జీవిత పరమార్థం
జీవిత పరమార్థం


ఆశలు తీరాలని
ఆశయాలు వదిలేస్తావు
సుఖాల వెంపర్లాటలో
కష్టాల కడలి ఈదుతావు
కామక్రోధ లోభాలతో
కృంగి కృషించుకుపోతావు
అహంకార జ్వాలలు కక్కి
నిలువెల్లా దహించుకుపోతావు
అజ్ఞానపు ఉబిలో చిక్కి
నిరంతరం కొట్టుకుపోతావు
కోరికలు ఆనంతమై
చివరికి నీవే శూన్యమైపోతావు
దేహమే శాశ్వతమని తలచి
చివరికి మట్టిలో కలిసిపోతావు
ఏడుపుతో మొదలుపెట్టి
జీవితాన్ని ఏడుపుతో ముగిస్తావు
నీటి బుడగ వంటిది జీవితం
నిన్నటిని చూశామని రేపటికి గ్యారెంటీ లేదు
గతంలో ఉన్నామని వర్తమానానికి వారెంటీ లేదు
ఒక్కసారి చేజారితే మళ్లీ రావడానికి
వన్ ప్లస్ వన్ ఆఫర్ కాదు జీవితం
చేతిలో ఉన్నప్పుడే
చేతల్లో చూపించాలి
మేధస్సును ఉపయోగించి
నూతన ఆవిష్కరణలు చేయాలి
మంచి మనసుతో సాయమై
మహాత్ముడవు అనిపించాలి
నలుగురిలో ఒకరిగా బతకడం
కాదు జీవితం
నలుగురిని నవ్విస్తూ జీవించడం
మనకోసం మనం బతుకడం
కాదు జీవితం
నలుగురి శ్రేయస్సు కోరి జీవించడం
స్వార్థం ఆలోచించడం కాదు మానవత్వం
ఆపదలో ఆదుకోవడమే అసలైన మనిషి తత్వం
ఆడంబరంగా ఉండడం కాదు ఆభరణం
సందర్భానుసారం మెలగడం మంచిగుణం
మానవ సేవయే మాధవ సేవ
అనునది మనిషి జీవిత పరమార్థం.