రారా కృష్ణయ్య
రారా కృష్ణయ్య


రారా కృష్ణయ్య
ఎన్ని జన్మల నుండి నీ
చరణములకు దూరమైతినో
ఏ తప్పిదముల వలన
నీ నుండి దూరమైతినో
మరల నిను చేరుటకు
తులసి యందు బృందావనమును దర్శించితి
జపించితి నిత్యము రాధే రాధే యని
నీవు తప్ప మరేదీ
వద్దని మనసున మాట
స్పష్టము చేసితి
కన్నుల నీరిడి నిరీక్షించితి
అల్లరి వాడివో నల్లని వాడివో
పదునాలుగు భువనములు కాచేవాడివో
కృష్ణా!ఈ దీనుడికి నీ సన్నిధి చేరు
భాగ్యము నీయరా
మరు భూమిలో వినిపించరా మురళీరవం
కానీయరా నా మనసే నీకొక బృందావనం
ఎంచుకొంటివట దేవకీ గర్భమును
అర్థరాత్రి దాటితివట యమునను
చేరితివట నంద గోకులమును
చిరునవ్వుగ మారితివట యశోదమ్మ మోమున
విషమును స్తన్యముల ఇవ్వజూపిన
పూతనను శిక్షింతివట
అన్ని లోకాలు ఏలు వాడవు
అన్ని బంధనాలను తెంపువాడవు
అట్టి నీవు అమ్మ కట్టిన తాడుకు కట్టుబడి
రోటిని ఈడ్చి ఏడ్చితివట
మాయలెన్నో చేసి
రక్కసుల హతమార్చితివట
అమ్మా చూడు తమ్ముడు
మన్ను తినెను అని అన్న బలరామన్న అనగా
ఏదీ నోరు తెరువుమన్న యశోదమ్మమాట విని
సమస్త విశ్వమును చిన్ని నోటి యందు చూపితివట
విశ్వ పాలకుడవు
గోప బాలురలతో కలసి చల్దులారగించితివట
యమునను విషమును చేసిన
కాళీయుని పడగలపైన తాండవమాడితివట
జగత్తుకు గురువైన నీవు
రాధను గురువుగా స్వీకరించితివట
బృందావనమున రాధతో రాసలీలలాడితివట
నవనీతము దొంగిలించితివట
గోపకాంతలు స్నానమాడుతున్న వేళ
హవ్వ! వస్త్రములు అపహరింతివట
ఇటు కురు సభలో ద్రౌపదిని వివస్త్రను చేయబోతే
గోవిందా అని చేతులు జోడించగనే
చీరలిచ్చి కాపాడితివట
ధర్మమును కాపాడవలెనని అందువట
ధర్మము సమయమును బట్టి మారునని అందువట
ఆయుధం పట్ట్టకుండా మహాభారత యుద్ధం నడిపితివట
ఓ కృష్ణా!
నీ లీలలు అర్థము చేసికొనగల వారమా
ఇక ఈ దాగుడు మూతలాపి ఇటు రారా కృష్ణయ్యా
వెదురునురా మాధవావేణువును చేయరా
గోపాలా!
మురళీరవం ఆలపించరా
గోధూళి ధరించితి
బృందావన దర్శనమీయరా
రారా కృష్ణయ్యా రారా కృష్ణయ్యా
రాధే రాధే రాధే రాధే రాధే రాధే