పితృదేవోభవ
పితృదేవోభవ


పురాణపుటలెన్ని తిరగేసినా
త్రేతాయుగమున శ్రీరాముడి జనకుడు
ద్వాపరమందున శ్రీకృష్ణుని పితృదేవుడు వసుదేవుడు
కలియుగాన మా తండ్రి జగన్నాధుడు ......
నాన్నా !
మా సుఖమే కోరి మీ సర్వసుఖాలను త్యాగం చేసిన త్యాగమూర్తి మీ చరణారవిందములకు శరణు శరణు
నాన్నా !
గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవోమహేశ్వరః అర్దాన్ని సార్ధకం చేసే త్రిమూర్తి స్వరూపమై
మాకక్షర జ్ఞానంతో పాటు లోకజ్ఞానాన్నందించిన మా
మలి గురువైన మీకు పాదాభివందనం
నాన్నా !
మిన్నగా భావించి భవదీయుల భవసాగరాలను మీ భుజానెత్తుకున్న భక్తార్తిభంజన భవహరణ
మీకు కరములెత్తి కైమోడ్పు నందింతు
నాన్నా !
తొలి ఉషస్సు నందే తొలి చీకట్లు తొలగక ముందే
చిరు దివ్వె ముందు చతికిలబడి కార్యోన్ముఖుడవై కాగితాలను ముందేసుకున్న కార్యశీలి
కర్మసిద్ధాంతాన్ని మాకు బోధించిన భాగవతోత్తమ
మీ పాదాలకు ప్రణమిల్లుదు
నాన్నా !
ప్రేమానురాగాల పంచభక్షాలతో మము పాలించగ&
nbsp;
ఏతెంచిన యతిరాజా అందుకో
ఈ నా యతిప్రాసలు లేని చంపకమాలను, రాగదీపికను
నాన్నా !
ఆ జగన్నాధుడు “నందిఘోష్ “ నధిరోహించి
జగమునుద్దరించ తరలిన తరుణాన
మిమ్ము నా హృద్మందిరాన హృద్యంగా కొలుతు……
మరు జన్మలో నన్ను, ఈ శశిధరునికి, నీ తండ్రిగా పుట్టి నీ
ఋణం తీర్చుకొనే భాగ్యం ప్రసాదించమని
మీ వైకుంఠనాధునికి విన్నవించమని
మీ కరచరణాలకు శిరస్సువంచి పాదాభివందనం
కావింతు నాధా! జగన్నాధ !
******💐💐💐*******
నందిఘోష్.... అంటే పూరీ జగన్నాథుని రధం పేరు.