సాధన చేద్దాం
సాధన చేద్దాం
*సాధన చేద్దాం*
కూడికలు తీసివేతల జీవితాన్ని
మానవత్వంతో గుణించి
పదిమంది సాయంగా భాగించమని
ఎవరైనా చెప్పారా
చెప్పరు కానీ చెప్పమనే సందర్భాన్ని
ప్రకటించేసింది ప్రకృతి
విందులు లేవు వినోదాలు లేవు
కేరింతలు లేవు..ఆకలి కేకలున్నాయి
ఉపాధికి హామీలేదు..కాస్త సాయానికి హామీఇద్దాం
చేయిచేయీకలిపి సంఘటితమవలేని కాలంలో ఉన్నాం
భౌతిక దూరం పాటించి దగ్గరవుదాం
అభౌతిక స్వరమై నినదిద్దాం
గజిబిజి వర్తమానంతో
గతాన్ని తలవలేం... భవిష్యత్తుని
కొలవలేం.. ఆలోచనలకు మాత్రం కొదవలేదు..మాటల్ని కుదువపెట్టి
కవితలను పోగేయటంతో
మనసును శుభ్రపరుస్తున్నాను
అసాధారణ పరిస్థితుల్లో
కలలన్నీ ఇంకిపోయాక
జీవితమో కల్లోల నావలానే ఉంటుంది..లంగరు దొరకాలంటే
సౌభ్రాతృత్వాన్ని కఠోర సాధన చేయాల్సిందే
సి.యస్.రాంబాబు