పెళ్లి చూపులు
పెళ్లి చూపులు
ముప్పై ఏళ్ల ముకుందానికి ముప్పై మూడో సారి
పెళ్లి చూపులు.
ఏరా ఆ ఎర్ర చొక్కా వేసుకోక ఈ తెల్ల చొక్కా వేసుకున్నావే అడిగింది ముకుందం తల్లి సుధ.
అమ్మా మరిచిపోయావ ! పోయినసారి పెళ్లి చూపులకి వేసుకుంటే ఏం జరిగిందో భయంగా అన్నాడు ముకుందం.
జరిగింది గుర్తు చేసుకుంటూ.
పోయినసారి రాజులపాలెం అనే పల్లెటూరుకు వెళ్ళాడు పెళ్లి చూపులకి ముకుందం తల్లి, తండ్రితో.
వారితో వచ్చిన పెళ్లిళ్ళ పేరయ్య చెపుతున్నాడు బాబు చెపుతున్న అని కాదు గాని అమ్మాయి తండ్రి రాజుగారికి చాలా పెద్ద మనసు.
ఊర్లో ఎవరికీ ఎంత పెద్ద సాయం అయినా చేయడానికి ముందు ఉంటారు.
వారి అమ్మాయి కూడా అందరికీ సహాయం చేస్తుంది.
చాలా పెద్ద మనసు వారిది అని చెప్పాడు.
కారు పెద్ద రాజభవనం లాంటి ఇంటిముందు ఆగింది.
ఎదురుగా చాలా లావుగా ఉన్న ఒక అతను వచ్చి రండి రండి అని ఆహ్వానించాడు.
పెళ్లిళ్ళ పేరయ్య వీరే రాజుగారని అతన్ని వీరికి వీళ్ళని వారికి పరిచయం చేసాడు.
అందరూ కూర్చున్నాక అతిథి మర్యాదలు మొదలు పెట్టారు.
తాము తినడానికే వచ్చినట్టు తమ ముందు చాప నిండా వడ్డించినట్టు రకరకాల స్వీట్లు, పిండివంటలతో నింపేశారు.
వాటిని చూసి తాము తినడానికో ఊరందంరీకీ సంతర్పనకో అర్థం కాలేదు.
ముందు అమ్మాయిని పిలవండి అని పెళ్ళిళ్ళ పేరయ్యకు చెప్పారు.
అదిగో అమ్మాయి వస్తుంది చూడు బాబు అన్నారు.
ముకుందం ఆత్రంగా వస్తున్న అమ్మాయి వైపు చూడగానే కళ్ళు పెద్దగా అయ్యాయి ఎందుకంటే అమ్మాయిని చూడటానికి ముకుందం కళ్ళు సరిపోవట్లేదు మరి.
మ...రీ.. ఇంత పెద్దగాన (లావుగాన)అని సుధ ముకుందం చెవిలో అంటుంటే.
ముకుందం లావుంటే ఏంటిలే అమ్మా మనసు మంచిగా ఉంటే చాలు అన్నాడు.
అమ్మాయి బిఏ చదివింది బాబు
మంచిదండి.
మీరు ఏమైనా మాట్లాడుకోవాలంటే మాట్లాడండి బాబు అన్నారు రాజుగారు.
ముకుందం అడిగాడు మీ పేరు.
రవళి అండి. ఇంట్లో వాళ్ళు రవ్వ అని పిలుస్తారు.
ఓ.. అవునా రవ్వ లడ్డు అని పిలుస్తార.
మీరు బాగా కామెడీ చేస్తారే అని రవ్వ అదే రవళి సిగ్గు పడి తల దించుకుంది.
ఇంతలో బాబు మీరు ఏం తినలేదు పలహరాలు తినండి అని అమ్మాయి తల్లి పలకరించింది.
వెంటనే ఈ రవ్వలడ్డు తినండి నాకు చాలా ఇష్టం అంది రవ్వలడ్డు రవళి.
ఓ వద్దండి నాకు స్వీట్లు ఇష్టం ఉండవు ముఖ్యంగా అని ఆగిపోయాడు..
తనకి నిజంగానే రవ్వలడ్డులంటే ఇష్టం ఉండదని చెప్పలేక.
ఒరేయ్ బాబు అమ్మాయి మరీ లావుగా ఉందిరా అంది సుధ ముకుందం చెవిలో.
లావు ఏం ఉందమ్మా లడ్డూలాగ బొద్దుగా బావుందిగా అన్నాడు ముకుందం.
లడ్డూ కాదురా చిన్న సైజు గున్న ఏనుగులా ఉంది అని గొణుక్కుంది సుధ.
స్వీట్ అంటే ఇష్టం లేదన్న మాట విని చిన్నబుచ్చుకున్న కూతురిని చూసి అమ్మాయి అబ్బాయి ఏమైనా మాట్లాడుతారేమో అలా తీసుకెళ్లి మన ఇల్లు చూపించు అన్నారు రాజుగారు.
రండి అంటూ పెరడి వైపు పూల చెట్ల దగ్గరికి తీసుకెళ్ళింది రవళి.
ముకుందం చుట్టూ చూస్తూ చాలా బావుంది ఇక్కడ అన్నాడు అక్కడ చెట్లను చూస్తూ.
ఇంతలోకి రవళి తత్తరపడుతూ కంగారుగా చూసింది.
ముకుందం ఆశ్చర్యంగా ఏమయిందండి అని అడిగాడు.
మా భీముడుకి మీరు నచ్చలేదు అనుకుంటా ఒకటే రంకెలెస్తున్నాడు అంది గాభరాగా.
భీముడా వాడెవడు మీ అన్నా, తమ్ముడా అని ఆశ్చర్యంగా అడిగాడు ముకుందం.
అయినా బోండంలాంటి మీకు భీముడు లాంటి అన్నొ, తమ్ముడో ఉన్నట్టు ముందు చెప్పలేదు అన్నాడు.
అంతే అప్పటిదాక శాంతంగా ఉన్న రవళి బోండం అన్నమాట విని కోపంగా భీముడు అని పిలిచింది.
అప్పటిదాక ముకుందం వేసుకున్న ఎర్రని ఎరుపు చొక్కా చూసి రంకెలెస్తున్న భీముడు అనే ఆవు ఉరుక్కుంటూ వచ్చి ముకుందాన్ని పరుగెత్తి పరుగెత్తి పారిపోయేలా చేసింది.
ఎలాగో అలా ప్రాణాలు కాపాడుకుని బ్రతుకు జీవుడా అంటూ ఆ గండం నుండి బయటపడ్డాడు.
అది గుర్తు చేసుకుంటున్న కొడుకును చూసి కంగారు పడకురా అది అంటే పల్లెటూరు ఇప్పుడు మనం సిటీలోనే పెళ్లి చూపులకి వెళుతున్నాం ఇక్కడ ఆవులు, బర్రెలు ఉండవు అంది.
ఈ ముప్పై మూడో పెళ్లి చూపులు ఏమవుతుందో చూద్దాం అని బయలు దేరాడు ముకుందం.
