కాగితపు ఊసులు
కాగితపు ఊసులు


చెలి చేరిన కాగితపు ఊసులు
ప్రియుని మది బావి ఊటలు
నయనాలు ఎంత తాగినా
తీరని వలపు దాహమది
యెడబాటు విరహాగ్ని
నిలువునా దహించేస్తుంటే
వీనుల వీక్షణం
తమకంతో తానమాడుతోంది
ఎంతటి రుచికరమైన
పలుకులోగానీ
పరిసరాల పట్టింపు లేకుండా
ఊహలు రాజ్యమేలుతున్నాయి
చెంపను చేరిన చేయి
తిమ్మిరి కూడా తెలియనీని
మత్తు ఏదో నిండిన మాటలు
ఎదురుగా దర్శనమిస్తున్నాయి
పగలో రాత్రో తెలియని
స్వప్నలోకంలో విహరిస్తున్న
పూబోణి తలపులకు
చెలికాడు తాళం వేసేదెప్పుడో!!