ఉదయించిన రేపటిలో...
ఉదయించిన రేపటిలో...


కడలిలోన నిదురించిన
కర్మసాక్షి కలలలోన
ఉదయించిన రేపటిలో
చూచెనెన్ని వింతలో
భూగోళ తలముపైన
గోలలన్ని మాయమయ్యె
భ్రమరులన్ని పలుకుతున్న
మాటలన్ని తేనెలొలికె
నరునినోట శ్రేయమైన
నుడువులెన్నొ వినిపించె
నియమములు మార్చుకొనే
నేమము తనకగుపించె
గుబురులేని గాలి తనకు
కబురులెన్నొ మోసుకొచ్చె
వసంతాన మావిచిగురు
మరకతమును బోలియుండె
కలలోని కాన్పుజూచి
బాలార్కుడు భీతిల్లి
తెరకొనగా తారసిల్లె
ముసువుయున్న మహీతలము
విషాణువొకటి విస్తరించి
పాషాణముగ ప్రబలి లోక
ప్రాణాలను యారగించి
భూకాణాచిగ దుడుకుజూపె
ఏమిజేయ తోచకెమొ
ఇనుడు మిగుల నిట్టూర్చె
యా వేడిని తాళలేక
మానవుండు యింట యుండె
అనువుగాని చోటిదని
అణువు కాలి మాడిపొయె
మానవులు ఊరడిల్లి
మామూలుగ మసలుకొనె