STORYMIRROR

Kalyani B S N K

Classics

5  

Kalyani B S N K

Classics

తెలుగు వాకిట ఉగాది

తెలుగు వాకిట ఉగాది

1 min
512

నిన్నటి వేకువ వాకిట

హేమంత శిశిరాల హిమ సోయగం ..

రేపటికై నా ఆశల తాపం

గ్రీష్మదనపు సంకేతం..

ఈ రెండిటి నడుమన చిగురించే వసంతం.


గత శరత్తుల ఉషస్సులో

ఉదయించిన అరుణిమ కిరణం..

హర్షానుభూతుల పొదరింట

వర్షించి మురిపించే మబ్బుల తోరణం..

ప్రకృతి ముంగిట ఋతు గీతికా కదంబం.


ప్రభవ మొదలు అక్షయ దాకా

నిన్నటి వికారిఐనా , రేపటి శార్వరి ఐనా

ప్రతి ఒక్క తెలుగు వత్సరం

జగతి ప్రగతికి కొలమానం

అరవై వసంతాల వెలుగునీడల అద్భుతం.


యుగాల తరబడి జ్వలించే ఒక నవ చైతన్యం..ఈ

ఉగాది రోజున మన మనసులలో నింపేద్దాం

జగానికంతా ఆ జవ్వాదిపరిమళమద్దేద్దాం.


మంచు దుప్పటి ముసుగులో

కలలు కనే కమ్మటి వేళ హేమంతం..


రాలుపూల , బోసికొమ్మల జన్మజన్మల వేదాంతం

మన మానవ జీవన నిరాశ రాసుల ఓ శిశిరం..


లక్ష్యం కోసం అలుపెరుగని పోరాటంలో

చిందే స్వేదం ..ఇది కాదా గ్రీష్మం..


చిన్ని చిన్ని ఆశలు నెరవేరే సమయం..

తుంపరల పరంపరగా ప్రతి ఇంటా చిరు వర్షం.


అలక మబ్బులు వీడినవేళ..

కలత చీకటి తొలగిన వేళ ..

శరత్కాలపు నిజ విభవం..మదిమదినా అనుభవం.


కోరిన ఆశలు తీరిన వేళ పులకించే ప్రతి అంతరంగం

నవోన్మేష సుగంధాల నిత్య వసంతం.


వికారి కొరకై మనసు నిండిన వీడ్కోలు

శార్వరి కొరకై మామిడి తోరణాల ఎదురుకోలు.


Rate this content
Log in

Similar telugu poem from Classics