చింత యేలరా !!!
చింత యేలరా !!!


చెంత లేని వారి గూర్చి చింత యేలరా
నీకు అంతలోన అంతమవునదేది లేదురా
సొంతమను తోచు వారలంతలోనే
నీకు అందనంత దూరమునుండి యీ వింతగాంచురా || ||
సంద్రమందు నీరుబీల్చి మేఘముగా పేరు మోసి
పరువులెత్తి కొండలలో వర్షించినా
ఆ నీరే యేరులా పారి ఉరకలేసినా
చింత లేదు సంద్రానికి ఒక్కింతైనా || ||
ఆ పాత జలముతో సొగసగు జలపాతమై
నదములలో తిరిగినా,పొలములన్ని తడిపినా
ధరణిలోన ఒదిగినా ఉద్ధరణిలోన దాగినా
చింత లేదు సంద్రానికి ఒక్కింతైనా || ||
దూరమెంత సాగినా,ధారలై రాలినా
పేర్లు యెన్ని దాల్చినా,రూపులెన్ని యెత్తినా
పయనమును ఆపును తన పుట్టినిల్లునా
చింత లేదు సంద్రానికి ఒక్కింతైనా || ||
అలసి చెమటతోడ కలిసియున్న బిడ్డనీ
అక్కున యా మలినము తా వహించె రా
ఘనమైన గుణములన్ని లో దాచినా
కడకు లవణార్ణవమని పేరు మిగిలెరా || ||
తలవదు రా తన అంశను ఏ నిమిషమైనా
విడువదురా తన ధర్మమునేగతులైనా
ఈ గాథ తెలిసుకొని నిదురపోరా
అగాథమున దాగు బుద్ధి మేలుకొలపరా || ||