రాజకీయాలు
రాజకీయాలు


కయ్యాల నెయ్యాలవీ రాజకీయాలు
తల పండిన కాయాలు తల తీసే గాయాలు
పాపాల మయాలు శాపాల న్యాయాలు
మంచిని మించిన చెడుతో మారుతున్న సమయాలు !!
ఆటుపోట్లు వెన్నుపోట్లు
పరస్పరం తిట్లు ప్రజల ముందు ఫీట్లు
జనాల ఓట్లు అసెంబ్లీ సీట్లు
పదవులకి అగచాట్లు నిలుపుకోను కనికట్లు !!
రౌడీలు కేడీలు మంత్రులు ముఖ్య మంత్రులు
చదువులేని వారికే నేడు ఉంది పదవులు
చాలించే తనువులతో పాలించే నాయకులు
మంచితనం ముసుగులో దాగిన నయవంచకులు !!
ప్రజల సొమ్ము అపాత్రదానాలు
మార్చలేని నేతల తీర్చలేని వాగ్దానాలు
జంకు గొంకు లేక శంకుస్థాపనలు
నిధుల స్వాహాకు అంకురార్పణలు !!
మాంత్రికులైన మంత్రుల మధ్యన
యాంత్రికమైన సామాన్యుడి జీవితం
కంత్రి మనుషుల కుతంత్రాల మధ్యన
స్వాతంత్ర్యము సాధించే పేదరికం !!
నీటి నియమాలు నీళ్ళనొదిలి
శాంతి భద్రతలు గాలికొదిలి
బరువు బాధ్యతలు భగవంతునికొదిలి
తిరుగు నాయకులకు ఏదిరా మజిలీ !!
మరుగవునా ఈ మారణ హోమం
పోయినా ఈ ఆకలి క్షామం
పదవులొచ్చాక పెడతారు నామం
పట్టించుకోరేం ప్రజల క్షేమం !!