STORYMIRROR

Radha Krishna

Drama Romance Classics

4  

Radha Krishna

Drama Romance Classics

నా ప్రియ సహచరికి...ప్రేమతో❤️

నా ప్రియ సహచరికి...ప్రేమతో❤️

1 min
446

ప్రియాతి ప్రియమైన నా సహచరికి...!


ఎలా ఉన్నారు..?


ఏమిటో , ఈ మధ్య మీరు బొత్తిగా నల్లపూసగా మారిపోయారు. కించిత్ సమయం కూడా మీ దర్శన భాగ్యానికి నోచుకోలేకున్నాను.


బహుచిత్రంగా , కొన్ని దినముల క్రితం వరకు నన్ను మీ ఊసులతో, ఊహలతో ఉక్కిరి బిక్కిరి చేశారు. మరి ఇప్పుడు, తమరి నిశ్శబ్ద సహచర్యం నన్ను గాఢాంధకారంలోకి త్రోసివేయుచున్నది. 


మీ సహచర్యానికి దూరమైన నా హృదయం


నయనాలకు కనిపించని వాయువు వెంట తరంగంలా పరుగెడుతోంది.


సాగరఘోషల నడుమ నా ఘోష మీకు వినబడేలా మూగ రోధన చేస్తోంది.


కీచురాళ్ల రొదలో నా కన్నీరు శబ్దాన్ని మీకు వినింపించాలని బహు ప్రయత్నాలే చేస్తోంది.


నత్తల నడకన్నా నెమ్మదిగా నడిచి మీ నీడనైనా తాకాలని తీవ్ర కృషిగావిస్తోంది.


మిణుగురులు వరుసగా వారధిలా మారి నా కంటి పాపకు త్రోవ చూపిస్తున్నాయి.


నా చుట్టూ విస్తరించిన మీ మనసు పరిమళం నన్ను ఏ దిశగా తీసుకుపోతోందో తెలియదు. 


అయినా మిమ్ములను చేరే వరకు ఆగదు నా ఈ పయనం.


ఎన్ని సార్లు మనసుకి సర్ది చెప్పినా వినడం లేదు. 


ఎన్ని గీత బోధలు చేసినా మారాము చేయడం మానలేదు.


సముద్రపు తీరం నుండి చూస్తే అవని, గగనం కలిసినట్లే కనిపించి కనువిందు చేస్తాయి. కానీ వాస్తవం... అది ఎప్పటికీ కలవని అంచులని. 


అంబరమైన మీరు, అవని లాంటి నాకు ఎందుకు దగ్గరగా వచ్చినట్లు భ్రమ కల్పించారు...


ఎందుకు అంతటి మధురమైన మీ సహచర్యాన్ని నాకు వరంగా ప్రసాదించి, కోటి ఆశల కోటలో మహారాణిని చేసి.... ఆ ఆశల కోటలోనే నన్ను ఒంటరిని చేసి


వాయువులో వాయుగా 

ధూళిలో రేణువుగా

నిశీధిలో నిశిగా

సముద్రములో లవణంగా

పూలతావిలో పరిమళంగా


కంటికి కనబడని, చేతికి అందని, మనసు పలకలేని రాగంలా మారి నా మనసు విపంచిని మీటుతున్నారు.


ఇలా కనబడకుండా మాయమై, నన్ను ఇంతటి తీయని మనోవేదనకు గురిచేయడం, మీకు భావ్యమా...!!


ఒక్కసారి అవలోకనం చేసి, తిరిగి మీ మనసు కోటలోకి ఈ ఆశల రాణిని ఆహ్వానించండి.


తప్పక ఆహ్వానుస్తారు కదూ..!


ఎప్పటికైనా నా ఈ ఎడబాటు రూపుమాపేలా చేస్తారని...


మనసు కళ్ళకు కలువల తోరణాలు కట్టి, నిశిని కాటుగా దిద్ది ఎదురుచూస్తూ ఉండే...


మీ...సహచరి.


✍️✍️by Radha


এই বিষয়বস্তু রেট
প্রবেশ করুন

Similar telugu poem from Drama