నింగికి నేలకి పెళ్ళంటా...
నింగికి నేలకి పెళ్ళంటా...
నింగికి నేలకి పెళ్లి...
*******************
చల్లగాలి మేనును తాకగా
నా కంటికి మెలకువ వచ్చింది
భూమాతకి పాదాభివందనం చేసి
అరచేతులతో నమస్కరించాను
నా దినమంతా బాగుండాలని
నాతోటి సకల ప్రాణులన్ని సుఖంగా ఉండాలని
ఆ దేవదేవుడిని కోరుకున్నాను
మొద్దుబారిన మెదడును తట్టిలేపింది తనువు
కాళ్లకు పని చెప్పి మైదానానికి ఉరికింది
ఆకాశమంతా మేఘావృతమైయుంది
నా పరుగులతో పిల్లగాలులు కూడా తోడుచేరాయి
ఉత్సాహం మరింత నాలో ఉప్పొంగింది
మనసంతా నిర్మలమైన నీలాకాశంలో తేలియాడినట్లుంది
నింగికి నేలకి పెళ్లి జరుగుతుంది కావచ్చు
మేఘాలతో పందిరి వేసినట్టుంది ఆ ఆకాశం
వధువు నేలమ్మ పచ్చదనపు చీరకట్టి
వనలతల పరువాలు చుట్టి
సోయగాలను ధరించి
విరుల మధువులనద్దుకొని
మహారాణిలా ముస్తాబయింది తను
మల్లెపూల పరిమళంతో పారుతున్న జలసిరులకురులతో
పొంగుతున్న జలపాతాల పరుగులతో
ముసి ముసిగా నవ్వుతుంది ఆమె
వరుడు ఘనుడు గగనుడు
గమనిస్తున్నాడు ఆకాశం నుండి
దేహానికి సప్తవర్ణాల హరివిల్లును పంచెగా కట్టి
అందాల నెలరాజుని తలపై పెట్టి
రెట్టింపైన అందంతో
పెళ్ళికొడుకై మురిసిపోతున్నాడు
ముస్తాబైన మహారాణిని చూసి
ముచ్చటగా ముద్దివ్వమని మురిపెంతో
వానజల్లు విసిరాడు ఆమెపై
చినుకు చెంపను తాకిన వేళ
ఎదలో తన్మయత్వం చేరగా
వధువు నేలమ్మ సిగ్గుతో మొగ్గైంది
గగనుడి కొంటెచూపు తగిలి తప్పించుకోలేక
కనులకు కాటుక పెట్టి,
కలువపూలను విసిరింది అతనిపై
ఉడతల,తోండల, పిల్లుల,ఎలుకల
కుందేళ్ల, ఉడుముల ఉరుకుల పరుగులతో
బిరబిర పనులతో పెళ్లి పండుగ మొదలైంది
బసవన్నలు, మేకపోతులు, పోతురాజులు, లేళ్లు,
దుప్పులు, జింకలు అన్ని వంటావార్పులు చేపట్టాయి
ఒంటెలు, గాడిదలు, ఏనుగులు, గుర్రాలు,
సరుకులు తేవడంలో నిమగ్నమయ్యాయి
ఖండాలను, సముద్రాలను, దీవులను దాట
ి
ఆస్ట్రేలియన్ కంగారులకు కబురంపి
అమెజాన్ అడవులకు, నయాగర జలపాతాలకు
అగాధాలు లోయలను దాటి,
అండీస్ పర్వతఅంచులను చుట్టి,
ఆఫ్రికన్ గజరాజులకు ప్రత్యేక ఆహ్వానమిస్తూ
పావురాలన్నీ పెళ్లి పత్రికలు పంపడంలో మునిగిపోయాయి
గ్రద్దరాజు పెళ్ళి పెద్దగా వచ్చాడు వరుడి తరపునుండి
మృగరాజు స్వాగతించాడు వధువు తరపునుండి
పక్షులు, జంతువులు అందరూ పెళ్లి పెద్దలు
కొండలు కోనలు, వాగులు వంకలు
నదీనదాలు, సాగర సముద్ర తీర మైదానాలు
ఎల్లోరా శిల్పాలు, తాజ్మహల్ అందాలు
ఎవరెస్టు బాబాయ్, బంగాళాఖాతం మావయ్య
చిట్టి చీమలు, పుట్ట పాములు
కీటకకాటకకర్కటకర్కోటక జల భూచర వాయు జీవరాశులన్నియు వధువునిచ్చు బంధువులు
పెదనాన్న సూర్యుడి సహాయంతో గగనుడు
నక్షత్ర మండలాన్ని పెళ్లి మండపం గావించాడు
పాలపుంతను తెచ్చి శూన్యానికి పరుపుగా మలిచాడు
అష్టదిక్పాలకులను పెళ్లికి అతిథిగా పిలిచాడు
నవగ్రహాలను ఆహ్వానించి దీవించమని కోరాడు
దేవతల గురువైన బృహస్పతిని
పెళ్లి జరపడానికి పండితునిగా పిలిచాడు
గ్రహాలు గ్రహశకలాలు, చుక్కలు తోకచుక్కలు
ఉరుములు మెరుపులు
గగనుడి తరఫున పెళ్లి బంధువులైనారు
ఊర్ధ్వలోకాలు ఏడు , అధోలోకాలు ఏడు కదిలి
చతుర్దశ భువనాలు కలిసి భూలోకం చేరాయి
చుక్కలన్ని మెరువంగా,మెరుపులన్ని ఉరమంగా
వరుణుడు అమృతవర్షం కురిపించగా
వనదేవతలు పూలఅక్షింతలు జల్లగా
సప్తస్వరాలు సంగీతాలు పాడగా
సకల శాస్త్రాలన్ని కలిసి వేదమంత్రాలు పఠించగా
కోయిలమ్మ గానాలతో
జంతువుల ఆటపాటలతో
పక్షుల కిలకిల సందడులతో
డోలు,సితార,డప్పు వాయిద్యాల నడుమ
అనకాలు,పణవాలూ, శంఖాలూ,భేరుల
ఓంకార ప్రణవనాదాల నడుమ
సర్వ జీవ, నిర్జీవ ప్రాణరాశుల మధ్య
అణువు నుండి అనంతాల వరకు
కరిగిపోని కాలమే పరిణయాణికి ప్రమాణంగా
ఆద్యంతాల సాక్షిగా
బృహస్పతి సమక్షంలో
అగ్నిదేవుడు చేతుల మీదుగా
అంగరంగ వైభవంగా నింగికి నేలకి పెళ్లి జరిగింది
ఆర్యవర్తనాన ఒక వసుదైక కుటుంబమై అలరారింది