మధ్యతరగతి మహాభారతం
మధ్యతరగతి మహాభారతం
చాలీ చాలని జీతంగడిచి గడవని జీవితం సమస్యలతో సతమతం బాధ్యతలకే అంకితం !! కొనాలంటే ఆలోచన అమ్మలంటే ఆవేదన ఆగదురా నీ రోదన తీరదురా నీ వేదన !! మింగడానికి మెతుకు లేకున్న కారు, విల్లా కావాలన్నా ఆశకు హద్దు లేదన్న సంపాదించే తెలివి పెంచన్నా !! మూడడుగులు ముందుకి నాలుగడుగులు వెనక్కి ఏడుస్తావు వెక్కి వెక్కి ఎపుడొస్తుంది నీ బతుకు కొలిక్కి !! ముందడుగు వెనుక రా వెనుకడుగు ముందురా అన్నిటికీ తొందర బ్రతుకు చిందర వందర !! ఒకపూట పస్తున్నావా మరోపూట చస్తున్నావా ప్రపంచం చూస్తున్నవా ఏమైనా చేస్తున్నావా !! అప్పులు చేసి గొప్పలు తప్పులు చేసి తిప్పలు ఉడకవు నీ పప్పులు పొంచి ఉన్నాయ్ ముప్పులు !! ఎవడికి పట్టిందిరా నీగోడు ఎవడుంటాడురా నీ తోడు ఏమైపోతాడురా జీవుడు ఎక్కడున్నాడురా దేవుడు !! బాగుపడితే ఎంత కుళ్లురా పొడుచుకుంటారు రెండు కళ్లురానీ దారి పొడవునా ముళ్ళురా నిస్వార్దపరులే దేవుళ్ళురా !! పెళ్లనేది ప్రహసనం ఇల్లనేది అసంభవం బ్రతికుంటే బలుసాకు బ్రతకడానికి ఏదో సాకు !! చచ్చినట్టు బ్రతకాలి బ్రతుకుతూ చావాలి పరమాత్ముడు రావాలి కష్టాలు తీరాలి !! ప్రత్యక్ష నరకంలో త్రిశంకు స్వర్గంలో బాధల దుర్గంలో వేదన మార్గంలో ... పెడవాడే బాగున్నాడురా గొప్పోడు ఇంకా బాగున్నాడురా మధ్యతరగతోడు చస్తున్నాడురా కళ్లతో చోద్యం చూస్తున్నాడురా !! ఎవరూ మారారురా ఏమీ చేయరురా నీవే మారాలిరా ఎదో చెయ్యాలిరా !! తియ్యరా తెలివి బాణం నిలుపుకో నిండు ప్రాణం సాగించు బ్రతుకు ప్రయాణం చూపించు నీలో మరో కోణం !! ఉన్నదాన్ని నిలుపుకో లేనిదాన్ని గెలుచుకో మంచి దారి నడుచుకో దైవాన్నే కొలుచుకో !!
