Hurry up! before its gone. Grab the BESTSELLERS now.
Hurry up! before its gone. Grab the BESTSELLERS now.

sesi saradi

Abstract Tragedy Fantasy


4.5  

sesi saradi

Abstract Tragedy Fantasy


తటాకం ఆత్మకథ

తటాకం ఆత్మకథ

4 mins 297 4 mins 297

తటాకం ఆత్మకథ


నేనొక తటాకాన్ని

అర్ధం కాలేదా సరస్సు,కొలను

ఇంకా నేటి భాషలో 

చెరువును .


ఈ పుడమి ఉద్భవించి నప్పుడే

 నా జననం కూడా జరిగింది

 ఎన్నో ఎకరాల విస్తీర్ణంలో 

విస్తరించి ఉండేదాన్ని .

 నిండుగా ఉన్న నా చుట్టూ

 ఎంతో ఎత్తైన వృక్షాలు, వాటిని పెనవేసుకున్న లతలు , 

వాటిపై ఆవాసం ఏర్పరచుకు

 విహంగాలు వాటి కిల కిలారావాలతో

 ప్రకృతి పరవశించేది .

 ఇలా ఎన్నో యుగాలు గడిచాయి . మానవుడు ఉద్భవించాడు . 

నీళ్లు ఎక్కడ ఉంటే అక్కడ

 నివసించడం మొదలు పెట్టాడు

 కానీ

 నా చుట్టూ దట్టమైన అరణ్యం

 ఉండబట్టి చాలా సంవత్సరాలు

 నా ఉనికి వారికి తెలియలేదు .

ఒకసారి ఒక మహారాజు వేటకు వచ్చి 

దారి తప్పిపోయాడు . 

నా దురదృష్టం ఆ రాజును

 నా దగ్గరకు చేర్చింది .

 నా తీయని నీటితో సేదతీరిన ఆ రాజు , 

నా చుట్టూ గిరి గీసాడు. 

నన్ను ఉద్ధరిస్తున్నా ననుకుంటూ నాకు సోపానాలు నిర్మించాడు .

 నా నీటి తియ్యదనం అందరికీ 

తెలిసింది . దూరదూరాలనుంచి

నా నీటి కోసం జనం రావడం మొదలు పెట్టారపోతూ

కొంత కాలం అంతా సజావుగానే సాగింది తాగు నీటికై వయ్యారాలు పోతూ

పల్లె పడుచులు సన్నటి నడుములపై బరువైన బిందె లెత్తుకొని వస్తుండేవారు .

వారి పాంజేబుల సవ్వడి పక్షుల కిల కిలా రావాలకు దీటుగా ఉండేది .


ఒక్క రాత్రి మాత్రమే స్థబ్దుగా ఉండేది . భానుని తొలి కిరణాలు 

తగలక ముందే నా నేస్తాలు 

నన్ను నిద్ర లేపేవి . 

మా గూళ్ళు జాగర్తగా చూస్తుండు 

అని చెప్పి వెళ్ళేవి .

 కానీ ఇప్పుడేవి ఆ తియ్యని కూతలు 

ఆ రెక్కల టప టపలు ? 

నాగరికత పెరిగింది 

రాచరికం అంతరించింది .

 పైపులలో తాగునీరు

 అందుబాటు లోకి వచ్చింది .

 నన్ను పట్టించుకునే నాధుడే లేడు . 

జనాభా పెరుగుదలతో 

నాకు దగ్గరగా అతి దగ్గరగా 

జనావాసాలు రావడం మొదలయ్యింది . గృహ నిర్మాణాలకు 

వృక్షాలన్నీ ఇంటి గుమ్మలుగా

 కిటీకీలుగా మారాయి .

దాంతో ఇప్పుడు నా చుట్టూ

 వృక్షాలూ లేవు వాటిని అంటిపెట్టుకునే పక్షులూ లేవు అవి వినిపించే 

సంగీతమూ లేదు.


మొదట్లో ఉత్సాహంతో

 నాలో నీరు ఊరేది . 

ఇప్పుడు నిరాశతో 

కుంచించుకు పోతున్నాను .

శతాబ్దాలుగా స్వచ్ఛమైన 

నీరందించిన నేను 

ఈనాడు ఊర్లోని వ్యర్ధ పదార్ధాలన్నీ 

నా చుట్టూ విసిరి వేయడం వలన 

పూర్తిగా కలుషితం అయిపోయాను .


మంచినీటి కొలనుగా ఉన్నప్పుడు 

నా స్వచ్ఛతను చూసి

 దూరంగా ఉండేవారు

 ఇప్పుడు వారి విసర్జన కార్యాలు

 కూడా నా చుట్టూ చేస్తున్నారు .

 ఎన్నో శతాబ్దాలు మంచిరోజులు చూశాను ఎన్నో తరాల తరుణీ మణులను కాంచాను . బాలికలు కన్యలుగా, 

వధువులుగా ,గృహిణులుగా, 

మాతృ మూర్తులుగా చివరకు

 వృద్దులుగా

 మారడం చూసాను . 


ఇప్పుడు నాకూ వార్ధక్యం వచ్చింది . 

కాదు కాదు తీసికొని వచ్చారు .

 ఓ మనిషీ ఆలోచించు . 

స్వచ్ఛమైన నీటిని అందించిన నన్ను

పూడ్చి ఒక మురికి కూపంగా మార్చావు .

నా అవసరం లేదు కాబట్టి 

నా ఉనికే లేకుండా 

చేద్దామనుకుంటున్నావు .

నాకు తెలుసు నన్ను పూడ్చి  పెట్టి నాపై ఆకాశ హర్మ్యాలు నిర్మించుకుందాం అనుకుంటున్నావు 

ఇప్పుడు నేను నిస్సహాయురాలిని

 కానీ నేను ఈ భూమితోపాటు

 స్వయంభూ గా వచ్చాను .

 ఇప్పుడు కాకపోయినా

 శతాబ్దాలు పట్టినా 

నాలో శక్తినంతా పుంజుకొని

తిరిగి భూమిపైకి ఉబికి వస్తాను

అప్పుడి నువ్వు కట్టే ఈ కట్టడాలు 

పేక మేడల్లా కూలడం తధ్యం 

ఇప్పటికైనా నువ్వు కళ్ళు తెరిచి

ప్రకృతిని రక్షిస్తే నీ మనుగడ 

సాగుతుంది .లేకపోతే నాలాగే,

నీ ఉనికిని కూడా కోల్పోతావు .


Rate this content
Log in

More telugu poem from sesi saradi

Similar telugu poem from Abstract