కడసారి చూపు
కడసారి చూపు
*******
కడుపు కట్టుకుని పైసా పైసా కూడబెట్టి చదివించితే
ఫలితం దక్కెట్లు ప్రధమశ్రేణి వస్తే మురిశాను
అంచెలంచెలుగా మెట్లెక్కుతుంటే
ఆనందం అంబరాని కేగిసింది
ఆరోగ్యం పట్టించుకోక , ఉన్నదంతా ఊడ్చిపెట్టి
విమానంలో విదేశాలకంపాను’
రెక్కలు ముక్కలు చేసుకుని చేసిన కష్టం
రెక్కలొచ్చి స్వేచ్చా విహంగం లా ఎగురుతుంటే మరిచాను
ఇప్పుడప్పుడే తిరిగిరావని తెలిసినా
క్షణం క్షణం తల్చుకున్నాను
నీ కిష్టమైనవి నీ పుట్టినరోజు కు చేసి మురిశాను
ప్రాణం లేని తీగలో నీ కంఠం తో తృప్తి పడ్డాను
వెబ్ కెమెరా లో నీ రూపం చూసుకుంటూ
ప్రతిరోజూ మైమరిచాను
నీ రాకకై ఎదురుచూస్తూ
వానదేవుడు కల్లాపి చల్లితే
నక్షత్రాలను ఏరుకొచ్చి రంగవల్లులు దిద్దాను
పసిడిరంగు కడపలకు రత్నాల రంగులద్దాను
అందాల హరివిల్లును తోరణం కట్టాను
వెండి మబ్బులను తెచ్చి కుర్చీలు వేసాను
ఎదురు చూసే కళ్ళని ద్వారానికి వేలాడదీసాను
అధిరోహించే నీకై చూసి చూసి
కళ్ళు కాయలు కాసాయి
జీవన దీపం కొడిగట్టి
జీవనజ్యోతి నింగిలో కలిసిన వేళ
నా పిలుపు నిను చేరినట్లు
అశ్రు నివాళి ఇవ్వడానికి నీవు వచ్చావు
కానప్పటికే
అందనంత దూరమేల్లాను నేను
నీ కడసారి చూపుకై తపించిన దేహం
నిను చూడకుండా నిస్తేజమయింది
**********