నాలో నేను
నాలో నేను
నా మనసు పాటించ సాగింది మౌనం
తెలియని స్థితి, మనసు లో అసహనం
ఎవరెలా అడిగినా చెప్పలేకున్న కారణం
నాకే అర్థం కాక అంతరంగాన సాగే రణం
నా ఆరోగ్యాన్ని, ఆనందాన్ని కోరిన నా మిత్రులు
ఇచ్చారు ఎవరికి వారు, తమకు తోచిన సలహాలు
మొదలు పెట్టామన్నారొకరు ఇష్టమైన వ్యాపకం
ఆమాట మీదే మొదలైంది నా రచనా వ్యాసంగం
ఈ ఏడు నెలల పయనంలో ఎన్నెన్నో చదివాను
ఎందరో నూతన మిత్రులకు నే పరిచయమ
ైనాను
మరి ఇంకెందరినో పరిచయం చేసుకున్నాను
అందరి ప్రేరణతో తెలియని గమ్యానికి సాగాను
ఈ పరిచయాలకు వేదికగా సాహిత్యం నిలిచింది
రచనలు చదువుతున్న నాలో చైతన్యం కలిగింది
రాయాలనే తపన నా అంతరంగాన మొదలైంది
చివరికి 'బాధ్యత' తో నా ప్రయాణం మొదలైంది
ఇప్పుడు వెదుక్కుంటున్నా అంతటా నన్ను నేను
నా మది కనులకు ఎక్కడా నే కనపడ లేకున్నాను
ఇంతకాలం సాగిన పయనం లో నేనెక్కడున్నాను
చదివినప్పుడు నన్ను నేను, దొరికాను నాలో నేను