నేనింతే నేస్తం.... నేనింతే
నేనింతే నేస్తం.... నేనింతే


ఆకాశానికి ఎగిరిన ఆశల రెక్కల్ని
చుక్కల్లో దాగిన నీ పాప నవ్వుల్ని
నిశీధి వెన్నెల్లో నిద్రిస్తున్న నీ వలపుల్ని
ఇలలో అలలో జల్లెడ పడతాను
జలచరాలను నిన్ను ఒకే లెక్కన కట్టి జల్లెడ పడతాను
నేనంతే నేస్తం నేనంతే !
నిలబడి నిగ్గు తేల్చి నిజాన్ని రాబట్టినా
నిను తీసుకురాలేనని కర్మ సిద్ధాంతం వల్లె వేస్తాను
నివ్వెర పోక నిలదీయగలనా?
ఆక్రోశించక ప్రశ్నించగలనా ?
నేనంతే నేస్తం! నేనంతే!
నీ కోసం రోదిస్తూ, పరి పరి పరికిస్తూ నా పరివారం క్షేమమని తలచి పల్లికిలిస్తాను
విధి విధానాల చిల్లు పెట్టి ఈ జల్లెడెందుకని?
బోల్తా కొట్టించి ఈ బావురులెందుకని?
ఎదురించి ఎదురీదలేను
నేనంతే నేస్తం! నేనంతే!
కానరాని మనోభావాలకై పురవీధుల్లో గగ్గోలు పెడతాను కానరాని నీ ప్రాణాలకై కించిత్ నోరుమెదపను
నేనంతే నేస్తం! నేనంతే!
అయినా, అలా ఎలా వెళ్ళిపోయావు?
నువ్వేమైనా పుణ్యాత్మమైన అధికారానివా!
ప్రఖ్యాతి గాంచిన అధికార మమకారానివా!
పదపదే పరిశీలించి పరిశోధించి విహార యాత్రకి సాగనంపడానికి
నిస్సహాయ అయిన నా ప్రియ నేస్తానివంతే!
అశ్రు ఝరిలో అలవాటుగా జల్లెడేస్తారేమోనని
లవణ గోదారి నా గుండెల్లో కొట్టుమిట్టాడుతుంటే
నీ కుటుంబ బాధ రొధ కనలేని వినలేని కఠినాత్మురాలిని
కనీసం కన్నీటి వీడ్కోలు ఇవ్వలేని అభాగ్యురాలిని
నేనింతే నేస్తం! నేనింతే!