధానం చెప్పలేక అవకాశం పోయింది. టెక్నాలజీ యూస్ చేయడం అంటే మాటల్లో చెప్పే అంత సులువు కాదు మరి.

కానీ రాధ దిగులు చెందలేదు. ఇది కూడా ఒక రకమైన అనుభవమే కదా! ఇది కాకపోతే మరొకటి అనుకుని తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్లు అని మొండిగా ప్రయత్నించింది. ఒక్కొక్క ఇంటర్వ్యూకి ఒక్కొక్క అనుభవాన్ని జమ చేసుకుంటూ మొత్తానికి వర్క్ ఫ్రొం హోమ్ ఉద్యోగాన్ని సాధించింది. ఉద్యోగం వచ్చిందని సంబరపడే లోపే హెచ్ఆర్ నుంచి కాల్ వచ్చింది. ఇది అమెరికా కంపెనీ అని, వాళ్ళకి పని రాత్రిపూట మాత్రమే ఉంటుందని చావు కబురు చల్లగా చెప్పింది." అదేంటి ఉద్యోగమని ఆ రోజు ప్రకటనలో రాత్రిపూట చేయాలని ఎక్కడా రాయలేదు కదా! ఇప్పుడు ఏంటి రాత్రి పని చేయాలంటున్నారు" అని అడిగింది రాధ. "మీరు ఆ ప్రకటన సరిగ్గా చూడలేదు అనుకుంటాను. కండిషన్స్ అప్లై అని కిందన చిన్న అక్షరాలతో ఉంది" సమాధానమిచ్చింది హెచ్ఆర్. రాధకు కళ్ళు తిరిగినంత పనయ్యింది. పగలంతా ఇంట్లో పని చేసుకొని రాత్రిపూట మెలకువగా ఉండి పని చేయాలంటే కత్తి మీద సామే మరి. కానీ కరోనా కాలంలో ఎంత కష్టమైనా పని చేయక తప్పదు మరి. పైగా అది తన డ్రీమ్. వర్క్ ఫ్రమ్ హోమ్మేగా ఇంట్లో ఉంటే పెద్ద పని ఏమిఉంటుంది? అనుకుంది రాధా ! అందుకే సరేనంది. కానీ శేఖర్ వద్దు రాధ! ఇది మనకు అలవాటు లేని పని. ఎలా చేయాలో తెలీదు. ఎన్ని ఇబ్బందులు పడాలో ఏంటో... "కూలో నాలో చేసి పోషిస్తాను నీకు ఈ ఉద్యోగం వద్దు అని నచ్చ చెప్పాడు". కానీ రాధ శేఖర్ మాటలు వినిపించుకోలేదు. అలా మూడు నెలలు రాత్రిపూట నిద్ర లేకుండా అన్ని కాల్స్ కి ఆన్సర్ చేసుకుంటూ కష్టపడి పని చేసింది. ఆఫీస్కి వెళ్తే ఎనిమిది గంటలు మాత్రమే పని ఉండేది. ఇదేం వర్క్ ఫ్రొం హోమో... 24 గంటలు కాల్చుకొని తినేస్తున్నారు. తినడానికి కూడా టైం లేదు. పిల్లల్ని పట్టించుకునే తీరిక లేదు. నలుగురు చేసే పని ఒక్కదాన్నీతోనే చేయిచేస్తున్నారు. పాపం రాధకు వర్క్ ఫ్రం హోం సరదా తీరిపోయింది.

అంతే ఒకరోజు సడన్గా మంచాన పడింది రాధా. సరైన నిద్ర తిండిలేక బీపీ, షుగర్ అన్ని రోగాలు వచ్చిపడ్డాయి.

సంపాదనంతా రాధా రోగాలకి మందులకే సరిపోతున్నాయి. తను చేసిన తప్పు తెలుసుకుని రాధా ఆ ఉద్యోగాన్ని మానేసి ఉన్నదాంతోనే సర్దుకోవడం నేర్చుకుంది. అత్యాస అనర్ధాలకు కారణం అని తెలుసుకుంది. వర్క్ ఫ్రొం హోమ్ అంటే ఆషామాషీ కాదని అర్థమైంది.


జ్యోతి మువ్వల

బెంగళూరు


Rate this content
Log in

Similar telugu story from Drama