Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

sateesh sateesh

Drama Romance

5.0  

sateesh sateesh

Drama Romance

పరాం ప్రేయసి

పరాం ప్రేయసి

31 mins
1.1K


నిన్ను చూసినప్పటి గుండె చప్పుడు..

లడ్డూపాపా! అది నా ఉద్యోగపర్వాన మొదటిరోజు. కొలువుకి వచ్చాననుకున్నా, కన్నెకనకాంబరాన్ని కలవడానికి అనుకోలేదు; మాటీలకింద ముంగురులతో ఆటలాడే జూకాలు, విచ్చిన కురులమీద తారాడే పలుమూరలపూలు, పసిడిపరువాన్ని చుట్టిన పట్టుపరికిణీ, ఎగసిపడే హారం, మేనిమెరుపు సరసన వెలవెలబోయే మువ్వలపట్టీలు, నా ప్రేమలోకాన్ని సృష్టించిన నీ పెదాల విరుపులు.

ఎవరీ అమ్మాయి! ఈ రోజేమైనా తన పుట్టినరోజా!! లేదా రోజూ ఇలానే మెరుస్తుందా! దానవాయిపేట పార్కు పక్క జెట్టీ ఛాంబర్స్.. నాలుగో అంతస్తులో కంప్యూటరు ట్రైనింగ్ సెంటరే కానీ, నగలకొట్టు కాదే? అడగని ప్రశ్నకి “కోర్సు చేద్దామని వస్తే.. కుర్చీలో కూర్చోబెట్టారట..” ఎవరిదో సమాధానం. ఇకముందు కలిసి పని చెయ్యాలన్నమాట.. నన్ను నేను సమాధాన పరచుకోవడం. రోజులెలా మారతాయో ఊహించడం కష్టం..

ఓపికతో ఉన్నప్పుడే కథ చెప్పేసుకోవాలి. స్వాతిముత్యం సినిమాలోలా ఏ మనవరాలో అడిగితే, మన వయసు ఉడిగిపోయాక చెప్పుకునే తీరిక ఉన్నా, జ్ఞాపకాలు మిగిలుండాలి కదా! 

నాది నాకు మాత్రమే ప్రత్యేకమా! నా జీవితమా!! నచ్చడాలు, మెచ్చడాలు పక్కనపెట్టి స్వచ్ఛంగా మాట్లాడుకుందామా, నాతో రా!

 

నీతో నాకు బంధముందని..

“అంత ఒళ్లేంటీపిల్లకీ! ఏపుగా ఎదిగిన చెరుగ్గెడలా ఉందని..”.. నా చూపుల్లోంచి వినిపించే కదా!!.. నిన్ను కన్న వస్తాదు ఫొటో చూపించి, నోరు తెరిపించి మరీ మూయించింది!

పెళ్ళిపుస్తకంపేజీల్లో కొన్ని పన్నీటితోనూ, కొన్ని కన్నీటితోనూ బొమ్మలేసుకున్నాక, ఇన్నేళ్ళకి నీతో పరాచికాలూ-పలకరింపులు. 

నువ్వు అవునన్నా కాదన్నా.. గుండెనిండా ఉన్నావని మళ్ళీ మళ్ళీ నీతో చెప్పాలని..

నువ్వు కనులముందే ఉన్నా, చేతికి అందని ఆకాశానివి.

నీ చిరాకులు... చీకటిలో మెరుస్తున్న మెరుపులు,

నీ కేరింతలు... నా కంటి కొలకులలో వణికే నీటిగోళాలు.

నీ కోపాలు... కొసరి ఊరిస్తూన్న మురిపాలు.


జంటపక్షులం. మనది కలిసి ఎగిరిన గతం.

ఇప్పుడు చెట్టెక్కి ఇక ఎగరకుంటే ఎలా?

వలపన్నిన జీవితం లో నీ ఊతం లేకుండా నే సాగలేను!

నా గోల ఎలాగోలా, నీకు చేరాలని.. నా ఈ ప్రయాస.

నీకై రాస్తున్న నా సమస్తం.. అస్తవ్యస్తంగా ప్రస్తావించేది...

నువ్వే నా పరాం ప్రేయసివి అన్న... వెచ్చని నిజాన్ని.

 

 

స్పర్శానుభూతి

రంపచోడవరం అడవుల్లో కార్తీకభోజన విహారం, రోడ్డు దిగువన వాలుపుంత లోనికి ఏటివైపు గుంపునడక, ముందుండి సాయంగా ఒక్కొక్కరికీ నా చేతిఆసరా. ఒద్దికగా అందరినీ నడిపించాలని ఎలా తలచానో అలానే నిన్నూ చొరవచేసి అందుకున్నా! అసూర్యంపశ్యవనీ, అరవిందవనీ అవగాహన ఉన్నా.. అయితేనేం, అవసరం కదాని సరిపెట్టుకున్నా. ఆపట్టుకే, నీగుండె గరగర మంటుందని, మనసు మెరమెరలాడుతూ ఉండిపోతుందని, ఎరుపెక్కిన బుగ్గలు బరువెక్కిన కనురెప్పల ఒప్పులకుప్పకు నా తలపే నెచ్చెలియై వెచ్చబరుస్తుందని తెలిసుంటే, పక్కకు తప్పుకునేవాణ్నేమో, ప్రకృతి రహస్యమేదో విడమర్చి చెప్పినట్టు నీ మౌనం, ఇంటికెళ్ళి చేసిన చన్నీళ్ళస్నానం, రోజుల జ్వరం, ఆపై మోసిన తలపుల పులపరం.


అప్పటికే ఎన్నోరోజులు మనం ఒకరికొకరం కనిపించే పరిధిలో మసలుతున్నా, అడపాదడపా ఎదురౌతున్నా, పలకరించుకోక పోవడం నాకిప్పటికీ ఆశ్చర్యం. ఆ మౌనసందర్భాలు వేళ్ళూనిన ఊహలు కొల్లలు కొమ్మలువోయినట్టు ఓనాడు నిశ్శబ్దం గట్టుతెగింది.. నీ గుట్టు విప్పింది..

నాతో నీ మాట.. ఇంచుమించుగా - “మీకిష్టమైతే.. మా పెద్దవాళ్ళని మీ ఇంటికి పంపిస్తాను”. హమ్మా! ఓ చేతిస్పర్శ ఎక్కడో మనసుని సుతారంగా తాకింది, ఇది శరీరాలకి చెందిన స్పందన మాత్రమేనా!

 

 

ముందు తెలిసెనా ..

ఇప్పుడేమైనా అంటావు; ఒప్పుకోలుకి తెగువ ఉండొద్దూ! అనుబంధం వద్దనడానికి సాకులు చెప్పాననుకోవచ్చు; తప్పుకోడానికో, తప్పించుకోవడానికో వంకే అనుకో! ఎలా నమ్మేస్తావు! వారం గడిచాక కనిపించానా!, అప్పటికింకా ఉబికిన కన్నీళ్ళ ఆనవాళ్లు; ఉబ్బిన కళ్లు. ఆ నవ్వు కనిపించనే లేదు. దించిన తల ఎత్తవూ, గుండెనెంత పిండేసావు! మనసుని తలపులదండెంపై ఆరేశావు. ఉద్వేగాల ఉయ్యాలవూపు మనిద్దరకీ అనుభవైకవేద్యమే కదా!.. ఒకరికోసం ఒకరం బ్రతకలేకపోతే ఏకాంతంగా జీవితాన్ని గడిపేద్దామని అనుకున్నావా! ఎంత చింత రగిల్చిందో మాట!!


ఓ జీవితకాల సంభాషణ రాయడానికి అర్హుణ్ని చేశావు. ఆనందం కొలబద్దకు అందని జీవితాలు మనవి; అయితేనేం! మన కథ మనదే కదా! ఓ స్పర్శ లేపిన అలజడి అంతరంగాన్ని అతలాకుతలం చేసి ఆడిస్తుందని ముందు తెలిసినా బావుండు! మరికాస్త నిబద్ధతగా మనోమందిరాన్ని నీకు సమర్పించుకునేవాణ్ని. ఈ ప్రస్తావన హృదయస్పర్శ గురించి. ఎందుకో మనసు రాతి ఫలకమైనట్టు అవే శిలాక్షరాలను నీ దగ్గర ఎలా వల్లెవేసానో! నీ ప్రేమధారతో నన్నుపొంగించి మనోమైదానాన్ని వెన్నెలకారు చేసి ఆడుకున్నదానివి. నీ పేరు శైలజ అవ్వడంలో ఆశ్చర్యం ఏముంది! 

నీ ప్రసన్నతే ఇప్పుడు దాగుడుమూతలు ఆడుతుంది. నే దండాకోర్ గాడ్నే, అయితేనేం! గప్ చుప్ గా ఉండలేకే ఈ ప్రేమ లేఖలు.

 

మొరాలకించిన అమ్మ..

అన్నయ్య పెళ్ళి కుదరడం తెలిసె. నాపై నీ ఇష్టత అమ్మతో విన్నవించా, నవ్వేసుకుంది. అందులో ఆనందం ఉంది, చిన్నోడికి మార్గం సుగమం అయ్యిందోలేదో అన్న శ్లేష ఉంది. పెద్దోడి పెళ్ళివరకూ చిన్నోడు ఆగుతాడో లేడో అన్న సంశయమూ ఉంది. ఇచ్చకీడుని మెచ్చిన పిల్లని చూడాలని, ముచ్చటపడి అమ్మ తన కన్నతల్లినీ పెనిమిటినీ వెంటేసుకుని గోదారిదాటి నా ఆఫీసు ముందు కారు దిగిందా! నీతో కలసి కూర్చున్నాక కదలివచ్చిన కర్బన పానీయాలు, వాటి బుసబుసల నడుమ, కలిసి పనిచేసే వారి గుసగుసలు. ఇప్పుడిలా పరివారం దండెత్తుకొచ్చి, మెచ్చి నా పరువుదీసె! నీ చేతిగుత్తులకు ముద్దులేమిటో, అమ్మమ్మకు బుద్దిలేదు! నా సావు నన్ను సావమన్నట్టు... అక్కడ జరిగినది ‘చూపుల’ తతంగమని చూచాయగా చెప్పేసింది. ఎదురుకళ్ళ నవ్వుల్ని తప్పించుకుంటూ నాచేతిని నుదురుకు అడ్దంపెట్టుకుని ఎంతకాలం నడచిపోతాను! అమ్మ తన సంతోషాన్ని దాచే ప్రయత్నం చేయలేదు. నాన్న పెద్దవాళ్ళని పంపమన్నట్టు నీకు చెప్పాడనుకుంటా.. అప్పుడు నీ మోవి పట్టపగ్గాలు లేకుండా వెలిగే పెట్రోమాక్సు లైటు. నిజంచెప్పినా నమ్మరెవరూ. అప్పటికీ మనమిద్దరం మూడోమారూ మాట్లాడుకోలేదు.

జగమెరిగిన నాట్య పండితులు సప్పా దుర్గాప్రసాద్ మాస్టారు దగ్గర నా అభ్యసనం. అప్పట్లో వారు మీ గురించి వాకబుచేసి విప్పిన మాట..! పిల్లలు వజ్రాలే. పెద్దవాళ్లే నలిగివున్నారని.

గట్టిదానివి అన్నారో, గొప్పని చెప్పారో! ఏమో!! పెళ్లిమాటతో మొదలైన ప్రేమకథ మనది. పెళ్లితో ముగిసేదేంకాదిది. మరి నిన్నూ-నన్నూ కలిపి ఉంచేదేది!

బువ్వాలాటల బొమ్మ..

“ఏమండీ! నేను ఆకలికి తాళలేను; వండిపెట్టడం చాలాఇష్టం...” తరువాత ఏమేమి చెప్పావో, నాకు గుర్తు తెచ్చుకోవడం కష్టమే. ఆ మేడమెట్లమీదే కుదిరినరోజు అటూఇటూగా గంటలో సగంకాలం కబుర్లాడుకుంటుంటే రెండునెలలు గడిచిపోయాయి! అన్నపెళ్ళికి నా పిలుపుకి విధేయవై భీమవరాన ప్రత్యక్ష్యం అయినప్పుడు ఈ సిగ్గరి సోయగాలు చూసి, నాతో నిలుచుంది పెళ్ళికూతురు అనుకున్నారంతా. నామీద కర్చీఫ్ వేసుకునేందుకు వచ్చావని ఆ తరువాత తెలిసిందిలే. అప్పుడే పడింది మనకథకి టైటిల్ కార్డు-“వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు”. ఆపై హమారా బజాజ్ మీద తిరుగుతూ కొనుక్కుతిన్న మరమరాల మిక్చర్లు, టమాటాబజ్జీలు, గౌతమీఘాట్ కబుర్లకన్నా మధురం కాదు. నీకు తెలిసినవన్నీ చెప్పడానికి ఈ రాతలెందుకు పిల్లా!- నీ వేలు పట్టుకుంటే అలలనవ్వొకటి ఆ పెదవులపై ఎగసిపడేది, నీటికెరటాలపై తరలి వచ్చిన సూర్యకిరణం నీచూపులోంచి నా గుండెల్లోకి దిగబడేది. అంతకుమించి ముందుకెళ్ళే ప్రయత్నానికి ఒకళ్ళకొకళ్ళం పాతవాళ్ళం కాదన్న వాస్తవం. ఎప్పటికప్పుడు మనసులో తుళ్ళిపడడమే.


ఇంకా మీ ఇంట పెళ్ళివిషయంలో మల్లగుల్లాలు, జీవనబింబంపై వాలిపోతున్న మేఘమాలికలు. ఒకరి కన్నీళ్ళని తుడిచే మరొకరి మునివేళ్లు... అదరకుండా బిగబడితే నీ పంటికింద నలిగే అధరం. నాలో కొంత తడి, కొంత అలజడి. కన్నీరు తుడిచే లోకం రుమాలు. చీకటితోపాటు గమ్యాన్ని చూపే రహదారులు-మరీచికలు.


గడుసరి లాహిరి.. 

పీటలెక్కేందుకు నీపాట్లు నీకుంటాయని ఒప్పించి, దుఃఖంతోనే ఉద్యోగం మానేసావు. అన్నదమ్ములు లేనిల్లు, చెల్లే నెచ్చెలి. మీ నాన్నని కాపాడుకుంటూ ఈదురుగాలుల్లో నుంచున్న అమ్మ. బయటసంబంధాలు వద్దని చెప్పే మేనమామ. విధి కుదిపితే అలాకుపలాకులైన జీవితాలు. అప్పట్లో నీకెన్ని ఇక్కట్లో! నన్ను నీ వెలుగుకి దూరంచేసి రేపు మనమిద్దరం కలిసుండాలనే పోరాటాన్ని ఒంటరిగా మొదలెట్టావు, పెంజీకటిని చీల్చుకువస్తేనే కదా రేపటి బాలుడు కనపడేది!! నీ చూపు వెచ్చదనం కనుమరుగైన కాలంలో నా పనులు.. ఉద్యోగ బాధ్యతల్ని నిర్వర్తించడం, నిన్ను ఉబికించిన బెంగటిల్లిన వేళలు నన్ను ఉరికిస్తే, నీ చెంతచేరి ఊరడించడం, ఆశల్ని సజీవంగా ఉంచుకునేందుకు ఒకరికొకరం సర్దిచెప్పుకోవడం. అసలు సమస్యేంటి!-ఆస్తినాస్తైనా అంతస్తు దిగకపోవడం. వెంట ఏమీ తెచ్చుకోనక్కరలేదన్నా, అమ్మ పెడతానన్న వడ్డాణం-అరవంకీ వంక అడ్డం పెట్టుకుని ఏర్పాట్లూ.. అంటూ ఆలస్యం చేసేశావు. నీ తపనకి నీడగా తోడుండడం తప్ప నీకేం సాయం చెయ్యగలిగాను! పెళ్ళంటే ఎంతకష్టమో అందరికీ ఆ అదృష్టం ఉండొద్దూ! అనుకుంటూ.. పెళ్ళికూతురే కళ్యాణమండపం మాట్లాడుకుని రావడం. అది అవసరం మాత్రమే అయితే సరే; ఒంటరి ఈదులాట అలవాటుగా మారితే.. బలాన్ని బలహీనతగా మార్చుకోవడమే కదా!


నీ మాటల్లో చెప్పు! తోడు.. నీడలా ఉండాలా!  నీ నీడ తోడుగ నిలుచుండాలా! ప్రియురాలా!!


ఇద్దరం ఒకటయ్యేవేళ..

జంటగా ఒకటవ్వాలంటే ఎనిమిది చర్యలు జరపాలట. స్మరణ, కీర్తన, కేళీలు- తలచి, కొలిచి, పిలిచి.. ఆడుకోవడం; ప్రేక్షణ, గుహ్యభాషణ, సంకల్పాలు- ఒకరినొకరు చూసుకుని, చనువైనవి మాట్లాడుకుంటూ.. అనువైన దారి వెతుక్కోవడం; అధ్యయనసాయం, క్రియానిర్వృత్తులు- ఆ దారిన పయనించి.. గమ్యంచేరడం. ఏదితక్కువ! మన ఆరాటంలో!! ఇవన్నీ తీరి పీటలు ఎక్కడానికి రెండేళ్లు పట్టింది. ఇప్పుడు ఆ కబుర్లన్నీ ఏకరువు పెట్టను. ఇక్కడో మాట ఒప్పుకోవాలి. ఏది ఎలా మొదలైందో అలానే ముగియాలని లేదు, జీవితం ఎన్నిపరీక్షలు పెట్టినా, నీ మీద నా ప్రేమ తగ్గిందీ లేదు, అలకలూ, ఆవేశాలూ ఎవరికీ తక్కువేం లేవు. అన్ని జంటల్లానే అంతుచిక్కని అంతఃసూత్రమేదో మనల్ని కలిపే ఉంచింది.

ఈ కథలోంచి కొంచెం బయటకి వచ్చి మాటొకటి చెప్పనా! నువ్వు నాకు రాసిన 2003 అక్టోబరు 20 వ తేదీ ఉత్తరం, రాత్రివేళ నీకు ఊరించి చూపించానా! అక్షరమక్షరం చదువుకున్నావే, ముసిముసిగా నవ్వుకుంటూ. ‘ఇది రాసింది ఇప్పటి నేను కాదు, అప్పట్లో అదో పిచ్చిది..’ అని తప్పించుకోవాలని చూశావు. అందుకే నిజం తిరగేసి ఒప్పేసుకున్నావ్. పెళ్ళైన కొన్నాళ్ళకే మీ డాబామీద మాటల మైమరపులో ఏమన్నావో గుర్తుందా! ‘అన్నీ తీరాయి నాకు; పిల్లల్ని కనడం తప్ప.. ఆ ఒక్కటీ తీరితే ఇక నేనేమైపోయినా పర్లేదు’ అని. 


నువ్వు నిజంగానే పిచ్చిపిల్లవు. జీవితం ఊహించనివీ తెచ్చిస్తుందని ఊహించలేక ఏమరుపాటుగా ఉండిపోయావు.

మన తిరుగుళ్లు..

చెవికి ఇల్లుకట్టుకోవడమంటే నీతో లంబాసఫర్ చెయ్యడమే. గట్టమ్మట రోడ్డు, రోడ్డమ్మట రయ్యిమంటూ ఢీకొట్టే గోదారినాదం. చెవిలో నీ మాటలసంగీతం. ఓసారి పట్టిసీమ వెళ్ళాం. మరోసారి పేరంటాలపల్లికి లాంచీప్రయాణం. నా పుట్టినరోజు పేద్ద కేకుపట్టుకుని మా ఊరే వచ్చేవు, గుర్తుందా! అప్పుడు నువ్వేసుకున్నది కోబాల్టునీలం గాగ్రా ఛోళీ. నువ్వలా రైలు దిగుతుంటే నా గుండె లయ మారదా! తుళ్ళిపడనా! నిన్ను చూసి ఐసా లగా ఐసా లగా అని అనలేదు, అనలేను. ఎందుకంటే.. నీలా మరెవ్వరూ లేరు; రారు. ననుచూసి నువు నవ్వుతుంటే పేరు తెలియని పాపాయివి, మోరెత్తి తుళ్లుతుండే చిట్టితువ్వాయివి. ఆనాటికి వదలి వెళ్ళాల్సిన సమయం వచ్చినప్పుడు ఏ పెళ్ళిలోనో, బువ్వాలబంతిలోనో అదాటుగా కనిపించి అభావంగా చూసే పరిచితాపరిచిత అమ్మాయివి. నీకు కోపం ఇట్టే వస్తుందో, నేను నీకు తెప్పిస్తానో.

అలకల చిలకా! పొందికగా అనిపించిన అమ్మాయిని ‘బాగుందికదా’ అని కూడా అనకూడదా నీతో! ఓసారి తన పప్పీ తోఎదురొచ్చిన ఓపాపని చూపించి అన్నానే, అప్పుడు, అలాంటి సందర్భాలలో ఆనాడే నవ్వావు తెరలుతెరలుగా..

నువ్వే నా ఇష్టసఖి అయినప్పుడు మనసులోమాట నీతో చెప్పకుండా ఎలా ఉంటాను! నిష్కల్మష మనసుముందు కపటంగా ఎలా ఉండగలను!

రమ్మని పిలుపు

నీకు బాగోలేదని కబురు, ఆసుపత్రిలో సెలైన్ ఎక్కిస్తుండగా వచ్చాను, తోటకూరకాడలా వాలి, నిర్వేదంతో సోలి ఉన్నావు. అర్థం అయింది. బయటి సంబంధానికి మొగ్గు చూపమంటే నిరశనదీక్ష చేసినట్టు. ఆపైతప్పక, పెద్దోళ్లు నన్ను పిలిపించి మరీ నీ భరోసాని పెంచినట్టు. ఆనాడు దీక్ష విరమింపజేయడానికి కదలి వచ్చిన నాయకుణ్ని. నాటినుంచి మీ ఇంట, నా పలకరింపులకి ఆక్షేపణేం లేదు.


నీచెల్లి ఒకతె.. వందమంది పెట్టు. దానికి నేను తెచ్చిచ్చే జున్నుతో పోలిస్తే పెద్దగా నచ్చినట్టులేను. ఒక్కగానొక్క అక్కకోసం రెక్కలగుర్రం మీద రాలేదని కామోసు, కసిరి కొట్టేట్టు దానిచూపు. చనువిస్తే గొడవ పడేనో, గొడవపడితే చనువు పెరిగేనో దాని విషయంలో చెప్పడం కష్టమే, ముసలమ్మ మూడోకాలు కూర్చున్నాలేచే, నుంచున్నాలేచె అన్నట్టు... మీ తాతగారు, కత్తులకొండయ్య సినిమా తీస్తున్నప్పుడు షూటింగు చూద్దామని రోజూ వస్తున్న మీ చెల్లిని హీరో బాలకృష్ణ ‘ఒసే! అన్నాడని ఆయనతో మాట్లాడితే ఒట్టు’ అని మీ అమ్మ గొప్పగా చెప్పుకున్నట్టు.. అది నిజంగానే తట్టొరసల తుర్రుపిట్ట, నీకన్నా గుట్టు. ఓపట్టాన ఏదీ నచ్చబెట్టుకోలేదు కదా, అన్నీ నువ్వే సరిపెట్టుకోవాలా.

నిన్ను పెళ్ళాడాలంటే నీ చెల్లిని ఒప్పించడమేంటే పిచ్చితనమా! కాబోయే మరదల్ని ఎలా బతిమాలాలి! తట్టగలనా! మొట్టగలనా!! అందరు అక్కచెల్లెళ్ళూ ఇట్టాగే ఉంటే కాపురాలు అయినట్టేనా? నీ ఇష్టాన్ని కాదనలేని అనురాగం నాది, నేను నీవాణ్ణి అన్న ధీమా నీది.

ఇద్దరు ముగ్గురయ్యేవేళ…

ఎంత సాధన చేస్తే నైపుణ్యాలు అలవడుతాయి! కలల్నీ, పిల్లల్నీ కనడానికి సాధన అవసరమే. వివేకం, వైరాగ్యం, నిగ్రహం, మోక్షం ఇవే సాధనామార్గాలు. మోక్షమంటే నా దృష్టిలో మనల్నిమనం తిరిగి పొందడమే. స్వస్వరూపానందావిర్భావమే. రెండు చిదానంద తనువులు మనువాడి ఓ నలుసుకి జీవం పోయడం ఓ తన్మయత, తాదాత్మ్యత. కేలండరు రెండువేలో సంవత్సరం దాటి నాలుగేళ్ల నాలుగు నెలలు గడిచాక నాలుగోవారంలో అడుగుపెట్టినట్టు చూపిస్తున్న 22వ తేదీ నడిరేయి ముహూర్తానికి అనువుగా మధ్యాహ్నపుటెండ వెన్ను దిగకముందే, నీ చిటికెనవేలు కోరి, గోదారి దాటాను. కాలం ఓ చుట్టు తిరిగి.. అదేరోజు అదేసమయం అదేఊరిలో మనల్ని ముగ్గుర్ని చేసిన చిత్రాన్ని చూపించింది. పెళ్ళిరోజుకి ఇంతకుమించిన పరమార్ధం ఏముంది! బిడ్డపై మమకారం కలిగి మన ప్రాణాలు రెండూ పెనవేసుకున్నాక నన్ను నీలోనిలిపి నవమాసాలూ ఎదురుచూశాను. ఆద్యంతాలూ నీవే. “మిమ్మల్నింకా ముందు కలవలేకపోయానన్న లోటు ఈ జన్మకు తీరదు, అత్తమ్మకి ఇంక ఎదురుచూపునివ్వొద్దు, వీలైనంత త్వరగా మనవణ్ని ఇవ్వాలి” అంటూ ఆలస్యాన్ని వద్దన్నావు. ఆషాడం అడ్డురాకపోతే వాడు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పేవాడేమో.


మీ పిన్ని పాదంపెట్టిన సామంతుల వారింట, ఆడుకోడానికి మామలిద్దర్ని ముందుగానే ఎంచుకున్నట్టు.. ఏలేశ్వరంలో కడుపునపడ్డ హితైషి మన బిడ్డడు. నామార్గం తొక్కని యశోధరవి. నిన్ను వదలలేని బుద్ధుడ్ని నేను. చిరునవ్వులతో చిరాయువై వర్ధిల్లు.

మనవాడెలా వచ్చాడు!

ఆసుపత్రికి వెళ్లడం గమనించలేదు. తిరిగివస్తుంటే గుమ్మంలో నల్లచుక్కల తెల్లచీరలో చుక్కల్లే ఆనావు. చేతిలో మెడికల్ రిపోర్ట్సు- పరీక్ష ఫలితాలు. ఎప్పట్లానే నీ ముసిరింత, ఈపట్టు ముసిరింది వింతకాంతి. మీ అమ్మగారేదో నాతో అన్నట్టున్నారు, నా బయట చెవులకేమీ వినబడలేదు. చతురహస్తంతో నువ్వు పొట్ట నిమురుకుంటూ చేసిన సైగ మాత్రం కనపడింది. అందమైన ఊహని నెమరువేసుకుంటూ నేను. వివాహం, కొత్తఉద్యోగం, కొత్తబాధ్యత. ఆనందానికి ఆరోజు వడ్డీ ముడుపు కట్టబడింది. తన చిన్నితండ్రి తండ్రి అవ్వబోతున్నాడని కబురు విన్నాక అమ్మ ఆదేశం-ఆనందంగా ఉంచాలి కోడలుపిల్లని. సాధన ఇప్పుడూ అవసరమే కదా! వివేకం, వైరాగ్యం, నిగ్రహం- ఇవే నేను గుణించుకుంటున్న స్వస్వరూపానంద ఆవిర్భావానికి మోక్షమార్గాలు.

హైదరాబాద్ బదిలీ. అమీరుపేటలో బస, కోరుకున్న ఏకాంతవాసం, వంటా-వార్పు అలవాటు లేదు; ఏర్పాట్లూ లేవు. వదిలి ఉండలేనని నా సాదాజీవితంలోకి సీదాగా వచ్చేస్తే, చూలాల్ని నిండుగా ఎలాచూసేది! ఊరే మనకి దిక్కయ్యింది. హర్ష మెస్, కాకతీయ పార్శిల్స్ భోజనాలు, హైదరాబాద్ సెంట్రల్ షికార్లు, సత్యం థియేటర్ సినిమాలు, సారథి స్టూడియో సినిమా షూటింగులు, అడపాదడపా మేఘన పార్శిళ్లు. బలవంతాన తాగించిన ఫలూదాలు, అప్పుడప్పుడు పలకరించ వచ్చే తమ్ముళ్ళు చున్నూ, రవి.. చిన్నాన్న పిల్లలు. 


హైదరాబాద్! నీకు సలాం, పుట్టబోయే బిడ్డను, వాడి అమ్మను నువ్వే అమ్మలా.. ఆరోగ్యంగా కాపాడావు అప్పుడూ-ఇప్పుడూ.

ఈనగరం ఎంతో మంచిది

నీ బొజ్జలో బొజ్జున్న బుజ్జోడి సాక్షిగా భాగ్యనగరం మనకు ఎంతో ప్రేమను పంచింది. నీళ్ళోసుకున్న పిల్ల భర్తతోపాటు చాయి కొట్టుకు తోడొస్తే, వేడినురగల పాలయ్యింది,  వద్దన్నా బజ్జగించి మరీ తాగించింది. సాయంత్రాలు పెనిమిటి పని ముగించుకుని వచ్చేవరకూ ఎదురు చూసేందుకు హైదరాబాద్ సెంట్రల్ కి వస్తుంటే, కూర్చోబెట్టి సేదతీర్చే చల్లగాలి అయింది. లేచి బరువుగా వెళ్తున్నప్పుడు తన బిడ్డ కడుపున మెదిలినంత సంబరపడిపోయేది. స్టాపు ఎక్కడున్నా, సిటీబస్సు నీ ముందరే ఆగేది వందనంగా. బస్సెక్కిన ప్రతీపట్టూ బిడ్డను కడుపున మోసే తల్లికి లేచి సీటిచ్చింది. వరుసలో నుంచోకుండానే చేతికి సినిమా టికెట్లను అడిగిమరీ అందించింది. ఆగిన ఏ ఆటో అయినా బేరమాడకుండానే ఎక్కించుకుంది, రోడ్డుదాటే సమయాల్లో ట్రాఫిక్ పోలీసు నీ అన్నో, బాబయ్యో అనిపించేవాడు. అతనికి నిన్ను మించిన విఐపీ అప్పుడెవరూ లేరన్నట్టు, అన్నివైపులా వాహనాల్ని నీకోసం ఆపేసి జీబ్రాక్రాసింగుని ఏనుగు అంబారీ చేసేసేవాడు, అప్పుడు నేను నీ చేయి పట్టుకుని ముందుకుసాగే మావటివాణ్ని. నీతో కలసి నడిచిన దార్లన్నీ ఎన్నెన్నిసార్లు నన్ను నీగురించి కళ్ళెగరేసి ప్రశ్నించేవో! ఎందరికి ఏమిచ్చినా.. నాకు నిన్ను అందంగా చూసుకునే అవకాశాన్ని, ఊరంతా తోడుందన్న భరోసాని ఎల్లకాలం ఇచ్చింది ఈ భాగ్యనగరమే.

సఫల ప్రేమకథకు సాక్షిగా పుట్టిన నగరమే, తన దుమ్ము చేతులతో నిమిరి, వానచినుకులతో తడిపి బిడ్డల్లా సాకింది, అక్కున చేర్చుకుంది. ఇప్పటికీ మన ఆలనాపాలనా చూస్తూంది ఈ నగరమే.

ఇంకాస్త వెనక్కువెళ్ళి..

మనమంటే ఈ నగరానికి వల్లమాలిన వాత్సల్యం. పెళ్ళిపీటలపై ఉండగానే హనీమూనుకి రమ్మని రామోజీ తారానగరం ఆహ్వానించింది. అన్న తోడల్లుడు కృష్ణారావు-ఉదయశ్రీలు జంటగా అందించిన పెళ్ళికానుక. వారంలోగా రెండ్రోజులు అక్కడ గడపడానికి. ఎన్ని చల్లని దీవెనల ఫలమో మన పునఃసమాగమం! ఆపై కాలాన ఈ నగరంలోనగరం రోజువారీ ఉద్యోగానికి అక్కడికే రప్పించుకుంది. పుష్కరకాలంగా మూడుగ్రాసాల మృష్టాన్నాన్ని బిర్యానీల నామాన తింటున్నామంటే అది ఆ వేళావిశేషమే. మేడే 2004 న ఐమాక్స్ థియేటర్ లో నీకిష్టమైన నాగార్జున సినిమా. పెళ్లైయ్యాక మనం చూసిన మొదటి చిత్రం ‘నేనున్నాను’. అంత వరకూ ఎప్పుడు ఎక్కడ ఏ ఆట కలిసి చూసినా నా భుజంపై వాలిన నీ తల ఆ గుండె అదురును వినిపిస్తూనే ఉండేది! కొద్దిసేపటికి నిన్నొదిలేసి మరలిపోతానన్న బెంగతో. ఆ పట్టు సినిమా మధ్యలోనే అలసిన నా చిట్టినుదురు చిలకమ్మ సేదతీరేందుకు నాపైవాలి నిదురపోయింది. ఆనాటి ఆ పాట నా చెవుల్లో ఇప్పటికీ వినిపిస్తూనే ఉంది. 

“అందరుఉన్నా అప్తుడు నువ్వై చేరువయ్యావనీ... జన్మకి ఎరుగని అనురాగాన్ని పంచుతున్నావనీ, జన్మలు చాలని అనుబంధాన్ని పెంచుకున్నామని, శ్వాసతోశ్వాసే చెప్పెను... మనసుతోమనసే చెప్పెను.. నేనున్నానని, నీకేం కాదనీ...- “


ఆ మంచిగంధం చీర, చెక్కిలీ చమటకి తడిచి నన్నంటుకునే ఉందింకా. పాట నా బాధ్యతను నాకు గుర్తు చేస్తూ గడియగడియకీ వినబడుతూనే ఉంది.

అత్త ఉల్లిపాయ- కోడలు మిరపకాయ

ఉల్లినికోసినా కన్నీళ్లొస్తాయి, అత్త సుద్దులు చెప్పినా. కత్తి సానకు నిప్పురవ్వలు, పోపు వేగినపుడు చిటపటలూ సహజం. ప్రాయాన్ని బట్టి మారే అభిప్రాయాలు తప్ప అత్తాకోడళ్లిద్దరూ ఒకేనాణానికి రెండు వైపులాఉండి, గోడున నుంచున్నవాడ్ని బొంగరంలా తిప్పుతారు. అత్త స్టాండర్డ్ వెర్షన్- బట్ ఓల్డ్; కోడలు అత్తకు లేటెస్ట్ వెర్షన్–బీటా. అత్త ఊసు లేకుండా కోడలు ప్రెషరుకుక్కరు తెరవదు, కోడరికంలో అత్త వడ్డించేది అప్పుడప్పుడు అత్తెసరు మార్కులు. జీవితం వంట వండకముందు కత్తిపీటకు తప్ప కొత్తిమీరగాడికి ఈ వివరం అంతుచిక్కదు. అంతా మంచిగానే మొదలౌతుంది. కోడలికి అమ్మమీద బెంగ తిక్కెక్కి అత్తరికం మీదకి బదలాయింపు.. “అత్తమ్మ చేతిప్రేమ లెక్కల్లో మీకు చేప పొట్టముక్క, నాకు తోకముక్క- ఓ బుంగమూతి”. “పగలు పడుకోవద్దని చెప్పరా అసలే పిల్లకి ఒళ్లు..- అత్త రుసరుసలు” సారెలు, పెట్టుపోతలలానే కారణాలూ తొందరగానే పాతబడిపోతాయి. “నేను కాకపోతే కోడలికి ఇంకెవరు చెబుతారు!- ఇది అమ్మ అనునయం”. “మీ అమ్మగారికి మీతర్వాతే నేను- ఇవి నీ అలకమాటలు” ఇలా ఎన్ని తవ్వుకున్నా, ఇదంతా సిద్ధాంతం. లౌక్యంగా ఎదుర్కొనకపోతే పోపులో కరివేపాకు అవ్వాల్సిందే. తింటేనే కదా కంటికి ఆరోగ్యం! 


 ఇలాంటి సందర్భాలే జీవన సాగరతీరాన్ని తాకే ప్రేమకెరటాలు. తడిసి ముద్దయ్యే అదృష్టం! వెనకటికి జనార్దనమహర్షి వెన్నముద్దల్లో చెప్పాడు- మాఅమ్మా, మాఆవిడ నాకు రెండుకళ్లు, కళ్లు.. ఒకదానినొకటి చూసుకోవు.

అత్త అల్లం- కోడలు వెల్లుల్లి

‘అత్తమ్మా! ఏం వండుకుందాం ఈవాళ? తూరుపు ఎండ సుర్రుమనకుండానే కోడలి పలకరింపు’– ‘ఇంత పెందలాడే ఎందుకమ్మా, పన్నెండింటికి వంటకి వెళ్దాం. ‘మీరుండండి! నేనొండుతా’-‘నీకెందుకమ్మా ఈపని! కోడలుతో వెండిగ్లాసుకూడా కడిగించ కూడదు అనుకున్నా. మసాలాలు ఎక్కువైతే మీ మామయ్య తినలేరు, పక్కనుండు చాలు’. ‘ఇంకచాలు అత్తమ్మా జ్యూస్ తాగలేను’- ‘మన తోట సపోటాలు అమ్మాయ్! నీకిష్టమే కదా’. ‘బయటేమీ తిని రాకండి. మీకోసం తాలింపేసి.. కమ్మగా పొడిపప్పూ, కొబ్బరిపచ్చడి చేశా. బోలెడు గుడ్లున్నాయి ఇంట్లో, ఆమ్లెట్లేసుకుందాం’-‘అబ్బా! అత్తమ్మా! నోటికి అడ్డంపడ్డారే, బిర్యానీ తినొద్దామనుకుంటే!

ఇంతకుమించి సరిహద్దు తగాదాలేమైనా ఉంటాయా! ఒకరు వేసవి మరొకరు వర్షరుతువు. వలయమై విస్తరిస్తున్న సందర్భాల మబ్బులు. ఎంత ఎండకాస్తే అంత వాన కురుస్తుంది. ఎండా- వానాలతో కలిసి నడవడం, ఏ సందర్భానికి ఆ గొడుగు పట్టడం ఇదే జీవనమకరందం. ఇది సరిగా అమలుకానినాడు కష్టాలతో చలికాచుకోవడం తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి అతిగా శోకింపతగదు. 

కూర ఘుమఘుమలాడాలంటే అల్లం-వెల్లుల్లిముద్దలా కలవాలి.. కలియబెట్టి ఉడికించే పనిలో ఎక్కువతక్కువలు అనుభవాలు. వండుకుతినడమే ఆస్వాదన. రుచులన్నీ కలిసే ఉంటాయి రసాలూరిస్తూ.

నేనేమో అమ్మరెమ్మ-తానేమో వెన్నెలకొమ్మ

అమ్మమ్మ ఊరేమో పొలమూరు, గోదావరి ఇవతలి పేరు. బక్కరైతుకి అమ్మ ఐదో సంతు, తొమ్మిదో ఏడు బాలానందానికి వెళ్ళిందని తిట్లు తినడం తప్పని ఇంటి పడికట్టు. అమ్మ ఎస్సెసెల్సీ చదివింది, అంటే ఊరి బడిగట్టు దిగినట్టు.. చుట్టంచూపుకి వచ్చినోడు ‘నచ్చింది’ అన్నాడని, బాగాచదువుకున్నాడని, కూటికీ-గుడ్డకూ కొదవుండదని నమ్మి, నాన్నకి కట్టబెట్టారట గానీ, ఇక్కడ ఉద్యోగం లేక పక్కరాష్ట్రానికి వలస వెళ్ళిన వైనం. పాసింజరు రైలుప్రయాణాల దూరభారం. పేదరికానికి కొత్తరూపు-మధ్యతరగతి జీవనం. ఒంటిరెక్కలమీద ఇద్దర్ని కనిపెంచడం, కథలు చెబితే నీతి, చదువుచెబితే రీతి అలవడుతుందని నమ్మి ఆచరించడం. నాకు పాలు పట్టించాలనో, కనిపెట్టుకుని ఉండాలనో ఖమ్మం జాయ్ బెల్స్ కాన్వెంటులో టీచరుగా చేరడం, ఆపై తానే గురువై ఇంటిలోనే హిందీ పరీక్షలు కట్టించడం. సారస్వతం నా తల్లిపాలు. లలితకళలు నా నోటికందించిన వెన్నముద్దలు, నేనెన్ని చెప్పినా నన్ను దిద్దితీర్చిన అమ్మ తపన చర్వితచర్వణం. ఎదగడంలో లోపమెక్కడ ఉందో, నా వేళ్ళూనిన నేలంతా సారవంతమే... ఆకాశాన్ని అందుకోవడంలో సగందారిలోనే ఆగిపోయాను. అప్పుడు కనిపించావు నువ్వు ఆకాశం లో సగమై. 


ఆశలతారకల నడుమ నీకై వికసించాను, నన్ను ఎల్లవేళలా వెలిగించి ఉంచేది నీ నెలవంక నవ్వు; మనం కన్న తురాయి పువ్వు.  యుద్ధాన్ని వలచి వచ్చిన సిపాయిని నేను. నువ్వు దానిమ్మ మొగ్గవు కావు, నా మనసు పై పాకిన మల్లికవు.


నచ్చని ఇచ్చకాలు

ముందొకలా, పెళ్లయ్యాక ఇంకోలా ఉంటారని వీళ్ళని వాళ్ళూ, వాళ్ళని వీళ్ళూ ఆడిపోసుకుంటారు మనుషులు. అస్తమానం ఒకేలా ఉండటం విసుగనిపించదూ! పెళ్ళిమంత్రాలకు అర్థాలు వెతకను, భార్యవని ఏ విషయానా, బలవంతం చేయలేను. నన్నుకోరి వచ్చిన స్నేహానివి, నిన్నెలా వదిలి ఉంటాను! ఎక్కడ ఏది ప్రాప్తమో, తృణమోపణమో ఇచ్చి పుచ్చుకుంటున్నాను. ఈ జిందగీ ఎంత వింతైనదో! ఒకచోట వదిలితే మరోచోట పట్టుకోవాలి. పంచుకున్నచోట గిట్టుబాటు కానంతమాత్రాన నొచ్చుకునేది ఏముంది! లక్ష నిరాకరణల నడుమ ‘కలిసిజీవిద్దాం’ అన్న అంగీకారంపై గౌరవం నాకు. భౌతికప్రేమ మధురమైనదీ, మోహం మొహంమొత్తేదనీ తెలుసు, నేలమీద నిలబడి జీవించేందుకు చేసుకున్న సర్దుబాట్లే అన్నీ. అసలు జీవించడమే ఉత్సవం అయినప్పుడు కలిసి బ్రతకడం ఎలాగైనా ఆనందమే.


ఒకరి ప్రపంచాన్ని మరొకరికి అందించడం, ఒకరి ప్రపంచంలోకి మరొకరిని ఆహ్వానించడం, ఎవరి ప్రపంచాన్ని వారు సొంతంగా సృష్టించుకోవడం, ఎవరి ప్రపంచంలో వారు మిగిలిపోవడం ఇది తనను తాను అద్దం లో చూసుకోలేని ప్రపంచ పరిభాష. ఇందులో మనం ఇమడలేం. ఎవరు ఈ లోకాన్ని ఎలాచూసినా ప్రతి చినుకులోనూ ఉన్నది అదే తడి.

మరి నిన్నే నా లోకమని అంటున్నది ఎందుకంటే, నన్ను తడిపిన చినుకువి, జడివానవి నువ్వేమరి. అమ్మను తలపించే బొమ్మవు. నా బొమ్మ అమ్మవు. నా గుండె గట్టు తెగేటట్టు ప్రవహిస్తున్నావు.

మెచ్చిన ముచ్చట్లు

అసలీవాన ఇలా మొదలయ్యింది!- ఓ కరెంటుపోయిన పగలు, కూతపెడుతున్న కంప్యూటర్లను వదిలేసి, ఆఫీసులో ఫ్రంట్ లైన్ మేగజైన్ను తిరగేస్తుంటే కనిపించిన సుష్మాస్వరాజ్ బొమ్మ, నీ పక్కన కూర్చున్న పోచమ్మ అన్నట్టుంది.. ‘ఈవిడలానే ఉంటుందంట.. సతీష్ గారి అమ్మ’. సామవేదం శాస్త్రి; బావగాడికి నాలుకమీద మచ్చ.. వాడే చెప్పుంటాడు.. ఆ మాట తనకి – అత్తకోడళ్లుగానే అనిపిస్తారు అనేశాడు. నీ బుర్రలో తొలిచే పురుగును వదిలేశాడు. పెద్దల వాగ్దానాలను పిట్టలదొరల కాకరకాయలుగా మార్చిన కాలం నన్ను నీ మనసులో వరుడిగ కూర్చోబెట్టింది. నువ్వు చెప్పినమాటే- నీ ఇష్టసఖి అన్నయ్యకి నచ్చావని, అప్పుడు కలవని జాతకాలు, మనిద్దరికీ ఎలా కలిసాయి! నచ్చబెట్టుకుంటే కదా. సినిమాతెరపై దేవుడిబొమ్మ కనిపిస్తే దణ్ణం పెట్టుకునేదానివి, మనం ఒకటవ్వాలని, నీకు నచ్చిన చీటీ వచ్చేవరకూ నాకోసం దేవుడి ముందు దోబూచులాడావ్, నాపై ఎంతిష్టం లేకపోతే అట్లా చేస్తావ్. నిన్నిష్టపడిన శ్రీనివాసునీ, నువ్విష్టపడే శ్రీనివాసుణ్ని ఇద్దరినీ తలచుకోవడం నాకు ఒక్కటే. నిన్నిష్టపడ్డ వారెవరన్నా నీ అంత ఇష్టం. మంచి అభిరుచి ఉన్నవారిపట్ల కలిగే గౌరవం.


బండిమీద మనం షికారుకెళ్ళే రోజుల్లో ఏ కుర్రచెయ్యో నీ నగుమోముని మెచ్చుకుంటూ సైగచేస్తే చూసి కించిత్ గర్వం నవ్వుని పులిమేది ; ఇప్పుడు తలచుకుని మరీ నవ్వుకుంటున్నా. మనమిద్దరం ఒక్కటవ్వడం ఈ లోకంమొత్తం కోరుకుంది. మనమిద్దరం ముగ్గురవ్వడంలో ముచ్చట్లు చెప్పడం ఇంకా మిగిలిఉంది.

పురుడు ముందరి పాట్లు

పెళ్ళైనపిల్ల నీళ్ళోసుకుందంటే... పుట్టేదెవరు!! బొండుమల్లా! బూందీ లడ్డూనా!! పిల్లలబొమ్మల్ని పొద్దస్తమానూ కనిపించేలా గోడకంటింప జూస్తే మీ అమ్మగారు వద్దంది. బొమ్మలో దొరబాబుది చట్టిముక్కట, ఇంతకన్నా అందంగా ఉంటాడా మీ మనవడు! అడిగా, చూద్దురులెండీ!! అందావిడ. అతిశయం అనుకుంటుంటే నువ్వు అన్నావూ,.. “మీ ముక్కు వాడికీ వస్తుందని మా అమ్మ ధీమా”. అసలు పిల్లలంటేనే అందమైనవారు, అందులో అందమైన పిల్లలు వేరంటే ఏమంటాను! ఎవరి పరిధిలో వారి ఆలోచనలని సరిపెట్టుకున్నా. ఆరోగ్యమే అందం కదా అనుకుంటూ నడక మంచిదని ఒప్పించి నీ చేయి విడువకుండా నడిచేవాడ్ని. సంఘీ దేవాలయానికి నీతోకలసి మొదటిసారి వచ్చాక, మెట్లు చూసి వెనకడుగు వేయలా! ముందుకే అడుగేసాం.. నడుముకు నాచేయి ఊతమిచ్చి ఆరు నెలలు నిండిన మనిషిని, రెండుప్రాణాల్ని కాపుకాసుకుంటూ అన్నేసి మెట్లు ఉక్కిష్టం ఐనా ఎక్కించానే, నాలుగేసి కాళ్లు-చేతులూ, కళ్ళూ ఇంకా కనబడని వాణ్ని కనిపెట్టి ఉన్నాయన్న భరోసా. ఆపై నిత్యం కనిపెట్టుకుని ఉండేవాడి నిండు దయ. నీకు తొమ్మిది నెలలు నిండి పై తొమ్మిదో రోజు కృష్ణవంశీ-చక్రం సినిమా కి వెళ్ళాం! హాల్లోనే నెప్పులొస్తే! ఈ ఊహకే కళ్ళు కలిసి ఎగరిపడ్డాయి.. గుర్తుందా!


జైల్లో పుట్టిన రాష్ట్రపతిని జ్ఞాని అన్నారు. మన జీవితచక్రాన్ని తిప్పే ఇరుసు ఎక్కడ ఎప్పుడు పుట్టినా ముద్దుగా ఏమని పిలుచుకుందాం! నా లెక్క తప్పనట్టు, రెండు వారాలాగి మరీ మన పెళ్ళితారీకునే నీ గుడిగర్భం నుంచి బయటకొచ్చాడు,  ‘లక్కీ’గాడని అన్నారు అంతా!

పెళ్ళిరోజు C/o లేబర్ రూం

ఏం లక్కీగాడో! పుడుతూనే పెద్ద ఇబ్బంది పెట్టేశాడు. నా పెళ్ళిరోజు సరదాలన్నీ చెడగొట్టేశాడు. నా లడ్డూపాపని ఆసుపత్రి బెడ్డుమీద అడ్డంగా పడుకోబెట్టేశాడు. రాజమండ్రి ‘కంటే దుర్గ’ ఆసుపత్రిలో మధ్యాహ్నం మూడు గంటలకి వాడి ప్రయాణం నీ కత్తెరకోతలతో. పావుగంటలో నర్సు తెల్లనిగుడ్డలో చుట్టిన బొమ్మబుజ్జాయిని అంతదూరంనుంచి ఇడిగోండని చూపించింది. అప్పుడూ నేనొక్కడ్నే నాతోఉన్నాను. నేను వాడ్ని చూసినప్పుడు ధ్యానంలో మౌనంగా ఉన్నాడు. నన్ను చూశాకే కేర్ మన్నాడు. ఏం చెప్పాడు వాడు! ఇది నీ పెళ్ళిరోజు కాదు, నా రోజనా! ఇక ముందు అమ్మకు నీకన్నా నేనే ముందనా! ఏదైనా వాడు ‘టేక్ కేర్’ అన్నాడు, ఏవో జాగ్రత్తలు చెప్తున్నట్టు.. నేనింకా నువ్వు సొమ్మసిల్లి ఉన్నావన్న బెంగలో ఉన్నాను. కానుపు అలసట తెలిసిన అత్తగారు, తన కూతురి ధ్యాసలో ఉన్నారు. ఎవరో అంటున్నారు, మగపిల్లాడు పుట్టినా నేనేం సంబురాలు చెయ్యడంలేదేంటని! పిల్లాణ్ని చూపించిన మిస్సమ్మ పేరు కనుక్కున్నాను.. మస్తానమ్మ. మస్తానమ్మ-నా సమస్తాన్ని నేలన జాబిల్లిని చేసి తన చేతుల్లోంచి చూపెట్టినమ్మ. నోరు తీపిచేస్తే సరిపోతుందా! అమ్మా, నాన్నా ఆఘమేఘాల మీద వచ్చారు. కోడలి కష్టాన్ని కన్నారా కందామని. అప్పుడూ నువ్వు ఆ మంచిగంధం చీరలోనే, అలానే తడిచిన నీ మేను. ఇప్పుడు నేనున్నానని మనతో చెప్పాలని వీడొచ్చాడు.


బిడ్డ నీలా నిద్దరోతుంటే, మగతలోంచి బయటపడ్డాక, నిన్ను నిత్యం చూసుకునే నా చూపుల్తో నువ్వు వాణ్ని చూసుకుంటూ..

ఇంట కాసిన పండువెన్నెల

బిడ్డ పుట్టకుండానే రెండు కుటుంబాల వారధిగా మారతాడు. పుట్టాక వారి నడుమ కనిపించని ప్రయాణాలు చేస్తాడు, చేయిస్తాడు. వాణ్ని తమవాడని ఒప్పించుకునేందుకు ఎవరిలెక్కలు వారివి. ఇంటిపేరు నిలబెట్టేవాడని తండ్రితరుపు, తమపిల్ల ప్రాణాలొడ్డి రక్తం పంచామని తల్లితరుపు.. ఎవరికివారు వీడు మావాడే అనుకుంటారు. ఇక్కడన్నీ మురిపాలే. నా అన్న-ముందుగా తన్నుకొచ్చిన తమ్ముడి కొడుకులో తన వారసత్వం చూసుకోవడం మురిపెం. సంజెరేవునే ఇంటికొచ్చిన తోటికోడలు ఆరిందాగా బాలింత అయిపోవడం, ఊహించినట్టే మెట్టినింటి చెల్లి అమ్మయ్యే సరదా తీర్చేసుకోవడం; నీపెద్దకొడుకని నన్ను అప్పగిస్తూ పెళ్ళిపీటల మీదే తనని తల్లినిచేసిన అత్తగారి వైనం గుర్తొచ్చినట్టు సంధ్య వదినకు ఇద్దరి బిడ్డల మురిపెం. ఇంటిపేరు లెక్కల్లో ఒకటి పెరిగిందని మానాన్న అనందం. 

వెతలకీ నలతకీ నలిగినా చిరునవ్వు వదలని చిద్విలాసి మీ డాడీ.. నునుపుకండల పిల్లవస్తాదులో తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ, లక్కీ! లక్కీ!! అంటూ.. చిటెకెలు వేస్తూ పొందిన మురిపెం ఆ జీవితం మన మనసు గోడకు వేలాడదీసిన ఆఖరి జ్ఞాపకం. ‘బాబుగాడితో మాట్లాడుకోవేం తల్లీ’! అమ్మ ప్రశ్నకు, వీడు ఎప్పుడు ఎదుగుతాడో! ఎప్పుడు నా చేతి చికెనుముక్క తింటాడో.. అని పైకి అనేసి.. నువ్వు.. నీ నవ్వు.

గుర్తు తెచ్చుకునేకొద్దీ గోదారిపొంగులా, వరదగుడివెన్నెల మనసుని చుట్టబెడుతూ...


ఔరా అమ్మకు చెల్లా!..

ఎదురుచూపుల నొప్పుల్ని ఏడాదిగా మోస్తున్న ఆ పిల్ల.. తీపికబురు విన్నాక, తలారా స్నానం చేసి దీపం వెలిగించుకుని నీ దరికి వచ్చింది. వాణ్ని దగ్గర్నుంచి చూసుకుంటూ నిలిచుంది. తనూ చిన్నపిల్లే!, ఇప్పుడు పిన్ని అనే పెద్దరికం. అప్పుడా కంటికీ, ఈ చంటికీ మధ్య త్రేతాయుగపు అనురాగపు జల్లు, ద్వాపరయుగపు పురాస్మృతులు, శబరి అనురాగం, యశోద పరవశం. మింటివెలుగు విరుపున పటాపంచలైన మోక్షమార్గం, తీరా అందాల్సింది అందాక, అంతర్యామి సాక్షాత్కారంలో అంతకుమించినదేమీ తోచక, స్థాణువై నిలబడిన సుప్తచేతనావస్థ. చేష్టలుడిగి చిత్తరువైన వైనమో, సంభాషణో! వారిరువురిబంధం జన్మాంతరాలుగా పెనవేసుకున్నదేమో అన్న సంశయాన్ని మోస్తూ నిశ్శబ్దం. నిజం చేస్తూ గడుస్తున్న కాలం. శిరీష తన అస్తిత్వాన్ని వదిలి, మన కొడుకు కోసమే కట్టుబడడం, అక్కని వదిలి చెల్లీ, పిన్నిని వదిలి పిల్లడూ పుష్కరకాలంగా ఉండలేనితనం లోకం ముక్కుమీద మనమే వేలువేసి వెనక్కి నెట్టేయడం.. పురాశిలాజానికి చలనం వచ్చి కాలంకానికాలం లో జీవం పోసుకున్న అమాయకపు మీ మమ్మీ, వెనుదిరిగిరాని పెనిమిటిని తల్చుకుంటూ రాణివాసంలో, కలసిరానికాలం లో నన్ను మీ పాల్జేసి.

నువ్వు నాతో ఆడుతున్న తోడుబొమ్మలాట ఈ తోలుబొమ్మలాట యధాస్థితి అనివార్యమై నేను. ఉద్ధారకునిపాత్రలో ఇమడ లేకపోయినా, ఆత్మబంధపు ప్రేమకు బందీనై... నీ గుంజకే నన్ను కట్టుకుని గింజుకుంటూ ఉండిపోయా.

ఆకతాయి మాటలు

పసివాణ్ని చూడటానికి వచ్చారు చుట్టపక్కాలు, అమ్మలక్కలు -‘ఇంకా గుండ్రంగా ఉంటాడనుకున్నామమ్మా’ అంటూ బుగ్గలు నొక్కుకున్నారని ఐదున్నరపౌన్లవాణ్ని తరచి కన్నీరయ్యావు, కడుపుతో ఉన్నప్పుడు పాలింకా తాగిఉంటేనా! అని కుమిలావు. తిండి ఏం తక్కువ మనకు! అత్తారింటి సపోటా పాల జ్యూస్ ముందు నువ్వు ఓడిపోలేదూ!  బరువో పెరిగినంతనో, నేనింతలా కనబడ్డంతనో బిడ్డపుట్టడం తోనే పెద్దగా కనబడాలా! లోకం శుభకరే, కొండకచో మనతో ఆడేది సలిలకేళి, కుదిపేసి తప్పుకుంటుంది కొన్నిసార్లు. మమత వల్ల కన్నీళ్లు కళ్ళముందరి దృశ్యాన్ని మసకబారుస్తాయి. వాస్తవానికి ఏ మహావృక్ష విత్తనమైనా చిన్నగానే ఉంటుంది! మొలిచి ప్రవర్ధమానమౌతుంది. సుసారక్షేత్రం నీది. మన చిన్నోడికేం తక్కువ! ముక్కుపచ్చలారేవరకూ నీరెండ కాపడానికై నేనెత్తుకుని ఆడించిన వేళల్లో లోపలి లోకపు కబుర్లు ఎన్నెన్ని చెప్పేవాడనుకున్నావ్! నే ఊకొడుతూ ఉండేవాడ్ని. తీరా రోజులుదొర్లిపోయాక, బాబు ఎదిగిపోయాక సరదాలన్నీ నీవేనా! ఇప్పుడూ ఊకొట్టాలా! దమ్ముంటే ఇంతకన్నా చక్కనోడ్ని ఎవరికన్నా కని చూపించమన్నావు గుర్తుందా! భూమ్మీద ఇప్పటిదాక ఇలాంటి మాట ఏ మగడన్నా వినిఉన్నాడా ఈ లోకాన!!

మళ్ళా అబ్బాయెందుకు నాకు! చుక్కని కని; సాఫల్య అని పేరు పెడతానన్నాను. రాతల్నిమించి కనే సాఫల్యతేముంది నాకు ఈ లోకాన! నా సాఫల్య నచ్చేనా నీకు!


నారికేళ సలిలము భంగిన్

“ఏమండీ! లక్కీ,.. బుజ్జిబాబు కదా నేనొక్కద్దాన్నే చూసుకోలేను; శిరీషని తోడు తెచ్చుకుంటానే!” ఏళ్ళనాటి మాట. “సతీష్! లక్కీబాబుకి చపాతీ, నాకూ- సిరికీ ఇడ్లీ, వడ.. నీకేం కావాలో తెచ్చుకో” ఇది సగటు శనివారపు కోటా. లడ్డూ! నువ్వేమడిగినా వద్దనలేను. కాదన్న కారణమేమన్నా ఉందంటే అది సిరి ఇంట ఉన్నందున కాదు; ఆనవాయతీ లేనందునే. వేరువేరు నేపథ్యాలనుంచి వచ్చి ఒకచోట కలబడ్డాం. మనం కన్నది ఒక్కడ్నే అయినా, ఒక్కసారిగా నీకూ నాకూ నడుమ పిల్లాడు-పిల్లా. నీకు ఇద్దరూ, నాకుముగ్గురూ పిల్లలై కొత్తకాపురం కాస్తా కుచేలమైంది. ఏ మాటకామాటే చెప్పుకోవాలి. లోకం మొత్తాన్ని ఓ పక్కకు నెట్టేసి ఈ పిల్లలు మన ఏకాంత సమయాల్ని ఆక్రమించుకున్నాక, మనది నాలుగు స్తంభాలాట. ఆటలన్నీ ఆహ్లాదంగానే ఉంటాయి. జీవితం ఓ గాలిదుమారం. దూరంనుంచి భయపెడుతుంది. గడ్డిపోచలం, మనకేం భయం!

నీ అల్లరికెరటాల తాకిడికి నిత్యం తడుస్తున్నవాణ్ని. నీ ఆనందాలు, తాపాల వెనుక మెదడున న్యూరాన్ల అసమతుల్యత, ఆనువంశిక కారణాల నడుమ ఒకానొక ఒత్తిడి సందర్భాన బయటపడ్డప్పుడూ దేవుడు మనజట్టే. అందుకే నీ పసిమనసును నాతో ముడిపెట్టాడు.

నన్నుచూసి నువ్వు నవ్వినప్పుడల్లా, దేవుడు నాలోకి తొంగిచూస్తూ పలకరిస్తున్న చప్పుడు...


గుర్తుకొస్తున్నాయి.

ఎందుకింత ఆలస్యంగా పరిచయమయ్యానని నిలదీసావుగా! మరో జన్మంటూఉంటే, ఏ దృష్టీపడకుండా బావామరదళ్ళై కలసిపెరగాలని, తరగని కబుర్లెన్నో చెప్పుకోవాలని ఉబలాటపడ్డావే! ఇంకాస్తదూరం నాతోపాటు నడిచొస్తావా, గుర్తున్నవన్నీ చూపిస్తా. కొన్ని తలపుల్ని కాలం చెరిపేసినా మిగిలినవన్నీ నువ్వెవ్వరో తెలియని కాలంలో నీకై నా ఆరాటాలే. - చిన్నోణ్ని కదా అమ్మకి, చేరికవల్లో గారంవల్లో చురుకెక్కువ. తను తప్ప ఇంకెవ్వరూ కనపడని కాలంలో ‘అమ్మ దేవత’, ఇదే మాట కనిపించిన చోటల్లా రాసుకున్నా. చెక్కలపై బలపాలతోనో, గోడలపై పెన్సిళ్లతోనో. నాన్నతో పనివుండి గుమ్మం తొక్కినవారంతా అమ్మను కని, ఈమాట పైకి అని వెళ్లినవాళ్లే. పెట్టుపోతల్లో లోటెప్పుడూ కానని కళ్లకి ఇప్పటికీ ఆ కదిలే దృశ్యాల ఆనవాళ్ళే కనులముందర. ఒళ్లు నలగకుండా ఉండాలంటే ఏదోకటి నేర్పుతూ కూర్చోబెట్టాలని కళలన్నింటిలోనూ వేలు పెట్టించింది, దొరికినచోట దొరికినంత అవేమైతేనేమిలే, అపురూపంగా పెంచింది. అన్నకూ నాకూ పురాణేతిహాసాలను ముద్దలు చేసి తినిపించింది.

అమ్మకథలన్నీ ఆణిముత్యాలే. నాన్న ఉద్యోగార్థం ఊళ్లట్టుకు తిరుగుతున్నప్పుడు పిల్లలిద్దరినీ చెరోపక్క వేసుకుని వినువీధిన చందమామను తనవేలికి వేలాడదీసి చూపించేది.

ఇప్పుడు నా కట్టెదుట నడయాడే చందమామా నువ్వే, కన్నుల్లో వెలిగే వెన్నెలమ్మా నువ్వే.


..గుర్తుకొస్తున్నాయి

అప్పుడు నాకు ఊహరాలేదు, పసిపాదాలకు వేసిన సాక్సులు ఒరుసుకుపోయి పక్క రాష్ట్రానికి రైలుప్రయాణంలో గుక్కపట్టాను, నొప్పి గుర్తులేదు; కాలిమీద మిగిలిపోయిన మచ్చ జ్ఞాపకం. నియతిని నిలదీసినందుకు నాన్న చెయ్యెత్తాడని దూకేద్దామనే ఆవేశంలో అమ్మ, గోదారొడ్డుకెళ్ళి కూర్చోడం,. పక్కింటి వెంకట్రావు అంకులు చూడడం; అనునయించి తీసుకురావడం మా అదృష్టం. అమ్మ తిరిగి రాకపోతే మా ఇద్దరి గతేమయ్యేదో; అమ్మా! మళ్ళా పోవాలనిపిస్తే మమ్మల్ని చంపొద్దమ్మా అన్న అన్నమాట.. ఇప్పటికీ జ్ఞాపకం. వరదాయని గౌతమికి వెల్లువొచ్చి శివలింగాన్ని చుట్టినరోజు, గట్టుతెగి కొట్టుకుపోతామేమో అనుకుంటూ కొవ్వూరు గుండె చిక్కబెట్టు కుంటుంటే అమ్మ నమ్మకంగా గంగమ్మకి పసుపుకుంకుమలు సమర్పించుకుంటున్న దృశ్యం ఓజ్ఞాపకం. ఇంటిముందు ఆగిన రిక్షాఎక్కి, కడ్డీ తొక్కుడులో జారిపడ్డప్పుడు తొడకండ చైనుచక్రం పక్కన ఇరుక్కుపోయి విలవిల్లాడుతుంటే అమ్మ విడిపించిన జ్ఞాపకం. పిల్లి ఒకటి కిటికీ బయట పరిగెడుతుంటే దాని ఉరుకుకి భయపడి నేను జారి,గడ్డం బద్దలు కొట్టుకున్నప్పుడు.. ఎడబిడ్డను వదలలేక ఇద్దర్నెత్తుకుని అమ్మ ఆసుపత్రికి గుండెలదిరేలా పరిగెత్తుకుంటూ వెళ్లిన దృశ్యం జ్ఞాపకం.  రెండేళ్ళకోసారి ఊరు మారిన జ్ఞాపకం, ప్రతిసారీ దూరమైన స్నేహితులు- జ్ఞాపకాలు.

- చెమరింతల నీ కళ్ళతడి జారిన బంగారుచెక్కిళ్లు, నిద్రలేని రాత్రుళ్ళలో తీరని దిగుళ్లు.. రెండేళ్ళ ఎడబాటుకు ఆనవాళ్లు. ప్రతీ సందర్భమూ తీపితీపుల జ్ఞాపకమే.

...గుర్తుకొస్తున్నాయి

మొదటి ఏడేళ్ళూ ఊహ తెలియని హాయిలో, తరువాత ఇరవై నేర్చుకునే తపనలో. ఎదగడం ఎంతసేపు! కొవ్వూరు, తుని, ఆకివీడు, ఖమ్మం, నారాయణపురం- హైస్కూలు చదువులు; విజయవాడ, తణుకు, కాకినాడ-ఇంటర్ డిగ్రీ పీజీలు, ఉజ్జోగం రాజమహేంద్రి, అక్కడే కలిసాగా నిన్ను, ఆగింది ఎక్కడ! ఆయాసం తగ్గనే లేదు. చదువు చెడకుండానే  డాన్సులు, డ్రాయింగులు. వేసంకాలంలో చుట్టాలిళ్ళకు వెళ్ళిందీ లేదు. ఓడిపోతే ఉక్రోషానికి కొదవేం లేదు, డిక్టేషను మార్కు తగ్గినా, ఎలక్యూషనులో మెట్టుదిగినా, రికార్డుబుక్కులో బొమ్మెయ్యమన్నప్పుడు అన్నయ్య బెట్టుచేసినా తన్నుకొచ్చే కన్నీరు. అమ్మ నా ప్రైవేటు టీచరు. కుదురు అబ్బని నాకు తగిలే నెత్తురుదెబ్బలకు డైలీ ఫస్ట్ ఎయిడ్ డాక్టరు. ‘అపాఇజ్’ లా మిగిలిపోవడమో, ‘తునక్ మిజాజ్’ లా ఊగిపోవడమో కూడదనే చెప్పేది సుద్దులు, గాయాలకి కట్లుకడుతూ. వంటపట్టించుకునే వయసు వచ్చేటప్పటికి చాలానే తగిలాయి.

లడ్డూపాపా! పడ్డవాణ్ని కొట్టి ఏడ్చే అమ్మలే లోకమంతా. గారం కొంత చెడగొట్టింది. ఎదిగి పోగొట్టుకున్న సున్నితత్వం కొంత, మాట మెత్తదనం మారలేదుగానీ, మొండితనం మిగిలేఉంది కావాల్సినంత.

జీవితం పరీక్ష ఓ కవ్వింత, గెలవాలని నీ కోసం నా ప్రయాస. పట్టు చిక్కుతుందన్న ఆశ రవ్వంత. చూసే కళ్ళకి ఉప్పూ-నిప్పూ కాపురం వింత.

....గుర్తుకొస్తున్నాయి

అమ్మ నాకు కావలసినంత స్వేచ్ఛనిచ్చింది, చుట్టూ క్రమశిక్షణ అనే పెద్ద పంజరాన్ని నిర్మించింది. ప్రపంచం దిష్టి తగలకుండా పెంచింది. నేను ఆమె జీవనానుభవసారం. విన్నకథలు, చదివినపుస్తకాలు ఊహాలోకాల్లో విహరింపజేశాయి. చందమామ, బాలమిత్ర, బుజ్జాయిలు నేస్తాలు. ఆపై ఇతిహాసాలు, ఎన్టీవోడి పౌరాణిక సినిమాలూ. ఐదోక్లాసు ఐభీమవరంలో చదువుకుంటున్నప్పుడు సైకిలు తొక్కుతూ శివాలయం లైబ్రరీకి వెళ్ళబోయి కనుమూరి బాపిరాజు గారి కారుకు అడ్డంగా పడ్డానట. మీసాలాయనేమో మోకాళ్లు కొట్టుకుపోయిన నన్ను చేతులమీద ఎత్తుకుని తెచ్చి అప్పగించారట. దెబ్బలు మానేవరకు  పుస్తకాలు ఇంటికి తెచ్చిచ్చే ఏర్పాటు చేశారు. వాటితో జీవితం కొత్తగామొదలు. ఇతిహాసాల్ని చదివాను, కావ్యాల్లో విహరించాను, భక్తిలో ఓలలాడాను, పదకొండేళ్ళ వయసప్పుడు దేవుళ్లతో వాదులాడాను, ధిక్కరించాను. ఆనాడు నత్కీరుణ్నీ, నిగమ శర్మనూ నేనే. గోపన్ననూ, గజేంద్రుణ్నీ నేనే. కెనెత్ ఆండర్సన్ వేటడైరీ- శివానిపల్లి నల్లచిరుత, భారతదేశపుటడవుల్లో ఇతర సాహసాలు. ఒకవైపు పులిపిల్లలతో ఆడుకున్న బాలభరతుడి కావ్యసారం, మరోవైపు మనుషుల్ని తినే మృగాలభరతం. పచ్చిపాలలో కోడిగుడ్డు కలుపుకుని కథల్ని తాగిన రోజులు... మర్చిపోలేనివి.

నీకొంగుకు నన్ను కట్టుకున్నాక నామానాన నేను కొట్టుకు పోకుండా ఒడిసిపట్టుకున్నావు. నీ అవసరాలకు నా స్వేచ్ఛని ముడిపెట్టి గంపకింద కోడిలా దాచిపెట్టావు. నీకు తెలియకుండానే రాసే అలవాటును రాజిల్లేట్టు చేశావు. కృతజ్ఞత ఎలా తీర్చుకోను!

..... గుర్తుకొస్తున్నాయి.

అమ్మ తాను చదువుకుంటూ మాకు చదువు చెప్పేది. రాష్ట్రభాషాప్రవీణ్ పూర్తిచేసింది. నేను హైస్కూలుకి వచ్చాక నాతో పరీక్షలు కట్టించడం సమాంతరంగా మొదలైంది. హిందీసాహిత్యం చదవాల్సిన అవసరం; అప్పుడే క్రికెట్ చూడడమూ-ఆడడమూ. సర్కారుబడుల్లో తెలుగుమీడియం చదువు, ఆటలతో రోజులు దొర్లిపోవడం. పెదనాన్నగారు క్లాసుటీచర్. పెద్దమ్మ సంరక్షణలో పదో క్లాసు చదివడం, చిన్నాన్నగారు పనిచేసే కాలేజీలో పీజీ చెయ్యడం ఇవన్నీ తీపిగుర్తులు, ఇంటర్ రెసిడెన్షియల్ జీవితం రుచిలేని చప్పరింత. డిగ్రీ చదువు నల్లేరుపైనడక.. అప్పట్లో నాట్యప్రదర్శనలు నా తప్పటడుగులు. డిగ్రీలో శ్రీకాంత్ అడ్డాల సావాసం ఓ వెచ్చని తలంపు. కొప్పర్తి మాష్టారి పరిచయం మేలుమలుపు. తాడేపల్లి వెంకన్న గారు నేర్పిన డ్రాయింగు మెళకువలు.. నా గ్రాఫిక్స్ కోర్సుకి ముడిసరుకు. ఏదిచేతికి అందితే అది చదివేసేవాణ్ని. లోనికి లాగేసేవాడ్ని. ఉద్వేగాల్ని పంచేవి.. సహవాసి రక్తాశ్రువులు, బొమ్మదేవర నాగకుమారి నవల ‘పయనమయే ప్రియతమా’. యండమూరి అప్పుడు ఓ పజిల్, షాడో మధుబాబుకి ఓ విజిల్, మల్లిక్ నవ్వితే నవ్ రత్నాల చక్కిలిగింత. పుస్తకాలను చదువుతూ. బొమ్మలు వేస్తూ సాగిన రోజులు నా శారదరాత్రులు. పుస్తకాలు నాకు ప్రేమను పంచాయి. మనుషుల పట్ల గౌరవాన్ని పెంచాయి. పుస్తకం తీస్తేనే నిద్రొచ్చేస్తుంది నీకు.. నాకైతే ఎంత చదివినా తనివితీరని పుస్తకంలా దొరికావు.


నేను గీయని బొమ్మవు నువ్వు. తరిచేకొద్దీ కొత్తగా అనిపించే మస్తకం నువ్వే. చూసే కొద్దీ నచ్చే సినిమా మనదే.  నువ్వంటే అంతిష్టం నాకు!

ఇంతకీ ఏమిటంటాను!

సాహిత్యం సంస్కారాన్ని నేర్పుతుంది. అదెలానో అనుకునే అమాయకత్వం మీ ఇంటిల్లిపాది. ఎలాపెంచాలో తెలియక భవిష్యత్తు తలుపులు మూసేసింది ముందుతరం. జీవితమంటే షాపింగ్ సంస్కృతి కాదని, డాబుగా కనబడడం కాదని, ఎవరి కాళ్ళమీద వాళ్లు నిలబడడమనీ. ఒద్దికగా సర్దుకోవడం అనీ.. చెప్పినా వినిపించుకోవు, చనువు ఎంత పనిచేస్తుందో చూశావా! అందుకే నా మాటా-మనసూ ఇలా పరుస్తున్నా. యుగధర్మం ఒకటుంటుంది. చీకటిపడ్డవేళ  యుద్ధనీతి పాటించి పోరునిల్పి, మరునాడు రమ్మని అలసిన రావణుడిని పంపేశాడట పురుషోత్తముడు రాముడు. యుగం మార్పు- రథమెక్కితే నిలువరించలేమని రాధేయుణ్ని నిరాయుధుడై ఉండగా అదాటున వధించమన్నాడట కృష్ణుడు. తనను వదిలివెళ్లిన లక్ష్మిని వెతుక్కుంటూ వచ్చి, అసలు పని మరచినట్టు మరో తోడును కోరుకున్నాడు కలియుగదేవుడు. ఆపై నిత్యకళ్యాణం చేసుకుంటున్నాడు. పోరాడి సీతను తిరిగి పొందిన కాలం నుంచి, బృందావనాన ఆటలాడి, నారాయణవనాన దారి మరచిన కాలం వరకూ. విధి దైవంతో ఏపనిని ఎలా ఎందుకు చేయించిందో! పెరుమాళ్ళ గుట్టు నాకెందుకు అంటావా! నా సీతవీ, రాధవీ, లక్ష్మివీ నువ్వే మరి. నువ్వూ నేనూ ఈ యుగానికి చెందినవాళ్ళం మాత్రమేనా! ఏ తపఃఫలానివో నువ్వు నాకు!!

మనకథ బ్లాక్ బస్టర్ కానీ, కాకపోనీ... సీరియస్ కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్. కొన్ని సీన్లు తొలగిస్తే.. క్లాసికల్ రొమాంటిక్ మెలోడ్రామా. నాకు నువ్వు-నీకు నేను సీక్వెల్ రెండు. ఒకరికొకరం నువ్వూనేనూ.

సాహిత్య సంస్కారం

మీ కుటుంబనేపథ్యం సినిమారంగమని మీ పరిభాష మాట్లాడుతున్నా; ఈనాటి సినిమా ప్రేమలపై విముఖత నాకు. పద్మాకుమారి అక్క ‘ఏకతారా’ వార్షికోత్సవ సభకు నన్ను అధ్యక్షుణ్ని చేసిన సందర్భం. ఆ సభ సాక్షిగా ఇదే చెప్పాను.-గాలి, నేల, వెలుగు, చినుకులతో పోల్చుకుని తాను చితిలోకైనా నడిచొస్తానని గొప్పగాచెప్పుకున్న మగధీరుడు ఈ కాలపు ప్రేమలకి నిదర్శనం కాదు, ఆదర్శం కారాదు. రోమాంచితం అవ్వడం స్వీయానుభూతికి కొలమానం కాదు, మూత్రశాలకు వెళ్ళి బరువు దించుకున్నప్పుడూ ఒళ్లు నిక్కబొడుచు కుంటుంది, భయపడ్డప్పుడూ, ఆసందర్భాలకి ఉదాత్తత ఏముంటుంది! హోవర్డుఫాస్ట్’ రచన స్పార్టకస్, ఇక అదే చివరిదేమో అనుకునే ఏకాంత సాంగత్యాన- తనను విడచి బ్రతకలేనంటూ బెంగటిల్లుతున్న ప్రేయసి వరీనియా మాటకు స్పార్టా- “నన్ను ప్రేమించినట్లైతే, నేను మరణించినా నువ్వు జీవించే ఉండాలి. జీవితం లేకపోతే మరేమీ ఉండదు. ఇరుజీవితాల్నీ కలసి జీవించడం నీ బాధ్యత.” అంటాడు. ఒండొరులు ప్రేమపంచుకునే కార్యాలన్నీ భయాన్ని జయించినందునే సాకారమౌతాయి. ప్రేమంటే భయాన్ని జయించడమే. ప్యార్ కియాతో డర్నాక్యా- కన్నా గొప్ప జీవితసారం ఉందంటావా!

జీవనసహచరితో ప్రేమ రతిక్రియ కాదు; నిత్య రత్యానంతర అనుభూతి, ఆనందవిభూతి. ఈమాట పంచుకోవడానికి, పుష్కరకాలాన ఏకాంతం దొరికేనా మనిద్దరికీ! భయాల్ని నువు చుట్టుకున్న ఈవేళ కూడా నీతోడు నేనున్నాను. మన జీవితాల్లో ఇంకా తెలవారలేదు. ఈ చీకటి ఏనాటికైనా వీడిపోయేను.

రహస్య సమాచారం

నీపై నాప్రేమ, కలసి జీవించాలన్న సంకల్పం, జీవితాన్ని గొప్ప ఆకర్షణవైపు పారించింది. నిన్ను చేరడానికి వీటిని మించిన తరంగశక్తి దొరకలేదు. ప్రేమనుమించిన అనుభూతి భావన నేనెన్నడూ పొందలేదు. పాటలకు లయబద్దంగా అడుగులు కదుపుతున్నప్పుడు నువ్వు ఎంత అందంగా ఉంటావో, వంట చేస్తున్నప్పుడూ అంతే ఆనందంగా కనిపిస్తావు. సినిమాతెరమీద కనిపించే సన్నివేశాల్ని భలే లోనికి తీసుకుంటావు. నీపక్కన కూర్చున్నప్పుడు సినిమాను, నిన్నూ.. మార్చి మార్చి చూస్తుంటానా! నీ వదనపు రంగులు వెండితెర కన్నా గొప్పగా అనిపించవు. నన్ను గమనించి నవ్వేస్తావు; ఓ నీ పిడికిలి నాపై విసిరేసి చూపులు అటు మరలేలా చూస్తావు. సినిమా చూస్తున్న ఆ కాసేపూ నీ కేరింతలూ-తుళ్ళిపడటాలూ, ఒక్కోసారి కన్నీరై ఒలికిపోతావు, కదిలించేస్తావు. కనులముందర కదిలే బొమ్మలకథ నిజం కాదన్న విషయాన్ని తొలగించుకుని లీనమైపోతావు, విశ్మయాన్ని కలిగిస్తావు. నేను చూసే ఘట్టమేదైనా ప్రతి సన్నివేశమూ నీదే! నా ఎదలో ఆడే బొమ్మల కథ నీదే. నీ నయగారం మనసుపై ముద్రగా మిగిలిపోయాక ఏరాగం ఆలపించాలో తెలియక మౌనరాగమౌతున్నాను.


 నా పదేళ్ళప్పుడు ‘అన్వేషణ’ సినిమా ఇంత విహ్వలతకు లోను చేసింది. సంగీతం ప్రాణాల్ని పిండేసింది. వేదనలో ప్రాణేశ్వరిని చూడడం సినిమా చూసినంత తేలికకాదు. నా ఎదలయ నువ్వైనప్పుడు, నీ మనోవయస్సు పదేళ్లున్నప్పుడు, నీ నవ్వులో నేలేనప్పుడు నా జీవన తంత్రి తెగిన చప్పుడు.

చల్తే..చల్తే..

ఈ నగరంలానే నీలో ఎన్నో మార్పులు. సిటీ బస్సులు ఎక్కేవాళ్ళం, హాల్సుకీ, మాల్సుకీ, హొటేల్సుకీ అటోల్లోనే. లక్కీబాబుని జలకాలు ఆడించాలని లుంబిని పార్కుకీ! శనివారాలు అక్కడేకదా నా రాకకోసం తచ్చాడేవాళ్లు, ఆ బాంబుపేలుళ్ల దెబ్బ ఏడాదికాలం మీ కాళ్ళను కట్టేయలేదూ! మనమిద్దరమే జంటగా తిరిగే రోజుల్లో ఎల్లారెడ్డిగూడా హైదరాబాద్ రెస్టారెంట్, క్రిష్ణకాంత్ పార్కు కబుర్లు... ఆ జ్ఞాపకాలే వేరు. బడాఖానా అయ్యాక మీఠాపాన్ జతగా స్వాదనకి సిగరెట్ తాగొచ్చని సూచించేదానివి. ఇప్పుడు ఎక్కడో రోడ్ మీద ఎవరో పొగతాగుతుంటే మొదటి అంతస్తు బాల్కనీలో నీకు వాసనొచ్చి, నీతో తిట్టిస్తుంది. ఐమాక్స్ సినిమా, స్వాగత్ బఫె అదీ నెలకొక్క తూరి. నాకు తెలుసు, సెలవొచ్చినా, సండేవచ్చినా నీ మనసు సినిమాకి తపిస్తుందని, వెళ్తున్నామంటే చాలు ఎక్కడలేని ఆ ఉత్సాహం, కేరింతలలూ కూనిరాగాలను దాటి మరో నిన్ను చూపిస్తుంది టీవీలో పాట వింటూ నీ చిందులాటలు.  ఫుడ్ కోర్ట్ లో గంటలకొద్దీ గడపాలని, సినిమావిరామంలో కోక్ తాగాలని. నీ ఒళ్లు చూశావా కోవాబిళ్ళలా  గుల్లిరిగి పోతుంది, స్నానమయ్యాక దణ్ణం పెట్టుకుంటూ.. వినాయకుడి వద్ద గుంజీలు తీసేదానివి, ఇప్పుడు కూర్చోవడమే ఉక్కిష్టమై పూజ మానేశావు. బొండుమల్లీ! నువ్వాడితే చూడ,ఈ కళ్ళు చాలవే. నా గుండెచూడు, నీకై ఎలా కొట్టుకుంటుందో!

ఉదయాన్నే వాకింగ్ చెయ్యమంటే వరండాలో తిరుగుతున్నా కదా అంటావ్! నువ్వు చల్లగా ఉండాలనే. నా మాటెపుడు వింటావు!

వద్దంటే వినవే!

నీ మనస్తత్వం పట్టుబడనినాడు, తలపోసుకున్న వాస్తవం ఇది. ఇంటికొస్తానోలేదో ఆపాదమస్తకం నీచూపుల అవలోకనాలింగనాలు. ఖాళీచేతుల్ని తడిమే నీకళ్లు దిగులుగా వాలిపోతాయి. తేవడం మరచిన మిఠాయి నా నాలికని అప్పుడు మండిస్తుంది. అంకురాన్ని మొలకెత్తించిన దర్పం నీది. క్షమయా ధరిత్రీ అని ఆ నిముషం మరుస్తావు. ప్రేమని పిల్లలపాలు చేసిన మమకారం ఏకపక్ష నిర్ణయంతో ఇంటి సామరస్యాన్ని ఏమారుస్తుంది. మూడుగుళ్ళాటలో ఇల్లు న్యాయస్థానం అవ్వడం నే దోషినవ్వడం రూఢీ అవుతుంది. శిక్షకు తలవంచి.. చూపులంటిన కాళ్ళూ నాలిక కరచుకొన్న చెప్పులు గుమ్మం పహారాలో బజారున పడతాయి. డబ్బుల తోలుతిత్తి నాకన్నా నయం; సన్నబడడానికి కష్టంగానైనా ఆరాటపడుతుంది. తేవాల్సినవి అన్నీ తెచ్చి ఇచ్చాక నీ చేయి అందించే కాఫీ కప్పు కోసం నాకు ఎడతెగని ఆత్రం! ఆ ఆనందం నీకెన్ని సింహావలోకనాల కైనా అంతుచిక్కదు. పశుప్రవృత్తి నుంచి ఇంకా బయటపడని మగాడు ప్రేమను పండించుకోవడం ముందు అనాదిగా విధివంచితుడే. ఎందుకంటే ఏం చెప్పను!! ప్రేమ నిత్యచైతన్యశీలి, ఎన్నిరంగులైనా మార్చగలదు. మగాడి కామమే జీవితసత్యం. ఒక్క ఒప్పందానికి జీవితాన్ని తాకట్టుపెట్టి ఎన్ని అవసరాలనైనా తీర్చగలదు.

ఈ మాటలతో నాకు పేచీ లేదు గానీ,  కామాన్ని కామనగా చదువుకోమని కోరిక. ఇప్పుడు కాఫీ అవసరం కూడా నాకు గుర్తురాదు. అయినా ఆశించడం మానలేను. ఎందుకంటే ఏమంటాను!


నిను చేరాలనే..

గాలిపలకరింతలకు అనిపిస్తుంటుంది ఒంటరితనమే నా చిరునామా కదా అని. ఈనేలపై అప్పుటి నా అడుగుల తడబాటు..  తలపుల్లో నిలిచిఉన్నది నీవైనప్పుడు ఎడబాటుకు అర్థమేముంది! అడుగుఅడుగులో మెదిలే సవ్వడై ఎద ప్రతిధ్వనిస్తుంది. పగలైనా రేయైనా నీ ఊహే నన్ను నాకు వివరించేది, నను నిలువరించి వరించేది. యుగాల విరామంలో క్షణాలు గడుస్తున్నాయి. అంతరంగాల్లో మనోభావాలే జ్ఞాపకాల కూనిరాగాలై నిలుస్తున్నాయి. ఆకాశం చలికాగుతుంది నాతో, చెంతనుంటే, ఊపిరిలో వెచ్చదనానికి మంచులా కరుగుతావన్న ఆశ. నిలకడ వదిలిన నీ మునివేళ్ళను మునిమాపు వేళల్లో సందెపొద్దు సూరీడు ముద్దాడి వెళ్లేలోగా కలవిడిచి అనుకుంటున్నా. ఇలనే నిను చేరాలంతే.. శీతలపవనాలు ప్రేరేపించే నాదాలై, పక్షుల కువకువలు స్వరజతులై ఉత్తేజితం చేసేవేళ నిశీథిని వీధుల విషాద ఛాయల్లో నువ్వు విశ్రమించవని, అంబరవీధుల పహారామాని నీకై నిలవనా! మేఘాల వీవెనలతో చెమర్చిన మోహనాన్నే తడమనా!! మంచుబిందువులు నీపెదవిపై వాలేలోగా నిను చేరాలంతే. నిత్యం నిను నా జీవితంలా శ్వాసించనీ. 


నీ ఊహల్లో నేను నేనుగా ఉండాలనే ఆవిర్లు విరజిమ్మే ఈ గుండె ఆగేలోగా నిను తిరిగి చేరాలనే. వెన్నెలకిరణాల దాడిలో నే ఓడేలోగా.. మళ్ళా నీతో ఆడి పాడాలని దఫదఫాలుగా కోరుకుంటున్నా, కనపడనివాణ్ని వేడుకుంటున్నా. ఇవన్నీ నా కలవరింతలేనా!!

మాటవినని మనసా!

నువ్వు అర్థంకాని ఆరోజుల్లో నీ అలకలు నన్ను నీళ్ళను చేసి కుదిపేసేవి. నా రాతల్ని తప్పు పట్టే దానివి. నా సృజన నీ స్థానాన్ని ఎక్కడ ఆక్రమిస్తుందో అన్న భ్రాంతి. జీవితంపట్ల నీ భయాలు నేనెరుగుదును. నిన్ను వదిలి రోజూ కొంత సమయం బయట ఉండే అవసరాన నా దృష్టి ఎక్కడ మరలుతుందో అన్న నీ దిగులు.


అప్పటి మన ఘర్షణలే గాయాలు. వేదనలే గేయాలు. గాయాలు నాకు గేయాలై వినిపిస్తున్నప్పుడు, గేయాలు గాయాలై సలిపేస్తున్నప్పుడు, గాయం నేనే అయినప్పుడు.. మనిద్దరిలో ఎవరు గాయపడ్డట్టూ!! కోల్పోయేది స్నేహసౌహార్దమో కుటుంబక్షేమమో, నా ముగింపు పతాక సన్నివేశమైన ప్రజావినోదమో, పేలవమైన స్వీయవిషాదమో! నా కళ్ళకు నీకలల భయమెందుకో! ఎందుకిలా నమ్మకాల తరాజు చీకటితో మొగ్గుతుంది! ఎందుకో గడిచిన రోజుల జీవితం ఏకాంతపుటాలోచనలను కుదుపుతుంది. వాలినపొద్దు మరునాటికి వెన్ను పొడుస్తుంది. ఏ విషాదాలు మెదులుతున్నాయి తలపుల్లో! నాకెందుకు నేనంటే భయం? పలుకని నిజాలు నను బేరీజు వేస్తున్నాయనా! నేనుండని రేపటి వెలుగుల గుట్టు ఈరోజే విప్పిపోనీ.

అలకల రాణీ! నువ్వొప్పుకున్న నెప్పేగా మన అనుబంధం, ఏళ్లు గడిచాయి; మళ్ళీ నీతో మనసువిప్పి ఇలా చెప్పుకోనీ. నిన్ను ఎప్పటికీ ప్రేమించిన మాటొకటి ఇప్పుడే చెప్పుకోనీ. నీతోడుగ నన్ను కనిపెట్టుకుని కలకాలం ఉండిపోనీ.


మాటలు లేని కాలాన..

ఏకారణంగానైనా ఆలస్యంగా ఇంటికొస్తే పలకరించేదానివి కావు, అలకల్లో గంటలు గడిచేవి, గుండెలను కరిగించి పోసిన గంట కాలమై కాలుస్తుందో.. రవమై మోగుతుందో! నీ మేనిగంధాల పలకరింతలు నను దాటివెళ్ళిన జాడలను మరుగుపరచలేక నిలువనీయనివ్వవు. నీ ఊహే లోపలా-బయటా మంచుని కరిగిస్తుందే! నిట్టూర్పుల్లో మన ప్రేమ వెచ్చదనం మంచుబిందువులను ఆవిరి చేసినా గతించడాన్ని మాపలేని కాలాన్నడుగు నా మనసేంటో. ఆనాటి మన సంగమాన్ని నిరంతరతను నింపుకున్న మన స్నేహాన్ని అడుగు. నిన్ను-నన్నులను దాటిన మన భావననడుగు. వేర్లు వేరైనా ఒకటైన మన జీవితాలని అడుగు. మనంలేని నాడూ ఒకరికొకరిని చూపించడం నేర్పమన్నావా కళ్ళకి. మన అందాలు నింపుకున్న లోకంలో అనవరతం ప్రేమై శ్వాసించనీ హృదయాన్ని. చెవులకు నిశ్శబ్దనిలయాల్లో పారవశ్య పదనిసనలను వినిపించనీ. సాయాన్ని స్పృశించనీ చేతులను. ప్రార్థనలో పెదవి పలకనప్పుడూ నా గళాన్ని విను. కన్నీళ్ళను నీపెదవులతో చెరిపెయ్యరాదూ.. నా ప్రమేయంలేకుండా రాలుతున్నాయి పూలై. పొదవిపట్టుకో నన్ను ఊహవై నీకు దగ్గరగా ఉన్నప్పుడూ. నన్ను చూస్తే ఈ ఒంటరితనానికి జాలేయదా!

నీకేం కావాలన్నా గోముగా అడిగి తెప్పించుకున్నాక, థాంక్స్ చెప్పి వదిలేస్తావా! అన్నమైనా వడ్డించరాదూ! దుప్పటి చుట్టబెట్టుకు పడుకుంటావెందుకు! నాకై ఎదురు చూసే ఆ  క్షణాలేమయ్యాయి!

 

పదాల తోటదడి

ఇలా ఎందుకు రాసుకోవడం అని అడిగితే ఏం చెప్పను! పదాల తోట దడి కొక్కాన్ని తీస్తున్నా, మూస్తున్నా. పూలతావి తాకిన తుమ్మెద ఎదచేసే ఝంకారం నీ నామ జపమైన వేళ. చెదిరే తూనీగల్లా నా భవభావాలు గడికోమాటు బరిదాటుతున్నా పదాల తోటదడి కొక్కాన్ని తీస్తున్నా మూస్తున్నా. నీలో నన్ను వెతికి, వెతికి.. వగచి తలవంచి నిలువలేక ఈ భావావేశపు గింగిరులు. జారిపడ్డ ఆలోచనల కంపన కంటి కొలనింట. కదిలేపిట్టలా కనుచూపు మింటివెంట.. అందుకే పదాల తోట దడి కొక్కాన్ని తీస్తున్నా మూస్తున్నా. ఎండిన ఆకులా నా మాటరాలి తేలి నిన్ను చేర ముద్దాడ.. పదాల తోట దడి కొక్కాన్ని తీస్తున్నా మూస్తున్నా. మాట తేరుపై మనసు చేసే సంధ్యా రాగం మనప్రణయం. అందుకే పదాల తోట దడి కొక్కాన్ని తీస్తున్నా మూస్తున్నా. ఉక్కిరిబిక్కిరిలో కదలాడే కలువనీడలా వణికిస్తున్న కన్నీటి పొర. తడుస్తున్న కనుపాపలను పొడుస్తున్న వెన్నెల కిరణాల తుంపర. మనసుతో వేడుతున్నా..

నీరాక చూడని కాలాన్ని నీమాట వినిపించని రాగాన్ని యుగాల ఎడబాటుని నన్నొదిలి వెళ్ళమని. పెదాల పరదాల తెరదీసి పలవరిస్తున్నా పదాల తోటదడి కొక్కాన్ని తీస్తున్నా, మూస్తున్నా.. వెనక్కివచ్చి నా కళ్ళన వేలాడే నీకోసం కన్నీరుగా మారి నిరీక్షిస్తున్నా. ఎంతకాలమో ఈ పరీక్ష అని వగచి ఉన్నా, నాతో కలిసే నీ గెలుపు చూడాలనే తపిస్తున్నా.


నిదురపో హాయిగా

నేనేం రాసినా నీకు ఎందుకు ఆసక్తి ఉండదో అని అనుకుంటూ ఉంటాను. ఏదో చెప్పాలని నేను, నీతీరున నీలో నువ్వూ.  నడుమ కాగితాలు చిరుగుతున్నాయి అక్షరాల బలం చాలక. కలంనొప్పులు పడుతుంది నన్ను ఈరీతిన కనలేక. పుట్టినప్పుడు లేని కలతను జీవితాంతం మొయ్యలేక అమాయకత్వాన్ని మిగుల్చుకోలేనితనం ఆపసోపాలు పడుతుంది. ఉన్న కొద్దిరోజుల్లో మంచినిపంచలేక ముసిరిన భావకాలుష్యం లోంచి మిగిలి ఉందనుకుంటున్న మానవత్వం బయటకు రాలేక మల్లగుల్లాలు పడుతుంది. చుట్టుముట్టిన చీకటిలోంచి, చేతికందనంత ఎత్తున వేలాడే నక్షత్రాల్లా మిణుకుమిణుకుమంటూ స్వచ్ఛత అరకొరగా అగుపడుతుంది. బురదలోనే కూరుకుని నుంచున్నా, నీ వదనోదయం కోసం మనసు మోరెత్తి కలువలా ఎడబాటు గాలులతో కలబడుతోంది.

ఏదో చెప్పాలని ఉన్నా, ఏముందిలే అనే నిర్వేదం, జీవితం అసారకాసారమైన నిజం, దిశమొలతో నలుగురిముందు నన్ను నిలబెడుతుంది. ఎవరన్నా నిశ్శబ్దాన్ని పసిగడతారేమోనని కొట్టుకుంటున్న గుండె ఘడియ ఘడియకు తడబడుతోంది. నేనేమి చెబుతాను! నువ్వేమి వింటావు!!

లడ్డూ పాపా! కేరింతల పసిపాప నవ్వై నువ్వున్నప్పుడు నిద్దురపో! హాయిగా. రేపన్నది మనకు మిగిలుండాలి. ఈ మాట నిద్రలోను నాకు వినపడుతూనే ఉంటుంది.

 

వలపుల కిసమసలు

పరిపరితపనల యవ్వనకాలాన అగ్నిపరీక్షలా వచ్చావు. ప్రేమంటే పరీక్షని, అది దాటడం తేలికకాదని తెలియని వాణ్నే. కాలం గడిచే కొద్దీ అనుభవం అయ్యింది.. ప్రేమంటే రుచి తెలిసిన కమ్మని కూర, అమ్మ పట్టిన ఆవకాయ పచ్చడి, జీవన రసధుని. మధుర భావనా లాహిరి. జీవితం ఆ ప్రేమ కోరే మనసు చేసే సాగర ఘోష. ఆంక్షలపై సంధ్యాకిరణాలు ప్రతిఫలించినా, కాంక్షలపై వెన్నెలగాలులు ప్రసరిస్తున్నా, కాలం కొత్తగాయాల్ని- గేయాల్నీ రచిస్తున్నా, మనమెప్పటికీ విడిపోము. నాలో నిన్ను నింపుకుని నేనూ, నువ్వూ ఎప్పటికప్పుడు.. విడివిడిగా కనిపిస్తూ ఉంటాము. నా ఎద మలుపుల్లో నీ గలగలల హోరు వినిపిస్తూనే ఉంటుంది. నీ రూపం నిండిన కళ్ళకు లోకం కనపడదు. ఎందుకింత ఆలస్యమన్న మన తొలి పరిచయానికి సమాధానం దొరకనేలేదు. 

నా రోజా పువ్వా! ఇంకేమి చెయ్యగలను నీకోసం. నువ్వు కోరినట్టే ఉండాలని గుండె గువ్వ.. నీ ముల్లుకే గుచ్చుకుని వేలాడుతోంది చూడు. నెత్తురు పారితేనేమిలే. నా కన్నీరుని చులకన చేయకు. చిలికిన గుండెలో చిందేదేదైనా, చివరకు మిగిలేదేదో నీకు మాత్రం తెలియదా. ఎన్నిసార్లు పలికినా అది నిన్నేకదా! ఇప్పుడీ నిశీధి వీధిన ఒంటరిగా నిలబెట్టి పసిపాపలా తుంటరిగా నవ్వుతున్నావే! నా తపన నీ తలపులను తాకలేదా!


నిలబడ్డ నిజమే మన ప్రేమ కధ. కొద్దిగా నా వేదనని ఆలకించు. నీకై ఆగిన యానాన్ని కలిసి మళ్లీ కొనసాగించు.


అదేనీవు అదేనేను, అదేమాట.. పదే పదే!

ఎందుకంటావు నీకీ సతమతమని నాతో, ఎక్కడన్నా రెండు నిముషాలు అదనంగా ఉన్నట్టు అనిపిస్తే అనుకుంటాను కదా!, జంటపక్షి గూట్లో ఎదురుచూస్తుంటుందని. తలచుకోకుంటే స్తిమితంగా ఉండలేను. మనిషి కన్నా ముందు మనసక్కడ వాలిపోతుంది. ఎందుకన్నా! అంత బెదురు!! ఇబ్బందైతే వదినని వదిలేయరాదూ, ఓ అనుజుడి కాందిశీకత్వపు పైత్యం. మీరింకా కలిసే ఉన్నారా! రాశిచక్రం చూసిన ఓ జ్యోతిశ్శాస్త్ర ప్రవర్తకుని విస్మయం. తరచిచూస్తే ఇవన్నీ అల్పజ్ఞతలు. విజ్ఞత ఏదైనా ఉందీ అంటే అది మనం ఒకే నాణేనికి ఇరు తట్టులం. జిబ్రాన్ చెప్పినట్టే మనం కలిసి పుట్టాం. ఊసులు కలబోసుకునే మళ్ళా ఈ నేలమీద కలుసుకున్నాం. నువ్వు మగబిడ్డ అయిఉంటే చెయ్యాల్సిన మీ తండ్రి అంతిమ సంస్కారాలు విధి నాతో జరిపించడం దీనికి తార్కాణం. భద్ర జీవిత శకలాల్ని కాలదన్నిన తర పరంపర తామర ఐనా తంపరలోనున్నా పురస్సరుడిగా కలశాలెత్తడం నా విపశ్యన. అందుకే నేనెక్కడున్నా చీకటి పడ్డాక, నాగుండె నీకై కొట్టుకునేది. నీ గట్టుకే నేచేరి నన్ను గుట్టుగా చిక్కబెట్టుకునేది.

నువ్వెంతలా ఆకట్టుకోకపోతే నే ఇట్లా అయిపోయానని ఊరు ఊరికే అనుకుంటుందా! నీ అవసరాల నడుమే నా మనుగడ. ఏనాడైనా నువ్వు నా గడపలో లేనప్పుడు నే ఒక్కడినే ధీమాగా గడపగలిగానా? స్తంభించిన కాలం ఇక నా ఎదపై నీ చిత్తరువై. నేను తొలకరికై వేచిచూసే మొలకనై నీకై.


నువు లేని ఇంట.. నా అస్తిత్వం ఎక్కడ!

అన్నిరోజులూ ఒకేలా మొదలౌతాయి, అప్పుడు కూడా, నా శరీరాన్ని తప్పించి వేరొక ప్రాణేదైనా కనిపిస్తుందేమోనని తేరిపారచూస్తాను. అద్దంలాంటి ఇంటిని చిందరవందర చేయలేని జేబుసామాన్లు విడిచిన బట్టలు పక్కకి లాగితే ఆక్రమించుకున్నంత జాగాకాదు, ఈఏకాంతం.. నా జీవితాన. చీమ కూడా కానరాని అంతస్తుల అద్దెఇంట నా అస్తిత్వం అప్పుడో వస్తువేగా!. మౌనం మూర్తీభవించిన పనిపిల్ల వచ్చినట్టు తలుపుచప్పుడో.. వెళ్ళినప్పటి సూచనో నన్ను అప్రమత్తం చేసే రెండు క్షణాలు ప్రాణమున్న జీవాన్నని గుర్తుచేస్తాయి. ఇక రోజంతా నాదికాదు. ఇక ఇల్లుచేరే వరకూ... నేను నాలో ఉండను. నేనే నావనైనట్టు జనసంద్రాన్ని చీల్చుకుంటూ కనిపించని గమ్యం వైపు సాగిపోతాను. బంధాలు తోడున్నప్పటి ఆకతాయి మనసుకు, ఆనాటి ఉడికించే మాటలకు అసలు అర్థాలు ఇప్పుడే తేటతెల్లమవుతాయి. ఎటుచూసినా ఒక తెలియనితనం, నాదికాని పరధ్యానంలో లోకుల లోకం. 

అప్పుడే తెలుసుకుంటాను నాలోకం వేరొకచోట ఉన్నదని. నన్నే కలవరిస్తున్న నేస్తాలకు నేనుఅందను. మాటల్లో ఒలికేవి, పనుల్లో పలికేవి ఎన్నున్నా నీ ధ్యానంలో నిలిచేవి జన్మబంధాల అనుభుతులేనని.. నిమిషాలు యుగాలుగా మారే రోజుల్లో నేనో తాపసిని. తపస్సు ఏమిటో  ఎరుగవా!! ఏతోడు కావాలి నాకు నువ్వు తప్ప! స్నేహపు పలకరింపుల నడుమ నీ రాక కై ఎదురుచూస్తూ ఉండడం తప్ప!!


నిన్ను చూడకుంటే.. నాకు బెంగ

నలుడి నుంచి రాముడి వరకూ సహచరి ఎడబాటుని తట్టుకున్నవారే. వారంతటవారే వదిలిపెట్టినందున మాటపడ్డవారే. లోకం ఇప్పటికీ మగవార్ని మహారాజుల్ని చేసి తిట్టుకుంటూనే ఉంటుంది. కలి ప్రభావాన ఒకరు, కాలం కలసిరాక మరొకరు విధికి వశమయ్యారు, వారి కష్టాలకు నేను తోడు! నా వేలికి దురదెక్కి నీ కళ్ళకింద పరచుకున్న నల్లమబ్బులని తుంటరిగా ఓ చీకటి దినాన ఎత్తిచూపితే, నిను పోల్చి పలుచన చేసినట్టు నాపై నీ కుంభవృష్టి. అక్కవానకు తోడు చెల్లిగాలి. చిలికిన గాలివాన అబద్దాన్ని నిజమని నమ్మిస్తూ చక్రవాతమై కూర్చుంది. ఊహనైనా చేయని తప్పుకు తలవంచలేక నేను, బాధని తీరం దాటించడానికి పూనుకుంటే కలసిరాని వాతావరణం, గొడవ నన్ను గడపదాటించింది. అల్పపీడనదిశగా నా అజ్ఞాతవాసం. ఏ ఇబ్బందైనా ముగిసేదే! ఎడబాటు దాటాక, ఏమని ఆక్రోశించావు! ‘ఎవరోవచ్చి కలపాల్సిన అవసరం ఉందా నిన్నూ నన్నూ! కలసి జీవిద్దామని ఒట్టేసుకున్నప్పుడు వీళ్ళెవరు తోడున్నారు! నిలదీసి అడిగితే వెళ్ళిపోవటమేనా!’ చివరిప్రశ్నకి సమాధానం నీ విషణ్ణవదనాన్ని చూడలేకనే. నిన్నలా నిత్య శోకాగ్నిలో దగ్దం చేయలేకనే. కంటికింద నలుపెందుకంటెనో అని కొంటెగా అడిగినందునే ఇంత మంటపెట్టినావే! నువ్వు ఖండితవు కావని, విరహోత్కంఠితగా గడిపిన క్షణాలన్నీ మన్వంతరాలపాటు నే నీతోడు ఉండేందుకు చేసుకున్న వెసులుబాటు అని నీకు చెప్పాలని.


ఇంటిని వదిలివెళ్ళింది ఈ శరీరం మాత్రమేగా!! మనసెక్కడ దాచిపెట్టానో, నీకెలా తెలుపను!!

మనోవైకల్యానికి మూలకారణం

మంకుపట్టులన్నీ పెంపకం లోపాలని సరిపెట్టుకున్నా, ఇంట్రడక్షన్ టు సైకాలజీ ఏడో ఎడిషను చదవడం మొదలుపెట్టా. క్లిఫొర్డ్ టి మోర్గాన్, రిచర్డ్ ఎ కింగ్ ల వల్ల నాకు అవగాహన వచ్చినా, నీ ఆరోగ్యం చక్కబడేనా! టాబ్లెట్ మనసును దారిలోకి తెస్తుందని విశ్వసించలేను కానీ, అవసరానికి ఔషధం కన్నా దారిమళ్ళింపు కనపడలేదు. ‘ఆశ’ ని ఆశ్రయించాను. తిమ్మరాజు కథలో తోకపోయి కత్తి వచ్చె అన్నట్టు ఉన్నది తగ్గి అతిశుభ్రం వచ్చికూర్చుంది. నీకేమి అర్ధమైందో ఏమో, మాటతీరు మారి పసితనం హెచ్చింది. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, నీ పిల్లాణ్ని చెల్లినీ సాకుతూ నాతో సామీప్యత వద్దనుకున్న ధోరణే నలతకు మూలం అని. బలోపేతమైన నీ కాల్పనిక భావనల్ని తుంచివేయడానికి నాకు ముందుచూపు లేదు. ‘వేలికొసలు తాకనిదే వీణ పాట పాడేనా, చల్లగాలి తాకనిదే నల్లమబ్బు కురిసేనా’ అని కృష్ణశాస్త్రిలా అనుకోలేకపోయా, మంచిరోజులొస్తాయని ఎదురుచూస్తూ ఉండిపోయాను. అప్పుడప్పుడు నీకు అనిపించినట్టే నాకూ అనిపిస్తూ ఉంటుంది.. డబ్బు ఇబ్బడిముబ్బడిగా ఉంటే జీవితం ఈ తీరున ఉండేదా అని. అసలా ఆలోచనే రుగ్మతనీ మనసూ, ఏమిఇచ్చి ప్రసన్నతను కొనగలమని మెదడూ పోట్లాడుకుంటాయి. నీకివేమీ పట్టవు, తట్టుకోలేకున్నా నీ ఆలోచనల్ని నేను జోకొట్టలేను,

నిన్ను విసిగించనంతవరకూ నీకన్నా మంచిపిల్ల ఎక్కడన్నా ఉంటుందా! నువ్వు కడిగిన ముత్యమల్లే.. బాబుతో ఆడుకుంటూ పాడుకుంటూ.. నీ ఆలోచనల్లో నువ్వై ఈ లోకానికి ఏమీకాకుండా విడిగా ఉండిపోతూ...

నీకో మాట చెప్పాలి..

అల్లంత దూరాన నను చూస్తూ ఓ మాట చెప్పినా, పని అప్పజెప్పినా.. గట్టిగా హత్తుకుని చెప్పినట్టే.. ఆలకించడానికి నువ్వే నా నిండా నిండి ఉన్నప్పుడు నా బుర్రనెక్కడ ఖాళీ!! - నీమాట.. మొహంమొత్తిన దినమన్నదే లేదు. నాకేదీ గట్టిగా గుచ్చుకున్న గుర్తులేదు. నీ తలపు మరచిన క్షణమన్నది ఉన్నదో లేదో!! బంధం.. ఎంతపనిచేసిందో లాలిత్యమూ.. మాధుర్యమూ తగ్గిందని అబద్దాలు చెప్పను.. పాకం గట్టిపడిందంతే.. పంచదార చిలకల్లాంటి మాటలు కొరుకుడు పడడంలేదు. నాకే సొంతమైపోయిన నీ మనసు మాటల్లోంచి తొంగి చూడడం లేదు. రేపటిరోజుల ఆలోచనల్లో తప్ప పెళ్ళిబంధానికి-వర్తమానంతో సంబంధం లేదు. కాలంసానపై గంధపుచెక్క జీవితాలను అరగదీసుకుంటూ వెళ్ళదీస్తున్నాం. లోకానికి సువాసనలు వెదజల్లుతూ కరిగిపోతున్నాం. అరిగిపోయి ఒకరికొకరం దూరంగా జరిగిపోతున్నాం. ఇద్దరం పూర్ణంగా ఉండలేక విడివిడిగా ఒక్కటౌతున్నాం. సాన్నిహిత్యానికి దూరంగా కలిసి ఉంటున్నాం.

నువు ఎదురుగా లేనప్పుడు నీకోమాట చెప్పాలి.. నువ్వంటే బోలెడు ఇష్టమని.. నిన్ను విసిగించడమంత ఇష్టమని నిను దూరం నుండే ముద్దాడడం ఎంతో కష్టమని.. అయినా సరే నువ్వు వద్దన్నాక నీ మాట వినక తప్పుతుందా! నీ చిరాకుల్ని చక్కబెట్టే కిటుకు తెలిస్తే బాగుండు.

నేనలా నిరంతరం ఉండలేను కానీ, నువ్వు నామాట వినకపోతే అని నీకెదురువస్తే మన మధ్య ఉప్పెనే కదా! మరి, నువ్వు నాతో లేనిదెప్పుడు!! చనువు ఎంత పనిచేస్తుందో చూస్తున్నావా!!

పొసగని కాలంలో..

సమాధానం చెబుతాను. అడిగింది నువ్వే. నమ్మడం మాట దేముడెరుగు వినిపించుకోవు. మరి అడగడమెందుకో అర్థం కాదు రోదిస్తావ్! మనో ఆకాశాన్ని చిందరవందర చేస్తావ్. నేను మరనై ధ్వనికాలుష్యాన్ని, పదకాలుష్యాన్ని ఆశ్రయిస్తాను. ఒకరికి పట్టిన దయ్యాన్ని వేరొకరు వదిలించాలని చూస్తాం. సమాధానపడడం సాధ్యం కాదు. పరిస్థితి విషమిస్తుంది. కొన్నిక్షణాలు మరణిస్తాయి. మనమధ్య చీకటి పరుచుకుంటుంది. నువ్వు అంతఃపురంలో విశ్రమిస్తావు. నేను సమాధిలోకి దారి వెతుకుతుంటాను. కీచురాళ్లు రొదపెడుతూనే ఉంటాయి. కాలం అకాలంలో శమిస్తుంది. మరో నిమిషానికి శపిస్తుంది. ఏదోశక్తి ఇద్దరినీ పరీక్షిస్తుందని ఎవరో ఒక్కరికే అనిపిస్తుంది. ప్రాణం పాతరోజులకై పరితపిస్తుంది. అందని ఏకాంతం పరిహసిస్తుంది. దిండు తడుస్తుంది. రాత్రి గడుస్తుంది.. నిట్టూర్పు విడుస్తుంది. పొద్దు పొడుస్తుంది. ఇద్దరిమధ్య ప్రేమ.. మౌనంగా పురుడుపోసుకుంటుంది. అహం ఊపిరి తీసుకుంటుంది.


ఇచ్చిపుచ్చుకోవడంలో మాట.. తీరాలు దాటిస్తుంది. అంతరాలు పాటిస్తుంది. చేతల్లో కసిదీర్చుకుంటుంది. రాతల్లో ఓదార్చుకుంటుంది.

ప్రేమ అమరం.. కదా! తను మాయమై.. మనసుల్ని నలిపేస్తుంది.. మనుషుల్నిమాత్రం కొన ప్రాణాలతో నిలిపే ఉంచుతుంది. ‘కలసి జీవించడం కావాలి’ కదా!! అంటుంది.



నిశ్శబ్ద సాంగత్యాలు

జీవితం నుంచి పెద్దగా ఆరోపణలేం లేవు! నీకు నయమవడం, నాకు సంయమనం కోరుకోవడం తప్ప. అప్పుడప్పుడు తొంగిచూసే నిశ్సబ్దసాంగత్యాలు చాలు, ఆనందాన్ని ప్రోది చేసుకోవడానికి. పెళ్ళవ్వడం, ఎల్లలు లేని ప్రేమను ఇద్దరూ కుదించి ఓ ఇల్లవ్వడం, ఒకరికొకరు గువ్వలవ్వడం నుంచిఒకరికొకరం పిల్లల్నివ్వడం, ఒకరికోసం ఒకరు బతకడం నుంచి కన్నవారి కోసం కలసి బతకడం, సరదాలు పరదాల చాటుకెళ్ళి బాధ్యతలు భుజాలకెక్కిపోవడం, ఇవి ఎవరికైనా తప్పవు కదా! మళ్ళాఇన్నాళ్ళకి, మూతిముడిచినా, నాలికమడిచినా, చూపుకలపకున్నా, మాటవినిపించుకోకున్నా విసురుగ తప్పుకున్నా, దురుసుగా కసురుకున్నా, ఒకరికొకరమని తేలిపోయాక ఎవరిని ఎవరు ఏమన్నా, చూసేవారేమనుకున్నా ఇచ్చుకునేవి, పుచ్చుకున్నవి లెక్క తేలిపోయినా, చెప్పాలనుకున్నవన్నీ ఎప్పుడో చెప్పుకున్నాక ఈ రంగస్థలం మీద నీకూ నాకూ రోజులెన్ని మిగిలున్నా రాలిపోయేదాక, జీవితంలోంచి తూలిపోయేదాక అనుభవిస్తుంటే భలే ఉంటాయి, నిశ్శబ్దసాంగత్యాలు.

మనం పిల్లలం లడ్డూ పాపా! తప్పక పెద్దవాళ్ళైపోయాం. ఒకరికి ఒకరప్ప, ఒంటిగ లేమప్పా..అని పాడాలని ఉంది. ఇది నిన్నింకాస్త మెరుగ్గా చూడాలన్న తపనలో గుండె లయతప్పుతుంది. నువ్వు మాత్రం నవ్వుతూనే ఉంటావు. నీ నవ్వులో నేను ఎప్పుడన్నా కనపడ్డానా, నీకూనాకూ ఉన్నాడప్ప, ఆపై ఉన్నప్ప. ఎప్పటికీ నువ్వే నేనప్పా అని చెప్పాలనే. ఇలా చూడు.

చరణ వాంగ్మూలం

సఖ్యం సాప్తపదీనాం అంటారే పెద్దలు. వేల అడుగులు కలిసి ప్రయాణించాం! ఇప్పుడన్నా నా మొరాలకించవా!!

నీ మీగాలును ఆటల్లో తొక్కినప్పుడు నువ్వు విలవిలలాడడం, ఆనాడు నిన్నలా అదే చూడడం. ఎంత బతిమాలితే మాలిమి అయ్యావు ఆ రోజు. అది గుచ్చుకున్న పలుకేదో గుండెల్లో ఇప్పుడూ కలుక్కుమంటుంటే నిద్రవేళ నీ కాలిదరికి మెత్తగా ఒత్తాలని సంజాయించుతూ చేరతానా, నా చేయి తగలగానే తాబేలు లెక్కన దుప్పట్లోకి ముడుచుకుపోతావు. ఒత్తిగిల్లినవేళ నీ మడమ దొరుకుతుంది మెత్తగా అదిమితే నీకు ఊరటని అప్పటికి ఆదమరచి ఉంటావు, ఆ కాసేపే నీ స్పర్శానుభవం. చెయ్యి కాలకుండా కాఫీకప్పును పట్టుకుని చిరుచెమటతో మునివేళ్ళ మీద చిట్టిచిట్టి అడుగులు వేసుకుంటూ గబగబా వచ్చి నవ్వులతో అందించే కొత్త పెళ్ళికూతురి వేలు తగిలినట్టే మురుస్తాను. ఇప్పుడంటే సరదాకైనా దరిచేరనీవు. ఉద్యోగానికి బయల్దేరేటప్పుడు షేక్ హాండ్ ఇమ్మంటే నో..నో.. అంటూ నీ మెటికలు నా పిడికిలికి సుతారంగా తాటిస్తావే, అప్పుడు ఉషోదయపు తొలి వెచ్చదనం తాకిన తుషారాన్ని .

 “ఈ జగాన అతి సుందరమైన వాటిని చూడలేం, తాకలేం. కేవలం అనుభూతి మాత్రమే చెందగలం” అన్న హెలెన్ కెల్లెర్ మాట.. సగం అబద్దంగా తోస్తుంది.

నీ చేతిలో సబ్బు అవసరాన్ని మించి అరిగినప్పుడల్లా, నా మనసుపాత్ర లో మరుగుతున్న కన్నీళ్లు. ఆపై నీకు ఎప్పటీకీ వినిపించని వెక్కిళ్లు.

నమ్మకమీయరా..

నీకు తెలియడం లేదు గానీ, నువ్వెంత పొంకంగా ఉన్నా జీవితం నిన్ను భయపెట్టింది. ఏదో అభద్రతాభావం నీతో జతకట్టింది. నీకు భరోసా కలిగించని వర్తమానం-సహచరుడిగా ఇది నా వైఫల్యం. మన్నించు, మన్నించు.. నిన్ను నిన్నుగా స్వీకరించని పెద్దరికాల్ని, నీకనుగుణంగా లేని లోకాన్ని క్షమించు. దయచేసి సాటిమనుషుల అవసరాన్ని గుర్తించు. బిడ్డను ఒద్దికగా సాకుతున్నావు సరే, వాడు ఎదిగాక నిలబడేందుకు సమూహాన్ని గుర్తించు. వసుధైకకుటుంబాన్ని నిర్మించు.

కోరికల కీరవాణి కొసరికొసరి ఊరిస్తూన్నవేళ నేనే నీ శారికను. నదీమతల్లులఎదలపై సోలి అల్లుకుపోవాలని ఆశపడే వేళ నువ్వే నా జలనిధి. సుధాంశుతూలికల మొనలతో మేనెల్ల జల్లుమనేలా నిమిరించు కోవాలని ఉబలాట పడే వేళ నువ్వు నా వెన్నెల. మవ్వంపు పువ్వుల చిరునవ్వు, తళుకు, చురుకు, తావి నావే కావాలని తపించేవేళ నా పూబోణివి. మబ్బుదిబ్బల అబ్బురాలలో కలిసిపోయి అల్లరి చేయాలన్నా... అరుణకిరణాల జడిజాలులు ముక్కులతో చురుక్కు మనిపించుకోవాలన్నా అది నీతోనే. నువ్వు మాత్రమే నా ప్రియసఖి. సఖ్యతకు దూరంగా ఉన్నా నీకన్నా నాకు దగ్గరెవరూ లేరు లడ్డూ!.. నువ్వు నా ‘పరమ ప్రేయసివి’.

నీకు నీనుండి తరలిపోయిన నమ్మకం మరలిరావాలని. నీతో నా జీవితాన్ని స్నేహంగా మొదలుపెట్టాలని. రెక్కలిప్పిన గువ్వవై నువ్వు నాతో కలసి మళ్ళీ ఎగరడం చూడాలని ఎదురుచూసే..... 

క్షేమపిపాసి...*



Rate this content
Log in

More telugu poem from sateesh sateesh