మాన(వ)భంగము
మాన(వ)భంగము
రక్కసి రాకాసుల రంపమంటి పళ్ళతోటి
రక్తం చిందేట్టు మానవ మృగాలు రక్కేస్తుంటే;
చీడపురుగులు రక్తపిశాచులు రాబందుల
కంటె ఘోరంగా కామాంధులు
నా మాంసాన్ని బ్రతికుండగా బొంచేస్తుంటే;
దేవుడా!
నన్ను రక్షింప రావా!
అని భక్తితో పిలిచినా;
బాధతో అరచినా;
నా కంఠము
ఏ దేవుడూ వినడే?
నా వ్యాకులము
దేవుడు చేసిన ఏ మనిషీ కనడే?
ఆడది ఎక్కువగా గౌరవింపబడే పుణ్యదేశమంటిరే?
నరకయాతన పడుతూ నిశ్రేష్టురాలైతిని!
స్త్రీ నా వేదభూమిన వెలుగుదివ్వె అని వాపోతిరే?
అంధకారమున గొంతు చించుకొని యేడ్చితిని!
నా గోడు వినని మీరు మనుషులా
లేక మురుగు కాలువలోని మలమూత్రాలా?
మనుషులమంటారా!
అయినచో చెర చేసినవాడిని
జనసంద్రములో నడివీధిన ఉరి తియ్యండి!
స్త్రీని కేవలం సంభోగ వస్తువని
భ్రమించినవాడికి ఘాటైన సందేశమివ్వండి!