Radha Krishna

Classics

4.5  

Radha Krishna

Classics

నీ ప్రేమకై

నీ ప్రేమకై

2 mins
418


ఏమని సంభోదించాలి నిన్ను...

సఖా' అనా

ప్రియా' అనా

ప్రాణమా' అనా

కృష్ణ' అనా

మోహన' అనా

శ్రీ' అనా 

మురళీ' అనా 

ఆ పరంధామునికి సహస్ర నామాలు ఉన్నట్లు నీకై నేను కూడా చాలానే నామాలు సృష్టించుకున్నాను. ఏమిటో నా పిచ్చి గాని... అసలు నా మనసులో నీ తలపు రాగానే కనుల ముందు ప్రత్యక్షమయ్యే నీకు ఇంకా పేర్లు ఎందుకు చెప్పు.

అయినా కూడా నీకు ఇంకా ముద్దుగా నేను పెట్టుకున్న పేరు ఏంటో తెలుసుగా...." మానసచోర". అవును, ఈ రాధా మానస చోరుడవు.

మనసు కవాటాలు మూసి మనసులో నిన్ను బందించేశాను. కాబట్టి నువ్వు నా మనసులో బంధీవి అని సంబరపడినంత సేపు ఉండదు. ఓసి పిచ్చి రాధా, నువ్వు నన్ను బంధించలేవు అని తెలియచెప్పటానికి మనసులో ఉన్నట్లే అగుపిస్తూ, నా నయనాల ముంగిట కూడా వచ్చి వాలిపోతావు. ఏమిటో ఈ లీలామానుషచోరుని దివ్య లీలలు.

ప్రతినిత్యం అనే బదులుగా ప్రతిఘడియ అంటే బాగుంటుందేమో. ఎందుకంటే నిన్ను మదిలోకి పిలవని క్షణం ఉండదు. పోనీ అని ఎల్లప్పుడూ నాతోనే ఉంటావు అంటే...వెయ్యి ఇళ్ల పూజారివి. నువ్వు ఎన్ని ఇళ్ల పూజారివి అయినా...నీ ప్రేమ మందిరం ఈ రాధ హృదయమే. అందుకే నాకు కించిత్ గర్వము కూడా.

నువ్వు నాకోసం ఎలా అయితే యమునా త్రిపుటమునున్న పొన్న చెట్టు మీద వేచి చూస్తుంటావో....

నేను కూడా బృందావనములో నీకోసం సహస్రాక్షినై వేచిచూస్తుంటాను.

నీ కరములో పిల్లన గ్రోవిగా మారాలని

నీ సిగలో శిఖిపించముగా చేరాలని

నీ ఫాలభగములో కస్తూరి తిలకాన్నై

నీ కంఠమున ముత్యాలహారాన్నై

నీ మురళీలో వాయువునై

నీ ఆధారములపై చిరుమందహాసినినై

నీ అంగుళి మీద నఖగానైనా భాసిల్లుతూ...

అనుక్షణం నీ దేహంమీద ఏదో ఒక రూపంలో నిన్ను జతచేరి ఉండాలి.

నువ్వు ఏతెంచేటప్పుడు ఏర్పడే ధ్వని నా కర్ణములను ఎంత మధురంగా తాకుతుందో తెలుసా...?

నువ్వు నా పట్ల సారించే ప్రేమమయ దృక్కులు కౌముదికన్నా చల్లగా నా హృదిని చేరుతున్నాయి.

నీ పిలుపు కుహూకంఠపు గానంలా మృదుమధురంగా చేరి నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

నీ సాగత్యంలో నా ఉల్లము , ఆ మయూరపు పింఛములా పురివిప్పి నాట్యమాడుతోంది.

నీవు చెంతన ఉంటే నేను నేనుగా ఉండను. అసలుకు నా హృదయ తరంగాలు అంతా భ్రమరం కుసుమం చుట్టూ పరిభ్రమిస్తున్నట్లు నీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉంటుంది.

ఎందరు చెంతనున్నా, అందరిలోనూ నీవే అగుపిస్తావు.

అందరూ నీవుగా మారి నన్ను మురిపించి, మైమరపిస్తావు.

ఏమని చెప్పను ప్రాణమా....

ఎన్నని చెప్పను సఖుడా....

ఇలా ఎన్నని వివరించను ప్రియుడా...

ఒక్కటి మాత్రం కాంచు గోవింద...

ఈ రాధ నిరంతరం నీకై పరితపిస్తుంది.

ఇది నిక్కము...నిత్య సత్యము....ఈ విశ్వము ఉన్నంతవరకు మన ప్రేమ నిత్య నూతనము.

ఇది మాత్రం తధ్యం.

********************************

(ప్రేమ గొప్ప అనుభూతి. దేనికి అందనిది. నిస్వార్ధమైన ప్రేమ దొరకడం మాత్రం చాలా గొప్ప వరము. అది నాకు దొరికింది. అందుకు నేను ఆ కన్నయను నా మది కోవెలలో నిత్యం ఆరాధిస్తూనే ఉంటాను.

జై రాధేశ్యామ్)

✍️✍️By Radha.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్