సవ్య యోచనే సఖ్యంబు
సవ్య యోచనే సఖ్యంబు
మలినపు తలపులు మనసున
పంకపు ముద్రలు
తీరును మార్చెడి
అవలక్షణ జాడలు
అదుపు తప్పిన అడుగులు
కష్టాల మడుగులో
కూరుకుపోయి
కోర్కెల మొసళ్ళే
మృత్యువై కబళిస్తాయి
మల్లెలంత సుతారమైన
మనసున
మాలిన్య పంకపు
తెరలు తొలగించి
మంచి అనే బీజంనాటి
స్వచ్ఛమైన ఆలోచనా జలాన్ని పోస్తే
సలక్షణ అంకురాలు మొలిచి
పరిమళాలు వెదజల్లే
మంచి గంధపు మొక్కల్లా
మానవతా విలువలు
గుబాళిస్తాయి
సక్రమమైన మార్గాన నడిపించి
ఆనందపు గమ్యానికి చేర్చేది
మనుషుల మధ్య మనీషిగా నిలిపేది
పదిలమైన ఆలోచనా
వాహనమే కదా!
హద్దులు దాటని ఆలోచనలు
హర్షపు అత్తరు పూతలు
మేలు తలపుల జీవన నౌక
ఆనందమయ అలలలో
తేలియాడుతూ
సురక్షిత తీరానికి చేరుతుంది