వందే మాతరం
వందే మాతరం


దేశ ప్రగతి శకటానికి
కృషీవలుడి కృషి చక్రం
పట్టణపరిశ్రమల శ్రామిక చక్రం
సమన్వయ ప్రయాణమే ప్రమాణమనుచూ
నినదించినప్పుడు కాదా వందే మాతరం!
ఏమి మిగిలెను నాకు ఈ సాగు నుండి
అను నిస్పృహను దాటుకుని పోయి
వ్యవసాయరంగాన్ని ఆధునీకరిస్తూ
బంగారమే పండు నా భూమి అంతా
అను దృక్పధమునకు రైతన్న చేరుకున్న నాడు
అవ్వదా సుజలాం, సుఫలాం, సస్యశ్యామలాం!
పరిశ్రమల అభివృధ్ధికి తోడై ఉంటూ
అంకురాల స్థాపనలకు ప్రోత్సాహమిస్తూ
ఫలితంగా ఏర్పడిన ఉద్యోగ రంగమే
నవ సమాజ స్థాపనకు నాంది అయినప్పుడు
మరి కాదా మాతరం సుఖదాం, వరదాం, ప్రజ్వలాం!
ఈ రెండు చక్రాల గమనాన్ని కలుపుతు
స్వతంత్ర శక్తిగా భారతావనిని సంస్కరిస్తూ
సాగే పరిపాలనకు గళమెత్తదా
మాతరం వందే అనుచు!