స్వామీ! ఏమి నీ అభిమతం?
స్వామీ! ఏమి నీ అభిమతం?


నీ ఉనికిని మరచి నన్ను మించిన శక్తి లేదని
పైకి ఎగిరిన మానవాళికి నిమిత్త మాత్రమైన
తన పాత్రను పరిచయం చేయడమా?
మనిషికి మనిషికి మధ్య పేరుకు పోయిన
రాగద్వేషాల రుగ్మతలను నశింప చేసి
భగవదృష్టిలో అందరూ సమానమేనని
విపత్కర సమయంలో ప్రతి జీవికి
శరణు నీవని తెలియజేయడమా?
తిమిరాంధకారంలో ఉన్న ఈ జగత్తును
ప్రజ్వలింప జేసి నీ కరుణ చూపమని
శిరస్సును వంచని మనిషి నేడు
ఈ సృష్టిలో లేడు కదా స్వామి!
దీనజనోద్ధారకుడవు నీవని
భవభయ హరుడవని
జగద్రక్షకుడవని ప్రసిద్ధి గాంచితివే
నీ కడగంటి చూపు చాలుకదా స్వామీ
ఈ ఆపత్కాలం నివారింప!
నీ అభిమతమేదైనా
నీవు నేర్పదలచిన గుణపాఠం ఏదైనా
నీ పరీక్షకు తట్టుకునే శక్తి
ఇక మాకు లేదు
శరణు స్వామీ శరణు!!
---నాగ పూర్ణిమ కె