STORYMIRROR

Kalyani B S N K

Classics

4  

Kalyani B S N K

Classics

మా బడి ఊసులు

మా బడి ఊసులు

2 mins
328

గుర్తుందా...

ఓ భాగ్య శాలీ ...నీకు గుర్తుందా..

అమ్మ ఒడి నుంచి నేరుగా బడికి చేరిన ఆ క్షణం గుర్తుందా..

నాన్న చిటికెన వేలు వదల లేక

వెక్కిళ్లు పెడుతున్న  

నీ పాలబుగ్గల పై కన్నీటి చారల ను తుడిచిన టీచరమ్మ చేతి స్పర్శ గుర్తుందా..


చెక్కుమర తో పెన్సిల్ చెక్కడం రాక అవస్త పడుతున్నప్పుడు 

చనువుగా.... 

నీ చేతి లో పెన్సిల్ లాక్కుని.. చెక్కి చూపించిన తొలినేస్తం గుర్తుందా..


జేబులు నిండా బఠాణీలు, దారం తిప్పుతూ తినే పిప్పరమెంటు బిళ్ళలు, పీచు మిఠాయి...

ఉడికించిన కర్రపెండలం, ఊరబెట్టిన ఉసిరికాయలు..

లొడ్డాసు సీమచింతకాయలు..

పుల్లైసు, పుల్లకు గుచ్చిన చింతపండు..

మన చిన్నతనపు విందుల పసందు...మరి మీకూ గుర్తుందా..


స సైన్యం గా ..

అదే....మన వానర మూక తో..

అయ్యవారు దసరా పండుగ రోజుల్లో ఊరిలో ..

అయ్యవారికి చాలు ఐదు వరహాలు, పిల్లలకు చాలు పప్పు బెల్లాలు అంటూ ఊరేగిన వైనం గుర్తుందా..


తరగతి ఏదైనా, విషయం ఏదైనా 

తను నేర్చిన జ్ఞానమంతా నీ మెదడులో నింపెయాలన్న ఆ తరం ఒజ్జల తాపత్రయం గుర్తుందా..

అమ్మానాన్నల ఆశల మోసులను నీ అస్తిత్వానికి అసలు చిరునామా గా స్వప్నించి , శ్వాసించి..

అహరహం తపించి , 

అదే ఆలోచనలతో అనుగమించి , శ్రమించి ..

ఆ స్వేదమును ఆస్వాదించి 

ఒక్కొక్క మెట్టూ ఎక్కటానికి నిచ్చెన వేసిన మన బడి పాఠాలు, పాఠ్యకులు..

ఎల్లలు దాటిన సమరసత,

సంఘీభావం, అమాయకత్వం

మన బాల్యం తాలూకు అస్తిత్వం...ఇది మీకూ గుర్తుందా..


నిర్నిద్రా , నిర్నిమేషులమై 

పరీక్షా రక్షలను ధరించి  

సర్వెక్షకులైన శిక్షకుల పర్యవేక్షణలో 

నిశ్శబ్ద శాబ్దికుల వలె పరీక్షా పత్రం లోని ప్రతీ ప్రశ్నను గ్రహించి 

గత అనుభవాలతో గమించి..

మేధకులజుల నుంచి ప్రాప్తించిన మేధను మధించి..

విరించిని మించి రచించినా.. 


కటాకటి దిద్దుడు లో పొందిన బొటాబొటి మార్కులకు కూడా..

పొంగిపోయి ఊరంతా మిఠాయి పంచిన మన కాలపు పరీక్షల ప్రహసనం గుర్తుందా..

గుర్తుండే ఉంటుంది..


అడవిమల్లెలంత స్వచ్చంగా గుబాళించే నీ తెలుగు పలుకుల వెనుక అసలు కారణం

అప్పటి తెలుగు తరగతిలో వల్లేవేసిన చిన్నయ సూరి వ్యాకరణ అంశాలు, 

యమాతారాజ భానసలగం వంటి ఛందో భాగాలు,

అలంకారాలు, నుడికారాలు అందంగా అమరడమే అని 

ఎందుకు గుర్తుండదు!?


బీజీయ సమాసాలు, సమితులు, క్షేత్ర గణితం...ఇక్కడ అభ్యసించిన ప్రతి విద్యార్థీ 

శాస్త్రజ్ఞుడు అయినా కాకపోయినా 

చిక్కు లెక్కలను చిటికెలో విప్పగలడంటే 

అది కేవలం అప్పటి ఉపాధ్యాయులు పెట్టిన జ్ఞానభిక్ష అని నీకూ గుర్తుండే ఉంటుంది..


 ప్రశ్నించడం, పరిష్కరించడం, ప్రహేళ్లించడం..


వృత్తి ఏదైనా జాతి ఎన్నదగ్గ పౌరులుగా ఎదగడం , ఒదగడం..


శారీరక, మానసిక, సామాజిక ఆరోగ్యంతో అలరారే మన ఈ పాఠశాల వారసత్వ పరంపర కు అసలు కారణం ..

ఆనాటి బీజాలలో అప్పటి ఉపాధ్యాయులు, సమాజం, తల్లి దండ్రులు పొదిగిన విలువలే అని ఎలా మరచిపోగలం...


Rate this content
Log in

Similar telugu poem from Classics