కిటికీయే నిజం
కిటికీయే నిజం


కిటికీయే నిజం
కిటికి ఒకటి లేక పోయుంటే
కవిత్వం కవులు ఏమైపోయేవారు?
కిటికి దగ్గరే
కవుల ప్రాణం ఉంటుంది
కవులకు కిటికీ ఆక్సిజన్!
దాని ద్వారా కనిపించే దృశ్యమే ముడిసరుకు
కొత్తగా పెళ్లయిన స్త్రీ
కిటికిలోంచే భర్త రాకపోకలు చూస్తుంది
కిటికి లేని ఇల్లు కన్ను లేని శరీరమే
రేయింబవళ్లు కిటికి దగ్గర కూర్చున్న
ఆ అందమైన అమ్మాయి పేరు అసూర్యంపశ్య
బయటవాళ్లు అల్లరి చేసి ఆ అమ్మాయిని రమ్మంటే
ఆ అమ్మాయి అక్కడ నుంచి కదలకపోతే...
ఆ అమ్మాయి తండ్రి చెప్పాడు
ఆమెకు Xeroderma Pigmentosum వ్యాధి ఉందని
ఆమె స్కిన్ దానిని తట్టుకోలేదని
సూర్యకాంతి పడకూడదని
పడితే తన బిడ్డ మరణానికి నెమ్మదిగా చేరువవుతుందని
అయ్యో!!
1965 నాటి పాత తాతగారి ఊరు వెళ్లినప్పుడు
మట్టి గోడల ఇంట్లో
వెదురు కర్రల కిటికి చూసాను
అక్కడ ఓ పిచ్చిక ఆనందం చూసాను
చింతపూలు కిటికి లోంచి రాల్తున్న దృశ్యం జల జల
ఈతకెళ్లిన హుస్సేన్ చెరువులో మునిగిపోయాడు
అతడిని నులక మంచమ్మీద మోసుకొస్తున్న దృశ్యం
అతడి తల్లి బూబమ్మ నమాజు లాంటి ఏడుపు
కిటికి భీతావాహం
మనసులో గుబులు జ్ఞాపకం
మూయడానికి కిటికికి తలుపుల్లేవు
నేను పెరిగాను
డాబా ఇంట్లో కిటికి గాజు అద్దాలతో ముస్తాబైంది
నాన్నని ప్రకృతి తీసుకు వెళ్లిపోయింది
చేతి సంచితో రోజూ వస్తూ వెళుతూ కనపడే నాన్న దృశ్యం
ఔట్ ఆఫ్ ఫోకస్ అయిపోయింది కిటికి లో
ఆ రోజే నిశ్చయించుకుని
కిటికీ అబద్ధం అని
ఓ కవిత రాసుకున్నాను ఏడుస్తూ...
కాని
కిటికీయే నిజం
దృశ్యాలు అబద్ధం అని తెలుసుకున్నాను
కాలం కిటికి తెరుచుకున్నాక