నువ్వొస్తావని
నువ్వొస్తావని


ఒంటరిగూటిలో నన్నొదిలి
ఎగిరేళ్లావాదిక్కుకి
ఏ సంకల్పాల్ని
మోసుకెళ్ళావో
ఏ సవాళ్ళని
దాటుకొచ్చావో
తీరా తిరిగొచ్చేదారుల్లో
ఆ ముళ్ళేమిటి
ఇన్నాళ్ల నా ఎదురుచూపు
మాటేమిటి
నీ ఊపిరి కబురులు
వినాలని
ఆ ఊసుల జగతిని
మరవాలని
అందమైన ఎన్ని
ఉహలల్లాను నీ చుట్టూ
నీ శ్వాసే నేనన్నావు
మరీ వైరస్ ఏంటి కొత్తగా
నీ శ్వాసలో
కళ్ళనిండా
కనీసం
నిన్ను చూడనీకుండా
అర్ధమౌతుందా నేస్తం
నిన్ను చేరువకాలేని
నా గుండె భారం
ఎందుకు ప్రియతమా
చేయందుకోలేనంత ఈ దూరం
త్వరగా తిరిగిరా మిత్రమా
ఆ కల్లోల కరోనా
తీరాన్ని దాటుకుని
నీవులేని మరుక్షణం
ఆగిపోయే
నా గుండెని గుర్తుంచుకొని
ఎదురుచూస్తుంటాను
క్షేమంగా తిరిగొస్తావని !!!