హద్దే రక్ష
హద్దే రక్ష


శేష తల్పంపై నిద్రకు
నారాయణుడికి చోటిచ్చాను
దేవతలకు అమృతాన్ని అందించాను
హాలాహలం చిమ్మినా
ముక్కంటి గొంతు చేర్చి
లోకాల హాని తొలగించాను
అందరూ మెచ్చే మామకు
జన్మనిచ్చింది నేనే
ఐశ్వర్య సంపదలకై కొలిచేటి
సిరులతల్లిని
లోకాలకు బహుమతిగా ఇచ్చింది నేనే..
నరుడి రోగాలు పోగొట్ట
వైద్య నారాయణుడు పుట్టింది
నా గర్భం నుంచే..
సహస్రాక్షుడికి ఐరావతం బహుమతి నాదే!
ఇన్ని ఇచ్చిన నేను పైకెగసినా
కిందపడి వెనుకకే!
గంగమ్మ ఎంత ఉరకలేసినా
ఆలింగనంతో సంతపరిచేది నేనే!
హద్దుమీరిన స్వార్ధ నరుడు మాత్రం
చెత్తను నాలో నింపి
తన గొయ్యి తానే తీసుకుంటున్నాడు
నే హద్దు మీరానో ప్రళయం తప్పదు!