STORYMIRROR

kavi voleti. Prahaasin

Tragedy

5.0  

kavi voleti. Prahaasin

Tragedy

బతుకు నటన

బతుకు నటన

1 min
177

కరోనా కాటుకి నా కలం మూగబోయేది


నా పుస్తకం లో పేజీలు శిథిలమయ్యేవి


అలలు వీడిన సంద్రం లా

మెదడు మూగబోయేది


కానీ

ఆమె గుండెల్లో గరళం

నా కలానికి ఊపిరి పోసింది


ఆమె ఆక్రందన నా పేజీల్లో

రూపం పోసుకుంది


బీరువాలో గుట్టలుగా ఉన్న ఉత్తరాల్లోంచి

ఒకటి తీసింది

అవేగా కళకి దొరికే

రంగురాళ్లు

"మేడం మీ నటన చాలా బాగుంది. నేను ఎప్పటికి మీ అభిమానిని"

రంగులేని కన్నీరు ఒక్కో అక్షరాన్నీ చేరిపేస్తోంది


నేను అక్షరాలు పేర్చుకుంటున్నా

సంధ్యలో గగనం తారల్ని

కూర్చిన చందంగా


ఆమె అద్దం ముందు నిలుచుంది

చాలా రోజుల తర్వాత

తడారిన పెదాలను

లిప్ స్టిక్ పలకరించింది


నిండుకున్న పాళి

ఎర్రని ఇంకు నింపుకుని

నాకై చూస్తోంది


దట్టించిన పౌడరు

కన్నీటి చారికలకి

ముసుగేసింది


రెట్టించిన అభిమానం

ఆమె జ్ఞాపకాలను

ముడేసింది


కొత్త చీర,అరవంకీలు

అభరణాలన్నీ

ఒక్కొక్కటిగా ఆమెను చుట్టుముట్టాయి..


లయలు హొయలు

ఆమె వన్నెలన్నీ

నా మనసుకి కట్టబెట్టాయి


చిక్కిన నడుమునుంచి జారిన వడ్డాణం

ఏదీ నిలవదనే సత్యం చెబుతోంది


అచ్చం నిలవని నా తలపులాగానే


అద్దం ముందు ఆమె కొత్త పెళ్లికూతురులా నిలుచుంటే

నిరాశలో నా రాతలు

చిత్తుప్రతిలా నవ్వుతున్నాయి


పొగబారిన నిలువుటద్దం కూడా

ఆమె సింగారానికి మెరిసిపోతోంది


అధమమైన నా పదబంధం

కూడా

ఆమెకోసం మురిసిపోతోంది


కన్నీటి నది చెంపలపైకి

ఉరుకుతుంటే


అక్షర సంద్రం చెలియకట్ట

దాటి పొంగుతోంది


తెరచిఉంచిన తన డైరీ లో

ఆమె రాసుకుంది

"జీవిత చిత్రం లో ఆఖరి సన్నివేశానికి స్వాగతం"


నా కలం మాత్రం

ఒప్పుకోవట్లేదు..

నిజాన్ని

రాచి రంపాన పెట్టైనా

అబద్ధంగా చూపించాలంటోంది..


చిన్న చిన్న మాత్రలు

సన్న సన్నగా జోల పాడుతూ

ఆమెను శాశ్వత నిద్రలోకి

తీసుకెళ్ళాయి


వన్నె వెన్నెల అక్షరాలు

మెల్లమెల్లగా ముందుకెళుతూ

నా కవితలో ఆమె కళను శాశ్వతం చేశాయి


ఇల్లు చెక్కబెట్టుకోకుండానే

మరో దీపం వెళ్ళిపోయింది


నా కవితలను నడిపించే జ్యోతి ఆరిపోయింది


కళ మాత్రమే కళ ను తెలుసుకోగలదు

ఆమె ఆత్మ నా కలాన్ని కదుపుతోంది

నా హృదయాంతరాన్ని స్పృశిస్తోంది


బ్రతికుండగా సాటి కళాకారులను కదిలించలేకపోయిన ఆమె దైన్యానికి

నా మనసెపుడూ రోదిస్తూనే ఉంటుంది


ఇప్పుడు

ఆమె శవం పై పూల జల్లులు

కపట గొంతుకలు

అందరికి కనిపిస్తాయి


నా కవితలో ఆమె జీవం మాత్రం ఎప్పుడూ నాతోనే ఉంటుంది


( పై కవిత కరోనా కారణం గా చేతిలో పనిలేక ఆత్మహత్య చేసుకున్న బుల్లితెర నటి జీవితాన్ని చూసి స్పందించి రాసినది.)


Rate this content
Log in

More telugu poem from kavi voleti. Prahaasin

Similar telugu poem from Tragedy