ఉదయపు స్వరవీణ
ఉదయపు స్వరవీణ


పెదాలపై పూచిన దరహాసంలా
ఆకాశపు సరస్సులో విచ్చుకున్న పద్మంకదూ అతను
పగలంతా అతనో నడిచే రాజసం
రాత్రి ఏగూటిని చేరతాడో
సొంతిల్లు లేని ఈగృహస్తుడు
సెలవులేని కార్మిక చక్రవర్తి కదా
గ్లోబల్ విలేజ్ అని విశ్వాన్ని పోలుస్తారు కానీ
ఇది నిజంగా అతనికి వర్తించే మాట
వెడలిపోయే హేమంతచలిని
ఆకురాల్చే శిశిరానికి కానుకచేస్తాడు
అతనికి ఏడిపించటమూ తెలుసు
కోపమొస్తే వేసవిని మండిస్తాడు
మనుషులకు ముకుతాడు వేస్తాడు
కరుణ కలిగితే కన్నీటివానతో అభిషేకిస్తాడు
ప్రేమెక్కువైతే శీతాకాలమై చుట్టేస్తాడు
చుట్టపు చూపులా ఉదయాన్ని చూస్తాడనుకుంటాం
కర్మసాక్షని ఊరికే అంటారా
ఉపాధి హామీపథకంలా ఊరును కాపాడతాడనికదా
అదిగో నారింజకాంతితో నర్మగర్భంగా నవ్వుతున్నాడు
ఇక రోజుకో శుభోదయం పలికి స్వరాలవీణను చేద్దాం