గురి ఎరుగని ప్రేమలు
గురి ఎరుగని ప్రేమలు
" గురి ఎరుగని ప్రేమలు "
===================
మనుషులమధ్య మమతని పెంచి
మానసిక దూరాల్ని తుంచి
రెండు మనసుల్ని రంజింపచేసి
రెండు కులాల్లో మనస్పర్దలని రగిలింపచేసి
ప్రాణంపెట్టి ప్రాణం తీసే ప్రేమలు
ఎవరికోసం... ఎందుకోసం...
జీవితమివ్వకుండా జీవం ధర తెలియకుండా
బేరానికి దిగి , వైరానికి కాలుదువ్వే ప్రేమలు
మనుషుల్ని చంపి మనసుల్ని నలపడానికి
మనసుగుమ్మాలముందు ఎదురుచూస్తున్నాయి
నోటికాడి బొక్కదొరికేవరకూ కదలని శ్వానములా
మనుషుల మధ్యలోని కులమతాల పొరల్ని
చించేసి అందరిని ప్రేమలోకి నెట్టేసి
ప్రాణాలతో పాచికలాడుతూ కాచుక్కూర్చున్నాయి
ప్రేమని నమ్మినోళ్లు ప్రేమించినోళ్లు
వేర్వేరన్నా సంగతి చెప్పని ప్రేమలు
కుళ్లిపోయిన కులాంతర వివాహాలకు
వేడుకలేసి మరణశయ్యాల్ని వేయడమెందుకు
సమానంకానీ మనుషులమధ్యా
సంధికుదిరే మనసులు ఇమడగలవా?
ప్రేమలు, పెళ్లిళ్లు కూడా బ్రతకలేవని
గురిలేని ప్రేమలకి తెలిసేదెప్పుడు?
కులమతాలు పెళ్ళికి మాత్రమే అడ్డు
ఆడోళ్ళపై అకృత్యాలు దౌర్జన్యాలు
హత్యలు శ్రమదోపిడీలకు గుర్తురావు
ప్రేమపెళ్లితో ఓ దోచుకొనే తరం మారుతుంది
ఓ బానిసలతరం దొరగా రాజ్యమేలుతుంది
బాంచనన్నోడు బలవంతుడౌతాడు
ఈ మార్పు భరించలేనిది, పెనుభారమైనది
ఈ ఊహలే ప్రాణాలు తీస్తాయి
ప్రకృతి, వ్యాధులు, యుద్దాలు
తీయలేని ప్రాణాలు కులమనే తీగకి
అంటిపెట్టుకొన్న ప్రేమలు తీయగలవు
చివరికీ చరిత్రనే తిరిగిరాయగలవు
గురిలేని ప్రేమలు మిగిలించిన
గుర్తులు చివరికీ వార్తల్లో
ఊరి చివరున్న సమాధుల్లో
మాత్రమే మిగిలాయి
***** సమాప్తం*****