నమో వేంకటేశ
నమో వేంకటేశ


ఓ వేంకటేశ ఓ శ్రీనివాస
ఓ మందహాసా శేష శైలా వాసా
మా భగవంతుడా మా బలవంతుడా
మమ్మేలువాడా మము బ్రోవు వాడా !!
లెక్కలేని కష్టాలను ఒక్కసారి ఎదుర్కొని
రెక్కాడితే గాని డొక్కాడని శ్రమ జీవులు
గుక్కపట్టి ఏడ్చి ఏడ్చి నీకు మ్రొక్క
కష్టాలను రూపు మాపై కద లిరారా కరుణాసాంద్ర !!
రోజులు కావు మంచికి
న్యాయం కదా కంచికి
ధర్మానికి పట్టిన ఖర్మము
వదిలించగా రార వడ్డికాసులవాడా !!
ప్రతివారికి ధన దాహం
ఏమిటో ఈ వ్యామోహం
నీ సేవకే ఈ దేహం
నీవే ఒక అమోఘం !!
ఎందరెందరో అభాగ్యులు
దారిద్య్ర ము లో దౌర్భాగ్యులు
దిక్కులేక దిక్కు తోచక పెడదారులు పడుతుంటే
వారి ఆశాజ్యోతివీవై కడలి రారా వేంకటేశ !!
మమకారం మంటగలిసి
జాలిగుణం జావగారి
క్షమాగుణం క్షీణించి
వక్ర బుద్ధులు సంక్రమించి
వేళా కొలది సన్మార్గులు
దుర్మార్గులుగా మారి
పాపాలను పండించగా
దండించగా రారా దయాసాగరా !!
ఉన్నంతలో తృప్తి పడక
లేని దానికై ప్రాకులాడి
ఉన్నవాడు లేని వాని దోస్తుంటే
ఎవరి ఖర్మకు వారు బాధ్యులా ఏడుకొండలవాడా !!
తమకుందని గర్వాలు
ఒకరికుందని అసూయలు
అవసరం లేని అనుమానాలు
అనవసరమైన అపార్ధాలు
తెస్తాయి అనర్ధాలు
మారుస్తాయి జీవిత పరమార్ధాలు !!
ఎక్కడ చూసినా అవకాశవాదులు
ఒకరిపై ఒకరి ఫిర్యాదులు
ఒకరి బాధ ఒకరి ఆనందం
చూసావా మా మానవుల అనుబంధం !!
అనుక్షణం ఆలోచనలలో మునిగి తేలి
చావు తెలివితేటలతో తూలీ సోలి
కష్టాలలో ప్రార్ధించి
నష్టాలలో నిందించే
సంస్కృతి రా మనుషులది !!
మేమంటే ప్రేమతో
మా వెంటే నడుస్తున్నావా
ఇంటింటా వెలిసావే
ఇంటి గుట్లు తెలియనివా !!
శునకము లోని విశ్వాస గుణము
ఖరము లోని కష్టించే గుణము
చీమలోని క్రమశిక్షణ
గోవు లోని సేవా గుణము
ఏనుగు లోని శాంతము
మానవులకు ప్రసాదిస్తావా?
నీవిచ్చిన బుర్రతో
నిజా నిజాలు పరిశీలిస్తే
ఎవరి జీవితం వారి చేతులలో
ఉందన్నది గమనిస్తే
మనుషులంతా దైవాలే
మహిలో సుఖశాంతులే !!
నీవేరా మా ప్రాణం
నీవేరా మా లోకం
నీకోసం ఈ శోకం
నీదేరా ఈ లోకం !!
ఘోరాలు అనుక్షణం పాపాలే ప్రతి క్షణం
తూర్పు పడమర ఉత్తరం దక్షిణం
దుష్ట శిక్షణం శిష్ట రక్షణం
చెయ్యి తక్షణం చెయ్యి తక్షణం !!