కవులారా....!కవిత్వమా...!
కవులారా....!కవిత్వమా...!
కలమను కృపాణము చేతబట్టి
సత్యశోధనకు లక్ష్యపెట్టి
మనోశక్తినంతా కూడగట్టి
ఇనుడు జేరని చోటు సైతం కనిబెట్టి
సమాజమను రణరంగమున పోరాటం చేబడుతున్న...
ఓ మహానుబావులారా!
తెలుగు సాహిత్య పోషకులారా!
మీ అక్షరాల సందుల్లోంచి పుట్టింది నా కవిత!
అది రాయగా తీరింది సుమా నా యావత్ చింత!
కలముకీనాడు పదునులేకున్ననూ
కవితకీనాడు భవిత లేకున్ననూ
నిరర్థకమైన కళలు రాజ్యమేలుతున్ననూ
వెర్రిముఖములు విర్రవీగుతున్ననూ
పదునైన పదముల కలయికలతో కవితాస్త్రములను పేల్చు...
ఓ భాషాబాదుషాల్లారా!
పద సంపద ప్రావీణ్యులారా!
మీ అద్వితీయ కవితలతో అనుభవిస్తిమీ అసమాన క్రాంతినంత!
నిపుణతలేనివాడైననూ అనుభవజ్ఞుడైననూ కవికే సొంతమీ వింత!
వీటంతటికీ కారణమై
ప్రావీణ్య వర్ణమై
ఆకాశమంత అక్షమై
అక్షర సువర్ణమై
మేము నీ చెంతనే ఉండే భాగ్యమునిచ్చిన...
ఓ కవిత్వమా!
నిజాన్ని కప్పు వర్ణ వేషమా!
సమాజ స్థితులను చెప్పు ప్రయత్నమా!
మూగమనసుల మౌనాన్ని విప్పు మంత్రజాలమా!
నీకు దాసోహుడను ఊపిరున్నంతవరకు!
నిన్ను దిగజారనియ్యను ప్రాణమున్నంతవరకు!