R I P మానవత్వమా
R I P మానవత్వమా
R I P మానవత్వమా....!?
చేతులు చచ్చుబడి
కాళ్ళు కుళ్లబడీ
అన్యాయాన్ని అడ్డుకోలేక
ఆగిపోయిన
నా సహ సన్నాసుల్లారా
వేలాడండి...వేలాడండి....ఉరికొయ్యలకు వేలాడండీ
పిడికెడు కత్తికి
నూరేళ్ళ ప్రాణం బలి అవుతుంటే
ఆడబిడ్డగా పుట్టిన పాపానికి శిక్ష అని
మనసును దులుపుకున్న
నా సాటి బేవార్సుల్లారా
కూలబడండి...కూలబడండి....సమాధుల్లో కూలబడండి
జరుగుతున్న ఘోరాన్ని చోద్యంలా చూస్తూ
ఆర్తనాదాలు జోలలనుకుంటూ
గుడ్లు మిటకరించి
చెవుల నిండుగా సీసాన్ని కుమ్మరించి
నాకెందుకు మత్తులో జోగుతున్న
నా తోటి దద్దమ్మల్లారా
చాలించండి.... చాలించండి....బతుకును చాలించండి
ఎక్కడెక్కడ ఉన్న ఆడ వాసనల్లారా
ఇక వీయటం ఆగిపోండి
కులం కంపు మతం కంపు మధ్యలో
అమ్మతనం ఆడతనం ఏనాడో ఉనికిని కోల్పోయాయి
ఇక పుట్టడం, పెరగడం ఆపేయండి
దారుణానికీ దుర్మార్గానికీ
వర్గపోరు వర్ణపోరు అంటగడుతున్న ఈ తీరులో
సబలా అబలా వివస్త్రలౌతూ ఊరేగించబడుతున్నారు
ఇక నడక, పరుగు మానేయండి
మానాన్నీ
ప్రాణాన్నీ
కాచుకోలేక చతికిల పడే బదులు
భూమి పైకి రాక ముందే ఆయువును ఆర్పేసుకోండి
ఏ కీటకంగానో పుట్టి జన్మను సార్ధకం చేసేసుకోండి....
సుధామురళి
