మన భాష - మన శ్వాస
మన భాష - మన శ్వాస


నా తెలుగు మధురమైన పలుకు
నా తెలుగు కమ్మనైన పిలుపు
నాకు జన్మనిచ్చిన మాతృగడ్డ తెలుగు
ఉషోదయాన రాగమై మేలుకొలుపు
నాకు సరైన నడత నేర్పిన తెలుగు
నడిచే నేటి యువతకు ముందడుగు
నాకు మంచి మాటలు నేర్పిన తెలుగు
ముళ్లబాటలను తట్టుకునే గెలుపు
నా తియ్యని మాతృభాష తెలుగు
సంగీత సరస్వతి స్వరాల ఆలకింపు
నా మధురమైన గొప్పభాష తెలుగు
సుగంధద్రవ్య పరిమళాల గుబాళింపు
మనిషిని మహాత్ముడిగా దిద్దే తెలుగు
వర్షాల ఓటమిలో తడవని గొడుగు
నాకు లక్ష్యమేర్పర్చిన తెలుగు
విజ్ఞాన భాండాగారపు కొలువు
నాకు నడవడిక చెప్పిన తెలుగు
సంస్కృతికి చిహ్నమై వెలుగు
నాకు విద్య నేర్పించిన తెలుగు
ధరణిలో విశ్వఖ్యాతియై మెలుగు
నా ఆలోచనలకి అక్షరరూపమైన తెలుగు
ఆచరణలో చెలిమియై ఒసగు
నా జీవితానికి దివ్యతేజమైన తెలుగు
ప్రపంచానికి ప్రచండ భానుడుయై వెలుగు
కళ,కవిత్వాలు అల్లే మల్లెల తాడైనట్టి తెలుగు
సాహిత్య సామ్రాజ్యపు చెక్కుచెదరని ఆనవాలు