మా నాన్న
మా నాన్న


నానమ్మకి ..
చంటిపాపలా ఒళ్ళు కడిగీ..జడ దువ్వీ..
మందు వేసీ.. మంచి చూసీ..
ఇన్ని చేసిన నాన్న,
ఆమె కన్ను మూసిన క్షణం
ఒక వేదాంతిలా ...ఎందుకలా!?
నాన్న నాన్న కూడా నానమ్మ వెనకే చనిపోతే ..
అప్పుడు కూడా నాన్న,
గెడ్డం లేని భీష్ముడిలా...
నా బండికున్న ఒకే ఒక షాక్ అబ్సొర్బ్ లా..
మామూలు రోజుల్లో మాకోసం నవ్వులు పూయించే నాన్న
తన మనసు మూల్గుతున్నప్పుడు మాత్రం ఒక అత్తిపత్తి లా..
అలా తాకగానే ఇలా ముడుచుకుపోయేలా..
అలా ఎలా..!?
***
నా చిట్టితల్లి ఆయనవొళ్ళో ..
ఆ ప్రేమ వాసనలతో పెరిగినప్పుడు
నా పాప ప్రతి కేరింతా తన మేనుకి పులకింత..
ఒక మంచి కొడుకుగా..
బాధ్యత కలిగిన భాగస్వామిగా ..
తండ్రిగా, తాతగా..
స్నేహితునిగా, బంధువుగా..
మా నాన్న ప్రతి జ్ఞాపకం
నాకు అడుగడుగునాఆదర్శం..
నా పాపకు నేను నాన్నగా తిరిగి ఉదయించే ఈ క్షణం
మా నాన్నే నను నడిపించే ఓ స్ఫూర్తి కిరణం.