చరిత్ర
చరిత్ర
అగ్ని గోళం నుండి తునకై
విశ్వాంతరాళాల చరిత
ఊపిరి పోసుకున్న
ఒక్కో జీవిది
ఒక్కో కథ
తీర్చిదిద్దుకున్న
నేటి రూపాల వెనుక
తీరని తపన
పాత రాతి గుహలు నుంచి
పాలరాతి గృహాల దాకా
అలుపెరుగని నడక
ప్రతి మలుపులో
సాధించిన గెలుపులో
వీర తిలకం దిద్దుకున్న
అజేయ చరిత్ర
అస్త్రాల,
శాస్త్రాల,
శస్త్రాల
ఆవిష్కరణలో
రూపుదిద్దుకున్న భవిత
అక్కడక్కడ అంటుకున్న
రక్తపు మరకలు
చెరిపినా చెరగని
ముద్రల రక్త చరిత్ర
ఎత్తులు
పై ఎత్తులు
కుయుక్తులు
మెట్లు ఎక్కే క్రమంలో
వడ్డిన శాయశక్తులు
జనాలు మారినా
జెండాలు మారినా
ఆహారం మారినా
ఆహార్యం మారినా
మార్చలేనిది
తప్పుల తడకైనా
నిప్పుల నడకైనా
దాటివచ్చిన
కడగండ్లకు
చిరునామా
ఈ చరిత
నాలుగు అక్షరాల
పుస్తకం కాదు
నాగరికత
తొలి ఊపిరి చరిత
ఇది ఆకలి వేట
తీరని ఆశల వేట
ఎగసిన ఆశయాల బావుటా
మోగిన ఉద్యమాల జేగంట
శతాబ్దాలుగా
చరిత్రలో కలిసినవెన్నో
చరితగా మిగిలినవెన్నో
చరిత్ర చెప్పే కథలెన్నో
చరిత్రకందని గాధలింకెన్నో