కాడెద్దులు కుదువపెట్టి
కాడెద్దులు కుదువపెట్టి


నాగలి, కాడెద్దులు కుదువ పెట్టి
నా ఆకలి తీర్చుకున్నాను
వరి విత్తనాలు కొనడానికి
నా ఆలి తాళి కుదువ పెట్టాను
నాగలి విడిపించడానికి
నాయుడింటి కెళితే
నూటికి పది అని వడ్డీ లెక్కకట్టి
నాకున్న పరపతినంతా
హామీగా తీసుకున్నాడు
కౌలు రైతునని కనికరించని
వాన ఊరించి ఊరించి కురిసింది
మా యేటి గట్టుపై మాబోటి
రైతుల మేళాలు జరుగుతుంటాయి
నీటి మట్టం పెరిగి పలుకరిస్తాదని
ఊరు ఊరంతా ఒక్కటే పోరు
తిండిగింజలకోసం వలస పోలేమని
పులస చేపలు పండే గోదారి
మాకేదారీ చూపకుండానే ఎండిపోతే
కడుపు మంటల చితిలో
కుటుంబ సహగమనమే
నకిలీ విత్తనాలు సత్తువ నేలనూ
సతాయించి మొలకగా పెరిగి పెరగనట్లు
హెచ్చిరికలు చేస్తున్నాయి
ఉడిస్తే ఊపిరి తీసేస్తా
మని
కౌలు రైతులు దళారీ దృతరాష్ట్రుల
కౌగిళ్ళలో నలిగిపోతుంటే
ప్రభుత్వం దళారీల కాలర్ పట్టి
కాళ్లా వేళ్లా పడి వేడుకుంటుంది
కౌలు రైతుని కోలుకోనివ్వద్దని
మేకవన్నె పులులు కథలు వినిపించి
ఇది తరతరాలు భూమి భారతం
ఎక్కడవేసిన గొంగళి అక్కడే అనేకంటే
అసలు గొంగలే లేని
గొంగళి పురుగు రైతు...వ్యవస్థ
అద్వానంలో రైతు పల్లెటూరి బైతని
రైతు మెడపై కూర్చొని...
కార్పొరేట్ కి దారిచూపుతున్న
సర్కారీ అధికారుల కుర్చీలు
లంచాలు కంపు కంపు
ఈ సారి కుదవ పెట్టడానికి
నాకు నాగలి, కాడెద్దులు లేవు
అలి మెడలో పసుపు తాడు లేదు
నా మెడకి ఉరితాడుని
ఎవడో అల్లుతున్నాడు
చూద్దాం ఆ తాడు దళారీ చేతికి
సంకెళ్లు అవుతుందని
నా జోడెద్దుల మెడకు పలుపుతాడై
పంట పకాలైన మనకి తినిపిస్తుందని ఆశ